న్యూజీలాండ్ ను గాబ్రియేల్ తుఫాన్ వణికిస్తోంది. గంటకు 140 కి.మీల వేగంతో వీస్తున్న గాలులు బీభత్సం స్రుష్టిస్తున్నాయి. ఆకాశాన్నంటేలా సముద్రపుటలలు ఎగిసిపడుతున్నాయి. రాత్రి పూట పడుకున్న జనం ఉదయం లేచేసరికి ఆకాశం నల్లటి మబ్బులతో భారీ వర్షం కురిసింది. గాబ్రియేల్ తుఫాన్ తాలూకు విపత్తు దేశాన్ని కమ్మేసింది. న్యూజీలాండ్ చరిత్రలోనే మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు…
న్యూజిలాండ్‌లో ఉష్ణమండల తుఫాను వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ తుఫానుతో వరదలు పోటెత్తడంతో న్యూజిలాండ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మంగళవారం అత్యవసర పరిస్థితిని విధించింది. గాబ్రియేల్ తుపాను ఆ దేశ ఉత్తర భాగంపై పెను ప్రభావం చూపిస్తోంది. వేల కుటుంబాలకు విద్యుత్తు అందకపోవడంతో చీకట్లో కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రతి గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
దాదాపు 11 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని న్యూజిలాండ్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు నిద్రలేచే సమయానికి పూర్తిస్థాయి విపత్తు కమ్ముకొందని ప్రధాని క్రిస్ హిప్‌కిన్స్ అన్నారు. ”మేము గత 24 గంటల్లో పరిస్థితిని చూస్తే.. ప్రజల అత్యవసరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది” అని క్రిస్ వెల్లడించారు. కొన్ని వారాల క్రితమే ఆక్లాండ్, ఉత్తర ఐలాండ్ ప్రాంతాలను భారీ తుపాను తాకింది. గత నెలలో ఆక్లాండ్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై భారీగా వరదలు వచ్చాయి. ఈ వరదల్లో నలుగురు మరణించారు.
2011లో వచ్చిన క్రైస్ట్‌చర్చ్ భూకంపం, 2020లో వచ్చిన కొవిడ్ వ్యాప్తి తర్వాత న్యూజిలాండ్‌లో తాజాగా ఇప్పుడే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. తాజాగా 150 న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. చాలా కమ్యూనిటీల మధ్య సంబంధాలు తెగిపోయాయి. దేశంలో ఉత్తర ఐలాండ్‌లోని కొన్ని భాగాల్లో 30 జాతీయ రహదారులు, పోర్టులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను మూసివేశారు. ఇక ఆక్లాండ్ ఎయిర్ పోర్టు నుంచి దేశీయంగా ప్రయాణించాల్సిన 55 విమానాలను రద్దు చేశారు.
నేపియర్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఫిబ్రవరి సగటు కంటే మూడు రెట్ల అధిక వర్షపాతం నమోదైంది. న్యూజిలాండ్ వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన రెడ్ వార్నింగ్ జారీ చేసింది. ‘న్యూజిలాండ్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. ఈ కారణంగా పదివేల ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెనీ విధించాము’ అని అత్యవసర నిర్వహణా మంత్రి కీరన్ మెక్ అనుల్టీ తెలిపారు. అయితే ఈ అనుకోని తుఫాను వల్ల ఉత్తర ద్వీపంపై బాగా ప్రభావం చూపుతుందని, ఇది న్యూజిలాండ్‌వాసులకు అతిపెద్ద విపత్తు అని మంత్రి కీరన్ మెక్ అనుల్టీ పేర్కొన్నారు. తుఫాను ఎమర్జెనీ సేవలకు కూడా ఆటంకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. న్యూజిలాండ్ అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌కు సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాలలో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది.
- పలు ప్రాంతాలలో కొండచరియలు..
పలు ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. అలాగే న్యూజిలాండ్‌లో ఓ ఇల్లు కూలిపోయిన ప్రాంతానికి వెళ్లిన ఎమర్జెన్సీ సర్వీసెస్, అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు తప్పిపోయారని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని మంత్రి కీరన్ మెక్ తెలిపారు. ‘ఈ తుఫాను వల్ల ఉత్తర ద్వీపకల్పంలో అత్యవసర సేవలందించడానికి కూడా ఇబ్బంది ఉంది. అక్కడ అత్యవసర సేవలను కూడా అందించలేకపోతున్నామని’ ఫైర్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెర్రీ గ్రెగోరీ అన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల సోమవారం ఎయిర్‌సర్వీసెస్ విమానాలను నిలిపివేసింది.
మంగళవారం వాతావరణం అనుకూలంగా ఉంటే.. కొన్ని విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు ఎయిర్ న్యూజిలాండ్ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటి వరకు నార్త్‌ల్యాండ్‌లో 58 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పునరుద్ధరించేందుకు సుమారు వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపినట్టు న్యూజీలాండ్ మీడియా చెబుతోంది.
పలు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చెయ్యాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ అత్యవసర పరిస్థితుల్లో తమ వెంట ఏ ఏ వస్తువులు తీసుకెళ్లాలో జాతీయ విపత్తుల నిర్వహణ వ్యవస్థ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తోంది. ఓ వైపు తుపాను ముప్పు కొనసాగుతుండగానే మరోవైపు న్యూజీలాండ్‌ను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.1గా భూకంప తీవ్రత నమోదయ్యిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.