- ఏపీలో యాత్రల రాజకీయం ఊపందుకుంటోంది.
- కానీ జనసేన వారాహి మాత్రం ఎక్కడా కానరావడం లేదు..
- దీంతో వారాహికి బ్రేక్ పడిందా..? లేక కావాలనే పార్టీ పెద్దలే బ్రేక్ వేశారా..?
ఏపీ రాజకీయం యాత్రల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే నారా లోకేష్ పాదయాత్ర పేరుతో నడుస్తున్నారు. అప్పుడప్పుడు జగన్ పరదాల అండతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక మిగిలింది జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయన వారాహి యాత్ర ఎప్పుడు మొదలవుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. కానీ పవన్ కళ్యాణ్ యాత్ర .. ఎప్పుడు మొదలు పెట్టామన్నది కాదు.. ఎంత ప్రభావం చూపామన్నదే ముఖ్యం అన్నట్టు ఉండనుందని టాక్. ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఏపీ రాజకీయాల్లో పాదయాత్రలు, వాహనయాత్రలు కొత్తకాదు. కానీ పరదాలు అడ్డుగా కట్టి యాత్రలు చేయడమే కొత్త.
సీఎం జగన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా.. అక్కడ పరదాలు దర్శనమిస్తాయి. ఇన్నాళ్లు వ్యాపారం లేదని లబోదిబోమంటున్న పరదాల వ్యాపారులకు జగన్ రూపంలో గిరాకీ కలిసొచ్చిందట. జగన్ పుణ్యాన బాగానే వ్యాపారం జరుగుతోందట. కానీ జగన్ అప్పుడప్పుడు మాత్రమే పర్యటనలకు వెళ్తున్నారు. అలా కాకుండా లోకేష్ లా రోజూ తిరిగితే తమ వ్యాపారానికి ఢోకా ఉండదని పరదాల వ్యాపారాలు ఆశిస్తున్నారట. మరోవైపు నారా లోకేష్ పాదయాత్రను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ యాత్ర మొదలుపెడితే వైసీపీకి నిద్రపడుతుందో లేదో తెలియదు.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున వారాహి యాత్రను ఆలస్యంగానే ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతలోపు పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేశారు. ఇప్పటి నుంచి రోజూ తిరగడం కన్నా.. ఎన్నికలకు 7,8 నెలల ముందు నుంచి కార్యక్షేత్రంలోకి దూకాలని భావిస్తున్నారు. అదేదో సినిమా డైలాగ్ ఉన్నట్టు.. ఎప్పుడొచ్చామని కాదు, ప్రభావం చూపామా .. లేదా అన్నదే ముఖ్యం అన్నట్టు పవన్ కళ్యాణ్ వారాహియాత్ర ఉండనుందట.

దీంతో నారా లోకేష్ పాదయాత్ర ఒకవైపు.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మరోవైపు మొదలైతే.. ఇక ఏపీ ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పటికే అధికంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యాత్రకు భారీ స్థాయిలో మద్దతు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ప్రజలను ఉర్రూతలూగించడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎన్నికల ముందు వరకు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన భావిస్తోంది. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నుంచి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి విస్త్రతంగా వెళ్తారని తెలుస్తోంది. తద్వార ప్రజల్లో బలమైన ముద్ర వేయాలని జనసేన ఆలోచిస్తోంది. వారాహి.. జనసేన అధినేత పవన్ ప్రారంభించేందుకు రెడీ చేసిన వాహనం. దీనిపై అనేక చర్చలు.. విమర్శలు.. వివాదాలు కూడా వచ్చాయి. ఏదో ఒక విధంగా అయితే.. వాహనం రెడీ అయింది. కొండగట్టు, విజయవాడ, అన్నవరం.. క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకేముంది.. వారాహి యాత్ర కూడా ప్రారంభమవుతుందని అందరూ అనుకున్నారు.
ప్రజల్లో మార్పు కోసం.. ఈ యాత్రను చేపడుతున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇక, వారాహి రాకతో రాజకీయాల్లోనూ కీలక మార్పులు చోటు చేసుకుంటాయని కూడా అనుకున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ యాత్ర విషయంలో అటు పవన్ నుంచి కానీ.. ఇటు నేతల నుంచి కానీ ఎలాంటి ప్రకటనా రాలేదు. అంతేకాదు.. అసలు వారాహిని ఎక్కడ ఉంచారో కూడా తెలియడంలేదు. అయితే.. వారాహి రాకపోవడానికి.. పవన్ ప్రచారం చేయక పోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయనే గుసగుస రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం.
నిజం చెప్పాలంటే.. వారాహికి పూజలు చేయించి న అనంతరమే దీనిని లైన్‌లో పెట్టాల్సి ఉంది. అప్పటికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ లేదు. మరి అప్పటికి కూడా ప్రారంభంచలేదు. సో.. దీనివెనుక ఇంకో కారణం ఉందని అంటున్నారు. టీడీపీ యువనాయకడు నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. దీనికి వారాహి యాత్ర పోటీ అవుతుందేమోననే సందేహాలు ఉన్నాయి. అందుకే .. యాత్రను ప్రారంభించలేదనే మరోవాదన కూడా ఉంది.
అయినా.. కూడా వారాహి రూట్ మ్యాప్ వేరే గా ఉన్నప్పుడు.. యువగళానికి వచ్చిన ఇబ్బంది లేదని కొందరు అంటున్నారు. ఈ క్రమంలో ఇంకో కీలక కారణం ఉండి ఉంటుందని చెబుతున్నారు. బీజేపీ పెద్దలు జనసేన అధినేత పవన్‌ను నిలువరించారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా రాజకీయ వర్గాల మధ్య చర్చకువస్తోంది. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు ఇప్పుడే వద్దని చెప్పారని.. తాము ముహూర్తం నిర్ణయించి సమాచారం అందిస్తామని అప్పుడు యాత్ర ప్రారంభించాలని చెప్పారని.. అందుకే వారాహి యాత్రను పోస్ట్ పోన్ చేసుకున్నారని అంటున్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాది ముందు నుంచే ఆయన ఉత్తరాంధ్ర నుంచి యాత్ర ప్రారంభించారు. ఆగుతూ సాగినా యాత్ర అయితే కొనసాగించారు. ఈ సారి మాత్రం యాత్ర ప్రారంభించడానికే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వారాహి పేరుతో ఓ భారీ వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ వాహనం నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. అడ్డుకుంటామని అధికార పార్టీల నేతలు ప్రకటించారు. కానీ అడ్డుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అసలు వారాహీ రోడ్డు మీదకు రావడం లేదు. ఇప్పుడు వైసీపీ నేతలే వారాహి రావడం లేదేమిటా అని వాకబు చేస్తున్నారు.
నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నందున వారాహి రోడ్డు మీదకు రావడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు.. వారాహి యాత్రకు సంబంధం ఏముటుంది ?. జనసేనాని కూడా ప్రజల్లోకి వస్తే వైసీపీ పాలనా తీరు వ్యవహారం అంతా ప్రజల్లోకి చర్చకు వస్తుంది. ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకత అంతా బహిరంగమవుతుంది. కానీ పవన్ బయటకు రాకపోవడాన్ని కూడా వైసీపీ.. టీడీపీకి ముడి పెడుతోంది. పవన్ కల్యాణ్ తన సినీ షెడ్యూల్స్ ను బిజీగా ఉంచుకున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ.. ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగానే సమయం ఉన్నందున చివరి ఆరు నెలలు జనంలో ఉంటే చాలని ఆయన అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు వీకెండ్‌లో కూడా పార్టీకార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.
నాదెండ్ల మనోహర్ ఒక్కరే తిరుగుతున్నారు. కానీ ఆయన వల్ల పార్టీకి ఏమైనా మైలేజ్ వస్తుందా అంటే చెప్పడం కష్టమే. దసరా పండగ తర్వాత మంచి ముహుర్తం చూసుకొని ప్రజల ముందుకు వస్తారని భావించిన జన సైనికులు… శివరాత్రికి కూడా పవన్ బయటికి రాకపోవడంతో డీలా పడ్డారు. ఏదో పిడిఎఫ్ లేదా ఎవరో రాసిన దానికి ట్వీట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నారు. బహుశా వచ్చే వారాంతంలో పవన్ ఏదో ఒక సమస్య అంటూ మంగళగిరి పార్టీ ఆఫీసులో కనపడవచ్చు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. చేతిలో అర డజను సినిమాలు పెట్టుకుని ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ వస్తారు అనుకోవడమే పొరపాటే అంటున్నారు జనసైనికులు. మార్చి లేదా ఏప్రిల్లో వారాహిని పవన్ కల్యాణ్ బయటకు తీస్తారని తెలుస్తోంది.
మార్చి 14 జనసేన ఆవిర్భావ దినం. ఆరోజు నాటికి పార్టీ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున వారాహి యాత్ర ప్రారంభించే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెప్తున్న మాట. అయితే పొత్తు వేళ ఏఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందనేది ఇప్పట్లో తేలే అంశం కాదు. ఆ క్లారిటీ వస్తే ఆ నియోజకవర్గాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. అందుకే యాత్ర ఆలస్యమవుతోందని తెలుస్తోంది.
మరి వారాహి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో వేచి చూడాల్సిందే..