Homeఅంతర్జాతీయంచాట్ జీపీటీ ఎఫెక్ట్ తో అలర్టైన గూగుల్….

చాట్ జీపీటీ ఎఫెక్ట్ తో అలర్టైన గూగుల్….

ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం గూగుల్. చేతిలో గూగుల్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలుసుకోవచ్చు. ప్రపంచ దిగ్గజ సెర్చింజన్ గా గూగుల్ హవా కొనసాగిస్తోంది. కానీ, గత కొద్ది నెలల క్రితం అందుబాటులోకి వచ్చిన చాట్‌జీపీటీ అనే చాట్‌ బోట్‌ గూగుల్ కు చుక్కలు చూపిస్తోంది. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తూ, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బోలెడన్నీ సెర్చ్ లింక్స్ ఇవ్వకుండా సింపుల్ గా సమాధానాలు అందిస్తోంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప‌ని చేసే ఈ చాట్ బోట్‌….. టెక్నాల‌జీ రంగంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం గూగుల్ కు గట్టి పోటీ ఇస్తోంది. గత కొద్ది కాలంగా యూజర్లు గూగుల్ కు బదులుగా చాట్ జీపీటీని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ అలర్ట్ అయ్యింది.

ఇప్పుడ‌ప్పుడే స‌వాళ్లు ఉండ‌వ‌నుకున్న గూగుల్ కు చాట్ జీపీటీ తో స‌రికొత్త‌, ఊహించ‌ని స్థాయి స‌వాల్ ఎదుర‌వుతోంది. వాస్త‌వానికి ఈ చాట్ జీపీటీని గూగులే త‌యారు చేసి ఉంటే అది త‌న‌కు మ‌రో మార్కెటింగ్ మార్గం అయ్యేది. ఎందుకో గూగుల్ ఆ ప‌ని చేయ‌లేక‌పోయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ గూగుల్ లో ఏదైనా శోధిస్తే.. అందుకు సంబ‌ధించిన రిజ‌ల్ట్స్ వ‌స్తున్నాయి. చాట్ జీపీటీ మాత్రం అడిగిన దానికి దాదాపు సూటిగా…. సుత్తి లేకుండా స‌మాధానం ఇస్తోంది. అయితే ఈ స‌మాచారంలో కొంత తేడాలుంటున్నాయి. అయినప్పటికీ చాట్ జీపీటీ కి మిలియ‌న్ల కొద్దీ యూజ‌ర్లు త‌యార‌వుతున్నారు అతి త‌క్కువ స‌మ‌యంలోనే.

మ‌రి ఇక నుంచి దేన్నైనా గూగుల్ చేయ‌మ‌నే వారు సులువుగా…. ఇక నుంచి చాట్ జీపీటీ చేయమనవచ్చు. గూగుల్ లోకి వెళ్లి వ‌చ్చిన సెర్చ్ రిజ‌ల్ట్స్ లో తార్కికంగా, హేతుబ‌ద్ధంగా చూసుకుని కొత్త విండో ఓపెన్ చేసుకోవ‌డం కంటే….చాట్ జీపీటీతో ఇన్ స్టంట్ స‌మాధాన‌మే జ‌నాల‌కు న‌చ్చ‌వ‌చ్చు. స్పూన్ ఫీడింగ్ కు జనాలు విప‌రీతంగా అల‌వాటు ప‌డ‌వ‌చ్చు. ఇదంతా వేగంగా జ‌రిగితే.. గూగుల్ యాడ్ మార్కెట్ అత‌లాకుత‌లం అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఈ యాడ్ మార్కెట్ ను చాట్ జీపీటీ కాప్చ‌ర్ చేయొచ్చు. ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో ఎవరినోట విన్నా ఒక్కటే మాట వినిపిస్తోంది అదే చాట్ జీపీటీ. పైగా దీనికి అమెరికా టెక్ దిగ్గజం భారీ ఫండింగ్ చేస్తున్నట్లు ప్రకటించటంతో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో ఎలాగైనా ముప్పును ముందుగానే అడ్డుకోవాలని గూగుల్ నిర్ణయించింది. దీంతో చాట్ జీపీటీకి పోటీగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే బార్డ్ ను గూగుల్ విడుదల చేస్తోంది.

చాట్ జీపీటీ విడుదలైన అనతి కాలంలోనే కోట్ల మంది నుంచి ఆదరణ పొందినట్లు ఇటీవల వెల్లడైంది. వ్యాపారపరంగా ఇది గూగుల్ కు పెద్ద సవాలనే చెప్పుకోవాలి. ఇటీవల గౌతమ్ అదానీ సైతం చాట్ జీపీటీ వినియోగానికి బానిసనయ్యానంటూ కామెంట్ చేయటంతో…. ఇండియాలోనూ దానికి పెరుగుతున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది. దీంతో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ బార్డ్ అనే ప్రయోగాత్మక సంభాషణ ఏఐ సేవను ఆవిష్కరించింది. రానున్న మరికొన్ని వారాల్లో ప్రజలకు మరింత విస్తృతంగా బార్డ్ ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ బ్లాగ్‌పోస్ట్‌ లో వెల్లడించారు. గూగుల్ తన బార్డ్ ప్రాజెక్టును అట్లాస్ పేరుతో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. బార్డ్ కూడా చాట్ జీపీటీ మాదిరిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుంది. దీనిని లాంగ్వేజ్‌ మోడల్‌ ఫర్‌ డైలాగ్‌ అప్లికేషన్‌ ఆధారంగా రూపొందించారు. ఇది ఎవరైనా యూజర్ ఒక ప్రశ్న వేయగానే దానికి సంబంధించి ఇంటర్నెట్ లో ఉన్న అత్యుత్తమ తాజా సమాచారాన్ని సేకరించి అందిస్తుంది.

మైక్రోసాఫ్ట్ మద్దతుతో మార్కెట్లోకి వచ్చిన చాట్ జీపీటీ, గూగుల్ రూపొందిస్తున్న బార్డ్ రెండూ దాదాపుగా ఒకే రకమైన సేవలను అందిస్తాయి. అయితే బార్డ్ ఆన్ లైన్ లో ఉన్న తాజా సమాచారం ఆధారంగా వినియోగదారులకు ఏఐ ఆధారిత సేవలను అందిస్తోంది. ఇక ఇదే సమయంలో చాట్ జీపీటీ మాత్రం 2021 వరకు ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఆధారంగా వినియోగదారుల ప్రశ్నలకు సమాచారం ఇస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం చాట్ జీపీటీ ఉచితంగా అందుబాటులో ఉన్నప్పటికీ…దీని పెయిడ్ వెర్షన్ చాట్‌ జీపీటీ ప్లస్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ రెండింటిలో ఏది యూజర్ల ఆదరణ పొందుతుందో రానున్న కాలంలో తెలుస్తుంది.

Must Read

spot_img