ప్రపంచాన్ని వేదిస్తున్న వాతావరణ వైపరీత్యాల బారిన ఇటలీలోని అందమైన వెనిస్ నగరం కూడ పావులా మారింది. తాజాగా ఏర్పడిన కరువుతో వెనిస్‌లో కాలువలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. నిజానికి శతాబ్దాలుగా ఈ కాలువల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ కాలువలలో ప్రయాణాన్ని ప్రపంచంలోని ప్రముఖ కవులు తమ కవితల్లో రాసుకున్నారు. చరిత్ర పుటల్లో ఈ ప్రయాణాల గురించి అద్భుతంగా వివరించారు. ఇప్పుడా అందమైన ద్రుశ్యాలు గత చరిత్రగా మారిపోతున్నాయి. కాలగర్భంలో కలసిపోనున్నాయి. ఎవరికైనా ఇటలీలోని వెనిస్ నగరం అంటే వీధుల్లో కాలువలు.. అందులో పడవ ప్రయాణాలే గుర్తుకొస్తాయి. కానీ, ఇప్పుడక్కడ దాదాపు 150 కాలువలు నీరు లేక ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ జోరుగా ప్రయాణాలు సాగించిన పడవలు, వాటర్ టాక్సీలు, ముఖ్యంగా అంబులెన్స్ బోట్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
దీనిపై ఆధారపడ్డ అనేక కుటుంబాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ప్రాంతం నుంచి పలు ద్వీపాలకు జల మార్గమే ప్రధాన రవాణా సౌకర్యం కావడంతో ఆయా ద్వీపాల ప్రజల రాపోకలకు సైతం ఎంతో కష్టంగా మారింది. తక్కువ సముద్ర నీటి ప్రవాహం, వర్షాభావ పరిస్థితులే కారణమని నిపుణులు చెబుతున్నారు. అందమైన వెనిస్ కాలువలు ఎందుకు ఎండిపోతున్నాయ్.. ఎందుకీ దుస్థితి..?అన్నది అందరినీ వేదిస్తోంది. నిజానికి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల లాగానే నీటిపై తేలియాడే వెనీస్ నగరం కూడా కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. నీరు అడుగంటి పోయి సుందరమైన వెనీస్ నగరం అందవిహీనంగా తయారైంది. ఇటలీలో కరువు చాయలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం గత ఏడాది యూరప్‌లో దంచి కొట్టిన ఎండలే అందుకు కారణం. ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే వెనీస్ నగరం ఈసారి నిర్మానుష్యం కానుంది.
ఈ పరిస్థితి మొన్నటి కరోనా సమయంలోనూ ఒకటిన్నర సంవత్సరం పాటు లాక్డౌన్ సమయంలో కనిపించింది. ఇప్పుడదే సీన్ మరో కారణంతో రిపీట్ అవుతోంది. అక్కడి వర్షపాతం ఘణనీయంగా తగ్గిపోవడమే. హై ప్రెషర్ సిస్టమ్‌తో పాటు పుల్ మూన్, సీ కరెంటు, సముద్ర తరంగాలు కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఇక్కడ తరచూ వరదలు వస్తుంటాయి. ఈసారి అత్యల్ప వర్షపాతం నమోదు కావడంతో ఇటలీకి చెందిన అతి పొడవైన నదులకు మంచుకొండల నుంచి కరిగి వచ్చే నీరు 61 శాతం తగ్గింది.
దీంతో దేశంలో కరువుకాటకాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇటలీలోని ‘పొ’ నది ఎండిపోవడంతో ఇటలీ గత 70 ఏళ్లలో ఎన్నడూలేని కరువు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఏకధాటిగా 50 రోజుల పాటు భారీ వర్షాలుకురిస్తే తప్ప ఈ కరువు నుంచి వెనీస్ బయటపడదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఇటలీ ఈశాన్య తీరంలో నీళ్లపై తేలియాడుతున్నట్లుండే ఈ నగరం వందకు పైగా దీవుల సముదాయం. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం అత్యంత కనిష్టానికి పడిపోవడంతో చుట్టు పక్కల ఉన్న చిన్నచిన్న ద్వీపాలకు తేలిగ్గా చేరుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు వచ్చే 15 రోజుల పాటు పశ్చిమ యూరోప్‌లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఇది ఇలాగే కొనసాగితే శతాబ్దాలుగా నీళ్లలో ఉన్న వెనీస్ నగరం నేలకు దిగిపోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. ఇప్పుడొకసారి సాగరంలో నగరంగా పేరున్న వెనిస్ సిటీ గురించిన చరిత్రను ఆ విశేషాలను చూసే ప్రయత్నం చేద్దాం..వెనిస్ నగర వీధుల గురించి రాసినన్ని కవితలు, రచనలు, హాలివుడ్ సినిమాల షూటింగులు మరే పర్యాటక క్షేత్రం గురించి రాయబడలేదు. సామ్యెల్ రోజర్స్ అనే ఓ ఇంగ్లీషు కవి ఏమంటారంటే.. సాగరంలో ఒక అద్భుతమైన నగరం ఉంది. ఆ నగరంలోని విశాలమైన వీధుల్లో, ఇరుకు వీధుల్లో సముద్రపు నీరు పొంగి పొర్లుతుంటుంది; సముద్రపు నాచు, భవంతుల చలవరాతి గోడలకు పేరుకుని ఉంటుంది.” అని..ఆ ‘అద్భుత నగరమే’ వెనిస్.
ప్రముఖ గణతంత్ర రాజ్యానికి ఒకప్పుడు రాజధానిగా ఉన్న వెనిస్, ఇటు భూమిపై అటు సముద్రంపై విస్తరించిన సామ్రాజ్యంపై శతాబ్దాలపాటు ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈ నగరం “సాగరంలో” ఎందుకు నిర్మించబడింది, ఎలా నిర్మించారు..? దాని ఘనతకు కారణమేమిటి? దాని సామ్రాజ్యం ఎలా కూలిపోయింది అన్న వెనిస్ చరిత్రకు సంబంధించిన విశేషాలు నేటికీ మిగిలే ఉన్నాయి. ఏడ్రియాటిక్ సముద్రపు వాయవ్య చివరన ఒక ఉప్పునీటి చెరువు మధ్యన ఉన్న వెనీస్, 118 ద్వీపాలతో రూపొందిందని చెబుతారు.. సమీపాన ఉన్న సముద్రంలోకి ప్రవహించే నదులు, లోతు తక్కువగావున్న తీరప్రాంత జలాల్లోకి పెద్ద మొత్తంలో ఒండ్రుమట్టిని తీసుకొస్తాయి.
అలల ఆటుపోట్లవల్లా ప్రవాహవేగం వల్లా, ఇంచుమించు 51 కిలోమీటర్ల పొడవు దాదాపు 14 కిలోమీటర్ల వెడల్పుగల ప్రశాంతమైన ఉప్పునీటి చెరువును చుడుతూ పొడవైన ఇసుక తిన్నెలు గొలుసుకట్టులా ఏర్పడ్డాయి. సముద్రంవైపు వెళ్తున్న మూడు ఇరుకైన కాలువలగుండా ఆ చెరువులోకి మూడు అడుగుల ఎత్తులో సముద్రపు అలలు వస్తాయి, వాణిజ్య పడవలు కూడా ఆ కాలవల ద్వారానే చెరువు లోపలకు వస్తాయి. “ఎన్నో శతాబ్దాలపాటు, ఏడ్రియాటిక్ సముద్రం ద్వారా, మధ్య ఐరోపా నదుల ద్వారా వాణిజ్యనౌకలకు, రహదారి మార్గాల ద్వారా వచ్చే వ్యాపారులకు ఆ ఉప్పునీటి చెరువే కేంద్రబిందువుగా ఉండేది.
వెనీస్ నగరం ఐదవ శతాబ్దం నుండి ఏడవ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో ఆక్రమణదారులు పదేపదే ఉత్తరదిశ నుండి దండెత్తి వచ్చి ఇటలీ ప్రజలను దోచుకొని వారి నగరాలను కాల్చివేసేవారు. దాంతో ప్రజలు వారి రాకతో అలర్టయి వారికంటే ముందుగా పారిపోయేవారు. ఉప్పునీటి చెరువులోని సురక్షితమైన ద్వీపాలను ఆశ్రయించేవారు. ఆ ద్వీపాల్లో నిర్మించబడిన మొదటి కట్టడాల నీటి అడుగున బురదలో దిగగొట్టబడిన గుంజలతో నిర్మించేవారు. తర్వాతి కాలాల్లో వెనీస్ వాసులు వేలాది గుంజలను మట్టిలోకి దిగగొట్టి, వాటిపై రాళ్ళుపేర్చి ఇళ్ళు కట్టుకునేవారు.
అయితే ఆ తర్వాత నగర కేంద్రంగా మారిన రియాల్టో ద్వీపాలు చాలామట్టుకు నీటిలో మునిగి ఉండేవి. నానాటికీ పెరుగుతున్న జనాభా కోసం ఆ ద్వీపాలనుండి నీటిని తొలగించి, పాత పద్ధతులను ఉపయోగించి, ఉన్న స్థలాన్ని పెద్దదిగా చేసుకోవలసి వచ్చింది. ఆ ద్వీపాల మధ్య ప్రయాణాల కోసం కాలువలు తవ్వారు, దాంతో నేలలో అధికంగావున్న నీరంతా ఆ కాలువల్లోకి చేరింది, అలా వారు నేలను మరింత దృఢంగా తయారుచేసి ఆ ద్వీపాలను భవంతులు నిర్మించడానికి మెరుగైన స్థలాలుగా తయారు చేశారు. ఆ కాలువలు, వాటిపై నిర్మించబడిన వంతెనలు ఒక ద్వీపంనుండి మరో ద్వీపానికి నడిచి వెళ్ళడానికి ఉపయోగపడుతూ వారికి వీధుల్లా మారిపోయాయి. వెనిస్ నగరం వ్యాపార కేంద్రంగా కూడా విలసిల్లింది.. ముస్లిమ్ దేశాలనుండి బంగారం, వెండి, పట్టు వస్త్రాలు, మసాలా దినుసులు, దూది, అద్దకపు రంగులు, ఏనుగు దంతాలు, పరిమళ ద్రవ్యాలు, ఇంకా ఎన్నో ఇతర సరుకులు దిగుమతి చేసుకోబడేవి. ఆ నగర అధికారులు తమ నగరపు మార్కెట్లలోకి వచ్చి వెళ్ళే సరుకులన్నింటిపై నిర్బంధంగా పన్నులు వసూలు చేసేవారు.
చివరకు 1797లో నెపోలియన్ ఆ నగరాన్ని ఆక్రమించుకొని దానిని ఆస్ట్రియా అధికారానికి అప్పగించాడు. చివరకు 1866లో వెనీస్ ఇటలీలో భాగమయ్యింది. చాలా మందికి ఇప్పటికి కూడా వెనీస్‌ను సందర్శించడం కాలప్రవాహంలో రెండు మూడు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళడంలా ఉంటుంది. ఆ నగర వాతావరణమే వేరుగా ఉంటుంది..ఆ నగరపు విశేషాల్లో ఒకటి దాని ప్రశాంతత. చాలామట్టుకు కాలిబాటన నడుచుకుంటూ వెళ్ళడానికి చిన్న సందులు, పడవలో వెళ్ళడానికి కాలువలు విడివిడిగానే ఉంటాయి. ఎక్కడా కాలుష్యం జాడే ఉండదు. అక్కడి వీధులు నీటితో నిండిన కాలువలే అని చెప్పాలి.
ఆ నగరంలో ఆకర్షణీయమైన పెయింటింగ్స్ లాంటి దృశ్యాలకు కొదవే లేదు. బెసిలికా, బెల్ టవర్,అందంగా కనిపించే సెయింట్ మార్క్స్ కూడలికళాకారులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.ఆ కూడలిలో రద్దీగా ఉండే ఆరుబయటి కాఫీ హోటళ్ళు సందర్శకులను, అక్కడి నివాసులను కూడా ఆకర్షిస్తాయి. అలాంటిది ఇప్పుడు గత చరిత్రగా మారబోతోందంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది..