Homeఅంతర్జాతీయంజపాన్‌లో ఈ మధ్య తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి… ఎందుకు ?

జపాన్‌లో ఈ మధ్య తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి… ఎందుకు ?

జపాన్‌ను మరోసారి పెను భూకంపం సంభవించింది. జపాన్ లోని హొక్కాయిడోను ఈ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా రికార్డయింది. జపాన్ ఉత్తర ప్రాంతంలో హొక్కాయిడో ఉంటుంది . అక్కడి నెమురో రీజియన్‌లో భూమి ఒక్కసారిగా భయంకరంగా కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:48 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. నెల రోజుల కిందట అంటే ఫిబ్రవరి 26వ తేదీన ఇదే ప్రాంతంలో భూకంపం నమోదైంది. ఇప్పుడు మళ్లీ అదే రీజియన్‌ను వణికించింది. ఈ భూకంప తీవ్రత తీర ప్రాంత నగరాలైన ఇకెడ, టొయొకొరొ, ఒబిహిరో.. వంటి ప్రాంతాల్లో భారీగా కనిపించింది. ఆయా ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. పలు చోట్ల భవనాలకు బీటలు వారాయి.

ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు కావడం వల్ల స్థానికులు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. భూకంపం సంభవించిన వెంటనే రోడ్ల మీదికి ఉరుకులు పరుగులు పెట్టారు. అంతకుముందు- ఈ నెల 24వ తేదీన కూడా జపాన్‌లో భూకంపం చోటు చేసుకుంది. ఇజు దీవులలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా రికార్డయింది. జపాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. దీని తీవ్రత భారీగా ఉండటం ఆందోళనను కలిగిస్తోంది. రింగ్ ఆఫ్ ఫైర్‌ పరిధిలో ఉండే దేశాల్లో జపాన్ కూడా ఒకటి. ఎక్కడైతే భూఅంతర్భాగంలో ఉండే టెక్టోనిక్ పలకలు ఒకదానినొకటి రాచుకుంటాయో అక్కడే భూకంపాలు వస్తాయి. అలాంటి పలకలు ఉన్న చోటునే రింగ్ ఆఫ్ ఫైర్ గా గుర్తించారు.

ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ రేంజిలో బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, పాపువా న్యూగినియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికాలు ఉన్నాయి. ఇదివరకెప్పుడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. దాని తీవ్రత, ప్రాణ, ఆస్తినష్టం పెద్ద ఎత్తున ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిరోజుల కిందటే టర్కీ, దాని పొరుగునే ఉన్న సిరియాల్లో వరుస భూకంపాలు భారీ విధ్వంసాన్ని విపరీతమైన ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. ఈ రెండు దేశాల్లో పదుల సంఖ్యలో భూకంపాలు సంభవించాయి. అనూహ్యంగా టర్కీ, సిరియాల్లో సంభవించిన వరుస భూకంపాల వల్ల 50 వేల మందికి పైగా మరణించారు. టర్కీలో 45,968 మంది దుర్మరణం పాలయ్యారు. సిరియాలో ఈ సంఖ్య 7,259గా రికార్డయింది.

భూకంపం కొట్టిన దెబ్బకు ఈ రెండు దేశాలు ఇప్పటికీ తేరుకోలేకపోతోన్నాయి. ఆ విషాద ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. టర్కీ, సిరియాలకు సహాయ, సహకారాలను అందించడానికి భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ముందుకొచ్చాయి. మానవతాదృక్పథంతో ఆదుకున్నాయి. పెద్ద ఎత్తున ఆర్థిక, మానవ వనరుల సహాయాన్ని ప్రకటించాయి. జపాన్‌లో ప్రతీ రోజు భూకంపాలు వస్తున్నట్టుగానే ఉంటుంది. మరి అటువంటి దేశంలో అంత మంది భద్రంగా ఎలా జీవిస్తున్నారన్నది ఆశ్చర్యంగానే ఉంటుంది. ఏటా దాదాపు చిన్నా పెద్దా కలసి 5వేల భూకంపాలు జపాన్ దేశాన్ని పలకరిస్తుంటాయి. కొన్ని శతాబ్దాలుగా ఈ విపత్తులను కళ్లారా చూస్తున్న అక్కడి ప్రజలు వాటిని ఎదుర్కునేందుకు ఎప్పుడూ సిధ్ధంగా ఉంటారు.

దాంతో భూకంపం సంభవించినప్పుడు ఇతర దేశాల్లో జరిగే నష్టంతో పోలిస్తే జపాన్‌లో మరణాల రేటు ఆస్తి నష్టం తక్కువగా నమోదవుతూ ఉంటుంది. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది. 40 వేల కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌లో 450 అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. అందులో మెజారిటీ అగ్నిపర్వతాలు జపాన్‌లోనే కనిపిస్తాయి. అవి నిరంతరం యాక్టివ్‌గా ఉంటాయి. టెక్టోనిక్ ప్లేట్లు తరచూ కదులుతూ ఉండటం వలన భూకంపాలు అనివార్యంగా సంభవిస్తున్నాయి. పైగా జపాన్ ట్రెంచ్ అని పిలుస్తున్న జపనీస్ అగాధం కూడా భూకంపాలు రావడానికి మరో కారణం అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. పసిఫిక్ వాయువ్య ప్రాంతంలోని ఈ జపాన్ ట్రెంచ్ అగాధం 800 మీటర్ల లోతులో ఉంటుంది. అందులో కదలికలు ఏర్పడినప్పుడు భూకంపాలు సునామీలు వస్తుంటాయి.

Must Read

spot_img