ఎప్పుడూ స్థిరంగా ఉండకుండా ఏదో ఒక సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పుడు మరోసారి భారత్ పై విషం చిమ్ముతోంది. విస్తరణ వాదంతో ముందుకు పోతూ వీలైన చోట్ల దురాక్రమణలకు పాల్పడుతోంది. గతంలో చేసుకున్న ఏ ఒప్పందాలను పాటించడం లేదు. ఒకప్పుడు హిందీ-చైనీ భాయి భాయి అనే నినాదంతో తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూని నమ్మించింది చైనా.
ఆనాటి చైనా ప్రధాని అయిన చౌఎన్‌లై తర్వాత చైనాలో అధికారాన్ని చేపట్టిన నాయకులు ఎవరూ పాత ఒప్పందాలకు కట్టుబడలేదు. అయితే పొరుగుదేశాలతో భారత్ మొదటి నుంచి శాంతిని కోరుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే పంచశీల సిద్ధాంతాన్ని ప్రతిపాదించి చిత్తశుద్ధితో అమలుజేస్తోంది.
పరస్పరం దురాక్రమణలకు పాల్పడకపోవడం, దేశాల ప్రాదేశిక సమగ్రత పట్ల అవగాహన కలిగి ఉండటం అందులో మూల సిధ్దాంతంగా ఉంటుంది, పొరుగు దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, ఉమ్మడి ప్రయోజనాల కోసం పాటు పడటం, సమానత్వం, పరస్పర గౌరవంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం పంచశీల సిద్ధాంతాల్లోని ఇతర ముఖ్యాంశాలు. పండిట్ నెహ్రూ 1954లో ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాలకు చైనా ఆమోదం తెలిపినప్పటికీ, ఇంతవరకూ ఒక్క అంశంలోనూ చైనా తన నిజాయితీ, నిబద్దతను రుజువు చేసుకోలేదు.
పైగా 1962లో దురాక్రమణకు పాల్పడింది. అయినప్పటికీ, పొరుగు దేశంతో శాశ్వతంగా ఉద్రిక్తత మంచిది కాదన్న ఉద్దేశ్యంతో భారత్ పలు ఒప్పందాలు చేసుకుంది. అయినా పరిస్థితి సేమ్ టు సేమ్.. వాటిలో ఏ ఒక్కదానినీ చైనా ఖాతరు చేయలేదు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లో తావాంగ్ ప్రాంతం లోకి చైనీస్ సేనలు చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించగా, మన సైన్యం తిప్పికొట్టింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలో సైనికులు గాయపడటం తప్ప పెద్దగా నష్టం ఏమీ జరగలేదు.
ఈ చొరబాట్లపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాకు గట్టి హెచ్చరిక చేశారు. అరుణాచల్ ముఖ్యమంత్రి ఖండుఫెమా కూడా చైనాకు గట్టి హెచ్చరిక చేసారు. ఇది 1962 కాదని గుర్తుంచుకోవాలంటూ చైనాను సంబోదిస్తూ ప్రకటన చేసారు. అరుణాచల్ ప్రదేశ్‌పై తన హక్కును నిరూపించుకోలేకపోయిన చైనా ఈ మాదిరి దూకుడును ప్రదర్శించడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
ప్రాదేశిక హక్కులను కాపాడుకునేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా చైనాతో భారత్ శాంతినే కోరుకుంటోందనీ, అదే సందర్భంలో సమయం వచ్చినప్పుడు తన సత్తాని చూపేందుకు వెనుకాడదని స్పష్టంచేశారు. అయితే కుక్క తోక వంకర ఎన్నడూ సరికాదని చైనా మరోసారి రుజువు చేసుకుంది.
చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ విన్‌బిన్ తాజా పరిస్థితికి భారత సైనికులదే తప్పంటూ అడ్డగోలుగా వాదించారు. అయితే, సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగానే ఉందనీ, దౌత్య పరమైన సంప్రదింపులకు తమ దేశం సిద్ధమేనని అన్నారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్‌ని తమ భూభాగంగా చైనా సమయం వచ్చినప్పుడల్లా స్పష్టం చేస్తోంది. అడపా దడపా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దుల్లో తనదైన స్థలంలో స్థిర నిర్మాణాలు చేస్తూ అక్రమంగా కిలోమీటర్ల కొద్దీ స్థలాలను ఖబ్జా చేయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుంది.
మన సరిహద్దుకు అవతల వందలా సంఖ్యలో నిర్మాణాలు చేసి తన బలగాలకు ఆశ్రయం కలిగించేందుకు ప్రయత్నిస్తుంటూంది. మొన్నటి దాకా లడాక్, గాల్వన్ ప్రాంతాలలో స్రుష్టించిన అలజడి చల్లారకముందే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని భాగాలను చైనాలో అంతర్భాగంగా ప్రకటించుకంది. అంతే కాదు..అక్కడ శాశ్వత ప్రాతిపదికపై నిర్మాణాలు, రోడ్డు నిర్మాణాలు సాగిస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్‌నే చైనా ఎందుకు ఎంచుకుందంటే దానికి ఓ కారణం ఉంది..!
ఇంతకూ.. అరుణాచల్ ప్రదేశ్‌నే చైనా ఎందుకు ఎంచుకుందంటే దానికి ఓ కారణం ఉంది, అది బాగా అభివృద్ది చెందిన ప్రాంతం, జనావాసాలకు అనువైన ప్రాంతం. పైగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని తెగలతో ఆవతలి వైపున చైనా తెగలకు చాలా కాలంగా సంబంధాలున్నాయి. ఇవి చాలా కాలంగా సాగుతున్నా, ఇరుదేశాలూ పెద్దగా పట్టించుకోలేదు. సాధారణంగా ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుల్లోనైనా ఇలాంటి రిలేషన్స్ ఉంటాయి.
పైగా, సంస్కృతి, ఆహార్యం, జీవనవిధానంలో పోలికలు ఉండటం వల్ల ఎవరు చైనీయులో, ఎవరు అరుణాచల్ వాసులో పోల్చడం చాలా కష్టం. ఈ తేడాలను గుర్తించడంలో సరిహద్దు దళాలు కూడా విఫలమయ్యాయనే చెప్పాలి. అలా సైన్యం కన్నుగప్పి స్థానికులు రాకపోకలు సాగించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. అంతేకాకుండా సహజవనరుల వినియోగంలో కూడా ఇరుగుపొరుగు ప్రాంతాల మధ్య సదవగాహన ఉంది.
ఈ నేపథ్యంలో అరుణాచల్ ఆవలి వైపున చైనా చిన్న వంతెనలు, రహదారులు సహా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించింది. అరుణాచల్ వాసులను ఆకర్షించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టింది. దీనిని ఆధారంగా చేసుకుని అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమని వాదించడం మొదలు పెట్టింది. టిబెటెన్ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా ధర్మశాలలో తలదాచుకోవడం చైనీస్ పాలకులకు కంట్లో నలుసుగా ఉంది.
ఆయన తరచూ చైనీస్ నాయకులపై చేసే వ్యాఖ్యలను వారు జీర్ణించుకోలేకపోతు న్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఆయన ప్రవేశాన్ని నిషేధించారు. అంతేకాదు. భారత రక్షణ మంత్రి, ఇతర నాయకులు అరుణాచల్‌లో పర్యటించరాదంటూ ఆంక్షలు విధించారు. దీనిని మన దేశం పలు సందర్భాల్లో, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఖండించింది, అరుణాచల్‌లో నిర్మాణాలకు సైతం చైనా వెనుకాడలేదు.. దీనిపై గట్టిగా నిలదీస్తే అవి శాశ్వత నిర్మాణాలు కావనీ, ప్రజలు వేసుకున్న గుడారాలని నమ్మబలికింది.
మన సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చైనీస్ సైనికుల కదలికలను గమనిస్తూనే ఉన్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు ఏ మాత్రం చొరబడినా మన సైనికులు తరిమి కొడుతున్నారు. దౌత్య సంబంధాలను కొనసాగించేందుకు సిద్ధమేనంటూ ఈ మాదిరి కవ్వింపు చర్యలకు పాల్పడటం చైనా దుర్మార్గానికి నిదర్శనం. చైనా 2014 నుంచి ఇంతవరకూ 1025 సార్లు చొరబాట్లకు యత్నించింది. ఇందుకు ప్రతిగా భారత్ ఇప్పుడు గట్టి చర్యలు తీసుకుంది.
ఒకప్పటి ప్రభుత్వాలు సరిహద్దు ప్రాంతాల అభివ్రుద్దిని పట్టించుకోలేదు. దాంతో చైనా పాకిస్తాన్ దేశాలు ఆడింది ఆటగా పాడిందే పాటగా కొనసాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దేశం రక్షణ రంగంలో అపారమైన పెట్టుబడులు పెడుతోంది. సరిహద్దులు పటిష్టం చేసుకునేందుకు రహదారులు నిర్మిస్తోంది. కీలక ప్రాంతాలలో రఫేల్ లాంటి విమానాలను మొహరిస్తూ శత్రుదేశాలను అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే భారత్ నిజంగానే విశాలమైన ప్రాంతం.. అన్ని దేశాలలాగా కాదు..జనాభాలోనూ అనేక భిన్న సంస్క్రుతులు, సంప్రదాయాలు కలిగిన దేశం. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకునేందుకు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కుంటోంది. ఇన్నింటిని పాటిస్తూ చైనా పాకిస్తాన్ దేశాలను అదుపులో ఉంచుతోంది. అదే ఆ రెండు దేశాలకు కంటగింపుగా మారింది. అందుకే అడపా దడపా ఇలా చీకాకులు స్రుష్టించే ప్రయత్నాలు నిరంతరం చేస్తున్నాయి.
అయితే వాటిని మన సైనికులు దీటుగా ఎదుర్కుంటున్నారు. ఒప్పందాలను గౌరవిస్తూ పొరుగు దేశాలకు తమ హద్దులు చూపిస్తున్నారు.