మళ్లీ డీఎల్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయా..? వచ్చే ఎన్నికల్లో పోటీ కోసమే డీఎల్ .. విమర్శలు చేస్తున్నారా..? ఇంతకీ అసలు డీఎల్ దారెటు..? ఆయన వ్యూహం ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది.
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తాను వైసీపీలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. తనను ఎవరూ తీసేయలేదన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పైన సంచలన ఆరోపణలు చేసారు. అవినీతి చేస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీలో ఉండాలంటే తనకే ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.
తాను వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందని డీఎల్ అంచనా వేసారు. ఇద్దరూ కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పుకొచ్చారు. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేవుడు వచ్చిన కాపాడలేడన్నారు. చంద్రబాబు సీఎం అయిన ప్రరయత్నం చేస్తే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ లో నిజాయితీ ఉన్న సీఎం అయ్యేందుకు అనుభవం లేదని డీఎల్ రవీంద్రారెడ్డి విశ్లేషించారు. అంతేగాక వివేకా హత్య కేసుకు సంబంధించి డీఎల్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
జనవరి 3 నుంచి ఈ కేసులో మలుపులు తిరగనున్నాయన్నారు. వివేకా కేసులో ఎర్ర గంగిరెడ్డే కీలక వ్యక్తి అని సీబీఐ గుర్తించిందని చెప్పుకొచ్చారు. జనవరి 3న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు ఉన్నాయని గుర్తు చేసారు. సుప్రీం తీర్పు తర్వాత వివేకా కేసులో జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అంచనా వేసారు. తన పనితీరు గురించి తెలిసిన ఏ పార్టీ అయినా వచ్చే ఎన్నికల్లో నన్ను తీసుకుంటుందని ఆశిస్తున్నా.. ఏదైనా గుర్తింపు ఉన్న పార్టీ తరఫున పోటీ చేస్తాను. ఇంకా ఏ పార్టీ నుంచి ఆఫర్ రాలేదని అన్నారు.
దీంతో వైసీపీ కంచుకోట, జగన్ సొంత జిల్లా కడపలో భారీ షాక్ తగిలేలా ఉంది. ఎన్నో ఏళ్లుగా కడపలో రాజకీయం చేస్తున్న సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. ఈ మేరకు ఆయన ఓపెన్ గానే చంద్రబాబు తప్ప మరొకరు రాష్ట్రాన్ని కాపాడలేరు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచి మైదుకూరులో పోటీ చేస్తానని అన్నారు.
అయితే 1978 నుంచి డీఎల్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1978లో మైదుకూరు నుంచి ఇండిపెండెంట్ గా గెలిచారు. 1983, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు.
కానీ గత ఎన్నికల ముందు టీడీపీలో చేరాలని చూశారు.. కానీ చంద్రబాబు సీటు ఫిక్స్ చేయలేదు. దీంతో డీఎల్ వైసీపీలో చేరి..మైదుకూరులో వైసీపీ గెలుపు కోసం పనిచేశారు. మైదుకూరులో వైసీపీ గెలిచింది. అలాగే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత డీఎల్‌ని వైసీపీ పట్టించుకోలేదు. అలాగే మధ్య మధ్యలో డీఎల్..జగన్ పాలన పై విమర్శలు చేశారు.
తాజాగా మరీ ఎక్కువగా జగన్ పై విరుచుకుపడ్డారు. అలాగే బాబుని పొగడటం బట్టి చూస్తే ఆయన టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కానీ మైదుకూరు సీటులో టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఆయన్ని కాదని డీఎల్‌కు సీటు ఇస్తారనేది డౌటే. అయితే మైదుకూరులో డీఎల్‌కు పట్టుంది. డీఎల్ గాని టీడీపీలోకి వెళితే..అక్కడ వైసీపీకి నష్టమే. వివేకా హత్యకేసును ఆయన కూతురు వైఎస్ సునీతా రెడ్డి కుటుంబంపైకి నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రవీంద్రా రెడ్డి సంచలన రోపణలు చేశారు.
ఈ కేసులో సునీత కుటుంబానికి ఏ పాపం తెలియదని తాను అనుకుంటున్నానని రవీంద్రా రెడ్డి అన్నారు. వివేకా హత్య కేసులో నిందితులెవరూ
తప్పించుకోలేరని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, రాజకీయాల విషయంలో డీఎల్ రవీంద్రారెడ్డి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. తాను పార్టీల వద్దకు వెళ్లకూడదని, పార్టీలే తన వద్దకు వస్తాయని డీఎల్ రవీంద్రారెడ్డి భ్రమించారు. ఆరుసార్లు మైదుకూరు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం డీఎల్ రవీంద్రారెడ్డిది.
ఆయను అనుభవాన్ని ఏ పార్టీ అయినా ఉపయోగించుకోవాలని చూస్తుంది. అలాగే ఆయనకున్న క్యాడర్ కూడా బలమైనదే. కానీ డీఎల్ రవీంద్రారెడ్డికి కాలం
కలసి రావడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014లోనూ ఏ పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించరని తెలిసి కూడా దాదాపు ఐదేళ్లు ఆ పార్టీలో్నే కాలక్షేపం చేశారు.
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా డీఎల్ రవీంద్రారెడ్డి 2014 నుంచి 2019 వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు లెక్క. ఇక ఐదేళ్ల పాటు మౌనంగానే ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి గత ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకున్నారు. అదీ నాన్చినాన్చి నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి తనకు మైదుకూరు టిక్కెట్ వస్తుందేమోనని భావించారు. చంద్రబాబునాయుడిని కలిశారు. కానీ పుట్టా సుధాకర్ యాదవ్ ఉండటంతో చంద్రబాబు డీఎల్ కు నో చెప్పారు.
ఇక ఎన్నికలు సమీపిస్తుండంగా వైసీపీ నేతలు అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు కలసి డీఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. వారి కోరిక మేరకు డీఎల్ వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. అధికారంలోకి వస్తే తాను ఖచ్చితంగా పదవి ఇస్తానని జగన్ డీఎల్ రవీంద్రారెడ్డికి మాట ఇచ్చారు. దీంతో రవీంద్రారెడ్డి మైదుకూరులో వైసీపీ విజయానికి కృషి చేశారు.
కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఎన్నికలకు ముందు వైసీపీలో అనేక మంది నేతలు చేరారు. వారిలో ఒకరిగా డీఎల్ రవీంద్రారెడ్డి మిగిలిపోయారు. డీఎల్ రవీంద్రారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్నా ఇటీవలే జగన్ చల్లా రామకృష్ణారెడ్డి సీమ కోటాలో ఇచ్చేశారు. రెడ్డి సామాజికవర్గం నుంచి ఇక ఇప్పట్లో పదవులు జగన్ ఇవ్వనట్లే.
ముఖ్యంగా కడప జిల్లాలో పదవులు ఇవ్వాల్సిన జాబితా చాంతాండంత ఉంది. అనేక మంది నేతలు జగన్ పై ఇప్పటికే ఆశలు పెంచుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో డీఎల్ రవీంద్రారెడ్డికి ముఖ్యమైన పదవి వచ్చే అవకాశం లేనట్లే కన్పిస్తుంది. అయితే జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న ఏకైక ఆశ డీఎల్ లో మిగిలి ఉండడంతోనే, ఆయన ఇన్నాళ్లు వేచి చూశారని టాక్ వినిపిస్తోంది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలపై ఆయన కన్నేశారు.
వచ్చే సాధారణ ఎన్నికలకు మరోసారి మైదుకూరు నుంచి బరిలో ఉండాలని ఆయన ఆశిస్తున్నట్టు స్పష్టమవుతోంది. దానికి అనుగుణంగా బహిరంగ ప్రకటన కూడా చేశారు. 72 సంవత్సరాల వయసు పైబడిన డీఎల్ రాజకీయ జీవితం కూడా 43 ఏళ్లు దాటిపోయింది. అయినప్పటికీ ఆయన రాబోయే ఎన్నికలకు సిద్ధం కావడం .. ఆసక్తికరమే. ప్రస్తుత తరంలో చక్రం తిప్పుతున్న నేతల పట్ల డీఎల్ కి చిన్నచూపు కూడా ఉంటుందనే విమర్శ వినిపిస్తుంటుంది.
దానికి తగ్గట్టుగానే వచ్చే ఎన్నికల్లో రంగంలో దిగి తన హవా చాటుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. దానికి జనసేనను ఎంచుకోనున్నట్టు ప్రచారం మొదలయ్యింది. రాయలసీమలో బలిజల ప్రభావం ఉండే నియోజకవర్గాల్లో మైదుకూరు ఒకటి. మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లో కూడా జనసేన
పరువు నిలిపిన మునిసిపాలిటీ అదే. దాంతో వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన ఖచ్చితంగా పోటీ చేసే స్థానాల్లో మైదుకూరు ఉంటుందనే అంచనాలున్నాయి.
దానికి తగ్గట్టుగా డీఎల్ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన మైత్రీ దాదాపు ఖాయమనే వాతావరణం ఉంది. దాంతో ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మైదుకూరు సీటు మీద డీఎల్ కన్నేసినట్టు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటూ టీడీపీ, జనసేన కూటమి కన్ఫర్మ్ అయితే మైదుకూరు నుంచి మళ్లీ పోటీ చేసేందుకు డీఎల్ ఉత్సుకత చూపుతున్నారన్నది ఖాయం.
మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టే లక్ష్యంతో ఆయన సన్నాహాలు ప్రారంభించినా జనసేన వంటి వన్ మేన్ ఆర్మీలో ఆయన మనుగడ సాధ్యమా అనే సందేహాలున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో పొసగడం అంత సులువు కాదనేది నిస్సందేహం. అయితే తన రాజకీయ భవిష్యత్ కోసం డీఎల్ ఇప్పుడు ఏ
పార్టీలో చేరతారనేది స్పష్టత ఇవ్వటం లేదు. ఆయన టీడీపీ – జనసేన వైపు ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
మరి డీఎల్ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.