Homeతెలంగాణతెలంగాణలో కాక రేపుతున్న ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ..

తెలంగాణలో కాక రేపుతున్న ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ..

  • కోవర్టుల మాటెలా ఉన్నా, ఆయన కమలంలో ఇమడలేకపోతున్నారన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది..
  • ఇంతకీ దీనిపై హైకమాండ్ ఏం చేస్తుందో నన్నదే చర్చనీయాంశమవుతోంది..

తెలంగాణ సీఎం కేసీఆర్ కు అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉన్నారని … మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. 2018 ఎన్నికల్లో నాతో సహా 20 మందిని ఓడించేందుకు ప్రత్యర్థులకు కేసీఆర్‌ డబ్బులు ఇచ్చారంటున్నారు. ప్రపంచంలో ఏ పార్టీకి జాయినింగ్‌ కమిటీ లేదు. బీజేపీలో జాయినింగ్‌ కమిటీ పెట్టడం వల్ల పార్టీలో చేరే వారి పేర్లు లీక్‌ అవుతున్నాయి. అందుకే బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. \

ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆయన నిర్వేదాన్ని తెలియచేస్తున్నాయని కొందరు అంటూంటే… తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురు లేదని అన్ని పార్టీలు ఆయన గ్రిప్‌లోనే ఉన్నాయని దీంతో తేలిపోతుందని మరికొందరు అంటున్నారు. నిజంగానే కేసీఆర్ కు అన్ని పార్టీల్లో కోవర్టులున్నారా ?

ఈటల రాజేందర్ మాటలకు అర్థం చేతులెత్తేయడమేనా ? అన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో కోవర్టుల అంశం పదే పదే చర్చకు వస్తోంది. గతంలో కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో కోవర్టులున్నారనే వ్యాఖ్యలు చేసేవారు.

ఇప్పుడు బీజేపీ నేత ఈటల రాజేందర్ వంతు. కేసీఆర్‌కు చెక్‌ పెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తున్న తరుణంలో కోవర్టుల విషయం బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ బీజేపీలో ఉన్న కోవర్టులెవరు? పార్టీ అంతర్గత సమాచారాన్ని, కీలక అంశాలను కెసిఆర్ కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నదెవరు?

టీఆర్ ఎస్ పార్టీలో సుదీర్ఘంగా ఉండి బీజేపీలోకి వచ్చిన ఈటలకు కోవర్టులెవరన్న దానిపై స్పష్టత ఉందా? ఈటల లాంటి సీనియర్ ఎవరిని లక్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు? పార్టీలో ఈటలకు ఎవరెవరితో పొసగడం లేదు? ఇప్పుడీ అంశాలన్నీ బీజేపీలో చర్చనీయాంశమవుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. టీఆర్ఎస్ కు కోవర్టులుగా పని చేస్తున్నారని కొంత మంది నేతలపై కాంగ్రెస్ క్యాడర్ మండి పడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ అంశంపై ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఇటీవల కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన కొంత మంది సీనియర్లు కోవర్టులని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై వారు మండిపడ్డారు. తమను కోవర్టులంటే అంగీకరించేది లేదని ఆగ్రహించారు.

అయితే వీరు బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని తమ పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి చేశారన్న అభప్రాయాలు బలంగా వినిపించాయి. కారణం ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఈ కోవర్టుల పంచాయతీ ఇంకా తేలలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉంది. కానీ కేసీఆర్ వ్యూహాత్మకంగా టీడీపీలో ఉన్న తన వారితో చేసిన కోవర్ట్ ఆపరేషన్ కారణంగానే .. ఓటుకు నోటు కేసు వచ్చిందని, ఆ కారణంగానే టీడీపీ నిర్వీర్యం అయిందన్న ప్రచారం కొంత కాలంగా ఉంది.

  • అయితే ఈ కోవర్ట్ ఆపరేషన్లు ఏవీ బయటకు రావు..

రాజకీయాల్లో అంతర్గత ప్రచారం మాత్రమే. అందుకే టీడీపీ లోని కేసీఆర్ కోవర్టులు అన్నది కూడా… నిజానిజాలు తెలియనంతగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో అన్ని పార్టీల్లోనూ కోవర్టుల భయం ఉంది. బీజేపీలో ఇప్పటి వరకూ నిబద్దులైన నేతలు ఉంటారని అనుకుంటారు. కానీ ఈటల వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆ పార్టీలోనూ భయం …ఆందోళన కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన పని లేదు.

అందుకే.. ఇప్పుడు కేసీఆర్ ను చూసి అన్నిపార్టీల నేతలూ ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీలోనే ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితికి చేరుతున్నారు. బీజేపీలో ఈటల రాజేందర్ కు చేరికల కమిటీ చైర్మన్ గా పదవి ఇచ్చారు. ఆయన విచ్చలవిడిగా నేతల్ని బీజేపీలోకి తీసుకొస్తారని అనుకున్నారు. ఈటల కూడా అదే అనుకున్నారు. పార్టీలో నేతల్ని చేర్పించి, తాను బిగ్ లీడర్ అయిపోవాలనుకున్నారు. అయితే అనేక ప్రయత్నాలు చేసినా, బీజేపీలో చేరుతున్న వారే లేరు.

దీంతో కేసీఆర్ కోవర్టుల వల్లే బీజేపీలో చేరికలు లేవని ఆయన ఫీలవుతున్నారు. దక్షిణాదిన అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న మరో రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈమేరకు ఏడాదిగా కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు.

పార్టీలో చేరికల కోసం ఏడాది క్రితం కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్‌గా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను నియమించారు. అధికార బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా చేరికలు ఉంటాయని అందరూ భావించారు. కానీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అధికార పార్టీ నుంచే కాదు, కాంగ్రెస్‌ నుంచి కూడా చెప్పుకోదగిన నేతలు బీజేపీలో చేరడం లేదు. చేరికలకు ఉత్సాహం చూపి మధ్యలోనే ఆగిపోతున్నారు.

ఈ విషయం ఇప్పుడు కమలనాథులను ఆందోళనకు గురిచేస్తోంది. మంతనాల వరకు వచ్చిన నేతలు చేరికకు వెనుకాడుతుండడంపై కషాయ నేతలు ఆరా తీస్తున్నారు. వివిధ కార్యాక్రమాల ద్వారా ఇప్పటికే బీజేపీ అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అన్న భావన ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీలో చేరికలను ప్రత్సోహించి బీఆర్‌ఎస్‌తోపాటు, కాంగ్రెస్‌ను బలహీనపర్చాలని బీజేపీ అధిష్టానం భావించింది.

దీంతో బీజేపీలో కొంతమంది కోవర్టులు ఉన్నారన్న అభిప్రాయం కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. తిన్నింటి వాసాలు లెక్కించేవారి కారణంగానే చర్చల వరకు వస్తున్న నాయకులు చేరికలకు వెనుకాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చర్చలు జరుపుతున్న వివరాలు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు చేరవేస్తున్నారని ఈటల రాజేందర్‌ కూడా ఫీలవుతున్నారు.

  • కేసీఆర్‌కు చెక్‌ పెట్టాలని బీజేపీ ప్లాన్స్‌..

కేసీఆర్‌కు చెక్‌ పెట్టాలని బీజేపీ ప్లాన్స్‌ వేస్తున్న తరుణంలో కోవర్టుల విషయం బయటకు రావడం ఆ పార్టీని కలవరపెడుతోంది. తాజా వ్యాఖ్యలతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతున్నారా..? ఆయన ఏ లక్ష్యంతో బీజేపీలో చేరారో.. ఆ లక్ష్యం నెరవేరదని డిసైడ్ అయ్యారా..? ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక రాజేందర్ ఇబ్బంది పడుతున్నారా..? బీజేపీలోనూ కేసీఆర్ కోవర్టులున్నారని ఆయన చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటి..?

ఆ వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా పట్టించుకోలేదు కానీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం రాజేందర్ వ్యాఖ్యల పరమార్థాన్ని బయటపెట్టారు. ఆయన బీజేపీలో ఇమడలేకపోతున్నారని చెప్పారు. ఆ మాటకొస్తే రాజేందర్ తోపాటు, వివేక్ వెంకట స్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో ఇమడలేకపోతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి.

బీజేపీ సిద్ధాంతాలను వారు విశ్వసించరని, కేవలం కేసీఆర్ ని మాత్రమే వారు వ్యతిరేకిస్తారని చెప్పారు. తెలంగాణలో రోజు రోజుకీ కాంగ్రెస్ బలహీన పడుతూ ఆమేరకు కాస్తో కూస్తో బీజేపీ బలపడుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ అసంతృప్తితోనే ఉన్నా..కేసీఆర్ కావాలనే బీజేపీని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ ని భూస్థాపితం చేస్తున్నారని అంటారు ఆ పార్టీ నేతలు.

ఒకరకంగా తమలోని అంతర్గత కుమ్ములాటల్ని, అసమర్థతను అలా కప్పి పుచ్చుకుంటారు. ఇటీవల హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కనీసం తన ఉనికి చాటుకోలేకపోయింది. దీంతో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఆయన ఈటల రాజేందర్ పై సాఫ్ట్ కార్నర్ చూపెడుతూ, కేసీఆర్ ని టార్గెట్ చేసి విమర్శలు సంధించారు.

కేసీఆర్ నియంతృత్వ ధోరణిని గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు.. ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరు. బీజేపీ కేసీఆర్ ఒక్కటే అన్న విషయం ఈటల రాజేందర్ మాట్లల్లో స్పష్టమైందని అన్నారు. బీజేపీలో కూడా కోవర్ట్ లు ఉన్నారని ఈటల అన్నారంటే ఏదో అసంతృప్తి ఉన్నట్లే కాదా? అని రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో ఈటల వ్యాఖ్యల వెనుక ఏముందన్న చర్చ వెల్లువెత్తుతోంది. రేవంత్ అన్నట్లు కొందరు.. ఈటల నిజంగానే అసంతృప్తిగా ఉన్నారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరి ఈటల వ్యాఖ్యలపై బీజేపీ ఏం చేస్తుందన్నదే హాట్ టాపిక్ గా మారింది..

Must Read

spot_img