ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. భేటీలు ముగిసినా, పవన్ తిరుగు ప్రయాణమైనా .. ఏమీ తేల్చకపోవడంతో సర్వత్రా చర్చోపర్చలు సాగుతున్నాయి.
బీజేపీ బడా నేతల్ని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పలువురు నేతల్ని కలిశాక ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ ఇంచార్జి మురళీధరన్ కూడా పాల్గొన్నారు. అయితే సమావేశం జరిగిన అనంతరం బయటకు వచ్చిన పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన నుంచి ఏపీని విముక్తి చేయాలనే అంశాలపై చర్చించామని తెలిపారు. వైసీపీని ఓడించడమే బీజేపీ జనసేన లక్ష్యమని పేర్కొన్నారు. అయితే పొత్తుల గురించి ఇంకా మాట్లడలేదని సమయం వచ్చినప్పుడు చెబుతామని తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అయితే రెండు రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన పవన్ కల్యాణ్ బీజేపీ అగ్రనేతల్ని కలిసేందుకు చాలా సమయం వేచి చూడాల్సి వచ్చింది. అసలు ఆయనకు బీజేపీ అగ్రనేతలు అపాయింట్‌మెంట్ ఇస్తారా లేదా అనే సందేహాలు కూడా తలెత్తాయి.
అయితే ఈ భేటీలో జేపీ నడ్డా వారికి ఏం చెప్పారు.. జనసేన అధినేత వారి ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టారనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఆయన పర్యటనతో ఎన్నో రోజులుగా అటు జనసేన.. ఇటు బీజేపీ కార్యకర్తల మదిలో నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు వస్తాయని ఎన్నెన్నో అనుకున్నారు. కార్యకర్తలు, వీరాభిమానులు ఆశించిన రీతిలో పవన్ పర్యటన జరగలేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ టూర్‌తో పొత్తులు, రోడ్డు మ్యాప్, భవిష్యత్ కార్యాచరణ ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని అభిమానులు ఆశించారు.. పవన్ కూడా ఎన్నెన్నో ఊహించుకుని పర్యటనకు వెళ్లారు కానీ అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయట. పవన్ ఢిల్లీ పర్యటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అటు మీడియాలో .. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ టూర్‌పైనే చర్చ నడిచింది.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. సీన్ కట్ చేస్తే అవేమీ జరగలేదు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను కలిసి పొత్తులు, వారాహితో నియోజకవర్గాల పర్యటన, భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని పవన్ భావించారట. అయితే ముందుగా అనుకున్నట్లుగా పవన్ పర్యటన హస్తినలో సాగలేదట.
అమిత్ షాతో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆయన బిజిబిజీ షెడ్యూల్‌తో కలవడానికి కుదరలేదట.
దీంతో మూడ్రోజులు అనుకున్న పవన్ పర్యటన రెండ్రోజులకే ముగించుకుని హస్తిన నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనం కావాల్సి వచ్చిందట. వాస్తవానికి బీజేపీ-జనసేన మధ్య చాలా గ్యాప్ వచ్చిందన్న విషయం జగమెరిగిన సత్యమే. దీంతో ఆ గ్యాప్‌తో అలానే బయటికి వచ్చేయాలా లేకుంటే కమలనాథులతో కలిసి అడుగులు ముందుకేయాలా అనేది పవన్ మదిలో ఎన్నోరోజులుగా మెదులుతున్న ప్రశ్న. ఢిల్లీ పర్యటనతో ఈ ప్రశ్నకు సమాధానం వస్తుందని పవన్ భావించారు కానీ.. అదేమీ జరగలేదట. దీంతో పొత్తులపై ఎటూ లెక్కలే తేలనట్లయ్యింది. దీంతో షా.. సేనానికి షాకిచ్చారని సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
జేపీ నడ్డాతో భేటీతో అయినా పొత్తులపై క్లారిటీ వస్తుందనుకుంటే.. లెక్కలు ఎటూ తేలలేదు. ఢిల్లీ వేదికగా మాట్లాడుతూ.. మరికొన్ని చర్చల తర్వాతే పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తానని పవన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పలు కీలక అంశాలపై కేంద్ర నాయకత్వంతో పవన్ చర్చించారని జనసేన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఏపీలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిణామాలపై చర్చించారు. పాలన సంబంధితమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవైన పరిస్థితిని, అవినీతి తదితర విషయాలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు జనసేన తెలిపింది. ఏపీని వైసీపీ పాలన నుంచి విముక్తం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా చర్చలు జరిగాయని జనసేన చెబుతోంది.
మొదట.. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మురళీధరన్‌తో రెండు దఫాలుగా పవన్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీతో కూడా పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయాలు, ప్రధాన ప్రాజెక్టుల గురించి పవన్ కేంద్ర నాయకత్వానికి తెలియచేశారు. వైసీపీ ముక్త్ ఆంధ్రప్రదేశ్ కోసమే పనిచేస్తాను. ఈ చర్చలు ఇప్పుడే ముగియలేదు.మరికొన్ని చర్చల తర్వాతే సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తాను. చట్టబద్దమైన విధానాలు రాష్ట్రంలో అమలుకావడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న గొడవలపై లోతుగా చర్చలు జరిపాం. అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ఎలా వెళ్లాలనేదానిపైనే అన్నికోణాల్లో సమాలోచనలు జరుపుతున్నాం. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చవద్దనేదే నా అభిమతమని పవన్ చెప్పుకొచ్చారు.
మొత్తానికి చూస్తే.. పవన్ ఢిల్లీ పర్యటనతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతాయని అభిమానులు అనుకున్నారు కానీ అవేమీ జరగకపోవడంతో కాస్త అసంతృప్తితో ఉన్నారట. ఢిల్లీ వేదికగా పవన్ చెప్పాల్సినవన్నీ చెప్పారు. త్వరలోనే మళ్లీ ఢిల్లీ వెళ్తారా లేకుంటే.. ఇంతటితో హస్తిన టూర్‌లు ముగిసినట్లేనా.. వెళ్లాల్సిన అసరం ఉందా లేదా.. అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. సమావేశాలు అన్నీ సుహృద్భావ వాతావరణంలో సాగాయని పవన్ వెల్లడించారు. ఏపీపై బీజేపీ పెద్దలకు ఒక అవగాహన ఉందన్నారు. తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని తెలిపారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాత్రం తాము చర్చించలేదని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ-జనసేన ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపైనే చర్చించామని.. ఈ క్రమంలో సంస్థాగతంగా ఇరు పార్టీలు ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలనే విషయంపైనే దృష్టి పెట్టామన్నారు. కేంద్రం నుంచి తనకు సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న విషయాన్ని తాను బీజేపీ నేతలు చెప్పానని పవన్ వెల్లడించారు. దీనికి వారు కూడా సమ్మతించినట్టు చెప్పారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వరుస భేటీలు రాష్ట్రంలో ఉత్కంఠను రేకెతిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు వ్యూహం.. పొత్తులేనని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఒనగూరే ప్రయోజనాలు.. అధికారంలోకి వచ్చే అవకాశం వంటివాటిని వివరించి.. టీడీపీకి దూరంగా ఉన్న బీజేపీని ఆయన ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాదు.. మూడు పార్టీలు కలిస్తే.. ఏపీలో అధికారం చేపట్టడం పెద్ద కష్టం కాదని కూడా పవన్ తేల్చి చెప్పనున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆది నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంను చీలకుండా చూస్తానని పవన్ చెబుతున్నారు. ఇది జరగాలంటే.. బీజేపీ-టీడీపీ-జనసేన మూడు పార్టీలు కలిసిపోటీ చేయాల్సిన అవసరం ఉందని పవన్ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గతంలోనే రోడ్ మ్యాప్ కోసం పవన్ ప్రయత్నించారు.కానీ, బీజేపీ మౌనం వహించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరో ఏడాది సమయమే ఉన్న క్రమంలో తాజాగా బీజేపీని ఒప్పించి.. పొత్తుల దిశగా అడుగులు వేయించే బాధ్యతను పవన్ తీసుకున్నాడని అంటున్నారు పరిశీలకులు. అయితే ఇదెంతమేరకు ప్లస్ అవుతుందన్నదే హాట్ టాపిక్‌గా మారింది.
మరి పవన్ వ్యూహం ఏమైందన్నదే కీలకంగా మారింది.