వాటినే హ్యూమన్ రైట్స్ అంటారు. మరి మీకు ఉండే హక్కుల గురించి మీకు తెలుసా..? ఈ హక్కుల గురించిన అవగాహన అందరికీ ఉండాలనే ఉద్దేశ్యంతో మానవాళి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకొంటోంది. మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈరోజును మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తోంది.
ఐక్యరాజ్యసమితి ‘సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను ఐక్యరాజ్యసమితి ఆమోదించిన డిసెంబరు 10 తేదీన ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకొంటారు. మానవ హక్కుల చరిత్రలో- ఈ డిక్లరేషన్ ఒక ప్రధానమైన పత్రంగా భావిస్తారు.
ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన, చట్టపరమైన అంశాల్లో, సాంస్కృతిక వ్యవహారాల్లో వేర్వేరు నేపథ్యాలున్న ప్రతినిధులు కలసి రెండేళ్లలో దీనిని రూపొందించారు. యూడీహెచ్‌ఆర్ ముసాయిదా కమిటీకి అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ భార్య ఎలీనర్ రూజ్వెల్ట్ సారథ్యం వహించారు. అన్ని దేశాలు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా ఈ పత్రాన్ని నిర్దేశిస్తూ 1948 డిసెంబరు 10న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచమంతటా పరిరక్షించుకోవాల్సిన ప్రాథమిక మానవ హక్కులను తొలిసారిగా ఈ పత్రం నిర్దేశించింది.
ఇంతకీ ఈ డిక్లరేషన్ ఏం చెబుతోందన్న విషయాన్ని చూస్తే..మనుషులందరికీ పుట్టుకతోనే స్వేచ్ఛ, సమానత్వం లభిస్తాయని ఆర్టికల్ 1 చెబుతోంది. మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన గౌరవం, సమానమైన, శాశ్వతమైన హక్కులు ఉన్నాయి. వీటిని గుర్తించడం వల్లే ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతిలకు పునాది వేయబడుతుంది. మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు క్రూరమైన దుష్కృత్యాలకు కారణమయ్యాయి.
ఇవి మానవాళి అంతరాత్మకు గాయం చేశాయి. భావప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి, లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్షగా ఉంటుంది.
మానవ హక్కులను చట్టబద్ధ పాలనతో రక్షించాలి.
నిత్యం వీటిని పరిరక్షించుకోవడం కోసమే ఆందోళనలు నిరసనలు జరుగుతుంటాయి. నిరంకుశత్వానికి, అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్టచివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలనతో రక్షించాలి. దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం.
ఈ పత్రంలో- ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువపై, స్త్రీ,పురుషుల సమాన హక్కులపై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించటానికి ఐరాస సభ్యదేశాలు సంకల్పించాయి.ఐక్యరాజ్యసమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్ర్యాలకు విశ్వజనీన గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్యదేశాలు ప్రతిన బూనాయి.
ఈ ప్రతిజ్ఞను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్ర్యాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైనది. అందువల్ల సర్వప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తోంది.
ప్రతి వ్యక్తీ, సమాజంలోని ప్రతి వ్యవస్థా ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ, విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించటానికి కృషి చేయాలి. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన, ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించటానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి.
మనం ముందు చెప్పుకున్నట్టుగా మనుషులందరికీ పుట్టుకతోనే స్వేచ్ఛ, సమానత్వం లభిస్తాయి. గౌరవం, హక్కుల విషయంలో అందరూ సమానులే. మనుషులందరికీ సొంత ఆలోచన, అంతః చేతన ఉంటాయి. ఒకరితో మరొకరు సోదరభావంతో మెలగాలి.
ఈ విషయాలను ఆర్టికల్ వన్ చెబుతోంది. ఇక ఆర్టికల్ రెండోదానిలో ఏముందంటే.. ఈ పత్రంలోని అన్ని హక్కులూ, స్వేచ్ఛలూ ప్రతి ఒక్కరికీ ఉంటాయి. జాతి, రంగు, లింగం, భాష, మతం లాంటి అంశాల ప్రాతిపదికగాగాని, రాజకీయ నేపథ్యంవల్లగాని, భిన్నాభిప్రాయం వల్లగాని, జాతీయ లేదా సామాజిక మూలాలవల్లగాని, సంపదలో వ్యత్యాసాలవల్లగాని, పుట్టుక లేదా ఇతర ప్రాతిపదికల వల్లగాని వివక్ష చూపడానికి వీల్లేదు. వ్యక్తులను వారి దేశం లేదా భూభాగం రాజకీయ అంతర్జాతీయ హోదా ఏమిటనే దానికి ప్రాతిపదికగా ఎలాంటి వివక్షా చూపరాదు.
ఇలా వరుసగా ముప్పై ఆర్టికల్స్ మనిషి సుఖజీవనానికి సంబంధించిన హక్కులు నిర్దేశించబడ్డాయి. జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, స్వీయ భద్రతా హక్కు ప్రతి మనిషికీ ఉంటాయి. ఎవ్వరినీ బానిసగా చేసుకోవడానికి వీల్లేదు. బానిసత్వాన్ని, బానిస వ్యాపారాన్ని అన్ని రూపాల్లో నిషేధించాలి. ఎవ్వరినీ చిత్రహింసలకు గురిచేయరాదు. ఎవ్వరినీ క్రూరమైన, అమానవీయమైన, అవమానకరమైన శిక్షకు గురిచేయరాదు. ప్రతి చోట చట్టం ముందు వ్యక్తిగా గుర్తింపు పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. చట్టం ముందు అందరూ సమానులే. ఎలాంటి వివక్షా లేకుండా చట్టపరమైన రక్షణ పొందే హక్కు అందరికీ ఉంది.
ఈ డిక్లరేషన్‌కు విరుద్ధంగా, ఎలాంటి వివక్షకు గురికాకుండా అందరికీ సమానమైన రక్షణ ఉంటుంది. రాజ్యాంగం, లేదా చట్టం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే చర్యల విషయంలో సంబంధిత జాతీయ ట్రైబ్యునల్ నుంచి పరిష్కారం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఎవ్వరినీ ఏకపక్షంగా అరెస్టు చేయడానికిగాని, నిర్బంధించడానికిగాని, ప్రవాసానికి పంపించడానికిగాని వీల్లేదు. క్రిమినల్ నేరాభియోగాలపైగాని, తన హక్కులను, బాధ్యతలను నిర్ణయించే విషయంలోగాని స్వతంత్ర, నిష్పాక్షిక ట్రైబ్యునల్ ఆధ్వర్యంలో నిష్పాక్షిక, బహిరంగ విచారణ పొందే హక్కు ప్రతి ఒక్కరికీ సమానంగా ఉంది.
శిక్షార్హమైన నేరాభియోగాన్ని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ, బహిరంగ విచారణలో చట్ట ప్రకారం దోషిగా తేలే వరకు నిర్దోషిగానే భావించాలి. ఈ మేరకు ఆ వ్యక్తికి హక్కు ఉంది.
ఈ విచారణలో, తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని హామీలూ వ్యక్తికి ఉంటాయి. ఎవరైనా ఓ వ్యక్తి చేసిన తప్పిదం లేదా పని అది జరిగిన సమయానికి జాతీయ, లేదా అంతర్జాతీయ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం కాకపోతే, ఆ వ్యక్తిని శిక్షార్హమైన నేరంలో దోషిగా ప్రకటించడానికి వీల్లేదు. శిక్షార్హమైన నేరం జరిగినప్పుడు వర్తించే శిక్ష కన్నా తీవ్రమైన శిక్షను విధించడానికి కూడా వీల్లేదు.
ఏ ఒక్కరి వ్యక్తిగత గోప్యత, కుటుంబం, ఇల్లు, ఉత్తర ప్రత్యుత్తర విషయాల్లో ఏకపక్షంగా జోక్యం చేసుకోవడానికిగాని, గౌరవ ప్రతిష్ఠలపై దాడి చేయడానికిగాని వీల్లేదు. అలాంటి జోక్యం, దాడుల నుంచి చట్టపరమైన రక్షణ పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. దేశంలో స్వేచ్ఛగా తిరిగే, నివసించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దేశం నుంచి లేదా ఏ దేశం నుంచి అయినా వెళ్లిపోయే హక్కు, తన దేశానికి తిరిగి వచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి.
పీడన నుంచి తప్పించుకొనేందుకు ఇతర దేశాలను ఆశ్రయం అడిగే, పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి సూత్రాలకు, ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలు లేదా రాజకీయతేర నేరాలపై నిజమైన ప్రాసిక్యూషన్ జరిగే సందర్భంలో ఈ హక్కు ఉండకపోవచ్చు. ఏదైనా జాతీయతను కలిగి ఉండే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జాతి, జాతీయత లేదా మతం పరిమితులు లేకుండా పెళ్లి చేసుకొనేందుకు, కుటుంబాన్ని కలిగి ఉండేందుకు వయోజనులైన మహిళలకు, పురుషులకు హక్కు ఉంది.
సొంతంగాగాని, ఇతరులతో కలసి గాని ఆస్తులు కలిగి ఉండేందుకు ప్రతి ఒక్కరికీ హక్కుంది. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా హక్కు ఉంది. ఇతరుల జోక్యం లేకుండా సొంత అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు, సరిహద్దులతో సంబంధం లేకుండా ఏ మార్గం నుంచైనా సమాచారం, ఆలోచనలు కోరే, స్వీకరించే హక్కు ఇందులో భాగం. ఇలా ఎన్నో హక్కులు కలిగి ఉన్నా వాటిని అమలు చేయడంలో దేశాలు వెనుకబడుతున్నాయి. అదే ఇక్కడ విషాధం.