Homeజాతీయంపాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం..

పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం..

పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. శ్రీలంకలో మాదిరిగా నిత్యావసరాలకు కటకట ఏర్పడి జనం అల్లాడుతున్నారు. కనీసం గోధుమపిండి కూడా మార్కెట్ లో దొరకడం లేదు. ఏమీ కొనేటట్లు లేదు ఏమీ తినేటట్టు లేదంటున్నారు జనం. కరెంటు సరఫరా సరిగా ఉండటం లేదు..కనీసం తినే తిండికి కూడా కొరత ఏర్పడుతోంది. ప్రభుత్వం మాత్రం అన్నీ సర్దుకుంటాయని చెబుతోంది.

పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. మార్కెట్లో వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడు ఏమీ కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు, కొందామన్నా ఏమీ దొరికేటట్టు కూడా లేదన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. తినే తిండికి కూడా కొరత ఏర్పడుతోంది. ప్రజలకు ప్రధాన ఆహారమైన గోధుమ పిండి లాహోర్‌లో దొరకడం లేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

విదేశీ నిల్వలు తరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పంచదార, నూనె, నెయ్యి వంటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. 15 కేజీల గోధుమ పిండి బ్యాగ్‌ ఖరీదు 2వేలకు పైమాటేగా ఉంది. దేశవ్యాప్తంగా గోధుమపిండి, పంచదార, నెయ్యి, ధరలు 25 నుంచి 62 శాతం పెరిగాయి.

నిత్యావసరాలపై సబ్సిడీలన్నీ ఎత్తేయడంతో ప్రజలపై ధరల పిడుగు పడింది. ద్రవ్యోల్బణం రేటు వారానికి 1.09 % చొప్పున పెరుగుతోంది! పాకిస్తానీలు వినియోగించే వంటనూనెలో 90 శాతం దిగుమతుల ద్వారా లభిస్తోంది. విదేశీ మారక నిల్వలు కేవలం మూడు వారాలకు సరిపడా మాత్రమే ఉండటంతో వంటనూనెను అత్యవసరాల జాబితా నుంచి తొలగించారు.

మార్చిలో రంజాన్‌ మాసం ప్రారంభమవుతున్నందున నెయ్యి, నూనెల సరఫరాను చక్కదిద్దాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అప్పుల కుప్పగా మారిపోయిన పాకిస్తాన్‌లో రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. డాలర్‌తో పోలిస్తే పాక్‌ రూపాయి 227కు పడిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 550 కోట్ల డాలర్లకు పరిమితమై ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి చేరాయి.

పరిస్థితి ఆందోళనకరమేనని ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ అంగీకరించారు. ఒక రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడిన ఆయన ”పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉంది. 2016లో ప్రభుత్వం మాకు అప్పగించినప్పడు విదేశీ ద్రవ్య నిల్వలు 2,400 బిలియన్‌ డాలర్లు ఉండేవి. ఇప్పుడు అవి కూడా మా దగ్గర లేవు. కానీ ఈ తప్పు నాది కాదు. గత ప్రభుత్వాలదని అంటున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతం కంటే తక్కువగా వృద్ధి రేటు ఉంటుందనే అంచనాలున్నాయి. దీనికి తోడు గ్యాస్, ఇంధన సంక్షోభం నెలకొంది. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, పాకిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ ప్రభుత్వాన్నే సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ తయారీ పరిశ్రమలు కూడా చాలా వరకు ప్రభావితం అవుతున్నాయి. సదరు పరిశ్రమలు పాకిస్తాన్ కు భారీ షాక్ ఇచ్చాయి సుజుకీ, టయోటా కంపెనీలు.

పాకిస్తాన్ నుంచి పెట్టాబేడా సర్దుకుని వెళ్లిపోతున్నాయి. పాకిస్తాన్ లో సుజుకీ మోటార్స్ సంస్థ తమ అసెంబ్లింగ్ ఫ్లాంట్ ను జనవరి 6 నుంచి మూసేస్తున్నట్లు ప్రకటించింది. జపాన్ కు చెందిన సుజుకీ సంస్థ, పాకిస్తాన్ ఆటోమోబైల్స్ కార్పొరేషన్ తో కలిసి 1983లో పాక్ సుజుకీ కంపెనీగా ఏర్పడింది. ఇంతకాలం పనిచేస్తూ వచ్చిన సుజుకీ ఇప్పుడు దేశాన్ని వదిలిపెట్టి పోతోంది. భారత్ లో ఇదే సంస్థ 1981లో మారుతీ సుజుకీ పేరుతో ఏర్పాటు అయింది.

అయితే పాకిస్తాన్ మాత్రం జపాన్ నుంచి విడి భాగాలు తెప్పించుకుని అసెంబ్లింగ్ మాత్రమే చేస్తోంది. అక్కడ డిజైనింగ్, తయారీ ఫ్లాంట్లు లేవు. కానీ భారత్ లోనే గత కొన్నేళ్లుగా మారుతీ సుజుకికి సంబంధించి డిజైనింగ్, తయారీ జరుగుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ జపాన్ నుంచి విడి భాగాలు తెప్పించే పరిస్థితిలో లేదు.

కారణం డాలర్ల కొరత. గట్టిగా చెప్పాలంటే పాకిస్తాన్ కు కేవలం ఒక నెల దిగుమతులకు మాత్రమే విదేశీ మారకద్రవ్యం అందుబాటులో ఉంది. టొయోటా పాకిస్తాన్ లో ‘ఇండస్ మోటార్స్’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. గతేడాది డిసెంబర్ లోనే టొయోటా పాక్ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇన్నాళ్లు దివాళా తీసే పరిస్థితి వచ్చే సరికి పాకిస్తాన్ కు ఎక్కడో చోట అప్పు పుట్టేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

దీనికి తోడు తీసుకున్న అప్పుకు సంబంధించి ఇన్స్టాట్మెంట్స్ కట్టాలని అని పలు అరబ్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక పాకిస్తాన్ లో ట్రాక్టర్లు తయారు చేసే ‘మిల్లెట్ ట్రాక్టర్స్’ కూడా శుక్రవారం నుంచి ఆపేస్తున్నట్లు ప్రకటించింది. డాలర్లు లేకపోవడం ఓ కారణం అయితే.. కరెంట్ కష్టాలు కూడా కంపెనీలు వెళ్లిపోవడానికి ఓ కారణం. రానున్న రోజుల్లో ఇంకెన్ని కంపెనీలు పాకిస్తాన్ నుంచి బయటకు వెళ్లిపోతాయో చూడాలి.

Must Read

spot_img