Homeఅంతర్జాతీయంఏలియన్స్ గురించి అమెరికాకు తెలుసా..?

ఏలియన్స్ గురించి అమెరికాకు తెలుసా..?

మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు, అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే శక్తి మానవునికి ఉంది. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ దూసుకుపోతున్న ఈ సమయంలో ఒక్క విషయంలో మాత్రం పురోగతి సాధించలేకపోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి అందరి మనసులో ఒక ప్రశ్న…ప్రశ్నగానే మిగులుతోంది. అదే ఎలియన్స్.

అసలు గ్రహాంతర వాసులు అంటే ఏమిటి..?

గ్రహాంతర వాసుల గురించి మీడియాలో వస్తోన్న కథనాలను నమ్మాలా ? వద్దా ? అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా ? లేరా ? ఈ మిస్టరీ ఏమిటి అనే అంశంపై కన్ఫ్యూజన్ నెలకొంది.  అయితే కొందరు శాస్త్రవేత్తలు చెప్పే విషయాలను బట్టి చూస్తే నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారనిపిస్తుంది. గ్రహాంతరవాసుల విషయంలో అమోరికా కూడా ప్రపంచానికి తెలియకుండా ఎదో ఒక విషయం ఎన్నో ఏళ్లుగా సిక్రెట్ గా ఉంచుతుందని అందరి నమ్మకం అసలు ఆ విషయం ఏమిటి..? ఎందుకు అంత సిక్రెట్ గా వ్యవహరిస్తుంది. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాశులు ఉన్నట్టు అయితే సాక్ష్యాధారాలతో సహా చూపిస్తామని నాసా ఇది వరకే ప్రకటించింది. నాసా తాను చేసిన పరిశోధనలను  అత్యంత గోప్యంగా ఉంచింది. కాగా గ్రహాంతర వాసుల  అన్వేషణ కు సంబంధించిన విషయాలు అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి. టెలిస్కోప్‌, ఉపగ్రహాల సాయంతో భూమిలాంటి కొన్ని గ్రహాలను గుర్తించినా, మనుషుల్లాంటి గ్రహాంతర జీవులను మాత్రం గుర్తించలేకపోయారు.

ఇంతకూ గ్రహాంతర వాసులు ఉన్నట్టా ? లేనట్టా ?

ఎన్నోఏళ్లుగా గ్రహాంతరవాసుల గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. మరో పక్క భూమిని పోలిన గ్రహాలు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు మానవుల్లాంటి జీవులు అక్కడ ఉండొచ్చుకదా అన్న సందేహాలు కలగడం ఎవరికైనా సహజం. ఈ ఆలోచన మానవునికి వచ్చిన వెంటనే దానిపై అన్వేషణ మొదలుపెట్టాడు. ఒక వేళా మరో ప్రపంచం ఉంటే వారిని మనం ఎలా చేరుకోవాలనే విషయంపై ఆలోచించి రేడియో సిగ్నల్స్ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. భూమిలాంటి గ్రహాలు ఈ విశ్వంలో ఉన్నప్పటికీ, మనుషులను పోలిన గ్రహాంతర జీవులను మాత్రం గుర్తించలేకపోయారు. ఈ అనంత విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని అప్పట్లో ఎన్నో కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే మనం నివసిస్తున్న ఈ గ్రహంపై తప్ప ఇంత తెలివైన జీవులు ఉండే అవకాశం లేదంటూ నాసా తెలియజేసింది. ఆ తర్వాత ఏలియన్స్ గురించి ఇజ్రాయెల్‌ అంతరిక్ష భద్రత విభాగం మాజీ జనరల్ హైమ్ ఎషెడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానవులు, అంతరిక్షజీవుల మధ్య ఒప్పంద వేదికగా గాలాక్టిక్ ఫెడరేషన్ ఏర్పాటయ్యిందని, అంగారక గ్రహంలో ఓ అండర్ గ్రౌండ్ స్థావరం కూడా ఉందని  ఎషెడ్ అంటున్నారు. అందులో అమెరికన్ వ్యోమగాములు, ఏలియన్ ప్రతినిధులు ఉన్నారని ఎషెడ్ వెల్లడించారు. పైగా ఈ సంగతి అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా తెలుసన్నారు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది.

ఒక దశలో ట్రంప్  ఈ వివరాలను బహిర్గతం చేయడానికి ఉత్సుకత చూపగా గాలాక్టిక్ ఫెడరేషన్ ఆయనను వారించిందట.  ఎషెడ్ మాటలు వింటుంటే కాసేపు ఇది కల్పిత కథ అనిపిస్తుంది. మరో పక్క నిజమేమో అన్న భావన కలుగుతుంది. ఈయన కంటే ముందు 2018 లో  నాసా మాజీ శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ కెవిన్‌ నూథ్  కూడా దాదాపుగా ఇవే మాటలు చెప్పారు. గ్రహాంతర వాసుల మనుగడ గురించి తెలిసి కూడా నాసా  గోప్యత  ప్రదర్శిస్తోందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. 2002 నాసా కాంటాక్ట్‌ కాన్ఫరెన్స్‌లో గ్రహంతరవాసుల అంశంపైనే శాస్త్రవేత్తలు  చర్చించారు. ఏలియన్ల మనుగడ నిజమన్న భావనను కొందరు వ్యక్తపరిచారు. మరికొందరు అలాంటివేమీ లేవు అని కొట్టేపారేశారు.

ఆకాశంలో కనిపించి.. అదృశ్యమయ్యే యూఎఫ్ఓల మాటేంటి?

పలుచోట్ల ఆకాశంలో వింతగా ఎగురుతున్నవేంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. అవి గ్రహాంతర వాసుల నౌకలా? కాదా? అక్కడక్కడ భూ మైదానాల్లో ఏర్పడే మిస్టరీ ముద్రలేంటి? ఈ రహస్యాలకు నాసా దగ్గర సమాధానాలు ఉన్నాయి. కానీ  ఎందుకు దాస్తున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు అని శాస్ర్తవేత్త నూథ్ అప్పట్లో ఆరోపించారు. ఈ శాస్త్రవేత్తల ప్రశ్నలకు .. ఆరోపణలకు  నాసా స్పందించినట్టు లేదు. భూమి ఆవల మరో ప్రపంచముందని, అక్కడ మనలాంటి మనుషులు జీవిస్తుంటారనే ఆలోచన ప్రాచీన కాలం నుంచే మొదలవగా.. 18వ శతాబ్దం నాటికి తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, వేదాంతవేత్తలు దీనిపై పెద్దఎత్తున చర్చలు జరిపి, గ్రహాంతర నాగరికతలు ఉన్నాయని అంగీకరించారు. ఇక 19వ శతాబ్దంలో ప్రజలు ఫ్లైయింగ్ షిప్స్ చూడటం మొదలుపెట్టారు. ఇలాంటి వస్తువులు క్రమం తప్పకుండా ఆకాశంలో కనిపించడంతో ప్రజలు వాటి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. వాటిని చూసిన కొంతమంది అవి గ్రహాంతరవాసులవే అని ప్రచారం చేశారు. ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి ఎవరి దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఆకాశంలో కనిపించే అవి ఎప్పుడూ భూమి వైపు రాలేదు. కానీ వాటితో ఏమైనా జరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో ఫ్లయింగ్ సాసర్ల విషయం తేల్చేందుకు ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వం అనేక ప్రాజెక్ట్స్ చేపట్టింది. యూఎఫ్ఓలు నిజంగానే ఉన్నాయా? ఉంటే వాటి వెనుక ఎవరున్నారు? వంటి సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆకాశంలో ఫ్లయింగ్ సాసర్ల వంటి గుర్తుతెలియని వస్తువులు (యూఎఫ్ఓ) తిరుగుతుండడాన్ని చూసినట్టు అనేకమంది చెబుతుంటారు. అయితే యూఎఫ్ఓలకు సంబంధించి ఇప్పటిదాకా నిర్దిష్ట ఆధారాలు లేవు. కొంతమంది వాటిని ఫొటోలు తీశామని చెబుతుండగా, ఆ ఫొటోల స్పష్టత అంతంతమాత్రమే. దాంతో ఈ ఫ్లయింగ్ సాసర్ల అంశం మానవాళికి ఓ మిస్టరీలా మారింది. ఈ నేపథ్యంలో, యూఎఫ్ఓల గుట్టు విప్పేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసింది. వారు ఇప్పటి వరకు చేసిన పరిశోధనల గురించి నాసా ప్రకటించకపోవడంతో ఎన్నో అనుమానులు ఉన్నాయి. ఈ విషయంలో అమోరికా కూడా పలు విషయాలను గుట్టుగా ఉంచినట్లు ప్రచారం సాగుతుంది.

ఏరియా 51 అంటే ఏమిటీ ? ఆ రహస్య ప్రాంతంలో ఎందుకు తిరగకూడదు..

అమెరికా రహస్య వైమానిక స్థావరం పేరే ఏరియా-51. ఇక్కడ రహస్య ప్రయోగాలు జరుగుతుంటాయని ప్రపంచ ప్రజలు విశ్వసిస్తుంటారు. గతంలో దొరికిన గ్రహాంతరవాసులతోపాటు గుర్తుతెలియని ఫ్లయింగ్ సాసర్లు (యూఎఫ్‌వోలు) ఇక్కడ ఉంటాయని నమ్ముతుంటారు. ఈ ప్రాంతంలో ఎటుచూసినా ఎడారిని తలపించే భూములు. దుమ్ముతో నిండిన రోడ్లు. కనుచూపు మేరల్లో కనపడని ఇల్లు, మానవ సంచారం లేని ఓ నిషిద్ద ప్రాంతం అది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా రక్షణ దళం ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ఆ ఆసక్తి కాస్తా ఉద్యమరూపం దాల్చింది. చలో ఏరియా 51 అంటూ నెటిజన్లు సిద్దం అయ్యారు. దీంతో వైమానిక దళం తీవ్రంగా స్పందించింది. అక్కడ అడుగు పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. నెవడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ పేరుతో చెలామణి అవుతున్న ఈ ప్రాంతంలోకి సాధారణ ప్రజలకు అనుమతి లేదు. ఆ ప్రాంతం నిత్యం సైన్యం నిఘాలో ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేకుండా అక్కడ ఎలాంటి హెలికాప్టర్లు, విమానాలు, డ్రోన్లు ఎగరలేవు. ఒకవేళ అక్కడ పొరపాటున అడుగుపెడితే సైన్యం కఠిన చర్యలు తీసుకుంటుంది.

1950లో నెవడా మిలటరీ బేస్‌లో గుర్తుతెలియని యూఎఫ్‌వో గాల్లో ఎగురుతూ కనిపించాయి. అప్పటి నుంచి అమెరికా ప్రజలు ఆ ప్రాంతంలో ఎలియన్స్ దిగి ఉంటారని భావిస్తున్నారు. దీంతో పాటు అమోరికా అక్కడ సిక్రెట్ గా ఎలియన్స్ పై ప్రయోగాలు చేస్తున్నారని, ఆ విషయాల గురించి గతంలో అక్కడ పనిచేసిన మాజీ ఉద్యోగులు వెల్లడించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు అమోరికాను అక్కడ ఏం జరుగుతుందో బయటకు చెప్పాలని ప్రశ్నించిన…అమోరికా మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు. నిజానికి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియని మిలియన్ డాలర్ల ప్రశ్న.

అమోరికా ఆకాశంలో ఎగిరేవి ఏమిటి..?

ఇటీవల కాలంలో అమెరికా గగనతలంపై వరుసగా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తుండడం కలకలం రేపుతోంది. పది రోజుల క్రితం చైనాకు చెందిన స్పై బెలూన్‌ను అమెరికా పేల్చి వేసింది. ఆ తర్వాత కెనడా గగనతలంలో కనిపించిన మరో వస్తువును కూడా అమెరికా యుద్ధ విమానాలు పేల్చివేశాయి. ఇక నిన్నటికి నిన్న మరో అనుమానాస్పద వస్తువును అమెరికా పేల్చేసింది. ఇక ఇవి గ్రహాంతరవాసుల వాహనాలని అమెరికాలో ప్రచారం మొదలైంది. ఆ వాహనాలు గ్రహాంతరవాసులవే అనేందుకు స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ.. ఈ ఏలియన్స్ థియరీని కొట్టిపారేయలేమని నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ హెడ్ వాన్ హెర్క్ అంటున్నారు.

Must Read

spot_img