ప్రస్తుతం భారతదేశంపై కొన్ని విదేశాలు ఈర్షతో ఉడికిపోతున్నాయి. చూస్తుండగానే భారత ప్రతిష్ట పెరిగిపోవడం, ఆర్థికంగా బలపడుతుండటాన్ని ఓర్వలేకపోతున్నాయి. ఏ రకంగానైనా అప్రతిష్టపాలు చేయాలనే కుట్రలు పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పైనా, భారతదేశపు వ్యాపారులపైనా ఆరోపణలు చేస్తూ నష్టం కలిగిస్తున్నాయి. దేశంలోని ప్రతిపక్షాల బలహీనతలను వాడుకుని అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఏదో రకంగా కూల్చాలని ప్రయత్నిస్తున్నాయి. బీబీసీ డ్యాక్యుమెంటరీ, హిండెన్ బర్గ్ ఉదంతం, తాజాగా జార్జ్ సొరోస్ అనవసరపు ఆరోపణల నేపథ్యాలను చూస్తే అది నిజమేనని అనిపిస్తోంది. ఈ ఆరోపణలనే ఊతంగా చేసుకుని ప్రతిపక్షాలు తమ అస్తిత్వాలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
దేశంలో సమస్యలను వదిలేసి విదేశాల నుంచి వస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెప్పాలంటూ నిలదీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతా చేసి పిడికెడు లేని ప్రతిపక్షాలు విదేశాల నుంచి వస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలకు అగ్నికి ఆజ్యంలా తోడవుతున్నాయి. అయితే వాటన్నింటినీ అధికార ప్రభుత్వం ధీటుగానే ఎదుర్కుంటోంది. అయితే మనదేశంలో అనతి కాలంలోనే ఎదిగిన గౌతమ్ అదానీపై ఆరోపణలు చేసిన ‘హిండెన్‌బర్గ్’ నాథన్ ఆండర్సన్ హీరోనా, విలనా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి హిండెన్‌బర్గ్ ఓ షార్ట్ సెల్లింగ్ కంపెనీకి యజమాని.
ఈయన ఏం చేస్తారంటే ఏదైనా ఓ కంపెనీపై ఆరోపణలు చేస్తూ ఆ కంపెనీ షేర్లు పడిపోయేలా చూస్తాడు..ఆపై వాటిని తన సంస్థ కొనుగోలు చేస్తాడు. ఆపై అవి అబద్దపు ఆరోపణలు అని తేలగానే షేర్ల విలువ పెరుగతుంది. ఆపై వాటిని అమ్మేసి డబ్బులు సంపాదిస్తాడు. ఇదీ షార్ట్ గా హిండెన్ బర్గ్ వ్యాపారం..సరిగ్గా అలాంటి వాడినే కుట్రదారులు ఎంచుకున్నారు. అంతా అనుకున్నట్టు ఈయన సంస్థ షార్ట్ సెల్లింగ్ రీసెర్చ్ సంస్థ కానే కాదు..కేవలం శవాలపై నాణేలను ఏరుకునే సంస్థగానే అంతా చెబుతున్నారు. స్టాక్ మార్కెట్‌ను దెబ్బతీయడం ద్వారా తమ జేబులను నింపుకునే సంస్థ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కుట్ర కూడా అమెరికాలోనే జరిగింది. అమెరికాకు చెందిన హిండెన్ బెర్గ్ నుంచి భారత సంపన్నుడిని దివాలా తీయించే ప్రయత్నాలు జరిగాయి. తద్వారా భారత ప్రధాని ప్రతిష్టను మసకబారించే ప్రయత్నాుల జరిగాయి. హిండెన్‌బర్గ్ వంటి సంస్థలు చట్టబద్ధంగా పనిచేస్తున్న అమెరికాలో కొన్నాళ్లుగా ఈ చర్చ నడుస్తోంది. ఇలాంటి కంపెనీలను ఇష్టపడేవారు ఉన్నారు. అలాగే వీటిని ద్వేషించే వారికీ కొదువే లేదు. ఇంతకీ ఈ కంపెనీ ఏం చేసిందనే విషయానికొద్దాం..
హిండెన్‌బర్గ్ ఒక సంచలనాత్మక శీర్షికతో తన నివేదికను విడుదల చేసింది. ‘కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద మోసం’ అనే శీర్షికతో నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక అబద్ధం అని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.”వేగంగా పైకి ఎదుగుతున్న భారత్‌ను కిందికి లాగే ప్రయత్నం” అని మరికొందరు హిండెన్‌బర్గ్ నివేదికను విమర్శించారు. సాధారణంగా షేర్ల ధరలు పెరిగినప్పుడు డబ్బులు వస్తాయి. కానీ, షార్ట్ సెల్లింగ్‌లో ధరలు పడిపోయినప్పుడు డబ్బులు సంపాదిస్తారు. పలానా షేర్ పడిపోతుందని అంచనా వేస్తూ పందేలు కాస్తారు.
వాస్తవానికి, హిండెన్‌బర్గ్ వంటి యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్ సంస్థలు, కొన్ని కంపెనీల షేర్ ధర పతనం అవుతుందని ఊహించి పందెం వేస్తారు. ఆ తర్వాత వాటి గురించి నివేదికలను ప్రచురించడం ద్వారా వారిని లక్ష్యంగా చేసుకుంటారు.షేర్ల ధర, వాస్తవ విలువ కంటే చాలా ఎక్కువ ఉందని భావించిన కంపెనీలను లేదా ఒక కంపెనీ తమ వాటాదారులను మోసం చేస్తుందని తమ దృష్టిలోకి వచ్చిన కంపెనీలను ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థలు లక్ష్యంగా చేసుకుంటాయి.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థను 2017లో నేట్ అండర్సన్ స్థాపించారు.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ స్కార్పియాన్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ కీర్ కైలాన్ దీని గురించి మాట్లాడారు. హిండెన్‌బర్గ్ ఒక ప్రసిద్ధ సంస్థ అని, వారి పరిశోధనలను విశ్వసనీయమైనవిగా పరిగణిస్తారని ఆయన అన్నారు. ఈ నివేదికల ఆధారంగా అమెరికాలో అవినీతికి పాల్పడిన సంస్థలపై చర్యలు తీసుకున్నారని కూడా ఆయన చెప్పారు. హిండెన్‌బర్గ్ వంటి సంస్థల నివేదికలు విడుదల చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయని న్యూయార్క్‌లో షార్ట్ సెల్లింగ్‌పై వార్తలు ప్రచురించే ఎడ్విన్ డోర్సే అన్నారు. ఇందులో మొదటిది తప్పులను వెలికితీసి లాభాలను ఆర్జించడం… రెండోది న్యాయం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడం. ”యాక్టివిస్ట్ షార్ట్ సెల్లింగ్ సంస్థల నివేదికలు ఒక రకంగా పరిశోధనాత్మక జర్నలిజం లాంటివి. కానీ, వాటికి లాభాలు వచ్చే పద్ధతి భిన్నంగా ఉంటుంది.
నెట్, హిండెన్‌బర్గ్ వంటి సంస్థలను నేను అత్యున్నత సంస్థలుగా భావిస్తాను” అని ఆయన వివరించారు. చాలామంది పెట్టుబడిదారులు, యాక్టివిస్ట్ షార్ట్ సెల్లింగ్ సంస్థలను ఇష్టపడరు. ఎందుకంటే షేర్ల ధరలు తగ్గితే వారి పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చాలా కంపెనీలు కూడా ఈ సంస్థలను ఇష్టపడవు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. 2021లో ఎలాన్ మస్క్, షార్ట్ సెల్లింగ్‌ను ఒక స్కామ్ అని పిలిచారు. తాజాగా అదానీ కేసును భారతదేశపు ”ఎన్రాన్ మూమెంట్”గా అభివర్ణించారు స్కార్పియాన్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ కీర్ కైలాన్. ఎందుకంటే ”అదానీ, ఎన్రాన్ కంపెనీలు రెండూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కావడం, వాటికి బలమైన రాజకీయ సంబంధాలు ఉండటమే అందుకు కారణం.
భారీ ఆర్థిక నష్టాలను దాచిపెట్టిన ఎన్రాన్ సంస్థ 2001లో దివాలా తీసింది. ఆ సమయంలో ఎన్రాన్ సంస్థ చీఫ్ కెన్ లె, కంపెనీ ఇతర అధికారులతో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఎన్రాన్ సంస్థలా అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి లేదు. కానీ, కెన్ లే తరహాలోనే అదానీ కూడా భారత ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగాడనే ఆరోపణలు ఉన్నాయి. ”బలమైన, పటిష్టమైన కంపెనీలేవీ షార్ట్ సెల్లర్ సంస్థల నివేదికలను పట్టించుకోవు. గూగుల్, ఫేస్‌బుక్ లేదా మైక్రోసాఫ్ట్ గురించి ఇలాంటి నివేదికలు రాస్తే వాటిని చూసి ప్రజలు నవ్వుతారు. వారి స్టాక్స్ కూడా ప్రభావితం కావు” అని కైలాన్ వివరించారు. గతంలో ఇదే హిండెన్ బర్గ్ సంస్థ అమెరికాలో కొలంబియా లా స్కూల్ ప్రొఫెసర్ జోషువా మిట్స్, షార్ట్ సెల్లింగ్ సంస్థలను విమర్శిస్తూ ‘షార్ట్ అండ్ డిజార్ట్’ అనే పేరుతో పేపర్‌ను ప్రచురించారు. దీనికి చాలా పేరు వచ్చింది.
అయితే అదానీపై హిండెన్‌బర్గ్ నివేదికను విడుదల చేసిన సమయంపై, ఆ సంస్థ ఆర్జించిన లాభాలపై చాలా ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. దీనిపై అండర్సన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. హిండెన్‌బర్గ్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటివరకు అదానీ నివేదికతో సహా 19 నివేదికలను విడుదల చేశారు. అందులో అత్యంత ప్రముఖమైనది 2020 సెప్టెంబర్‌లో విడుదలైన నివేదిక. అమెరికా ఎలక్ట్రిక్ ఆటో కంపెనీ ‘నికోలా’ గుట్టును ఈ నివేదిక బయటపెట్టింది. 2015లో నికోలా కంపెనీ ఏర్పాటైంది. నికోలా కంపెనీ మార్కెట్ విలువ 30 బిలియన్ డాలర్లు. జీరో కార్బన్ ఆశలను ఆ సంస్థ రేకెత్తించింది. 2018 జనవరిలో ఆ కంపెనీ ఒక వీడియోను విడుదల చేసింది.
బ్యాటరీతో నడిచే ‘నికోలా వన్ సెమీ ట్రక్’ హైవేపై వేగంగా దూసుకుపోతున్నట్లు ఆ వీడియోను చిత్రీకరించింది. నిజానికి ఆ సెమీ ట్రక్కును కొండపైకి లాక్కొని తీసుకెళ్లి, ఆ తర్వాత కొండ వాలుపై ఆ వీడియోను చిత్రించారని హిండెన్‌బర్గ్ నివేదికలో ఆరోపించింది. ఆ ఆరోపణలను నికోలా ఖండించింది. కానీ, ఆ తర్వాత కంపెనీ చీఫ్ ట్రెవర్ మిల్టన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల అయిన వెంటనే ఆ కంపెనీ షేర్లు దాదాపు 24 శాతం పడిపోయాయి. నికోలా కంపెనీపై 120 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు.
2021లో మిల్టన్‌పై మోపిన ఆరోపణలు కూడా రుజువు అయ్యాయి. మరి ఇప్పుడు హిండెన్ బెర్గ్ అదానీని ఎందుకు ఎంచుకుంది..?”సాధారణంగా హిండెన్‌బర్గ్ సంస్థ గతంలో చాలా చిన్న కంపెనీలను లేదా ఎక్కువ సమాచారం అందుబాటులో లేని కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ, అదానీ గ్రూపు ఒక పెద్ద భారతీయ కంపెనీ”. పైగా 2022 ఏప్రిల్‌లో ఒక మీడియా నివేదిక ప్రకారం, కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ రెండేళ్లలో అదానీ షేర్లు 18 నుంచి 20 రెట్లు పెరిగాయి. అదే హిండెన్ బెర్గ్ లంటి షార్ట్ సెల్లింగ్ కంపెనీకి అవకాశం అని చెబుతున్నారు. అయితే ఇదే పని చైనా విషయంలో చేసే దమ్ము దైర్యం హిండెన్ బెర్గ్ కు ఉందా అన్నది ప్రస్తుతం వినిపిస్తోన్న ప్రశ్న..