Homeఅంతర్జాతీయండోనాల్డ్ ట్రంప్ మరోసారి వస్తారా ?

డోనాల్డ్ ట్రంప్ మరోసారి వస్తారా ?

ఈ స్టోరీలోనూ డోనాల్డ్ ట్రంప్ మరోసారి వస్తారు..అయితే అది మరో అంశం మీద. ప్రస్తుతం అమెరికాలో సీక్రెట్ డాక్యుమెంట్ సంచలనాలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పాత కార్యాలయంలో కొన్ని సీక్రెట్ పేపర్స్ బయటపడటం సంచలనం స్రుష్టించింది. ఆ సమయంలో బరాక్ ఒబామా అధికారంలో ఉన్నారు. జో బైడెన్ అప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆ కార్యాలయంలోనే ఇప్పుడు సీక్రెట్ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. అచ్చం ఇలాగే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది జనవరిలో మార్ ఎ లాగ్ ఎస్టేట్ లో రహస్య పత్రాలు దాచిన కేసులో ఇరుక్కున్నారు.

అత్యంత విలువైన సీక్రెట్ డాక్యుమెంట్లను ట్రేస్ చేసిన ఎఫ్ బీ ఐ అధికారులు చేసిన సెర్చ్ ఆపరేషన్ తో అడ్డంగా బుక్కయ్యారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశానికి చెందిన రహస్య పత్రాలు తరలించారని ఎఫ్బీఐకి సమాచారం అందింది. ఈ మేరకు మార్ ఎ లాగ్ ఎస్టేట్ లోని ఓ గదిలోని పెట్టెలో 67 విశ్వసనీయ.. 92 రహస్య.. 25 అత్యంత రహస్య ప్రతాలు లభించాయి. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ట్రంప్ మార్ ఎ లాగో ఎస్టేట్ వ్యవహారంపై అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

అయితే జో బైడెన్ సైతం అచ్చం అలాంటి పలు రహస్య పత్రాలు దాచిన కేసులో తాజాగా ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ట్రంప్ మద్దతు దారులు బైడెన్ పై తీవ్ర విమర్శలతో రిటర్న్ గిఫ్టు అందిస్తున్నారు. ఒక విధంగా పెద్దాయన తీవ్ర ఇబ్బందులలో ఇరుక్కున్నారని అంటున్నారు విశ్లేషకులు. అమెరికా ప్రెసిడెంట్ గా ఒబామా ఉన్న సమయంలో ఆయన ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. ఆ సమయంలో పెన్సిల్వేనియా విశ్వ విద్యాలయంతో సంబంధాల కోసం ‘ది పెన్న్ బైడెన్ సెంటర్ ఫర్ డిప్లొమసి అండ్ గ్లోబల్ ఎంగేజ్ మెంట్’ కార్యాలయాన్ని వాడుకున్నారు.

అసలు ఈ పత్రాలు అక్కడికి ఎలా చేరాయి?

2017 నుంచి 2019 మధ్య జో బైడెన్ ఆ విశ్వ విద్యాలయానికి గౌరవ ప్రొఫెసర్ గా పని చేశారు. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడి అటార్ని జనరల్ గార్లాండ్ నవంబర్లో కొన్ని రహస్య ప్రతాలను పెన్న్ బైడెన్ సెంటర్లో కనుగొన్నారు. డజను కంటే తక్కువ పత్రాలు ఆ గదిలో గుర్తించినట్లు సమాచారం. అయితే అవి తక్కువ సంఖ్యలో దొరికినా వందల సంఖ్యలో దొరికినా నేరం నేరమే అంటున్నారు నిపుణులు. కనీసం రెండు క్లాసిఫైడ్ పేపర్లు దొరికినా కేసు తీవ్రత అంతేగా ఉండనుంది.

వాటిని ఎందుకు అక్కడ ఉంచుకున్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా అధికారంలో ఉన్న వారు తాము దిగిపోయే సమయంలో రహస్య పత్రాలకు తిరిగి వైట్ హౌస్ అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ బైడెన్ వాటిని తిరిగివ్వలేదు. ఆయన వీటిని ఎందుకు తిరిగివ్వ లేదనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై బైడెన్ స్పెషల్ కౌన్సిల్ గా వ్యవహరిస్తున్న రిచర్డ్ సౌబర్ స్పందించారు. రహస్య పత్రాలు దొరికిన వ్యవహారంపై ఆర్కైవ్స్ విభాగం.. డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ కు శ్వేతసౌధం పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు.

అధ్యక్షుడి అటర్నీ జనరల్ ది పెన్న్ బెడైన్ సెంటర్లోని ఒక అరలో పత్రాలు సర్దుతున్న సమయంలో రహస్య పత్రాలు దొరకగా వాటిని మర్నాడే వాటిని ఆర్కైవ్స్ విభాగానికి అప్పగించారని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని షికాగో అటార్నీ జనరల్ జాన్ లాష్ జూనియర్ దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ట్రంప్ హయంలో నియమించబడ్డారు. అప్పట్లోనే ఆయన నియామకాన్ని సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2021లో ఇద్దరు డెమొక్రాట్లు లాష్ ను ఆ పదవిలో కొనసాగించాలని కోరారు. సున్నితమైన దర్యాప్తుకు ఆయన సేవలు అవసరమని తెలిపారు. ప్రస్తుతం దొరికిన పత్రాలు సెన్సిటివ్ కంపార్ట్ మెంట్ ఇన్ఫర్మేషన్ కేటగిరికి చెందినవిగా గుర్తించారు.

మరోవైపు బైడెన్ మద్దతుదారులు మాత్రం ఈ వ్యవహారాన్ని ట్రంప్ మార్ ఎ లాగో ఎస్టేట్ వ్యవహరంతో పోల్చకూడదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హౌస్ ఓవర్ సైట్ చైర్మన్ జేమ్స్ కోమర్ మాట్లాడుతూ ట్రంప్ రహస్య పత్రాలు తీసుకెళ్లినప్పుడు బైడెన్ చాలా విమర్శలు చేశారని కానీ ఇప్పుడు మాత్రం అదే పని చేసి అడ్డంగా దొరికిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అయితే ఆ పత్రాలలో ఏముందన్న విషయానికొస్తే ఉక్రెయిన్ ఇరాన్ యూకేకు సంబంధించిన సున్నితమైన అంశాలకు చెందిన ఫైల్స్ ఉన్నట్టు సమాచారం.

ఇవన్నీ దేశంలోని కీలక వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన ఇంటెలిజెన్స్ సంస్థలు అందించే సంక్షిప్త సారాంశాలుగా చెబుతున్నారు.ఇవి 2013 నుంచి 2016 వరకు సేకరించిన ఇంటెలిజెన్స్ కు సంబంధించినవిగా ఉన్నాయి. ఆ కార్యాలయంలో మరో మూడు నాలుగు బాక్సుల రహస్య పత్రాలు కూడా ఉన్నట్టు సీఎన్ ఎన్ కథనం ప్రసారం చేసింది.ఇవన్నీ ‘ది ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్’ పరిధిలోనికి వచ్చేవి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈకార్యాలయంలో బైడెన్ కుటుంబ పత్రాలు కూడా దొరికాయి.

వీటిల్లో బ్యూ బైడెన్ కు చెందిన అంత్యంక్రియల్ ఏర్పాట్ల పత్రాలు, సంతాప సందేశాల లేఖలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికే ఈ రహస్య పత్రాలకు సంబంధించిన ప్రాథమిక నివేదిక అటార్నీ జనరల్ గార్లాండ్ చేతికి వెళ్లింది. దీనిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ విషయాలేవీ తనకు తెలియవని జో బైడెన్ తెలిపారు. నా కార్యాలయంలో ఏవో ప్రభుత్వ పత్రాలు ఉన్నాయని తెలిసిఆశ్చర్యపోయా..అవి ఆ కార్యాలయానికి ఎలా చేరాయో నాకు తెలియదు. రహస్య పత్రాల విషయాన్ని నేను ఎంత సీరియస్ గా తీసుకుంటానో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలను కాపాడతామని బైబిల్ పై ప్రమాణం చేస్తారు.

అలాంటిది ఇంత తేలికగా రహస్యాలను బయటపెట్టడం సంచలనం స్రుష్టించింది. ట్రంప్ బైడెన్ ఇద్దరూ రహస్య పత్రాలను ప్రైవేటు కార్యాలయాలకు తీసుకెళ్లారు. బైడెన్ వద్ద పది పత్రాలు బయటపడ్డాయిని చెబుతుండగా, డోనాల్డ్ ట్రంప్ నివాసంలో 325 పత్రాలు లభించాయి. ఇద్దరి వద్ద దొరికిన వాటిల్లో టాప్ సీక్రెట్ ఫైల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ దర్యాప్తు బ్రుందాలకు సహకరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. బైడెన్ స్వచ్ఛందంగా దర్యాప్తుకు హాజరు కాగా ట్రంప్ మాత్రం అప్పట్లో దర్యాప్తు బ్రుందాలకు సహకరించలేదు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా రిపబ్లికన్​ పార్టీ బైడెన్​పై విమర్శలు గుప్పిస్తున్నది.

ఆ డాక్యుమెంట్ల వివరాలు వెల్లడించాలని సెనేటర్​ మార్ష్​ బ్లాక్​బర్న్​ డిమాండ్​ చేశారు. బైడెన్​ వైస్​ ప్రెసిడెంట్​గా ఉన్న టైంలో ఆయన ఇంటిపై ఎఫ్​బీఐ రెయిడ్​ చేసిందని, అప్పుడే వాటిని ప్రైవేట్​ ఆఫీస్​కు తీసుకెళ్లారని రిపబ్లికన్​ కాంగ్రెస్​ లీడర్​ ట్రాయ్​ నెహ్ల్స్ ఆరోపించారు. లేటు వయసులో అమెరికా అధ్యక్ష పగ్గాలు అందుకున్న జో బైడెన్ విమర్శలు వస్తున్నా, వృద్ధాప్య సమస్యలు వేధిస్తున్నా బండి లాక్కొస్తున్నారు.కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేసినప్పటికీ. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, కంపెనీల లే ఆఫ్‌లు ఆయనను భయపెడుతున్నాయి.దీనికి తోడు ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల ఆధిపత్యం మళ్లీ పెరగడం బైడెన్‌కు కొంత ప్రతిబంధకంగా మారాయి. అయితే సొంత పార్టీ నుంచి ఇంకా ఎలాంటి అసమ్మతి లేకపోవడంతో బైడెన్‌ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా వున్న సమయం నాటి రహస్య పత్రాలు తాజాగా బయటపడటం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Must Read

spot_img