Homeతెలంగాణఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీళ్ల ఎపిసోడ్..

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీళ్ల ఎపిసోడ్..

అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వచ్చిందంటే చాలు ఆ ఎమ్మెల్యే లక్ష్యంగా ఆరోపణలు షురూ అవుతాయి. మహిళలను వేదింపులకు గురి చేస్తున్నారనో లేక వారితో మాట్లాడిన ఆడియోలో లీక్ అవుతూనే ఉంటాయి. అయితే ఆ ఆరోపణల్లో నిజానిజాలు పక్కన పెడితే, ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్రజల మధ్యలోనే కన్నీటి పర్యంతం కావడం ఆ ఎమ్మెల్యేకు కామన్ గా మారింది.

  • ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు..?
  • ఆ కన్నీళ్లకు కారకులెవరు ..?

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యది అత్యంత విచిత్రమైన పరిస్తితి. తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత తొలిసారి గెలిచినప్పుడు డిప్యూటీ సీఎంగా జాక్ పాట్ కొట్టారు రాజయ్య. అయితే మధ్యలోనే, అనూహ్యంగా ఆయన ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఆయనను డిప్యూటీ సీఎం బాధ్యతల నుండి ఎందుకు తప్పించారన్నది ఇప్పటికీ క్లారిటీ లేకుండా పోయింది. ఫలానా కారణం అంటూ చిలువలు, పలువలుగా చెప్పుకోవడమే తప్ప అధికారికంగా మాత్రం అధిష్టానం నేటికీ ఆ కారణాలను బయటపెట్టలేదు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య నోటి నుండి కూడా తన మంత్రి పదవి బర్తరఫ్ గురించి ఒక్క మాటకూడా మాట్లాడలేదు.

అయితే కెసిఆర్ మాత్రం, తనకు అన్యాయం జరిగింది అని అనేవారని, అవకాశం వచ్చినప్పుడు ఎం చేయాలో చేస్తానని హామీ ఇచ్చారని రాజయ్య చెప్తుండేవారు. మరోవైపు రాజయ్య ప్రత్యర్థి వర్గం మాత్రం అవినీతి అక్రమాలతోనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ అయ్యారని ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ను డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించిన తర్వాత, రాజయ్యపై అవినీతి ఆరోపణలతో ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అంతే కాకుండా, 2018 ఎన్నికలప్పుడు ఓ మహిళతో మాట్లాడిన ఆడియో రికార్డు సైతం లీకయింది.

తనను కావాలనే ట్రాప్ చేస్తున్నారని రాజయ్య గగ్గోలు పెట్టినా ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయనకు టికెట్ వస్తుందా, రాదా అన్న చర్చ కూడా సాగినప్పటికీ సీఎం కేసీఆర్ రాజయ్య వైపే మొగ్గు చూపారు. అయితే క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని తెలుసుకునేందుకు వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టుకుని జనం నడుమే తాటికొండ కన్నీటిపర్యంతం అయ్యారు. తనను కావాలనే లక్ష్యంగా చేసుకుని తన పార్టీ వారే దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తనపై వస్తున్న ఆరోపణలను తట్టుకోలేక సొంత పార్టీకి చెందిన మరో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కాళ్లపై పడ్డారు. అంతేకాకుండా అనేక బహిరంగ సమావేశాల్లోనూ కంటతడి పెట్టుకుని తనను ప్రజలు ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఇదిలా ఉంటే, నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగింకగా వేధిస్తున్నాడంటూ సర్పంచ్ నవ్య ఆరోపించారు. ఈ క్రమంలో నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించింది.

ఎమ్మెల్యే రాజయ్యపై ఈసారి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జానకిపురం సర్పంచ్ నవ్య ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి తనను రాజయ్య వేదింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలకు దిగారు. దీంతో మళ్లీ రాజయ్య ఎపిసోడ్ తెరపైకి వచ్చినట్లయింది. ఈ క్రమంలో కొంతమంది శిఖండి పాత్ర పోషిస్తూ తనను ఇబ్బందులు పెడుతున్నారంటూ రాజయ్య వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత రాజయ్య స్వయంగా సర్పంచ్ నవ్య ఇంటికి వెల్లి మీడియా ముందు క్షమాపణలు అభ్యర్థించారు. నవ్య మాత్రం తగ్గేదేలే అన్నరీతిలో కామెంట్ చేశారు, కానీ ఆయనపై చేసిన ఆరోపణలు తప్పని మాత్రం చెప్పలేదు.

అయినప్పటికీ ఈ అంశం సద్దుమణిగిపోయినట్టుగా అందరూ భావించారు. తాజాగా నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ ప్రత్యర్థులపై ఘాటుగానే విమర్శలు గుప్పించారు. కొంతమంది రండ రాజకీయాలు చేస్తున్నారంటూ మండి పడిన ఆయన, సర్వేల్లో తానే గెలుస్తానని స్పష్టమైన రిపోర్టు వచ్చిందన్నారు. తన ఆత్మస్థైర్యం కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చివరి ఊపిరి ఉన్నంత వరకు తాను స్టేషన్ ఘన్ పూర్ ప్రజల మధ్యే ఉంటానని ఉద్వేగభరితంగా మాట్లాడిన రాజయ్య ఒక్కసారిగా కింద కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించడం సంచలనంగా మారింది.

తనకుకు నలుగురు చెల్లెళ్లు ఉన్నారని, మహిళల ఆత్మగౌరవం కోసమే తాను పనిచేస్తున్నానని రాజయ్య చెప్పుకొచ్చారు. ప్రాణం ఉన్నంత వరకు మహిళలకు సహకారం అందిస్తానన్నారు. ఇటీవల జరిగిన కొన్ని పొరపాట్లకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. సర్పంచ్ నవ్య ప్రవీణ్ కుమార్ లను కాపాడుకుంటానన్నారు. పార్టీ అధిష్టానం కూడా జానకీపురం గ్రామం అభివృద్ధి చేయాలని ఆదేశించిందన్నారు. ప్రవీణ్ ను చూసే సర్పంచ్ కు టికెట్ ఇచ్చానని, నవ్యను చూసి కాదన్నారు. స్టేషన్ ఘనపూర్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు.

ప్రతీ ఎన్నికలకు ముందు రాజయ్యను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు రావడం, ఆయన జనం మధ్య కన్నీటి పర్యంతం కావడం రివాజుగా మారినట్టుగా గుసగుసలు మొదలయ్యాయి. తాజాగా ఎమ్మెల్యే రాజయ్య కౌంటర్ గా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే మాత్రం ఆయనను కావాలనే ఎవరో లక్ష్యం చేసుకున్నారని స్పష్టం అవుతోంది. ఇటీవల శిఖండి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడగా తాజాగా రండ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.

అంటే రాజయ్యకు మళ్ళీ నష్టం కల్గిస్తున్న వారెవరో ఆయనకు తెలుసని స్పష్టం అవుతోంది. రాజయ్య విలువ తగ్గించేందుకు ప్రజల్లో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో కూడా ఆయనకు తెలిసి ఉంటుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సొంత పార్టీ సర్పంచ్ నవ్య, రాజయ్యతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు, ఎవరో చెప్పిన మాటలు విని మహిళలు సైలెంట్ గా ఉండొద్దని అన్నారు. మహిళలను ఇబ్బందులు పెట్టినా, వేధించినా కిరోసిన్ పోసి తగలెట్టాలని పిలుపునిచ్చారు.

అయితే రాజయ్య పై చేసిన లైంగిక ఆరోపణలను మాత్రం ఇప్పటికీ ఖండిస్తున్నానని చెబుతూనే, రాజయ్యను క్షమించడానికి కొన్ని కారణాలున్నాయని అన్నారు. అదే సమయంలో మాట్లాడిన ఎమ్మెల్యే రాజయ్య తనపై అభివృద్ధి విషయంలోనే ఆరోపణలు వచ్చాయని, అందుకే జానకీపురం గ్రామాభివృద్ధికి 25 లక్షలు ప్రకటిస్తున్నానని అనౌన్స్ చేసారు. ఇద్దరు ముఖాముఖిగా ఉన్నా రాజయ్యపై వచ్చిన ఆరోపణలు నిజమేనా అనేదానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని స్వపక్షానికి చెందిన వారే తనను ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేక కుట్రలకు పాల్పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.

అయితే కుట్రలకు పాల్పడుతున్న ఆ నేతలను మాత్రం ఏమి చేయలేని స్థితిలో ఎమ్మెల్యే ఉన్నాడని చర్చ నడుస్తోంది. వివాదాలు ఆయనకు కొత్త కాదు. ఆయనపై విమర్శలు వెల్లువెత్తడం కూడా పాత విషయమే. గతంలో ఓ మహిళా నాయకురాలిపై చేయి వేసినట్లు, కేక్ తినిపించినట్లుగా వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. మంత్రి పదవి పోయిన తర్వాత నుంచి నియోజకవర్గంలో ఏదో విషయంలో విమర్శలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్న రాజయ్య రీసెంట్‌గా ఓ లేడీ సర్పంచ్‌పై మనసు పడ్డానంటూ మరో బీఆర్ఎస్‌ నాయకుడితో రాయబారం చేయడంపై సదరు మహిళా సర్పంచ్‌ స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ రచ్చతో మరో చర్చ సైతం వెల్లువెత్తుతోంది. ఎన్నికల మూమెంట్ వచ్చిందంటే చాలు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి రాజకీయం మొదలవుతుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణల ఒత్తిడి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నాడా….! లేదా సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపుతున్నాడా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీళ్ల ఎపిసోడ్ ఈసారి ఆయనకు కలిసొస్తుందా లేదా అనేది మాత్రం వచ్చే ఎన్నికల్లో తేలనుంది.

Must Read

spot_img