Homeజాతీయంఎన్నికల్లో హవా… ఎమ్మెల్యే రూట్ మార్చనున్నారా ?

ఎన్నికల్లో హవా… ఎమ్మెల్యే రూట్ మార్చనున్నారా ?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ….అదికార పార్టీ ఎమ్మెల్యేలు రూటు మార్చారా ?

సోషల్ ఆక్టివిటీస్ నే అస్త్రాలు గా మార్చుకుంటున్నారా ? ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయట పడేందుకు .. ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నాలు షురూ చేశారా ? ఈ ఒక్క ఐడియా ఎమ్మెల్యేల జీవితాన్ని మార్చేస్తుందా ?

మరి సామాజిక సేవలతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరో చూద్దామా ?

తెలంగాణ లో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు హింట్ ఇచ్చారు గులాబీ బాస్. ఆ క్రమంలోనే రాష్ట్రంలో దూకుడు పెంచారు. అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. పెండింగ్ పనులు, ఇచ్చిన హామీలపై సీరియస్ గా దృష్టి సారించారు. సిట్టింగ్ లకే సీట్లు ఇస్తానని ప్రకటన కూడా చేశారు.ఎ మ్మెల్యేలంతా నియోజకవర్గం లోనే పాగా వేయాలని సీరియస్గా ఆదేశాలిచ్చారు.

నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను అమలు చేసే చర్యలు చేపట్టాలని సూచించారు బాస్. ఇక ఆ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత మంది అధికారపార్టీ ఎమ్మేల్యేలు సోషల్ ఆక్టివిటిస్ పై ఫోకస్ పెట్టారు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు లు పూర్తిగా తమ స్టైల్ మార్చేశారు. కొత్త ఓటర్లు, యువత టార్గెట్ గా పొలిటికల్ లో కొత్త స్టెప్ వేస్తున్నారు.


అయితే వీరి స్టెప్పులకు ప్రజల్లో ఎంత మద్ధతు లభిస్తుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. ఇదిలా ఉంటే, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
2019 లోనే “చిరుమర్తి చేయూత ఫౌండేషన్” పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటినుంచి ఆ పేరుతో అవసరంలో ఉన్నవాళ్లకు ఆర్ధిక సహాయం చేస్తూ వస్తున్నారు. ఇన్ని రోజుల దాకా ఫౌండేషన్ పెద్దగా వెలుగు లోకి రాకున్నా .. ఇక ఈ మధ్య ఫౌండేషన్ ను మళ్ళీ “రీ యాక్టీవ్ చేశారు. తాజాగా యువతను ఆకర్షించేలా నకిరేకల్ లో కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందస్తు టాక్ వేళ ఫౌండేషన్ ను మరింత యాక్టీవ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిరుమర్తి లింగయ్య.

తన ముఖ్య అనుచరులను ఫౌండేషన్ లో భాగస్వామ్యులను చేస్తూ…ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు షురూ చేస్తున్నారట. నియోజకవర్గ అభివృద్ధికి తోడు, సామాజిక సేవలు చేసే విధంగా పక్క ప్రణాళికలు తయారు చేసుకున్నారట ఆయన. ఇప్పటికే సిట్టింగ్ లకే సీట్లు అని కేసీఅర్ ప్రకటన చేయడంతో …ఫుల్ జోష్ లో ఉన్న చిరుమర్తి సామాజిక సేవల ద్వారా నకిరేకల్ లో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ప్రత్యర్ధులను దిమ్మ తిరిగే వ్యూహాలు అమలు చేసే ప్లాన్ ఉన్నారట చిరుమర్తి లింగయ్య.

ఇక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి 2014 కు ముందే పైళ్ల ఫౌండేషన్ పేరుతో ప్రజలకు దగ్గరయ్యారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో తాగు నీరు అందించే వాటర్ ప్లాంట్ ల ఏర్పాటు, వికలాంగులకు పరికరాలు, చేనేత ఇతర కుల వృత్తుల వారికి కావాల్సిన సహాయ సహకారాలు, ఆపద లో ఉన్న వారికి ఆర్ధిక సహాయాలు వంటి సోషల్ ఆక్టివిటిస్ కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తుండిపోయారు. ఆ సామాజిక సేవలే “పైళ్ళ” గెలుపు బాటలయ్యాయని భువనగిరి నియోజక వర్గ వాసుల మాట.

ఇక మరో ఏడాది లో ఎన్నికలు వస్తుండడంతో, హ్యాట్రిక్ విజయం కోసం పైళ్ళ మళ్ళీ తన ఫౌండేషన్ ను రీ యాక్టీవ్ చేశారు. తన నియోజకవర్గ వాసులకు ఆర్ధిక సహాయాలు, శుభ, అశుభ కార్యక్రమాల్లో తోచిన సహాయంతో పాటు, ఎవరికి ఏ ఆపద వచ్చిన పైళ్ల ఫౌండేషన్ ద్వారా సహాయం చేసే చర్యలు చేపట్టారు శేఖర్ రెడ్డి.ఇక హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తాను ఎమ్మెల్యే కాక ముందే సామాజిక సేవలపై దృష్టి పెట్టారు. తన తండ్రి “అంకిరెడ్డి”పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. పేదలకు ఆర్ధిక సహాయం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ వంటి కార్యక్రమాలతో ఫుల్ క్రేజ్ కొట్టేశారు.రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకున్నా, సామాజిక సేవల ద్వారా వచ్చిన క్రేజ్.. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించింది.

ముచ్చటగా మూడోసారి ఎన్నికల బరిలోకి సిద్దమవుతున్న సైదిరెడ్డి మళ్ళీ “అంకిరెడ్డి ” ఫౌండేషన్ ను ఫుల్ యాక్టీవ్ చేసేసారట. మండలాలు, గ్రామాల వారీగా తన అనుచరులను ఫౌండేషన్ లో భాగస్వాములు చేసి పట్టు కోల్పోకుండా ప్రయత్నాలు ముమ్మరం చేసేశారు. ఇక మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అయితే తన పేరుతోనే ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఎన్.బీ.ఆర్ ఫౌండేషన్ పేరుతో కొన్నేళ్లుగా ప్రజా సేవలు చేస్తున్నారు. తాజాగా ఈయన కుమారుడు సిద్దు ఫౌండేషన్ మళ్ళీ యాక్టివ్ చేసేసారట. బిజినెస్ ల ద్వారా వచ్చే లాభాన్ని మొత్తం ఫౌండేషన్ కు మళ్లిస్తున్నారు.

ఆ నిధులతో పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు చాలా మందికి ఉపాధి కూడా చూపెడుతున్నారు. సామాజిక సేవలతో వ్యతిరేకత రాకుండా
చాలా జాగ్రత్త పడుతున్నారు భాస్కర్ రావు. ఇక తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా సామాజిక సేవలపై కాస్త సీరియస్ గానే దృష్టి సారించారు. వాస్తవానికి 2018 ఎన్నికల ఓటమి అనంతరం సేవా కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు కూసుకుంట్ల. ఈ కార్యక్రమాలు కూడా ఉప ఎన్నికల్లో విజయానికి కొంత దోహద పడ్డాయని ఆయన అనుచరులు చెబుతుంటారు.

ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు పేదలకు ఆర్ధిక సహాయాలు చేస్తూ ప్రజల్లో నానిపోయే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.అధికారికంగా ఫౌండేషన్ స్థాపించక పోయినప్పటికీ, సోషల్ ఆక్టివిటిస్ తో చక్కటి గుర్తింపు పొందారు. ఇక తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ది కూడా అదే బాట అని టాక్ వినిపిస్తోంది. సేమ్ .అధికారికంగా ఫౌండేషన్ లేకపోయినప్పటికీ, సొంత ఖర్చుతో ఆర్ధిక సహాయాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు కిషోర్.

కులాలు,సంఘాల వారిగా తోచిన సాయం చేస్తున్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇలా ప్రజలకు దగ్గరయ్యేందుకు ఖర్చుకు ఏమాత్రం వెనకాడటంలేదు కిషోర్. ఇక ఎమ్మెల్యేల పనితీరు ఇలా ఉంటే, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కూడా తన తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ పేరుతో గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు జగదీష్ రెడ్డి. ఫౌండేషన్ కోసం ఓ వ్యవస్థనే తయారు చేశారు. తన సొంత నియోజకవర్గం సూర్యాపేటతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. జగదీష్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్న జిల్లా ఎమ్మెల్యేలంతా సామాజిక సేవలు చేస్తూ ఆయన బాటలోనే నడుస్తున్నారు.


మొత్తానికీ నియోజకవర్గాల్లో అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కన పెడితే, ఎన్నికల్లో సత్తా చాటాలంటే సోషల్ ఆక్టివిటిస్ కూడా ప్రాధాన్య మంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. మరీ ముఖ్యంగా ఈ దఫా ఎన్నికల్లో సహజంగా వచ్చే పదేళ్ల వ్యతిరేకత నుంచి బయట పడాలంటే సామాజిక సేవలు అస్త్రాలు గా మారొచ్చనే ఫీల్ లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా చేపడుతోన్న సోషల్ ఏక్టివిటీస్ .. ఏమేరకు కలిసివస్తాయన్నదీ చర్చనీయాంశంగా మారుతోంది. కొందరు రాజకీయాల్లోకి రాకముందే, సోషల్ యాక్టివిటీస్ ఆరంభించడంతో, మళ్లీ ఇప్పుడు అదే బాటలో పయనించడం వెనుక హ్యాట్రిక్ గెలుపు వ్యూహం ఉందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా కొత్తగా యాక్టివిటీస్ చేపట్టిన నేతలపై మాత్రం ఇదెంతమేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ నియోజకవర్గాల్లో వెల్లువెత్తుతోంది.

  • మరి ఎమ్మెల్యేల మానవతా దృక్పదం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.

Must Read

spot_img