HomePoliticsజ‌గ‌న్ మ‌న‌సులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా..?

జ‌గ‌న్ మ‌న‌సులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా..?

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బీసీ రాజకీయం ఊపందుకోవడంతో జగన్ .. ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. దీంతో బాబాయికి పదవీ గండం తప్పదని తెలుస్తోంది.

తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి వైవీ సుబ్బారెడ్డిని సాగనంపేందుకు వైకుంఠ ఏకదశి సాక్షిగా ముహుర్తం ఖరారు అయినట్లు వైసీపీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తోంది. కొత్త
సంవత్సరం.. ఆ మరునాడే వైకుంఠ ఏకదశి రావడం.. దీంతో తిరుమల కొండపై భక్తులు పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో కొండపై భక్తుల హడావుడి తగ్గగానే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవికీ వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. సుబ్బారెడ్డి స్థానంలో పల్నాడు జిల్లాకు చెందిన ఓ బీసీ నేతకు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారనీ, మఘమాసంలో ఓ మంచి ముహూర్తంలో ఆయన పేరును ప్రకటిస్తారని వారు చెబుతున్నారు.

వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గానే కాక వైసీపీ ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని, దాంతో వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రలో పాగా వేసి, పార్టీ విజయం కోసం పూర్తి స్థాయిలో కృషి చేయడం కోసమే ఆయనను టీటీడీ పదవి నుంచి జగన్ తప్పించాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. ఇటీవల తెలంగాణలోని ఖమ్మంలో నిర్వహించిన సభ సక్సెస్ అయిందని.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం సైతం సూపర్ సక్సెస్ అయిందని.. ఈ రెండు చోట్ల చంద్రబాబు సారథ్యంలో జరిగిన సభలకు భారీగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని.. అలాంటి వేళ అధికారంలో ఉన్న వైసీపీ మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉందని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్… బాబాయి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించి ఉత్తరాంధ్ర వ్యవహారాలకే పరిమితం చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అదే సమయంలో టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవి బీసీ నాయకుడికి ఇవ్వాలని నిర్ణయించారు. దీని వల్ల బీసీ వర్గాలలో వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని జగన్ భావిస్తున్నారు. మ‌రోవైపు బీసీల‌కు పెద్ద పీట వేసే క్ర‌మంలో జంగా కృష్ణ‌మూర్తికి చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశాల్ని కొట్టి పారేయ‌లేమ‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నారు. మొత్తానికి టీటీడీ కొత్త చైర్మ‌న్ పేరు అంశం పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశమ‌వుతోంది.

వైసీపీకి ఎన్నికల భయం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అధికారం చేపట్టినప్పటి నుండి విచ్చలవిడిగా సొంత సామాజికవర్గానికి పదవుల పందేరం చేపట్టిన నేతలకు ఇప్పుడు .. సామాజిక న్యాయం చేయాలని..కనీసం చేసినట్లుగా అనిపించుకోవాలని తాపత్రయపడుతోంది. తిరుపతి జిల్లాలో ఏ పదవిలో చూసినా రెడ్లే ఉంటారు. టీటీడీ చైర్మన్ కూడా రెడ్డే. ఈవో కూడా రెడ్డే. ఇప్పుడు జగన్ .. ఇంత మంది రెడ్లు అక్కర్లేదు.. ఒకర్ని తీసేసి బిసీకి ఇద్దాం అనుకుంటున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని పక్కన పెట్టేసి.. బీసీ నాయకుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామన్న విషయాన్ని మెల్లగా లీక్ చేస్తున్నారు.

వైవీ సుబ్బారెడ్డికి గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వనందుకు .. ప్రతిఫలంగా అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత పొడిగించారు. కానీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని ఆయనను ఇప్పుడు పక్కన పెట్టనున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఏ ఒక్క కీలక పదవి బీసీ వర్గాలకు ఇవ్వలేదంటున్నారు. ఇలాంటి సమయంలో కనీసం టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తే కాస్త ప్రచారం చేసుకోవచ్చని అనుకుంటున్నారు.

ఒక పదవి ఇచ్చి మొత్తం అధికారం కట్టబెట్టినట్లుగా ప్రచారం చేసుకోవడంలో వారికి వారే సాటి. టీటీడీ బోర్డు పదవి కాలం ముగిసిన వెంటనే.. ఈ సారి మార్పు చేర్పులు చేసి.. కొత్త బోర్డును నియమించనున్నారు. ఇప్పటికే టీటీడీ బోర్డులో ఎంతో మంది నేరస్తులు ఉన్నారు. దీనిపై కోర్టులో పిటిషన్లు కూడా పడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం మారలేదు. ఇటీవలే జగన్ తన బయోపిక్ తీస్తున్న వ్యక్తికి టీటీడీ బోర్డు సభ్యత్వం ఇప్పించారు.

వచ్చేసారి కూడా ఇలాంటి లాబీయిస్టులతోనే బోర్డు నిండిపోతే భక్తుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని పదిలపరుచుకోవడానికి ఎంతటి పనినైనా చేసేందుకు జగన్ సిద్ధపడుతున్నారు. ప్రజలను నయానో..భయానో తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వలంటీర్లతో 50 కుటుంబాలను తన గుప్పెట్లో పెట్టుకుంటుండగా.. ఇప్పుడు వారిపై గృహసారథులను నియమిస్తున్నారు.

గత ఎన్నికల్లో పనికొచ్చారని.. వచ్చే ఎన్నికల్లో పనికొస్తారని సలహాదారులతో పాటు నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలను ఆలస్యం చేసి.. వీరికి మాత్రం ఠంచనుగా ఒకటో తేదీన జీతాలు, ఇతర అలవెన్స్ లు బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. ఎన్నికలకు సమీపిస్తున్న కొలదీ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు కీలక పదవులు అస్మదీయులకు కట్టబెట్టిన జగన్.. ఇప్పుడు ఉన్న ఈ కొద్ది నెలలు బడుగు బలహీనవర్గాలకు ఇచ్చేందుకు నిర్ణయించారు.

మోహన్ బాబు పదవిపై మోజు..!

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. పాపం సినీ నటుడు మోహన్ బాబు ఈ పదవిపై మోజు పెంచుకొని గత ఎన్నికల ముందు నానా యాగి చేశారు. పదవి కోసం ఎంతగానో పరితపించారు. తన మనసులో ఉన్న మాటను కూడా చాలా సందర్భాల్లో బయటపెట్టారు. కానీ వాటికి జగన్ మనసు కరగలేదు. తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికే పదవి కేటాయించారు.

ఆయనకు రెన్యూవల్ చేస్తూ వచ్చారు. అయితే ఈసారి కొద్దినెలల పాటు తప్పించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వరకూ బీసీలకు అప్పగించి.. అధికారంలోకి వస్తే మళ్లీ బాబాయ్ కే పీఠం అందించేందుకు తాజాగా నిర్ణయించారు. బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తికి టీటీడీ అధ్యక్ష పీఠం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జిగా ఉన్నారు.

వచ్చే ఎన్నికలు కీలకంగా మారడంతో వైవీ సేవలను పార్టీకే వినియోగించుకోవాలని జగన్ పిక్స్ అయినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఆగస్టుతో వైవీ పదవీ కాలం ముగుస్తుంది. అదే నెల వైకుంఠద్వార దర్శనం అనంతరం వైవీ పదవి నుంచి నిష్క్రిమిస్తారని టాక్ ఉంది. అటు జంగా కృష్ణమూర్తి వైసీపీలో సీనియర్ నాయకుడు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడుస్తున్నారు. గురజాల రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు.

వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పదవి చేపట్టారు. ఈ నేపథ్యంలో జంగాను టీటీడీ పీఠంపై కూర్చోబెట్టాని జగన్ డిసైడ్ అయ్యారు. దీంతో ఏపీలో రాజ‌కీయాలే కాదు.. నామినేటెడ్ ప‌దువుల్లోనూ జగన్ త‌న‌దైన మార్కు వేసుకుంటున్నారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని జోర్డు పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఉంది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంత వైసీపీ బాధ్యతలు మొత్తం జగన్ ఆయనకే అప్పగించడంతో అటు టీటీడీ చైర్మన్, ఇటు పార్టీ సమన్వయ బాధ్యతలు నిర్వహించడం ఆయ‌న‌కు త‌ల‌నొప్పిగా మారింద‌నేది వాస్త‌వం.

ఈ క్ర‌మంలో టీటీడీ బోర్డు ప‌ద‌వి నుంచి బాబాయిని త‌ప్పించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు ఒక వాదన వినిపిస్తోంది. అయితే.. టీటీడీ బాధ్యతల నుంచి వైదొలుగుతానని వైవీనే స్వయంగా సీఎంకు చెప్పినట్లు ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని వైవీ స్పష్టం చేశారని, ఇందుకు జగన్ కూడా అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఇదే పంథాను అనుసరించారు.

ఎన్నికలకు ముందు పుట్టా సుధాకర్ యాదవ్ కి టీటీడీ బాధ్యతలు కట్టబెట్టారు. బీసీ నినాదాన్ని తెచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈసారి జగన్ అదే విధానాన్ని అనుసరిస్తున్నారు.

ఇది చదవండి : – వైసీపీ ని గెలవనియ్యకుండా చూస్తాను అంటున్న పవన్ కళ్యాణ్..!

Must Read

spot_img