Homeతెలంగాణబీఆర్ఎస్ కు మిత్రులు దూరమవుతున్నారా..?

బీఆర్ఎస్ కు మిత్రులు దూరమవుతున్నారా..?

  • తెలంగాణ రాజకీయాల్లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది.
  • లెఫ్ట్ పార్టీలు .. అధికార పార్టీకి దూరం అవుతున్నాయా..?
  • దీనికి కారణమేమిటి..?
  • మరి లెఫ్ట్ పార్టీలు .. దూరమైతే, బీఆర్ఎస్ కు రాజకీయ ఇబ్బందులు తప్పవా..?

బీఆర్ఎస్ కు మిత్రులు దూరమవుతున్నారా? ఇతర రాష్ట్రాలలో విస్తరణ పేరుతో రాజకీయంగా ఫేడ్ అవుట్ అయిన నాయకులను చేర్చుకుని తన భుజాలను తానే చరుచుకుంటున్న కేసీఆర్.. తెలంగాణలో మాత్రం ఉన్న మిత్రులను దూరం చేసుకుంటోంది. గత ఎనిమిదేళ్లుగా అరమరికలు లేకుండా మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కారణాలేమైతేనేం ఇటీవలి కాలంలో దూరం జరుగుతూ వస్తోంది. ఇక బీజేపీ వ్యతిరేకతే ప్రాతిపదికగా.. బేషరతుగా కేసీఆర్ బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తూ ముందుకు వచ్చిన వామపక్షాలు ఇప్పుడు బీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి.

మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు బేషరతు మద్దతు ప్రకటించిన వామపక్షాలు ఆ పార్టీ అభ్యర్థి విజయానికి తమ వంతు సహకారం అందించాయి. అప్పుడే కాదు.. ఆ తరువాత ప్రతి సందర్భంలోనూ.. వామపక్షాలు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచాయి. అందుకు వారు చెప్పిన మాట మతతత్వ శక్తులు బలోపేతం కాకుండా అడ్డుకోవడమేనని చెబుతూ వచ్చారు. అంత వరకూ బానే ఉంది.. కానీ హఠాత్తుగా వామపక్షాలు ప్లేటు ఫిరాయించినట్లు కనిపిస్తోంది.

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగననున్న నేపథ్యంలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలన్న వ్యూహంతో వామపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. కేసీఆర్ తో దోస్తీ ఉన్నప్పటికీ ఆయన వామపక్షాలకు తగినన్ని సీట్లు కేటాయిస్తారన్న నమ్మకం ఆ పార్టీలకు లేకపోవడంతో వామపక్షాలు వ్యూహం మార్చాయి. బీఆర్ఎస్ తో పొత్తు పక్కన పెట్టి వామపక్షాలు ఉమ్మడిగా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలన్న వ్యూహంతో ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.

అలాగే.. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు దగ్గరవ్వడం వల్ల జాతీయ స్థాయిలో సెక్యులర్ శక్తుల బలోపేతానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని కూడా ఆ పార్టీలు భావిస్తున్నట్లు చెబుతున్నాయి. అధికారికంగా ఈ సంగతిని వామపక్షాల అధిష్ఠానాలు ప్రకటించకపోయినప్పటికీ.. తెలంగాణలో సంభవిస్తున్న పరిణామాలను పరిగణనలోనికి తీసుకుంటే.. వామపక్షాల వ్యూహం బీఆర్ఎస్ విషయంలో మారిందనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

  • ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్రకు సీపీఐ సంఘీభావం ప్రకటించడాన్ని చూపుతున్నారు.

వామపక్షాలకు ఎటూ సొంతంగా అధికారంలోకి వచ్చే బలం తెలంగాణలో లేదు. అయినా ఆ పార్టీ .. బీజేపీ వ్యతిరేకత విషయంలో ముందు వరుసలో ఉంటుంది. ఇక బీఆర్ఎస్ అధినేత కూడా గతంలో ఎలా ఉన్నా.. ఇటీవలి కాలంలో ఆయన మాట, శ్వాస కూడా బీజేపీ వ్యతిరేకతే అన్నట్లుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే వామపక్షాలు కేసీఆర్ కు బేషరతుగా దగ్గరయ్యాయి. గతంలో వామపక్షాలను చులకన చేస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలూ, విమర్శలను సైతం పట్టించుకోకుండా మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ కు మద్దతుగా నిలిచాయి. ఆ తరువాత బీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనూ సందడి చేశాయి.

మరి హఠాత్తుగా ఏమైందో ఏమో కానీ.. సొంతంగా పోటీపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఫోకస్ పెట్టాయి. అదే సమయంలో కాంగ్రెస్ కు చేరువ అవుతున్న సంకేతాలు ఇచ్చాయి. ఇందుకు కారణం.. ఇటీవల పలు సందర్భాలలో బీఆర్ఎస్ నాయకులు వామపక్షాలతో పొత్తుపై చేసిన వ్యాఖ్యలు కూడా కారణమని పరిశీలకులు అంటున్నారు.

రాష్ట్రంలో ఏ మాత్రం పట్టు బలం లేని వామపక్షాలకు బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాలను కేటాయించే అవకాశం లేదనీ, కేసీఆర్ కూడా పోత్తు ఉన్నప్పటికీ వామపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దగా సానుకూలత చూపే అవకాశం లేదనీ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే వామపక్షాలు తమ దారి తాము చూసుకుంటున్నాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని వ్యాఖ్యానించడాన్ని కూడా పరిశీలకులు ఈ సందర్భంగా ఎత్తి చూపుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని కూడా వారు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంపై కన్నేసిన బీజేపీ.. అధికారం దక్కించుకున్నా, దక్కించుకోలేకపోయినా.. రాష్ట్రంలో చెప్పుకోదగ్గంతగా బలపడిందన్నది మాత్రం నిర్వివాదాంశం. అలాగే.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ పగ్గాలు చేపట్టడం, రాహుల్ భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్ లో ఆత్మ విశ్వాసం పెరిగింది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో విజయంపై ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ గణనీయంగా బలపడింది. దీంతో రాష్ట్రంలో హంగ్ ఎర్పడు అవకాశాలున్నాయంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

  • ఈ నేపథ్యంలోనే.. వామపక్షాలు కూడా బీఆర్ఎస్ కు దూరం జరిగి కాంగ్రెస్ కు చేరువ కావడానికి మొగ్గు చూపుతున్నారని అంటున్నారు..

ఎలాగూ బీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ కు సెక్యులర్ పార్టీగా జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు ఉంది. ఒక స్టేచర్ ఉంది. ఈ నేపథ్యంలోనే.. వామపక్షాలు కూడా ఎన్నికల తరువాత ఎటూ.. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు దగ్గరవ్వక తప్పని పరిస్థితి ఉన్నందున ముందే కాంగ్రెస్ కు దగ్గరైతే గౌరవంగా ఉంటుందని వామపక్షాలు భావిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. బీఆర్ఎస్ తో పొత్తుపై లెఫ్ట్ పార్టీల భేటీ తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండాలంటే తమకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించాలని సిపిఐ, సిపిఎం పార్టీలు స్పష్టం చేస్తున్నాయి.

తమకు గౌరవప్రదమైన సీట్లను కేటాయిస్తేనే పొత్తు ఉంటుందని, లేదంటే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించుకోవలసి వస్తుందని చెబుతున్నాయి. అంతేకాదు ఇదే విషయంలోబీఆర్ఎస్ పార్టీతో చర్చించాల్సి వస్తే అడగాలని అంశంపై నేడు సిపిఐ, సిపిఎంలు భేటీ నిర్వహించి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.

ఆ స్థానాలపై ఎర్ర పార్టీలు గట్టిగా పట్టుబట్టే అవకాశం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ తమ పార్టీలకు బలమున్న స్థానాలపై చర్చించి ఆయా స్థానాలలో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరే ఆలోచనలో ఉన్నారు ఎర్ర పార్టీల నాయకులు. సిపిఎం, సిపిఐ రెండు పార్టీలు చెరో పది సీట్లు అడగాలని, కనీసం చెరో ఐదు సీట్లు అయినా ఇచ్చేలా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే చివరకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలను కోరడంతో పాటు, రెండు ఎమ్మెల్సీ సీట్ల చొప్పున అయినా అడగాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా సిపిఐ కొత్తగూడెం స్థానాన్ని, సిపిఎం భద్రాచలం స్థానాన్ని తప్పనిసరిగా అడిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే లెఫ్ట్ పార్టీలతో పొత్తులు, సీట్ల కేటాయింపుకు సంబంధించి కొందరు బీఆర్ఎస్ నేతలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారికి అసెంబ్లీ ఎన్నికలలో ఎటువంటి సీట్లు కేటాయించేది లేదని, చెరో ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామన్నట్టుగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల సిపిఐ, సిపిఎం నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

లెఫ్ట్ పార్టీలు గెలిచే సత్తా తమకు లేకున్నా ఓడించే దమ్ము మాత్రం ఉందని, తమను తక్కువగా అంచనా వేస్తే బిఆర్ఎస్ పార్టీకే నష్టం జరుగుతుందని, అధికార పార్టీకి దబిడి దిబిడే అంటున్నారు. బిజెపికి చెక్ పెట్టాలంటే కనుక గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో సిపిఐ, సిపిఎం కూడా ఒకరికి ఒకరు పోటీగా అభ్యర్థులను నిలపొద్దని, పరస్పర ఐక్యతతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

మరి బీఆర్ఎస్ .. ఏం చేయనుందన్నదే కీలకంగా మారింది..

Must Read

spot_img