Homeఅంతర్జాతీయంపారిస్ మొదలుకొని మరో పది నగరాలలో ఆందోళనలు...

పారిస్ మొదలుకొని మరో పది నగరాలలో ఆందోళనలు…

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెకరాన్ చేపట్టిన పెన్షన్ సంస్కరణలను ఫ్రాన్స్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఉన్న పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచుతూ ప్రతిపాదనలు చేసినందుకు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెన్షన్ అందుకోవడానికి మరో రెండేళ్లు పనిచేయాలా అంటూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.

ఆందోళనలతో ఫ్రాన్స్ అట్టుడికుతోంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ పెన్షన్‌ సంస్కరణలు దేశ చరిత్రలో అతి పెద్ద నిరసన ప్రదర్శనకు దారి తీశాయి. పదవీ విరమణ వయసుని 62 నుంచి 64కి పెంచుతూ ప్రతిపాదనలు చేసినందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పెన్షన్‌ అందుకోవడానికి మరో రెండేళ్లు పని చేయాలా అంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పాఠశాలలు తెరుచుకోలేదు. కార్యాలయాలు మూతబడ్డాయి. ఈఫిల్‌ టవర్‌ను మూసేశారు. పారిస్‌ సహా పలు నగరాల్లో 10 లక్షల మందికిపైగా నిరసనకారులు వీధుల్లోకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 12 ట్రేడ్‌ యూనియన్లు, లెఫ్ట్‌ పార్టీలు, ఫార్‌ రైట్‌ పార్టీలు కలసికట్టుగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.

ఇలా ఒక్కత్రాటిన పలు పార్టీలు, ట్రేడ్ యూనియన్లు ఫార్ రైట్ పార్టీలు ఆందోళలనల్లో పాల్గొనడం ఓ విశేషంగా చెబుతున్నారు విశ్లేషకులు. దేశంలో 68% ప్రజలు ఈ పెన్షన్‌ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. రైట్‌ పార్టీల మద్దతుతో అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్‌ వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే పెన్షన్‌ సంస్కరణల బిల్లుకు ఎంతవరకు మద్దతు లభిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రపంచం అంతటా సగటు మనిషి ఆయుఃప్రమాణం పెరుగుతోంది. జననాల రేటు గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో వయసు మీద పడినా కష్టపడి పని చేయాల్సి వస్తోంది. అయితే రిటైర్మెంట్‌ వయసు యూరప్‌ దేశాలలో చూస్తే ఫ్రాన్స్‌లోనే తక్కువ. స్పెయిన్‌లో 65, యూకేలో 67, జర్మనీలో 67 ఏళ్లుగా ఉంది.

జర్మనీ కూడా రిటైర్మెంట్‌ వయసును 70 ఏళ్లకు పెంచే యోచనలో ఉంది. ఫ్రాన్స్‌ కూడా పెన్షన్‌ నిధుల్ని పెంచుకోవడానికే ఈ సంస్కరణలను తీసుకొచ్చింది. రెండేళ్ల రిటైర్‌మెంట్‌ వయసు పెంపుతో ఏడాదికి 1,770 కోట్ల యూరోలు జమ అవుతాయి. 2027 నాటికి బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యపడుతుంది. హాయిగా ఇంటి పట్టున ఉండి పెన్షన్‌ అందుకుందామని అనుకున్న వారంతా మరో రెండేళ్లు పనిచేయడానికి సుముఖత చూపించడం లేదు. ఇంకా పని చేస్తే రిటైరవక ముందే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని రైల్వే వర్కర్లు, మహిళలు, నైట్‌షిఫ్ట్‌ల్లో ఉండేవారు ఆందోళనగా ఉన్నారు. కనీసం 43 ఏళ్లు పని చేయాలన్న నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆలస్యంగా మొదలు పెట్టే మహిళలు, ఉన్నత విద్య చదివే వారు 67 ఏళ్ల దాకా పని చేయాల్సి వస్తుంది.

మరోవైపు నిరుద్యోగులు కూడా తమకు ఉద్యోగాలు లేటవుతాయంటూ ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే ఫ్రాన్స్‌లో కనీస పెన్షన్‌ పెరుగుతున్న ధరలకి అనుగుణంగా లేదు. కరోనా, రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ధరాభారం పెరిగింది. ఫ్రాన్స్‌లో పెన్షన్‌ సంస్కరణలపై నిరసనలు ఇదేం మొదటిసారి కాదు. 2010లో రిటైర్‌మెంట్‌ వయసుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచినప్పుడు కూడా ఇదే స్థాయి వ్యతిరేకత ఎదురైంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడయ్యాక మాక్రాన్‌ ఈ సంస్కరణలు తేవాలని గట్టిగా అనుకున్నారు. 2019లో ఈ ప్రతిపాదిత సంస్కరణలకి వ్యతిరేకంగా సమ్మె జరిగినా కరోనా సంక్షోభంతో సమ్మెని ఆపేశారు. పెన్షన్‌ నిధి పెంచుకోవాలంటే సంపన్నులకి పన్నులు పెంచాలని, పెన్షన్‌ పథకంలో యాజమాన్యాల వాటాను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రిటైర్మెంట్‌ వయసును ఏడాదికి మూడు నెలల చొప్పున పెంచుతూ 2030 నాటికి 64 ఏళ్లకు పెంచేలా మెకరాన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. 2027 తర్వాత చేరే ఉద్యోగులెవరైనా పూర్తి పెన్షన్‌ కోసం కనీసం 43 ఏళ్లు పని చేయాల్సి ఉంటుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రిటైరయే నాటికి 43 ఏళ్ల సర్వీసు లేకపోతే 67 ఏళ్లు వచ్చేదాకా పని చేస్తేనే పెన్షన్‌ లభిస్తుంది. పూర్తి కాలం ఉద్యోగం చేసిన అల్పాదాయ వర్గాలకు 85% పెంపుతో పెన్షన్‌ 1200 యూరోలు అవుతుంది. 20 లక్షల మంది చిన్న ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. అయితే ప్రపంచ దేశాలు పెన్షన్లను ఖరీదైన వ్యవహారంగా పరిగణిస్తున్నాయి. అమెరికాలో 50 ఏళ్ల క్రితం ప్రతీ 10 మందిలో 8 మందికి డిఫైన్డ్‌ బెనిఫిట్‌ పథకాలు వర్తిస్తే ఇప్పుడు ప్రతీ 10 మందిలో ఒక్కరికే వర్తిస్తోంది.

Must Read

spot_img