Homeఅంతర్జాతీయంగాడిదల గురించి ఊహించని ఆశ్చర్యకరమైన వాస్తవాలు

గాడిదల గురించి ఊహించని ఆశ్చర్యకరమైన వాస్తవాలు

  • ప్రస్తుతం ఉన్న గాడిదలకు, పురాతనకాలంలో ఉండే గాడిదలకు తేడా ఏంటి..?
  • పురావస్తు శాస్త్రవేత్తల అధ్యయనంలో సంచలన విషయాలేంటి..?
  • గాడిదలు మానవ చరిత్రలో ఎలాంటి పాత్ర పోషించాయి..?

గాడిద అంటే చాలా మందికి బరువులు మోసుకెళ్లే జంతువుగానే తెలుసు. లేదంటే ఎవరినైనా అవమానించడానికి ఈ జంతువు పేరు వాడుతుంటారు. కానీ పారిస్‌ కు 280 కిలోమీటర్ల దూరంలోని ఓ ఫ్రెంచ్ గ్రామంలో గాడిదల గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని విషయాలను కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. బోయిన్‌ విల్లె గ్రామంలోని రోమన్ విల్లా స్థలంలో అనేక గాడిదలకు సంబంధించిన అవశేషాలను ఈ పురావస్తు శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. అవన్నీ పరిమాణంలో చాలా పెద్ద గాడిదలు. ఇప్పుడు మనం చూస్తున్న గాడిదలు వాటితో పోల్చితే మరుగుజ్జులు.

‘ఇవి భారీ పరిమాణం గల గాడిదలు’ అని ఫ్రాన్స్‌లోని పర్పన్ మెడికల్ స్కూల్‌కు చెందిన ‘సెంటర్ ఫర్ ఆంథ్రపోబయాలజీ అండ్ జీనోమిక్స్’ డైరెక్టర్ లూడోవిక్ ఆర్లాండో వెల్లడించారు. ఆఫ్రికా గాడిదలతో జన్యుపరంగా పోలికలు కనిపిస్తున్న ఈ గాడిదలు గుర్రాల కంటే పెద్దవి’ అన్నారు ఆర్లాండో… ఈ గాడిదల అస్థిపంజరాల నుంచి సేకరించిన డీఎన్‌ఏను సీక్వెన్స్ చేసే ప్రాజెక్టుకు ఆర్లాండో నేతృత్వం వహిస్తున్నారు.

గాడిదలను పెంపుడు జంతువులుగా ఎలా మార్చగలిగారు… ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు అవి ఎలా చేరాయనేది అధ్యయనం చేస్తున్న భారీ ప్రాజెక్టులో ఈ డీఎన్ఏ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ఓ భాగం. గాడిదలతో మనిషికి గల సంబంధం ద్వారా మానవ జాతి చరిత్రకు సంబంధించిన ఆశ్చర్యకర ఫలితాలను ఈ పరిశోధన అందిస్తోంది. ఇంకా చెప్పాలంటే మానవ జాతి చరిత్ర మలుపులలో గాడిదల పాత్రా ఉందంటున్నారు ఈ అధ్యయనకర్తలు.

రోమన్‌ విల్లాలో పెంచిన గాడిదల ఎత్తు నేల నుంచి వాటి మూపురం వరకు కొలిస్తే 155 సెంటీమీటర్లు ఉందని ఓర్లాండో తెలిపారు.. ఇప్పుడు మనం చూసే గాడిదల సగటు ఎత్తు 130 సెంటమీటర్లు ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఉన్న గాడిదలలో ‘అమెరికన్ మేమోత్ జాక్స్’ రకం మాత్రమే రోమన్‌విల్లాలో గుర్తించిన రకం గాడిదల ఎత్తుకు సమీపంగా ఉన్నాయి. అమెరికన్ మేమొత్ జాక్స్ రకం గాడిదలు పెద్దగా ఉంటాయి. వీటిని గాడిదల సంతానోత్పత్తి కోసంవినియోగిస్తారు.. రోమన్‌విల్లాలో గుర్తించిన గాడిదలు వంటివి రోమన్ సామ్రాజ్య విస్తరణలో ప్రధాన భూమిక పోషించి ఉండొచ్చని ఓర్లాండో అభిప్రాయపడ్డారు.

‘రెండో శతాబ్దం నుంచి అయిదో శతాబ్దం మధ్య రోమన్లు ఇలాంటి పెద్ద గాడిదలను గుర్రాలతో సంకరం చేసి కంచర గాడిదలను ఉత్పత్తి చేయడానికి వినియోగించేవారు. అప్పట్లో రోమన్ సైన్యానికి చెందిన వస్తువులు, యుద్ధ సామగ్రిని కంచర గాడిదలతో మోయించేవారు’ అని ఓర్లాండో చెప్పారు. అయితే రోమన్ సామ్రాజ్య పతనం ఇలాంటి భారీ గాడిదలు అంతరించడానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ‘వేల కిలోమీటర్ల దూరం వరకు విస్తరించిన సామ్రాజ్యం లేనప్పుడు దూర ప్రయాణాలకు పనికొచ్చే జంతువుల అవసరం ఉండదు. అలాంటప్పుడు కంచర గాడిదలను ఉత్పత్తి చేయాల్సిన అవసరమూ ఉండదు. అప్పుడు ఈ భారీ గాడిదల అవసరమూ ఉండదు’ అని ఓర్లాండో భావిస్తున్నారు..

మానవ చరిత్రలో గాడిదలు ఎలాంటి పాత్ర పోషించాయో తెలుసుకోవడానికి వివిధ దేశాలకు చెందిన 39 ప్రయోగశాలల నుంచి 49 మంది శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందం ప్రపంచంలోని 207 ఆధునిక గాడిదలు, 31 ప్రాచీన గాడిదల జన్యువులను సీక్వెన్స్ చేసింది. జెనెటిక్ మోడలింగ్ టెక్నిక్స్ సహాయంతో వీరు కాలక్రమంలో గాడిదల జనాభాలో వచ్చిన మార్పులను గుర్తించారు.

అడవి జంతువులను పెంపుడు జంతువులుగా మార్చడం ఒక విధంగా గాడిదలతోనే మొదలైనట్లు ఈ బృందం చెప్తోంది. కెన్యా, తూర్పు ఆఫ్రికా, హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతాలలో 7,000 ఏళ్ల కిందట ఈ ధోరణి ప్రారంభమైందని వీరు అంచనా వేశారు. గతంలో కొన్ని అధ్యయనాలు గాడిదలను పెంపుడు జంతువులుగా మార్చడం యెమెన్‌ లో ప్రారంభమైనట్లు పేర్కొన్నాయి. అయితే, ఒకప్పుడు పచ్చగా ఉన్న సహారా ప్రాంతం పొడిబారిన కాలం.. ఈ గాడిదలను పెంపుడు జంతువులుగా మార్చడం ప్రారంభమైన కాలం రెండూ దాదాపు ఒకటే కావడం ఆసక్తికరం.

సుమారు 8,200 ఏళ్ల కిందట రుతుపవనాలు బలహీనపడడం అరంభించాయి.. అనంతరం జంతువులు మేత, పచ్చదనాన్ని హరించి వేయడం, ఇతర మానవ చర్యలు వర్షపాతంలో తగ్గుదలకు తద్వారా ఎడారీకరణకు దారితీసింది. ఇలాంటి కఠిన పరిస్థితులకు మానవులు అలవాటు పడడంలో గాడిదలు పాత్ర ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది. దూర ప్రయాణాలకు, ముఖ్యంగా కఠిన భౌగోళిక పరిస్థితులలో ఎక్కువ దూరం బరువులు తరలించడానికి గాడిదల సేవలను మనుషులు ఉపయోగించుకుని ఉండొచ్చు.. గాడిదలను పెంపుడు జంతువులుగా మార్చుకున్న తరువాత వాటి జనాభా ఒక్కసారిగా తగ్గినట్లు ఈ అధ్యయనం బృందం గమనించింది. అయితే, అక్కడికి తక్కువ కాలంలోనే మళ్లీ వాటి జనాభా పుంజుకొన్నట్లు గుర్తించారు.

‘ఒక్క గాడిదల్లోనే కాదు పెంపుడు జంతువులుగా మారిన తరువాత అనేక జాతుల జనాభాలో ఇలాంటి మార్పులు కలిగాయి’ అని అధ్యయనకర్తలలో ఒకరైన జన్యుశాస్త్రవేత్త ఎవెలిన్ టాడ్ వెల్లడించారు.. ఈ బృందం విశ్లేషణ ప్రకారం చూస్తే గాడిదలు తూర్పు ఆఫ్రికా నుంచి ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాపించాయి. తూర్పు ఆఫ్రికా నుంచి వాయువ్య దిశలో ఉన్న సూడాన్‌కు అక్కడి నుంచి ఈజిప్ట్‌కు వ్యాపించాయని తేల్చారు. ఈజిప్ట్‌ లో 6,500 ఏళ్ల కిందట గాడిదలు ఉన్నట్లు తవ్వకాలలో బయల్పడిన కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. అక్కడి నుంచి 2,500 ఏళ్ల కాలంలో గాడిదలు యూరప్ అంతటా, ఆసియా
ఖండం మొత్తం విస్తరించాయి.

భూ మార్గంలో దూరప్రాంతాలకు సరుకు రవాణా చేయడంలో మానవ జాతి సామర్థ్యాలను గాడిదలను మార్చగలిగాయని ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్సిటీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్త లెర్కీ రెచ్ వెల్లడించారు. క్రీస్తు పూర్వం మూడో సహస్రాబ్దిలో కంచు వినియోగం పెరిగిన కాలంలో గాడిదలు కీలక పాత్రపోషించినట్లు ఆమె విశ్లేషించారు. బరువైన లోహమైన కంచును దూర ప్రాంతాలకు తరలించడంలో గాడిదలను ఉపయోగించేవారని ఆమె అన్నారు. మెసపుటోమియా వంటి ప్రాంతాలకు కంచును రవాణా చేయడానికి గాడిదలనే ఉపయోగించి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, అదే యుగంలో గాడిదలు, గుర్రం జాతికి చెందిన ఇతర జంతువులు యుద్ధ రీతులనూ మార్చేశాయి.

ఆ కాలంలో చక్రాలతో నడిచే బండ్లు, రథాల వంటి వాటికి గాడిదలు, గుర్రాలను కట్టి లాగించడం ఆ కాలంలోనే మొదలైంది. అలాగే సైన్యానికి సంబంధించిన సామగ్రి మోయడానికి ఈ జంతువులనే వాడేవారని రెచ్ వెల్లడించారు..గాడిదలను ఆ కాలంలో చాలా విలువైనవిగా భావించేవారు.. మనుషులు ఆచార వ్యవహారాలలోనూ వాటి ప్రస్తావన ఉండేది.. ఈజిప్ట్, మెసపుటోమియాలలో చనిపోయిన మనుషులతో పాటు చనిపోయిన గాడిదలనూ ఖననం చేసేవారని.. కొందరు రాజులు, పాలకులతోనూ సమాధుల్లో గాడిదలున్నాయి.

రెండో సహస్రాబ్దిలో గాడిదలను బలిచ్చే ఆచారాలు ఉండేవి.. ముఖ్యంగా భవనాలు నిర్మించేటప్పుడు పునాదులలో గాడిదలను బలి ఇవ్వడం.. ఒప్పందాలు, సంధులు కుదుర్చుకునేటప్పుడు కూడా గాడిదలను బలి ఇచ్చిన ఉదంతాలున్నాయి.. ఓర్లాండో టీమ్ అధ్యయనం చేసిన పురాతన గాడిదలలో కాంస్యయుగానికి చెందినవి మూడు ఉన్నాయి. వీటి నమూనాలు తుర్కియే నుంచి తీసుకున్నారు. ‘ఇవి 4,500 ఏళ్ల కిందటివని రేడియోకార్బన్ పరీక్షలలో నిర్ధారణ అయింది. వీటికి ఆసియాలోని ఆధునిక గాడిదల ఉప జనాభాకు జన్యుపరమైన పోలికలున్నాయి…

గుర్రాల కంటే ముందు నుంచే గాడిదలు మనుషుల వద్ద జీవించాయని వీరి పరిశోధనలలో తేలింది. 4,200 ఏళ్ల కిందట మనిషి తన అవసరాల కోసం గుర్రాలను పెంచడం ప్రారంభించగా… అంతకంటే ముందు నుంచే గాడిదలను పెంచినట్లు ఈ అధ్యయనం సూచిస్తోంది. మానవ చరిత్రలో గుర్రాల ప్రభావం కంటే ముందే గాడిదల ప్రభావం ఉందని వీరు చెప్తున్నారు. ప్రస్తుత ప్రపంచంలో అనేక ప్రాంతాలలో గాడిదలకు ప్రాధాన్యం లేనప్పటికీ కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇప్పటికీ అవి కీలకమే.

‘ఇప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో లక్షలాది మంది ప్రజల రోజువారీ జీవితంలో గాడిదలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి… ఏటా గాడిదల జనాభా 1 శాతం పెరుగుతోంది.. అభివృద్ధి చెందిన దేశాలలో గాడిదల ఉపయోగం పెద్దగా లేనప్పటికీ ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్ప దేశాలలోని కొన్ని
ప్రాంతాలలో ఇప్పటికీ మానవ, సరకు రవాణాలలో గాడిదలను ఉపయోగిస్తున్నారు.

Must Read

spot_img