Homeజాతీయంఎగిరే సైనికులు వస్తున్నారు..

ఎగిరే సైనికులు వస్తున్నారు..

హాలీవుడ్ మూవీలో సూపర్ మ్యాన్ ఓ సూట్ ధరించి గాల్లో ఎగిరి ఫైటింగ్ చేసే సీన్స్ మనం తెరపై చూసాం….మూవీల్లో హీరోలు ఎగిరే సూట్లు ధరించి ఆకాశంలో రివ్వుమని ఎగురుతూ విలన్లను రఫ్ఫాడించడం చూస్తుంటాం. ఇటీవల తెలుగులో విడుదలైన ప్రభాస్ సాహో సినిమాలో ఫ్లయింగ్ సూట్ ధరించి హీరో ఫైటింగ్ చేసే సన్నివేశాలు థియోటర్లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా చేశాయి. మరీ నిజ జీవితంలో కూడా ఈ రకమైన సూట్లు ధరించి గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకోండి… ఇలాంటి సీన్లను రియల్ లైఫ్ లో కూడా చూడబోతున్నాం.. ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది కధా…కానీ ఇదీ ఇమాజినేషన్ కాదు నిజం. మరికొన్ని రోజుల్లో ఇలా గాల్లో ఎగిరే సైనికులు మన దేశంలోనూ సందడి చేయనున్నారు. ఎలాంటి ప్యారాచూట్‌లు అవసరం లేకుండా పక్షిలా గాల్లో ఎగిరే సైనికులు ఇండియన్‌ ఆర్మీలోకి రానున్నారు.

ఇండియన్ ఆర్మీలోకి వాయువేగంతో పయనించే ఫైటర్‌ జెట్‌లు, డ్రోన్ల వరుసలలో త్వరలో ఎగిరే సైనికుడు కూడా వచ్చి చేరనున్నాడు. ఎలాంటి ప్యారాచూట్‌ల అవసరం లేకుండానే పక్షిలా ఎగురుతూ లక్ష్యాలను చేరేందుకు వీలుగా ఉండే సూట్లను తయారు చేశారు. ఇప్పటికే బెంగళూరుకు చెందిన అబ్సల్యూట్‌ కంపోజిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏసీపీఎల్‌) అనే స్టార్టప్‌ కంపెనీ ఈ రకమైన సైనిక దుస్తులను తయారు చేసింది. ప్రస్తుతం బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా ప్రదర్శనలో ఉంచారు. ఈ ఫ్లయింగ్ సూట్లు దేశ, విదేశీ సైనిక సంస్థలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సాయుధ దళాలకోసం రూపొందించిన ఈ జెట్ ప్యాక్ సూట్ ప్రత్యేకతలు ఇన్నీ అన్నీ కావు.. ఈ సూట్ మూడు కిలోల బరువు ఉంటుంది. టర్బో ఇంజన్ తో సహా అయిదు ఇంజన్లు ఉన్న ఈ జెట్ ప్యాక్ సూట్ ధరించిన వ్యక్తి 10 నిముషాల్లో 10 కి.మీ. దూరం వెళ్లగలడట .. ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, కొండ చరియలు విరిగి పడడం, హెలికాప్టర్లు వెళ్లలేని ప్రదేశాలకు, అగ్నిప్రమాదాలు జరిగిన చోటలకు, సైనిక ఆపరేషన్లకు, సహాయక చర్యలకు ఈ విధమైన సూట్లు ఎంతో ఉపయోగపడుతాయని సంస్థ ఎండీ రాఘవరెడ్డి తెలిపారు.

దీని వెనుక 30 లీటర్ల సామర్థ్యం కలిగిన డీసెల్ ట్యాంక్, ఎలెక్ట్రానిక్స్ సాధనాలను అమర్చారు. ఫ్లయింగ్ సూట్ తయారీలో దాదాపుగా 70 శాతానికి పైగా స్వదేశీ వస్తువులనే ఉపయోగించినట్లు సైంటిస్ట్ లు తెలిపారు. ఈ సూట్ సైనికుడిని 10 నుంచి 15 మీటర్ల ఎత్తువరకు ఎగరడానికి, గంటకు సుమారు 50 కి.మీ. దూరం ప్రయాణించడానికి తోడ్పడుతుందని అన్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో పరిశోదనలు జరగలేదన్నారు. రానున్న కొన్ని వారాల్లో దీనికి సంబంధించిన డిమాన్స్ట్రేషన్లు ఉంటాయన్నారు. కనిష్టంగా మైనస్​ -150 డిగ్రీల సెల్సీయస్​ నుంచి మైనస్​ -100 డిగ్రీల సెల్సీయస్​ చల్లటి వాతావరణంలో .. గరిష్టంగా 400 డిగ్రీల సెల్సీయస్​ నుంచి 450 డిగ్రీల సెల్సీయస్​ ఎండల్లోనూ ఈ సూట్స్​ బాగా పనిచేస్తాయని వారు అంటున్నారు. ఈ సూట్ ఆపరేటింగ్ ను చాలా ఈజీగా ఒక్క రోజులోనే నేర్చుకోవచ్చు అంటున్నారు. అయితే దీన్ని టెస్ట్ చేసేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ట్రయల్ బేసిస్ పై తమకు 48 జెట్ సూట్లు కావాలని ఆర్మీ ప్రతిపాదించిందని. మార్చి నెలలో సైనికులు కొందరు వీటిని పరీక్షించనున్నాట్లు ఎండీ రాఘవరెడ్డి తెలిపారు. ఒకవేళ ఈ సూట్స్‌ అందుబాటులోకి వస్తే ఇండియన్‌ ఆర్మీ ముఖచిత్రం పూర్తిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Must Read

spot_img