మనిషి అడుగు తీసి అడుగు వేయాలంటే డబ్బు కావాలి..ఆహారం కావాలన్నా, వాతావరణం నుంచి రక్షణ కావాలన్నా, దుస్తులు ధరించాలనుకున్నా డబ్బు కావాలి. ప్రపంచం మొత్తం డబ్బు మీదే నడుస్తోంది. ఒక మనిషి మరో మనిషితో వస్తుమార్పిడితో మొదలైన ఈ అవసరం నోట్లకు మారి డాలర్లను అధిగమించి నేటి 21వ శతాబ్దానికి క్రిఫ్టో కరెన్సీ వరకు వచ్చింది. అసలు ఈ సోకాల్డ్ డబ్బు ఎప్పుడు పుట్టింది..నోట్లు ఎలా పుట్టాయి..వాటిలో ప్రముఖమైనదిగా డాలర్ ప్రపంచ ప్రధాన కరెన్సీగా ఎప్పుడు మారింది? అన్న వివరాలను చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. అసలు డబ్బు గురించిన చరిత్ర అద్భుతంగా అనిపిస్తుంది.
వేల సంవత్సరాలుగా డబ్బు మారకంగా పని చేస్తోంది. అంతేకాదు, కూడబెట్టుకున్న సంపద ప్రధాన రూపం కూడా డబ్బే అయింది. డబ్బు అనేది లెక్కించటానికి ఉపయోగించే ఒక గణాంకం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే.. ధరలను నిర్ణయించటానికి, అప్పుల పద్దులు రాసుకోవటానికి ఉపయోగపడే వ్యవస్థగా డబ్బు మారిపోయింది. డబ్బు అనే దానికి నిర్వచనం గురించి చాలా వాదనలున్నాయి. ఈ డబ్బు ఎలా పుట్టిందనే దాని మీద కూడా చాలా వివావాదాలున్నాయి. మనుషులు అనాదిగా వస్తుమార్పిడి చేసుకున్నారు.
తొలి వ్యాపార వ్యవస్థలు మొదలయ్యాక అకస్మాత్తుగా డబ్బు ప్రధాన మారకంగా మారిపోయింది. ఇదెలా జరిగిందంటే.. చరిత్రకారులు, పురాశాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ఆర్థికవేత్తలు.. ఎవరికి వారే తమవైన సిద్ధాంతాలు చెప్తారు. వేలాది సంవత్సరాల కిందట తిండి గింజలతో మొదలుపెట్టి.. మట్టి వస్తువులు, నత్త గుల్లలు, కోకో బీన్స్, వెండి పలుకులు వంటి అనేక రకాల వస్తువులను నేటి డబ్బులాగా మారకానికి ఉపయోగించారు. ఆ క్రమంలో ప్రాచీన ఇరాక్‌లో నాటి రాజులు అధికారికంగా లోహపు నాణేలను ముద్రించారు. కాలక్రమంలో ప్రాంతాల మధ్య, దేశాల మధ్య వ్యాపారం, లావాదేవీలు పెరుగుతూ పోయాయి. ఈ లావాదేవీల్లో చేతులు మారే నాణేల పరిమాణం కూడా పెరిగింది.
అయితే ఈ లావాదేవీలను డబ్బు లేదా మనీ అని చలామణి లేదా కరెన్సీ అని కానీ అనొచ్చా అనే అంశంపై వాదోపవాదాలున్నాయి. అది తేలాలంటే మెసపటోమియా కాలంలోకి వెళ్లాలి. అక్కడ ఉర్ అన్న నగరం చాలా ముఖ్యమైన నగరాలలో ఒకటి కొనసాగింది. మెసపటోమియా నాగరికతకు చెందిన సుమేరియన్ నగర రాజ్యాల్లో అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఉర్ ఒకటి . ఆ ఉర్ ప్రాంతంలో అనేక సంవత్సరాల పాటు జరిగిన తవ్వకాలలో కొన్ని విషయాలు బయటపడ్డాయి.
నిజానికి విలువను లెక్కగట్టేది డబ్బు.. అయితే, ఆ డబ్బుకు ప్రామాణిక భౌతిక రూపం కరెన్సీగా నిర్ణయించడం జరిగింది. అది నాణెం లేదా నోటు వంటి చలామణి రూపంలోకి మారింది. ఇదంతా తమ అవసరాల కోసం నిర్ణయించకున్న విధానాలలో ఒకటిగానే అభివ్రుద్ది చెందిందని చెప్పవచ్చు. ఈ కోణంలో చూసినపుడు.. మెసపటోమియా నగరికతలో బార్లీ, వెండి అనేవి చలామణి రూపాలుగా కొనసాగాయి. ఇప్పటివరకూ మనకు తెలిసిన అత్యంత పురాతనమైన భౌతిక డబ్బులు అవే అంటున్నారు చరిత్రకారులు. ఆ రకంగా డబ్బు మూలాలు ప్రాచీన మెసపటోమియాలోని జమ, అప్పు లావాదేవీల్లో ఉన్నాయని తేలింది.
ఆ లావాదేవీల్లో.. ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి ఏదైనా వస్తువు తీసుకుంటారు. దానికి బదులుగా భవిష్యత్తులో మరేదైనా వస్తువును ఇస్తానని హామీ ఇస్తారు. ఈ విధంగా అరువు అనే భావన లేదా విధానం మొదలైంది. అదే విషయం అందుకు బదులుగా ఇచ్చే నోటుపై ముద్రించబడి ఉంటుంది. అది ఆ వ్యక్తి కష్టపడి సంపాదించిన నోటుపై రాసి ఉంటుంది. చిన్నపాటి సమాజాల్లో మొదలైన ఈ మార్పిడి రూపం.. ఆ తర్వాత పెద్ద సమాజాల్లో పెరిగింది. కాలక్రమంలో.. రాయటం కనుగొన్న తర్వాత.. ఆ అరువును లెక్కించటం ఆరంభమైంది. ప్రాచీన మెసపటోమియాలో అరువు, అప్పు పట్టికలు చాలా బయటపడటంతో పాటు వాటికి వడ్డీలు కూడా ఏర్పడ్డాయి.
ప్రపంచంలో మొట్టమొదట అనటోలియాలో అధికారికంగా నాణేన్ని ముద్రించారని చెబుతున్నారు. ఒక ప్రభుత్వం అధికారికంగా నాణేలు ముద్రించటం మొదటిసారిగా 640 బీసీలో అనటోలియాలో కనిపిస్తుంది. ఆ ప్రాంతమే ఇప్పటి తుర్కియే. లిడియా పాలకుడు కింగ్ అలియాటెస్ రాజముద్రతో తొలి నాణేలు ముద్రితమయ్యాయి. లిడియా రాజ్యానికి చెందిన ఈ నాణేన్ని.. బంగారం, వెండి మిశ్రమంతో తయారు చేసేవారు. ఈ నాణేలు చాలా మన్నికగ ఉండేవి. తేలికగా రవాణా చేయవచ్చు. ఇలాంటి సౌలభ్యాలతో పాటు.. వాటికంటూ ఒక విలువ కూడా ఉంటుంది. దీంతో నాణేల ముద్రణ విజయవంతమైంది.
ఈ నాణేలు చాలా సమర్థవంతంగా ఉపయోగపడటంతో పాటు విలువైనవిగా మారాయి. చైనాలో చాలా కాలం వరకూ రాగి నాణేలు, కంచు నాణేలను ప్రాధమిక నగదుగా ఉపయోగించారు. ఆ నాణేల మధ్యలో చిల్లు ఉంటుంది. ఆ చిల్లులు ఉండటం వల్ల.. నాణేలను దండగా గుచ్చి కట్టటానికి, గొలుసులా వేలాడదీయటానికి వీలుంటుంది. క్రీస్తు శకం 1,000 సంవత్సర కాలంలో.. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో సాంగ్ వంశ పాలనలో రాచరిక ప్రభుత్వం అధికారికంగా ప్రపంచంలో తొలి కాగితపు డబ్బు జారీ చేసింది. మల్బరీ చుట్టు బెరడుతో తయారు చేసిన ఆ డబ్బును జియోజి అని పిలుస్తారు.
అదే తరహాలో అమెరికాలో 1792లో డాలర్ అనే కాగితపు నోటు ఒక డిక్రీ ద్వారా ఆ దేశపు అధికారిక కరెన్సీగా చలామణిలోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపుకు చేరుకున్న దశలో.. మిత్ర రాజ్యాల ప్రభుత్వాలు తమ ముందు ఒక సమస్య కారణంగా అమెరికాలోని బ్రెటన్ ఉడ్స్ అనే పట్టణంలో గల మౌంట్ వాషింగ్టన్ హోటల్‌లో ఆ సుదీర్ఘ భేటీ జరిగింది. యుద్ధానంతర వాణిజ్యం, ద్రవ్యవిధానం భవిష్యత్తుపై వారి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. అక్కడే అంతర్జాతీయ లావాదేవీల కోసం అమెరికా డాలర్‌ను కరెన్సీగా నిర్ణయించారు.
ఆ సమావేశంలోనే.. యుద్ధం ముగిసిన తర్వాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలకు డాలర్ల రూపంలో రుణాలు ఇవ్వటానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంక్ అనే రెండు సంస్థలను ఏర్పాటు చేశారు. దాదాపు ఏడు దశాబ్దాల కిందట అమెరికాలోని ఓ మారుమూల ప్రాంతపు పర్వతాల్లో జరిగిన ఆ చర్చల్లో రూపొందిన అంతర్జాతీయ ద్రవ్య విధానం నేటికీ కొనసాగుతోంది.