Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో జీవో నెం.1 నేపథ్యంలో నారా తనయుడి పాదయాత్ర జరుగుతుందా లేదా..

ఏపీలో జీవో నెం.1 నేపథ్యంలో నారా తనయుడి పాదయాత్ర జరుగుతుందా లేదా..

టీడీపీ యువ నేత నారా లోకేష్ ఈ నెల 27న చేపట్టనున్న పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ .. డీజీపీకి లేఖ రాసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. అలాగే లోకేష్ ప్రాణాలకు ముప్పు ఉన్నందున పటిష్ట భద్రత కావాలని కూడా కోరారు. పాదయాత్రకు అనుమతితో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వర్ల కోరారు. లేఖను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా జత చేశారు.

లోకేష్ వ్యక్తిగత కార్యదర్శి నరేష్ పాదయాత్రకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటారని లేఖలో వర్ల పేర్కొన్నారు. లోకేష్ ను టార్గెట్ చేస్తూ ఇటీవల సైతం కొంతమంది సంఘ విద్రోహ శక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని ఇందులో ప్రస్తావించారు. రాజకీయ వ్యతిరేకులు, ఫ్యాక్షనిస్టుల నుంచి లోకేష్ ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఈ లేఖలో వర్ల డీజీపీకి తెలిపారు. ఈ నేపధ్యంలో లోకేష్ పాదయాత్రకు, రాత్రిళ్ల బసకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరారు. భద్రతా ఏర్పాట్లు చూసుకునేలా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు.

రాష్ట్రంలో ప్రభుత్వం రోడ్లపై యాత్రలు, ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం నేపథ్యంలో లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేపట్టిన ప్రతి నాయకుడు అధికారం చేపట్టారని చరిత్ర చెపుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు.. జగన్ ఇలా ముగ్గురూ పాదయాత్ర చేసి అధికారం చేపట్టిన వారే.. పాదయాత్ర ద్వారా ప్రజల్లో వారికి వచ్చిన గుర్తింపే అధికారం అందేలా చేసింది.

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత మొదటి సీఎం చంద్రబాబు కాగా.. పాదయాత్ర చేపట్టి రెండోసారి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. పాదయాత్ర చేపట్టిన నాయకులు ఇంతవరకు ఓడిపోలేదన్న చరిత్ర.. జనాదరణ కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 400 రోజులు పాదయాత్ర సాగనుంది. మొత్తం ఈ పాదయాత్ర 4వేల కిలోమీటర్లు సాగనుంది. యువతను తమవైపు తిప్పుకొనేలా ఆకర్షించడంతో పాటు ఎజెండా నిర్దేశించే ప్రక్రియలో వారిని చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా తన పాదయాత్ర సాగుతుందని లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా చేసి.. యువత శ్రేయస్సు టీడీపీతోనే సాధ్యం అనే విధంగా పాదయాత్ర చేయాలని లోకేష్ సంకల్పించారు.

యువతతో పాటు వృద్దులు.. రైతులు.. ఉద్యోగులు ఏకతాటిపైకి రావడానికి ఈ పాదయాత్ర ఎంతగానో దోహత పడుతుందని భావిస్తున్నారు. హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వంపై పోరాడేందుకు పాదయాత్ర వేదికగా నిలుస్తుందని లోకేష్ వాదన. రాష్ట్ర జనాభాలో యువత దాదాపు 50 శాతం ఉన్నారని ఇలా టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. అయితే ప్రభుత్వం లెక్క మరోలా ఉంది. యువతిని ఆకర్షించే సత్తా లోకేష్ కు ఉందా అని ఓ వైపు వైసీపీ ఎద్దేవా చేస్తోంది. ఎమ్మెల్యేగా గెలవడంలో విఫలమైన లోకేష్ రాజకీయ నాయకుడిగా పనికి రాడని విమర్శలు చేస్తున్నారు.

ఓ వైపు విమర్శల పదును పెంచి.. మరోవైపు లోకేష్ పాదయాత్ర మొదలు కాకుండా ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోందని టీడీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. జీవో 1 ఎఫెక్ట్ తో లోకేష్ యాత్రకు అడ్డంకులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కుప్పంలో బాబు పర్యటన మూడు లాటీఛార్జీలు, ఆరు కేసులు అంటూ సాగింది. చంద్రబాబు యాత్రలలో జరుగుతున్న వివిధ ఘటనలను.. కార్యకర్తల మరణాలను బూచిగా చూపి అడ్డంకులు వేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

కుప్పంలో అడుగడునా ఆంక్షల మయంలో పాదయాత్ర చేయడం సాధ్యంకాని పరిస్థితి కనిపిస్తోంది. తనయుడి పాదయాత్ర మునుపే కుప్పంలో పరిస్థితి చక్క దిద్దాలని బాబు ఆలోచన. ఒక రకంగా బాబు టూర్ సక్సెస్ అయినా, పాదయాత్ర సాధ్యాసాధ్యాలపై పోలీసుల అనుమతి తప్పనిసరి. ఒకవేళ పోలీసులు అనుమతి ఇవ్వకుంటే.. న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నంలో టీడీపీ ఉందని తెలుస్తోంది. ఏపీ సర్కార్ రోడ్లపై సభలు, ర్యాలీలను నిర్వహించకుండా నిషేధం విధించింది.

కందుకూరు,గుంటూరు సభల్లో తొక్కిసలాటల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రహదారులపై, రోడ్డు మార్జిన్లలో.. సభలు, ర్యాలీలను అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జిల్లా ఎస్పీలు లేదా పోలీస్‌ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చింది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యంకలుగుతోందని.. అలాగే నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారని స్పష్టం చేసింది. అందుకే 30 పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1861 పోలీస్‌ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌ కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లోకేశ్‌ పాదయాత్ర, పవన్ బస్సు యాత్రలపై నిషేధం విధించే ఆలోచన భాగంగా ప్రభుత్వం ఈ స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం తమ ప్రజాస్వామ్య హక్కునూ కాలరాస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. రాజకీయ పార్టీల ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం 1 ను నాగబాబు తప్పుబట్టారు. ఈ జోవోపై కోర్టుకు వెళ్తామన్నారు.

ఏపీకి జగన్ ముఖ్యమంత్రి మాత్రమే.. రాజు కాదన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో పెట్టారు. వైసీపీ ప్రభుత్వ సంకుచిత మనస్తత్వానికి ఈ జీవో నిదర్శనం అన్నారు. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించడం రాజకీయ పార్టీల హక్కు అన్నారు. సభలు నిర్వహించినప్పుడు రాజకీయ పార్టీలు తగిన జాగ్రతలుతీసుకుంటాయన్నారు నాగబాబు. అలాగే ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమన్న ఆయన .. దానిని కారణంగా చూపిస్తూ ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించడం సరికాదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను ఆపడం ఎవరివల్లా సాధ్యం కాదని నాగబాబు అన్నారు. కాబట్టి తాజా జీవోను వెనక్కి తీసుకోవాలని నాగబాబు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెనక్కు తగ్గకుంటే అటు టీడీపీ కూడా కోర్టును ఆశ్రయించే యోచనలో ఉందంటున్నాయి టీడీపీ వర్గాలు. దాదాపు 4 వేల కోలోమీటర్ల మేర జరగనున్న ఈ పాదయాత్రలో చాలా చోట్ల లోకేశ్.. ప్రజలతో మాట్లాడతారు.. పలు చోట్ల ఆయన సభలు ఏర్పాటు అవుతాయి. అందుకోసం ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఓ వేళ.. పాదయాత్రకు.. అనుమతి ఇచ్చినా.. ప్రారంభమైన కొద్ది రోజులకే జగన్ .. ముందుస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో లోకేష్ ను టిడిపి బ్రాండ్ అంబాసిడర్ లా మార్చి స్టార్ క్యాంపెయినర్ గా జనంలోకి పంపుదామని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లైంది. తాజా పరిణామాలను గమనిస్తే.. లోకేష్యు వగళం పాదయాత్ర అసలు మొదలవుతుందా లేదా అనే సందేహాలు వస్తున్నాయి.

Must Read

spot_img