Homeజాతీయంఈవో వర్సెస్ చైర్మన్..!

ఈవో వర్సెస్ చైర్మన్..!

కొందరు అధికారులు .. అవినీతికి పాల్పడడం .. అటువంటి శక్తులకు తెరవెనుక మద్ధతు పలకడం .. నేటి ప్రజాస్వామ్యంలో కామన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఓ అధికారి .. ఏకంగా పత్రికా ప్రకటనతో మద్ధతు పలకడం .. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ అంశం .. స్థానికంగా రాజకీయ రచ్చకు తెరలేపింది.. ఇంతకీ ఎవరా అధికారి..

కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానం .. ఈఓ లవన్న .. ఆది నుంచి వివాదాస్పదంగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈయన నిర్ణయాలపై పాలకమండలి నిప్పులు చెరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న సమయంలోనూ ఆయన వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి.

తాజాగా కర్నూలులోని శ్రీశైలం ఈఓగా నియమితులైనా, అదే తీరు కొనసాగిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే, తాజాగా ఆయన ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి కొనసాగుతున్న లవన్న అక్కడ కూడా తన విధులను మరిచి ప్రజాప్రతినిధుల మెప్పు పొందే పనిలోనే బిజీ అయినట్లు సమాచారం.. శివ క్షేత్రాన్ని అభివృద్ధి పధం లో నడిపిస్తూ నిత్యం దర్శనానికి వస్తున్న వేల మంది భక్తులకు సౌకర్యాలు అందించాల్సి ఉంటుంది.

కాని ఈఓ .. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అందరిని చర్చనీయాంశంగా మారింది. పండగల సమయానికి మాత్రమే శ్రీశైల దేవస్థానం ప్రత్యేక అలంకరణ, లైంటింగ్ డెకరేషన్ తో కళకళ లాడుతూ కనిపిస్తోందని, ఆతర్వాత మాత్రం అపరిశుభ్రత, అభివృద్ధి లేక కునారిల్లుతోందని శివభక్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. చివరికి నూతనంగా ఏర్పడిన శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ బోర్డు .. చేపట్టిన అంతర్గత విచారణలో బోలెడన్ని ఆసక్తికర కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

శ్రీశైల దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు నైవేద్యం, భక్తులకు అన్నప్రసాదాలు అందిచే కంట్రాక్టర్ భారీ అవినీతికి తెరలేపారన్న విషయాన్ని శ్రీశైల ఆలయ చైర్మన్ చక్రపాణిరెడ్డి బహిర్గతం చేశారు. ఆలయ అధికారుల అండదండలతో ఒక వ్యక్తే సరుకుల సరఫరా కాంట్రాక్టు పనులు దక్కించుకుంటున్నారన్న విషయం వెల్లడైంది. దీంతో ఆలయ ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్ల రూపాయల స్కాం కు తెరలేపారని తెలుస్తోంది.

శివ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనంతో పాటు రుచికమైన ప్రసాదం, అన్నదానం కొరకు ముడి సరుకులు అందించేందుకు ప్రతి ఏడాది టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ పనులు అప్పగిస్తుంటారు. దీనిలో ఎవరైతే తక్కువ ధరకు నాణ్యమైన ముడి సరుకులు సరఫరా చేస్తారో అటువంటి వారికి పనులు అప్పగిస్తుంటారు.. ఐతే కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడంపై విచారణ ఆదేశించాల్సిన ఆలయ కార్యనిర్వహణాధికారి చూసి చూడనట్లు వ్యవహరించడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది.

ఈ నేపథ్యంలో శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చక్రపాణి రెడ్డి పలు సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు శివ క్షేత్రానికి వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఫోకస్ పెట్టారు.. కాని ఆదిలోనే శ్రీశైలం క్షేత్రంలో భారీ అవినీతి జరుగుతుందని పక్క ఆధారాలు లభించడంతో షాక్ గురయ్యారు.. ఆలయానికి నాణ్యమైన ముడి సరుకులు అందించాల్సిన స్థానిక కంట్రాక్టర్ అవినీతిక తెరలేపుతూ ఎక్కువ ధరలకు సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని బట్టబయలు చేశారు..

అందులోనూ ఒకే కంట్రాక్టర్ దాదాపు 15 ఏళ్ళు నుంచి పలువురి పేర్ల పై కాంట్రాక్ టెండర్లను దక్కించుకోవడం ఏంటని ఆశ్చర్యపోయారు.. చివరికి టెండర్ల సమయంలో ప్రభుత్వ అనుమతులను తిలోదకాలు ఇచ్చి, భారీ సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరలకు కొటేషన్లు వేస్తూ, ఆలయానికి ఎక్కువ ధరలకు ముడి సరుకులు సరఫరా చేస్తున్నారని తేలింది.

ఒక్క నవంబర్ నెలలోనే దాదాపు 42 లక్షల రూపాయల అవినీతి జరిగిందని మీడియా సాక్షిగా బహిర్గతం చేశారు ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి.. అందుకు తన వద్ద పక్క ఆదారాలు సైతం ఉన్నాయని స్థానిక ఆలయకార్యనిర్వహణాధికారి లవన్నతో చర్చించగా, ఆయన మాత్రం కాంట్రాక్టర్ కే మద్ధతు పలికినట్లు సమాచారం.

దీనిపై స్థానిక ఆలయ కార్యనిర్వాహణ అధికారి .. అవినీతిని ప్రశ్నించాల్సింది పోయి కాంట్రాక్టర్ కే సపోర్ట్ గా నిలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చైర్మన్ వర్సెస్ ఆలయ అధికారి అన్నట్టు విబేధాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ కే పూర్తి వివరాలు అందిస్తానని ఛైర్మన్ ప్రకటించడం కూడా చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే, తాజాగా రెండు రోజుల క్రితం ఈఓ పేరిట వెలువడిన పత్రికా ప్రకటన … మరింత రచ్చ చేస్తోంది. శ్రీశైలంలో సరుకులు సరఫరా టెండర్ లో అవకతవకలు జరగలేదని, నియమ నిబంధనకు మేరకు అన్ని జరుగుతున్నాయని ప్రెస్ నోట్ జారీ అయింది. కాంట్రాక్టర్ తో ఆలయ అధికారి చేతులు కలపడంతోనే ఈ భారీ అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

అంతేగాక క్షేత్రంలో ఇటువంటి సహజమేనని చైర్మన్ బహిరంగంగా మీడియాతో మాట్లాడకూడదని వింత సమాధానాలు చెబుతున్నారు ఆలయ అధికారి. దీంతో ట్రస్టు బోర్డు, ఈ.వో మధ్య కొనసాగుతున్న విభేదాలు బహిర్గతం కావడంతో భక్తులు అయోమయ పరిస్థితుల్లో పడ్డారు.

ఇదిలా ఉంటే, లడ్డూ తయారీ సరుకుల రేట్లలో నవంబర్ నెలలో రూ. 42 లక్షల గోల్ మాల్ జరిగిందనే విషయాన్ని గుర్తించామని ఆలయ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు. లడ్డూ తయారీకి కాంట్రాక్టర్ సెకండ్ క్వాలిటీ సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఇదే సమయంలో, మార్కెట్ రేట్ కంటే అధిక ధరకు సరుకులు సరఫరా చేస్తున్నారని తెలిపారు.

తమ అంతర్గత విచారణలో ఈ విషయం తెలిసిందని… ఈ విషయాన్ని దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. లడ్డూ తయారీకి సరుకులు ఇస్తున్న కాంట్రాక్టును రద్దు చేసేందుకు గత నెలో జరిగిన ట్రస్ట్ బోర్డు మీటింగ్ లో బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారని అన్నారు. అయితే ఇంతవరకు కాంట్రాక్టు రద్దుకు సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు రాలేదని, అందుకే కాంట్రాక్ట్ రద్దు చేయలేదని చెప్పారు.

ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయని, రానున్న ఫిబ్రవరి, మార్చి నెలలను కూడా కలుపుకుంటే కనీసం రూ. కోటి తేడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే దీనిపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ టెండర్ అన్నది ఆన్లైన్లో సంవత్సరానికి ఒకసారి ఉంటుందని, ఒకసారి టెండర్ ఫైనల్ అయ్యాక టెండర్ దారుడికి వర్క్ ఆర్డర్ ఇస్తామని, ఆరోపణలతో మధ్యలో టెండర్ ను రద్దు చేస్తే, కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే దీనిపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీశైల దేవస్థానానికి చైర్మన్ గా కొనసాగుతున్న చక్రపాణి రెడ్డి లేవనెత్తిన భారీ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోని అతనికి సపోర్ట్ గా నిలుస్తుందా లేక అధికారి కను సైగల వెనుక జరుగుతున్న అవినీతికి వంత పలుకుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

అసలు శ్రీశైల ఆలయం పడితరం సరుకుల ధరల్లో వ్యత్యాసాలపై రాష్ట్ర దేవాదాయశాఖ స్పందించి కమిటీని ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు. అయితే అవినీతి అంశంలో .. ఈఓ ఏకంగా పత్రికా ప్రకటన చేయడం .. మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈఓ వెనుక .. రాజకీయ శక్తుల ప్రభావం ఏమైనా ఉండి ఉండొచ్చని, అందుకే కాంట్రాక్టర్ కు మద్ధతుగా ప్రకటన చేశారన్న వాదన సైతం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ అంశంపై జగన్ సర్కార్ ఏం చేయనుందన్నదే ఆసక్తికరంగా మారింది.

మరి ఈ అంశంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే చర్చనీయాంశమవుతోంది.

Must Read

spot_img