Homeఅంతర్జాతీయంప్రపంచం తల్లడిల్లుతోంది.. వాతావరణ మార్పులు దేశాలను వణికిస్తున్నాయి

ప్రపంచం తల్లడిల్లుతోంది.. వాతావరణ మార్పులు దేశాలను వణికిస్తున్నాయి

ప్రపంచం తల్లడిల్లుతోంది.. వాతావరణ మార్పులు దేశాలను వణికిస్తున్నాయి. అతి భారీ వర్షాలు, హీట్ వేవ్ లు, భీకర భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవటాలకు ప్రధాన కారణం మానవ తప్పిదాలే అని అధ్యయనాలు చెబుతున్నాయి. భూతాపం 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగడం వల్లే ప్రక్రుతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితిని ఇప్పటికీ సరిదిద్దుకునే అవకాశం ఉందని అంటున్నారు..శాస్త్రవేత్తలు..మరి ఇప్పుడైనా కళ్లుతెరుస్తారా అని ప్రశ్నిస్తున్నారు..

ప్రపంచానికి మరోసారి ప్రమాద హెచ్చరిక. పారిశ్రామికీకరణ మునుపటి స్థాయితో పోలిస్తే పుడమి తాపం ఇప్పటికే 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగింది. ఈ లెక్కన గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలనీ, ఈ శతాబ్ది చివరకు భూతాపోన్నతి 1.5 డిగ్రీల లోపలే ఉండేలా చూసు కోవాలనీ చెప్పుకున్న ఊసులు, చేసుకున్న బాసలు తీరా రానున్న పదేళ్ళలోనే పూర్తిగా భగ్నం కానున్నాయి. ‘ఆఖరి అవకాశంగా తెరిచి ఉన్న తలుపు సైతం మూసుకుపోతోంద’ని ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’చేసిన ఈ హెచ్చరిక మానవాళికి మేలుకొలుపుగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను నియంత్రించడానికి ప్రభుత్వాలు తక్షణం బరిలోకి దిగాలని కోరుతున్నారు.

సమయం మించిపోలేదనీ, ఇప్పటికైనా కళ్లు తెరుచుకుంటే ఎంతో కొంత ప్రయోజనమని తాజా నివేదిక కర్తవ్యాన్ని బోధిస్తోంది. వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన సంపన్న దేశాలు ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదు. శాస్త్రవేత్తల హెచ్చరికలను చెవి కెక్కించుకోకుండా, వర్ధమాన, నిరుపేద దేశాలదే బాధ్యత అన్నట్టు ప్రవర్తిస్తుండడమే ఇప్పుడున్న చిక్కు. విషాదం ఏమిటంటే- పాపం ఎవరిదైనా, ఫలితం మాత్రం ప్రపంచమంతా అనుభవించాల్సి వస్తోంది. ఐపీసీసీ 1988లో ఏర్పాటైన నాటి నుంచి ఇది ఆరో నివేదిక. ఈ ఆరో అంచనా నివేదికకు సంబంధించిన వివరాలు షాకింగుకు గురిచేస్తున్నాయి. నిజానికి ఇదే ఆఖరి విడత నివేదిక అని చెబుతున్నారు. మునుపటి మూడు ప్రధాన విభాగాల నివేదికలోని కీలక సమాచారాన్ని ఒకచోట గుదిగుచ్చి అందిస్తున్నారు గనకనే ఈ చివరి దాన్ని ఐపీసీసీ ఏఆర్‌6 ‘సంకలన నివేదిక’ అన్నారు.

2021 ఆగస్ట్, 2022 ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో వచ్చిన మొదటి మూడూ వాతావరణ సంక్షోభం, దాని పర్యవసానాలు, గ్రీన్‌హౌస్‌ వాయువులను తగ్గించే మార్గాల గురించి చెప్పాయి. తాజా ‘సంకలన నివేదిక’ ప్రధానంగా మునుపటి ప్రచురణ ల్లోని కీలక ఫలితాల పునశ్చరణ. భూతాపం ‘మళ్ళీ తగ్గించలేని స్థాయికి’ చేరుతోందనీ, మానవాళికి దుష్పరిణామాలు తప్పవనీ, కఠిన చర్యలతోనే ప్రమాదాన్ని నివారించగలమనీ ఇది హెచ్చరిస్తోంది. అపార ధనబలం, సాంకేతిక సామర్థ్యం తమ సొంతమైన ధనిక దేశాలు కేవలం అప్పులు, ప్రైవేట్‌ రంగ పెట్టుబడులిచ్చి వాతావరణ పరిరక్షణ చర్యకు సహకరించామని చేతులు దులుపుకొంటే సరిపోదు. ఈ 2020 -30 మధ్య ఇప్పుడు చేస్తున్న దానికి కనీసం 6 రెట్లయినా వాతావరణంపై పెట్టుబడి పెడితే తప్ప, తాపోన్నతిని 1.5 డిగ్రీల లోపు నియంత్రించే లక్ష్యం సాధ్యం కాదట.

అలాగే, 2020 నాటి స్థాయిలోనే మన వాతావరణ విధానాలు బలహీనంగా ఉంటే, ఈ శతాబ్ది చివరకు భూతాపం 3.2 డిగ్రీలు పెరుగుతుంది. ఒకసారి 1.5 డిగ్రీలు దాటి ఎంత పెరిగినా, ఆ వాతావరణ నష్టం పూడ్చలేనిది. మానవాళికి మహా విపత్తు తప్పదు. పెను ప్రభావం పడే దేశాల్లో భారత్‌ ఒకటని నివేదిక తేల్చింది. వడగాడ్పులు, కార్చిచ్చులు, ఆకస్మిక వరదలు, సముద్రమట్టాల పెరుగుదల,పంటల ఉత్పత్తి తగ్గుదల, 2050 నాటికి 40 శాతం జనాభాకు నీటి కొరత – ఇలా పలు ప్రమాదాలు భారత్‌కు పొంచివున్నాయి. అయితే, వాతావరణ మార్పుల నివారణ భారాన్ని అందరూ పంచు కోవాలనే ‘వాతావరణ న్యాయ’ సూత్రానికి ఈ నివేదిక జై కొట్టడం మన లాంటి దేశాలకు ఊరట అని చెప్పుకోవచ్చు. గతంలో మూడు విడతల్లో ప్రచురించిన వేలకొద్దీ పేజీల శాస్త్రీయ సమాచారాన్ని సంక్షిప్తంగా అందించడం జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలకు వారు చేపట్టాల్సిన చర్యలను సారాంశరూపంలో తాజా సంకలన ద్వారా అందంచడం జరిగింది. నవంబర్‌ 20న దుబాయ్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆతిథ్య మివ్వనున్న ఐరాస తదుపరి వాతావరణ సదస్సు ‘కాప్‌ 28’కు ఈ నివేదిక ఒక దిక్సూచిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2015లో ప్యారిస్‌ వాతావరణ ఒప్పందం నాటి నుంచి నేటి వరకు గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించడంలో వివిధ దేశాల పురోగతిని ఆ ‘కాప్‌ 28’లో మదింపు చేస్తారు. ఇప్పటి దాకా చేస్తున్నవేవీ చాలట్లేదని తాజా నివేదిక సాక్షిగా తెలుస్తూనే ఉంది. వెరసి, వాయు ఉద్గారాలను తగ్గించే లక్ష్యంలో ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు కఠిన చర్యలు చేపట్టకుంటే, ఆ తర్వాత ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే అని అంటున్నారు.

Must Read

spot_img