Homeజాతీయంసార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు తోడు ఎవరు..? అసలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తన పట్టు...

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు తోడు ఎవరు..? అసలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోగలదా..?

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు జోడో యాత్ర కలిసిరానుందా..? దీంతో ఏకంగా మోడీని ఢీకొట్టగలుగుతారా..? దీనిపై రాజకీయ పరిశీలకులు
చెబుతున్నదేమిటి..?

సార్వత్రక ఎన్నికలు మరో ఏడాది తర్వాత జరుగనున్నప్పటికీ విపక్ష నేతలు అప్పుడే మోదీ స్థానంలో దేశ ప్రధానమంత్రి పదవి తమకు దక్కే అవకాశాల గురించి ఊహాగానాలు చేయడం ప్రారంభించారు. డిసెంబర్ 31న రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బిజెపి పట్ల తీవ్ర వ్యతిరేకత చాపకింద నీరులాగా విస్తరిస్తోందని, ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ప్రత్యామ్నాయ ప్రణాళికతో సమర్థంగా రంగంలోకి దిగితే బిజెపిని 2024 ఎన్నికల్లో ఓడించడం సులభమవుతుందని చెప్పారు.

అయితే దేశంలో కొద్ది రోజులు పాదయాత్ర చేసినంత మాత్రాన తనకు దేశ రాజకీయాల్లో అనుభవం వచ్చిందని రాహుల్ గాంధీ అనుకుంటే అంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ అప్పుడే జాతీయస్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు. విపక్షాలన్నిటికీ కేంద్రీకృత జాతీయ విధానం కావాలని, అది కాంగ్రెస్ వల్లే సాధ్యమని చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో భూమిక పోషించాలనుకుంటే అసలు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానమెంత? ఏ ప్రాతిపదికపై కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో గెలుస్తుందని అనుకుంటున్నారు? జ్యోతిరాదిత్య సింధియా వంటి యువనేతలు కాంగ్రెస్‌లో అవమానాలపాలై బిజెపిలో చేరిపోగా, దిగ్విజయ్, కమల్‌నాథ్ లాంటి వృద్ధ నేతలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారని భావిస్తున్నారా? చర్చనీయాంశంగా మారింది ఇతర విపక్షాల పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు.

2024లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను బలపరచడంలో తనకు ఇబ్బంది లేదని జనతాదళ్(యు) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా రాహుల్ 2024 నాటికి రంగంలోకి దిగుతారన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రకటనను దృష్టిలో ఉంచుకుని నితీశ్ ఆ వ్యాఖ్యలు చేశారు.

ఆ వెంటనే శివసేన నేత సంజయ్ రౌత్ కూడా 2024లో రాజకీయాల్లో రాహుల్ మార్పు తేగలరని వ్యాఖ్యానించారు. బిహార్, మహారాష్ట్రలో అంటే బిజెపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ ఉన్నది కనుక జెడి(యు), శివసేన నేతలకు రాహుల్ భావి నాయకుడుగా కనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మరి మిగతా ప్రాంతీయ పార్టీల సంగతి ఏమిటి? రాహుల్‌తో కలిసి ఉత్తరప్రదేశ్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ నిరాకరించారు. కాంగ్రెస్, బిజెపి దొందు దొందే అని ఆయన దుయ్యబట్టారు.

బిఎస్‌పి అధినేత్రి మాయావతి కనీసం స్పందించను కూడా స్పందించ లేదు. దేశంలోఅతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌లోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపేవారు లేనప్పుడు ఆ పార్టీ భవితవ్యం ఏమిటో సులభంగా ఊహించవచ్చు. పోనీ కేసీఆర్ అయినా కనీసం కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారా అంటే అది కూడా ఆయన చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. దేశ రాజకీయాల్లో ఉనికి కోల్పోయిన వామపక్షాలు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో చేతులు కలపలేని స్థితిలో ఉన్నాయి. మరి కాంగ్రెస్ జాతీయస్థాయిలో ఎటువంటి భూమిక పోషిస్తుంది? దారి తెన్నూ లేని చిన్నా చితక పార్టీల నేతలు, సమాజంతో సంబంధం లేని మేధావులు, పాశ్చాత్య భావజాలంతో మన సంస్కృతిని మరిచిపోయిన అపరిపక్వ వ్యక్తులు రాహుల్ గాంధీతో చేతులు కలిపితే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఏర్పడుతుందా? మేధాపాట్కర్, ప్రకాశ్ రాజ్, కమల్హాసన్ తదితరులు రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారో ప్రజలు మరిచిపోయారనుకుంటున్నారా? ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2014లో ఈశాన్య ముంబై నుంచి పోటీ చేసిన మహా ఉద్యమకారిణి మేధాపాట్కర్‌కి కేవలం 8 శాతం ఓట్లు మాత్రమే లభించాయి.

గత ఎన్నికల్లో బెంగళూర్ సెంట్రల్ నుంచి పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ డిపాజిట్ కోల్పోయిన విషయం ఎవరికి తెలియదు? కనీసం సినిమా కళాకారుల సంఘం ఎన్నికల్లో గెలవలేని ప్రకాశ్‌రాజ్ రాహుల్, కెసీఆర్ చుట్టూ తిరిగితే ఏమైనా సాధించగలరా? ఇక కమల్‌హాసన్ 2021లో తమిళనాడులో మకల్ నీధి మలమ్ అని పార్టీ ఏర్పాటు చేసి కేవలం 3.72 శాతం ఓట్లనే సాధించారని, పోటీ చేసిన అన్ని సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారని ఎన్నికల కమిషన్ రికార్డుల్లో నమోదైంది. మరోవైపు భారత జోడో యాత్ర ఒక మజిలీకి చేరుకుంది.

ఈ యాత్ర ప్రభావం రాజకీయ వేదికమీదికి కూడా చేరుకుంది. జాతీయ రాజకీయ జీవితంపైన దీని ప్రభావం ఏమిటి? మన గణతంత్రాన్ని విఫలం చేయడానికి సమాయత్తమైన అపరిమిత అధికారానికి ప్రత్యామ్నాయంగా సైద్ధాంతిక, రాజకీయ వేదిక తయారైనదా? అనే ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది. రాజ్యాంగ
విధివిధానాలను మళ్ళీ నొక్కి చెప్పడమే కాదు, భారతీయతను పునర్ ఊహించడం, ప్రజాస్వామ్య పథాన్ని పునర్ నిర్వచించడం అవసరం. ఈ సవాలు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని యాత్ర జయప్రదం అయినదో, కాలేదో నిర్ణయించాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త రాజకీయ విస్తృతిని సృష్టించేందుకు వినూత్నమైన ప్రయత్నం యాత్ర ద్వారా జరిగినట్టూ, రాజకీయ ద్వేషం పట్ల ప్రభావవంతమైన వైఖరిని ప్రదర్శించినట్టూ అంగీకరిస్తూనే, ఇది రాజకీయమైన ఆశాభావాన్ని కలిగించిందని ఇప్పటి వరకూ చెప్పలేమని వ్యాఖ్యానించారు. ప్రధాన లక్ష్యాలైన పార్టీ పునరుజ్జీవనం, మన ప్రజాస్వామ్య అస్థిత్త్వాన్ని తిరిగి ఆవిష్కరించడం అనే రెండు ప్రధాన లక్ష్యాలనూ సాధించే క్రమంలో యాత్రది తక్కువ స్థాయి ప్రదర్శనగానే అభివర్ణించారు.

యాత్ర ప్రారంభించిన నాటి పరిస్థితులను విమర్శకులు పూర్తిగా అర్థం చేసుకోలేదని అనుకోవచ్చు. యాత్ర పరిధిలో ఉన్న వాటికంటే ఎక్కువ అవకాశాలను ఊహించుకున్నారని కూడా భావించవచ్చు. యాత్ర ముగిసిన తర్వాత దాని ఫలితాలు కనిపిస్తాయని కూడా కొందరు వాదించవచ్చు. యాత్ర ఇంకా గమ్యం చేరలేదు. నిజానికి శ్రీనగర్ దాటి వెళ్ళి ప్రతి భారతీయుడి మనస్సునూ, హృదయాన్నీ చేరాలన్నది యాత్ర లక్ష్యం. ఈ మధ్యంతర అంచనాలను కాగల కార్యానికి మార్గదర్శకాలుగానే పరిగణించాలి. యాత్ర భౌగోళిక, రాజకీయ, మేథో పరమైన పరిధులను విస్తరించేందుకు ప్రయత్నించాలన్నదే సూచనగా వెల్లడవుతోంది.

కొత్త భావజాల దృక్పథాన్ని సృష్టించడం, రాజకీయంగా వేగం పుంజుకోవడం, ప్రతిపక్ష సమైక్యతకు కుదురు కావడం- తట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెసేతర శిబిరంలో కూడా కాంగ్రెస్ కు కొత్తగా చాలామంది మిత్రులు ఏర్పడ్డారు. వందలాది ప్రజాఉద్యమాల ప్రతినిధులూ, సంస్థలూ ఈ యాత్రలో పాల్గొన్నాయి. వారి హృదయాలను గెలుచుకోవడంలో రాహుల్ గాంధీ చాలా ప్రభావవంతంగా వ్యవహరించారు. సాధారణ ప్రజలకు సంబంధించినంతవరకూ ఈ యాత్ర వల్ల జరిగిన పరిణామం ఏమిటంటే రాహుల్ గాంధీ పట్ల ప్రజాభిప్రాయంలో మార్పు సాధ్యమైంది. ఇది ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే కాకుండా మొత్తం ప్రతిపక్షానికి సహాయం చేస్తుంది. ఇదంతా ఆరంభం మాత్రమే. మొదట చూడవలసింది నేషనల్ డెమాక్రాటిక్ ఫ్రంట్ లో లేని పార్టీల సంగతి. ప్రతిపక్షాలన్నిటినీ గుదిగుచ్చి ఎన్నికల మహాఘటబంధన్ ను తయారు చేయక్కరలేదు. ఐకమత్యం గురించి లక్ష్యశుద్ధి ఉండాలి. గోడమీద పిల్లివాటంగా కూర్చున్న ఓటర్లను ప్రభావితం చేసి వారి ఓట్లు సంపాదించుకునే పని ఇంకా జరగవలసి ఉంది.

వచ్చే ఎన్నికల్లో మోడీకి, రాహుల్ కు మధ్యే అసలైన పోటీ ఉంటుందని కొందరు అంటుంటే, విపక్షాల ఐక్య పోరాటమే దీనికి నాంది పలకనుందని మరికొందరు అంటున్నారు.

Must Read

spot_img