కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే, అక్కడి నుంచే తాను బరిలోకి దిగుతానని ఈటెల స్పష్టం చేస్తున్నారు. అయితే దీనివెనుక ..
అమిత్ షా స్కెచ్ ఉందన్న టాక్ తెలంగాణవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
రెండు బలమైన పార్టీలు.. రెండు బలమైన శక్తులు రాజకీయాల్లో కొట్టాడితే ఎలా ఉంటుందంటే .. తెలంగాణలో ఉన్న రాజకీయం మాదిరిగానే ఉంటుందని అంటున్నారు
పరిశీలకులు. జాతీయస్థాయిలో బలంగా ఉన్న బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు యుద్ధ సన్నాహా లు చేస్తోంది. అయితే ఇక్కడ లొల్లి ఏంటంటే.. కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆసక్తిగా మారింది.
తెలంగాణలో ఎవరు కాదన్నా.. ఔనన్నా.. కేసీఆర్ దూకుడు ఓ రేంజ్లో ఉంది. ఆయనను వ్యతిరేకించే వర్గాలు కూడా ఆయన రాజకీయాలను వ్యతిరేకించే పరిస్థితి లేదు. ప్రజల్లో ఉన్న సెంటిమెంటు కావొచ్చు.. ఆయన చెప్పే మాటలు కావొచ్చు.. మొత్తంగా కేసీఆర్ ఒక బలమైన శక్తి. దీనిని గుర్తించిన బీజేపీ ఆయనను ఓడిస్తే తప్ప తమ ప్రభావం పండదని లెక్కలు వేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ఆయనపై పదునైన అస్త్రాన్ని ప్రయోగించేలా వ్యూహాత్మకంగా చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ లో సంస్థాగతంగా
ఉన్న నాయకుల కన్నా.. టీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చి.. కేసీఆర్పై నిప్పులు చెరిగే నాయకుడు పైగా బీసీ వర్గానికి చెందిన నాయకుడు అయితే బలంగా ఢీకొట్టే అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం సహా ప్రధాని మోడీ లెక్కులు వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్కు ప్రియమైన శతృవుగా ఉన్న ఈటల రాజేందర్ను రంగంలోకి దింపుతున్నారని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా. చక్రం తిప్పుతా అని పదే పదే అంటున్న కేసీఆర్ కు మాంచి ఝలక్ ఇవ్వాలని బిజెపి యోచిస్తోంది. అందుకు తగిన ఆయుధాన్ని ఈటల రాజేందర్ రూపంలో తయారు చేస్తోంది. ఇదే విధానాన్ని గతంలో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మీద సుదేంద్రు అధికారి రూపంలో ప్రయోగించి విజయవంతమైంది. ఇప్పుడు అదే ఫార్ములా ను తెలంగాణలో అమలు చేయాలని తహతహలాడుతోంది.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తారో లేదా ఎంపీగా బరిలో ఉంటారో తెలియదు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి అనుకుంటున్నారు. అయితే ఈ సంగతి ఎప్పటినుంచో కేసీఆర్ చెప్తూనే ఉన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే భారత రాష్ట్ర సమితిని ప్రకటించారు. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం కూడా నిర్మిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం లాంచనమేనని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. వారి అభ్యంతరాలకు కూడా గడువు ముగిసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తాపత్రయపడుతున్న బిజెపి కెసిఆర్ ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకుంది. బిజెపి ఆలోచన ప్రకారం కెసిఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తారని అనుకుంటోంది. ఇదే సమయంలో పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశాన్ని కూడా కొట్టి పారేయడం లేదు..
అయితే కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా, దేనికోసం పోటీ చేసినా అతడికి ప్రత్యర్థిగా బరిలోకి రాజేందర్ ను దింపే అవకాశం కనిపిస్తోంది. బిజెపి హై కమాండ్ కూడా ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. కెసిఆర్ పై తాను పోటీ చేస్తానని ఈటల రాజేందర్ పలుమార్లు ప్రకటించారు కూడా. ఒకవేళ గజ్వేల్ నియోజకవర్గం నుంచి కెసిఆర్ పోటీ చేస్తే అతనికి ప్రత్యర్థిగా ఈటల రాజేందర్ నిలపాలని బిజెపి అధినాయకత్వం యోచిస్తోంది. పైగా కేసీఆర్ అనుపానులు రాజేందర్ కు తెలుసు కాబట్టి బీజేపీ కూడా లోలోపల చాలా హ్యాపీ గా ఉంది. కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేస్తారనే సమాచారం ఉండటంతో రాజేందర్ ఆ నియోజకవర్గంపై దృష్టి సారించారు.తరచూ అక్కడ పర్యటనలు సాగిస్తున్నారు. టిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. స్థానిక యువతతో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు. వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఒకవేళ కెసిఆర్ గజ్వేల్ నుంచి కాకుండా ఏదైనా పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. తాను కూడా అక్కడినుంచి పోటీ చేయాలని ఈటెల రాజేందర్ అనుకుంటున్నారు.. కేసీఆర్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఈటల అక్కడ రంగంలోకి దిగేలా బీజేపీ పెద్ద వ్యూహమే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కేసీఆర్ తన నియోజకవర్గాన్ని మార్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇది బీజేపీ నేతలే చేయిస్తున్న ప్రచారంగా టీఆర్ ఎస్ భావిస్తోంది. తద్వారా..
కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ప్రజలను దృష్టి మరిల్చి.. కేసీఆర్పై ఉన్న అంచనాలు అంతో ఇంతో తగ్గించి.. ఎన్నికల సమయానికి తమ పంట పండించుకునేందుకు కమలనాథులు స్కెచ్ సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.
భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయి.. చివరకు అధికార పార్టీని వీడిన నేత ఈటల రాజేందర్. బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆత్మగౌరవ నినాదంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిలిచి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఈటలకు, కేసీఆర్‌కు మధ్య పోటీ అన్నట్లుగా జరిగిన హుజూరాబాద్‌లో ఈటల పైచేయి సాధించారు. దీంతో ఈటల దూకుడు పెంచారు. కేసీఆర్‌ను ఓడించమే తన లక్ష్యం అని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన ఈటల రాజేందర్ అది గజ్వేల్ అయినా మరొకటి అయినా సరే తాను రెడీ అంటున్నారు. ఇప్పుడు అదే క్లారిటీ వచ్చేసినట్లుగా ఉంది. ఈటల రాజేందర్‌నే కేసీఆర్‌పై పోటీకి దింపాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయినట్లు కమలనాథుల నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఈ మేరకు ఈటలకు ఇప్పటికే అధిష్టానం నుంచి సమాచారం కూడా అందినట్లు తెలిసింది. ఇటీవల కొన్ని రోజులపాటు ఈటల ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై పోటీ, ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై ఆయనక చెప్పుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కేసీఆర్ .. టీఆర్‌ఎస్ అధినేతగా బలంగా నిలబడగలరు.. సీఎం కేసీఆర్‌పై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటలను బరిలో నిలపడమే సరైన నిర్ణయమని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే దీదీలాగా కేసీఆర్‌ను కూడా ఓడించవచ్చని లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం.