ఇప్పటికే ఏపీలో ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. ఈ తరుణంలో టీడీపీ మహా కూటమి .. ఏమేరకు ప్రభావం చూపనుందన్నదే చర్చనీయాంశంగా మారుతోంది. అసలు ఈ కూటమి ఏర్పాటు వెనుక కథేంటి..? అన్నదే హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మహా కూటమి కట్టింది. వైసీపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకొని వెళ్లాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి బీజేపీ-జనసేన మినహా మిగిలినవన్నీ తెలుగుదేశానికి జై కొట్టాయి. భవిష్యత్‌లో బీజేపీ-జనసేన పార్టీలతోనూ ఈ కూటమిలో భాగస్వామ్యం కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఈ భేటీని ఏర్పాటు చేసింది.

తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం – ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట నిర్వహించిన ఈ భేటీలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకుడు కందుల దుర్గేశ్, కాంగ్రెస్ తరఫున నరసింహారావు, జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం సాగుతోందని, దీన్ని సమష్టిగా అడ్డుకోవాల్సిన బాధ్యత వైసీపీయేతర పార్టీలపై ఉందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైసీపీ విజయం సాధించకుండా ఉండటానికి ఉమ్మడి వ్యూహాలను రూపొందించాలని, దాన్ని పక్కాగా అమలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. రాజ్యాంగం, చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని, దీన్ని సీజేఐకి వివరించాలని చెప్పారు. ఆయా అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందించాలని ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీని గద్దె దించడానికి ఉమ్మడి పోరాటాలకు శ్రీకారం చుట్టాలని అఖిలపక్ష నాయకులు చెప్పారు. మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తే, ప్రజా సంఘాలకు కనీసం స్వేచ్ఛ కూడా ఉండదని, అఖిలపక్ష భేటీలను నిర్వహించుకునే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు దిగుతోందని వారు ఆరోపించారు. అదేసమయంలో ప్రభుత్వ దాడులపై కూటమి కట్టడం .. రాష్ట్ర రాజకీయాల్లో గణనీయ ప్రభావాన్ని చూపనుందన్న అంచనాలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించే శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీకే ఉన్నాయని జడ శ్రావణ్ కుమార్ అన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఓటర్లల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వారే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా గడప గడపకు దగా పేరిట త్వరలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలను చేపట్టనున్నట్లు వివరించారు. దీనికి వైసీపీయేతర పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. తమ కూటమితో జనసేన కలిసి రావాలని, మతవాద పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని నేతలు సలహా ఇచ్చారు.
అది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదని హితబోధ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్క చాన్స్ అంటూ ప్రజలను మభ్య పెట్టారని, వైసీపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారని అచ్చెన్నాయుడు అన్నారు. ఆ నమ్మకాన్ని జగన్ పోగొట్టుకున్నారని, వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారికి రాత్రికి రాత్రి అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు.
జగన్ నాయకత్వంలోనే 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని గుర్తు చేశారు. జోగి రమేష్ .. చంద్రబాబు ఇంటి పై దాడికి పాల్పడ్డారని, పల్నాడులో 18 మంది బలహీన వర్గాలకు చెందిన వారిని హత్య చేశారని గుర్తు చేశారు. మాచర్ల ఘటనతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని ప్రయత్నం జరిగిందని ఫైర్ అయ్యారు. సిద్దాంతాలు, పార్టీలు వేరైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం – సేవ్ డెమొక్రసీ అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాలను అఖిలపక్ష, ప్రజాసంఘాల నేతలు ఆమోదించారు. రాష్ట్రంలో జరిగిన అప్రజాస్వామిక, హింసాత్మాక ఘటనలు ఖండిస్తూ అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు కలిసి గవర్నర్, ఏపీకి రానున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం సమర్పించాలని తీర్మానం చేశారు. ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మరింతగా సమన్వయ పరచడానికి రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు.
రాబోయే రోజుల్లో అఖిలపక్షం నేతలు విజయవాడ వేదిక గా చేసుకొని ప్రతి నెల సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక ఈ అంశంపై న్యాయ పోరాటానికి కూడా దిగాలని నిర్ణయించుకోవడం .. ఎన్నికల వేళ మరింత రాజకీయ వేడిని పెంచనుందని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీలో ఎన్నికల వాతావరణం..
ఇప్పటికే ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో టీడీపీ మహా కూటమి ఏర్పాటు .. వచ్చే ఎన్నికలకు పొత్తు దిశగా పయనమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్ పాలనలో ప్రతిపక్షాలపై దాడులు, అరాచకాలు పెరిగాయని, ప్రతిపక్ష నేతలపై అరెస్టులు, కేసుల నమోదు విచ్చలవిడిగా సాగాయని పలువురు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మిగిలిన పార్టీలతో టీడీపీ కూటమి కట్టడం .. రాజకీయ హీట్ ను రేకెత్తించనుందని వీరంతా అంటున్నారు. దీనివల్ల ఎన్నికలకు ముందే పొత్తులు కుదిరే అవకాశం ఉందని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు జనసేనతో టీడీపీ పొత్తు ఉంటుందన్న అంచనాల వేళ .. ప్రభుత్వ టెర్రరిజంపై కూటమి కట్టడం .. మాత్రం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ప్రభావం గట్టిగానే ఉంటుందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనిచ్చేది లేదన్న పవన్ వ్యాఖ్యలు .. ఎన్నికల వేడిని పెంచితే, తాజాగా కూటమి నిర్ణయం .. మరింత రాజకీయ హీట్ ను పెంచుతుందని తెలుస్తోంది.
జగన్ పాలనలో .. విపక్ష నేతలపై పెట్టిన కేసులు, పార్టీ కార్యాలయాలపై దాడులు వంటివాటిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లాలని కూటమి నిర్ణయించుకోవడం .. చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో ఇప్పటికే హైకోర్టు దగ్గర రాజధాని విషయంలో గానీ మరో విషయంలో గానీ తలబొప్పి కట్టించుకున్న జగన్ సర్కార్ కు .. మరో చిక్కు ఎదురుకానుందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు అత్యంత రసవత్తరంగా మారనున్నాయని కూడా తెలుస్తోంది. అయితే ఈ కూటమిలోకి అటు జనసేన గానీ, ఇటు బీజేపీ కానీ చేరకపోవడం చర్చనీయాంశమవుతోంది. అదేసమయంలో కూటమి సైతం జనసేనను ఆహ్వానిస్తున్నా, బీజేపీ దిశగా అడుగు వేయకపోవడంతో, వచ్చే ఎన్నికల్లో ఈ
రెండు పార్టీల అడుగులు ఎటువైపు అన్నదీ కీలకంగా ఉండనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పొత్తులకు కూటమి ఓ వేదిక కాగా, ఈ పొత్తులో జనసేన దారెటు అన్నదీ చర్చనీయాంశంగా మారనుందని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.
మరి ఈ కూటమి 2024 ఎన్నికల్లో ఏమేరకు ప్రభావాన్ని చూపనుంది అన్నదే చర్చనీయాంశంగా మారింది.