గౌతమ్ ఆదానీ .. ఇంతింతై, వటుడింతై అన్నట్లు .. తన వ్యాపార సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపింపచేశారు.. కానీ .. ఓ నివేదిక ఆ సామ్రాజ్యపు పునాదుల్నే వణికించేలా చేసింది. దీంతో ప్రపంచ సంపన్నుల్లో ఒకరిగా నిలిచిన ఆయన .. ఒక్కసారి గా టాప్ టెన్ లిస్ట్ లో నుంచి కిందకు దిగివచ్చేశారు.. మరి దీనిప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ఆయనకు అప్పులు ఇచ్చిన బ్యాంకులపైనా ఎలా ఉండనుందన్నదే ఆసక్తికరంగా మారింది.
ప్రపంచ సంపన్నుల జాబితా టాప్ 10 నుండి గౌతమ్ అదానీ నిష్క్రమించారు. భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ కు చెందిన అత్యధిక షేర్ల కంపెనీలు వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో భారీగా పతనం కావడంతో ఆయన సంపద భారీగా ఆవిరి అయింది. దీంతో నిన్న మొన్నటి వరకు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ టెన్ సంపన్నులు జాబితా నుండి నిష్క్రమించారు. గౌతమ్ అదానీకి చెందిన సంపద 34 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి. ప్రస్తుతం ఆయన 84.4 బిలియన్ల డాలర్ల సంపదతో 11వ స్థానంలో ఉన్నారు. భారతీయ వ్యాపారవేత్త బ్లూమ్ బెర్గ్ బిలినీర్స్ ఇండెక్స్ లో నాలుగో స్థానం నుండి 11వ స్థానానికి పడిపోయారు. కేవలం మూడు రోజుల్లోనే అదానీ ప్రపంచ సంపన్నులలో 11వ స్థానానికి దిగిపోయారు.
ఇక అతని తర్వాతి స్థానంలో 82.2 బిలియన్ డాలర్ల సంపదతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. అదానీ కంటే ముందు మెక్సికో సంపన్నుడు అయిన కార్లోస్ స్లిమ్ ఉన్నారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపు కంపెనీల షేర్లు హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల తీవ్రంగాదెబ్బతిన్నాయి. అదానీ గ్రూప్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. దీనిపై రెండేళ్ల పాటు పరిశోధన చేసి నాలుగు రోజుల కిందట రిపోర్టును విడుదల చేసింది. దీనికి ప్రతిస్పందనగా అదానీ గ్రూప్ కూడా 413 పేజీల రెస్పాన్స్ ను విడుదల చేసింది. అయినప్పటికీ హిండెన్ బర్గ్ తన నివేదికను సమర్థించి మరోమారు అదానీ గ్రూప్ పై విరుచుకుపడింది. జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకొని అదానీ గ్రూప్ భారీ మోసాలకు పాల్పడుతోందని మరోమారు ఆరోపించింది.
ఇక అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కంపెనీ షేర్లు విపరీతంగా పడిపోతున్నాయి. మార్కెట్ విలువలో 68 బిలియన్ల డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోయాయి. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ కూడా ఇప్పటికే ఐదు లక్షల కోట్లకు పైగా పతనమైంది. అదానీ కంపెనీల షేర్లు పతనం కొనసాగితే ఆసియా కుబేరుల్లో టాప్ 1 స్థానం కూడా కోల్పోవాల్సి వ్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు రోజుల ట్రేడింగ్ సెషన్లలో పెట్టుబడులు పెట్టిన వారి సంపద దాదాపు పదిలక్షల కోట్ల రూపాయల మేర పతనమైంది.
మొత్తంగా చూస్తే గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానం నుండి 11వ స్థానానికి పడిపోగా, ఈరోజు మార్కెట్లో కూడా వరుసగా అదానీ గ్రూప్ షేర్లు పడిపోతే ఆసియాలో కుబేరుడుగా మొదటి స్థానం నుండి గౌతమ్ అదానీ కిందికి వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు అదానీ స్థానంలో ఆసియాలో కుబేరుడిగా ముఖేష్ అంబానీ నిలుస్తారు. ఆసియా కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. ఇక అదానీకి అంబానీకి మధ్య సంపదలో వ్యత్యాసం రెండు బిలియన్ల డాలర్లే కావడంతో, అదానీ సంపద మరింత పతనం అయితే ఆయన ఆసియా కుబేరుల జాబితాలో తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోతారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి స్థానంలో ఉన్నారు. ఇతని మొత్తం ఆస్తులు 189 బిలియన్ డాలర్లు. దీని తరువాత ఎలోన్ మస్క్ రెండో స్థానంలో ఉన్నారు. అతని మొత్తం ఆస్తులు $ 160 బిలియన్లుగా ఉంది. జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు. అతని ఆస్తులు $ 124 బిలియన్లు. బిల్ జెంట్స్ 111 బిలియన్ డాలర్ల నికర విలువతో జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. వారెన్ బఫెట్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతని ఆస్తులు $ 107 బిలియన్లు.
హిండెన్ బర్గ్ నివేదికలో స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన ముఖ్యమైన కంపెనీలపై అదానీ గ్రూప్‌కు చాలా అప్పులు ఉన్నాయని కూడా చెబుతోంది. ఇక ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ జాబితాలో మాత్రం ఆయన 8వ స్థానంలో ఉన్నట్లు చూపిస్తోంది. హిండెన్ బర్గ్ దెబ్బకు గౌతం ఆదానీ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. ఈ మధ్య కాలంలో ప్రపంచ కుబేరుల్లో ఒకడుగా వెలుగు వెలిగి, కొంత కాలం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకొన్న ఆదానీ నేడు ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం లేకుండా పోయింది. గత మూడు రోజులుగా అమ్ముడవుతున్న షేర్లలో ఆదానీ గ్రూప్ కంపెనీలు.. తమ షేర్ల విలువ పడిపోవటం కారణంగా 68 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కోల్పోయాయి.
ఈ నేపథ్యంలో ఆదానీ టోటల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ 10శాతం మేర రోజూ షేర్ల అమ్మకాల్లో నష్టపోతోంది. అలాగే ఫ్లాగ్‌షిప్ ఆదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ల ధరలు కనిష్టానికి పడిపోయాయి. ఈ విధంగానే ఆదానీ గ్రూప్‌నకు చెందిన పది కంపెనీలు షేర్లలో పడిపోయిన విలువ కారణంగా 75బిలియన్ డాలర్లు నష్టపోయాయి. ఇదిలా ఉంటే. ఆదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి గతంలో ముందుకు వచ్చిన కంపెనీలు వెనకపట్టు పడుతున్నాయి. హిండెన్ బర్గ్ ఆరోపణల తర్వాత అనేక దిగ్గజ సంస్థలు ఆదానీ అంటేనే అనుమానంతో వెనుకడుగు వేస్తున్నాయి. ఈ కోవలోనే.. దుబాయి రాయల్ కుటుంబానికి చెందిన ఇంటర్నేషన్ హోల్డింగ్ కంపెనీ కూడా పెడతానన్న పెట్టుబడులను పెట్టడానికి ఇష్టపడడం లేదని సమాచారం. దీంతో తాజా పరిస్థితి చూస్తుంటే.. ప్రపంచ కుబేరుడిగా వెలుగొందిన ఆదాని ఆర్థిక సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే ఆదానీ తన కంపెనీల షేర్ల ధరలను ఎక్కువ విలవ చూపి మన బ్యాంకులు, ఆర్థిక సంస్థలనుంచి తీసుకున్న రుణాల పరిస్థితి ఏమిటన్నది ఆందోళన కలిగించే అంశం. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటాయనటంలో సందేహం లేదు. దీంతో భారత దేశ బ్యాంకులకు అదానీ గ్రూప్ ఎంత అప్పు ఉంది? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే దేశీయ బ్యాంకుల ద్వారా అదానీ గ్రూప్ తీసుకున్న రుణాలు తక్కువేనని, అవి ‘మేనేజెబుల్ లిమిట్స్’లోనే ఉన్నాయని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు జెఫ్రీస్, సీఎల్ఎస్ఏ పేర్కొన్నాయి. అదానీ గ్రూప్ తీసుకున్న అప్పులు.. గత మూడేళ్లల్లో రెట్టింపు అయ్యాయి. రూ. 1లక్ష కోట్ల నుంచి రూ. 2లక్షల కోట్లకు చేరాయి.
బ్యాంక్‌ల నుంచి తీసుకున్న అప్పులు 25శాతం పెరిగాయని సీఎల్ఎస్ఏ వెల్లడించింది. మొత్తం మీద.. అదానీ అప్పుల్లో ఇండియన్ బ్యాంకుల వాటా 40శాతం కన్నా తక్కువగానే ఉందని వివరించింది. అదానీ గ్రూప్ రుణాల్లో భారత దేశ బ్యాంకుల వాటా 40శాతం కన్నా తక్కువగానే ఉంది. అందులో ప్రైవేటు బ్యాంకుల వాటా 10శాతం కన్నా తక్కువ. ఎయిర్ పోర్ట్, పోర్ట్ వంటి ఫైనాన్సియల్ అసెట్స్‌తో కూడిన వ్యాపారలకే అధికంగా రుణాలు ఇచ్చినట్టు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకులు చెబుతున్నాయి.
అందువల్ల.. బ్యాంకింగ్ వ్యవస్థపై అదానీ అప్పుల ప్రభావం తక్కువేనని సీఎల్ఎస్ఏ పేర్కొంది. పీఎస్‌యూ బ్యాంక్‌లపై అదానీ అప్పుల ప్రభావం 30శాతంగా ఉంది. కానీ గత ముడేళ్లల్లో ఈ అప్పులు పెద్దగా పెరగలేదు. అంటే.. అదానీ కొత్త, పాత వ్యాపారాలకు విదేశాల నుంచే ఎక్కువగా నిధులు అందాయని సీఎల్ఎస్ఏ వివరించింది. గత మూడేళ్లల్లో అదానీ గ్రూప్ కంపెనీలు తీసుకున్న రూ. 1లక్ష కోట్ల అప్పుల్లో ఇండియన్ బ్యాంక్స్ వాటా రూ. 15వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేసింది.