HomePoliticsఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో ఎమ్మెల్యేల అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో ఎమ్మెల్యేల అసంతృప్తి

  • ఏపీ అధికార పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయా..?
  • ఎన్నికల వేళ ఈ తీరు .. అధిష్టానానికి తలనెప్పిగా మారుతోందా..?
  • ఇంతకీ ఈ అంసతృప్తికి కారణాలేమిటి..? దీనికి అధిష్టానం ఏం చేయనుంది..?

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో ఎమ్మెల్యేల అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు పాలనా తీరుపైనా.. సొంత పార్టీ నేతల వ్యవహారశైలిపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది పరోక్షంగా కొంత మంది నేరుగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది ముందు ముందు జగన్ పాలనకు గళమెత్తుతారని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

అందులో నిజం ఎంత ఉందో కానీ.. ఇప్పుడు అయితే పరిస్థితి కట్టు తప్పుతున్నట్లుగానే కనిపిస్తోంది. ముందస్తుకెళ్తే ముందే ఇంటికెళ్తామని ఆనం చేసిన వ్యాఖ్యలు వైసీపీ హైకమాండ్‌కు ఆగ్రహం తెప్పించింది. అంటే ఆలస్యంగా వెళ్తే ఆలస్యంగా ఇంటికి వెళ్తామని ఆయన చెప్పినట్లే కదా అని అప్పటికప్పుడు ఆయనను తన నియోజకవర్గ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి సమన్వయకర్త పదవి ఇచ్చారు.

అయితే ఆనం మాత్రం తన జోరు తగ్గించలేదు. ఉన్నదే చెప్పానంటున్నారు. ఆనంతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అదే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను జగన్ పిలిపించి మాట్లాడాల్సి వచ్చింది. ఇక దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చాలా సార్లు నేరుగానే ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు.

వ్యతిరేక కామెంట్లు చేస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య అంతకంతూ పెరుగుతోంది. మరో వైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు తాను ఎన్నికల్లో పోటీ చేయనని జగన్ కు చెప్పానని … గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో చెప్పుకొచ్చారు. తనకు విశ్రాంతి కావాలన్నారు. అయితే జగన్ ఒప్పుకోలేదని.. ఈ ఒక్క సారి పోటీ చేయమన్నారని చెప్పారు. ధర్మాన మాటలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.

ఆయన తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం ఇలా మాట్లాడుతున్నారని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు కానీ.. ఆయన మాట తీరు వల్ల ఆనం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారో అలాంటిదే ప్రజల్లోకి వెళ్తుందని అనుకుంటున్నారు. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం కూడా వైసీపీ హైకమాండ్ ను కంగారు పెట్టిస్తోంది. ఆయన తండ్రి ఇటీవల ప్రభుత్వంపై తిరగబడాలని ఓ వర్గానికి పిలుపునిచ్చారు.

తన తండ్రిని కంట్రోల్ చేయలేనని వసంత కృష్ణప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ చేసిన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావుకు మద్దతుగా నిలిచారు. ఆయనను వేధించడం కరెక్ట్ కాదని తన పార్టీపై నేరుగానే విమర్శలు చేశారు.

ఎమ్మెల్యేలు ఇలా అదే పనిగా పార్టీ , ప్రభుత్వ తీరుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయడం వైసీపీలోనూ చర్చనీయాంశం అవుతోంది. అయితే ఎమ్మెల్యేలు ఎవరూ జగన్ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో లేరని.. కేవలం వారికి వారి నియోజకవర్గాలు, జిల్లాల్లో ఉన్న రాజకీయ ఆధిపత్య పోరాట పరిస్థితుల కారణంగానే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు.

కోటంరెడ్డి, ఆనం, వసంత కృష్ణప్రాద్, మద్దిశెట్టి వేణుగోపాల్ ఇలా.. బయట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నవారికీ టిక్కెట్ గ్యారంటీ లేదని అందుకే.. బయటపడుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వారి అసంతృప్తి పూర్తిగా రాజకీయ కారణాలే కానీ.. జగన్ పని తీరు కారణం కాదంటున్నారు. భారీ మెజార్టీ రావడమే ఇప్పుడు వైసీపీకి ఇబ్బందికరంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. 175 మంది అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్లే.

మరో ఐదుగురు ఇతర పార్టీల నుంచి మద్దతు పలికారు. ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి పెరగడం.. సంక్షే్మంపై ప్రజల్లో ఆశలు పెరగడం.. అభివృద్ది పనులు జరగకపోవడంతో.. వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారిందన్న వాదన వినిపిస్తోంది.. అన్ని స్థాయిల్లో ఆ పార్టీ నేతలే ఉండటంతో వారి తీరు వల్ల సామాన్య జనంలో అసంతృప్తి పెరుగుతోంది. ఇది కూడా … ఎమ్మెల్యేలు బయటపడుతుండటానికి మరో కారణం అని భావిస్తున్నారు.

ఇలాంటి అసంతృప్తుల్ని వీలైనంత వరకూ తగ్గించకపోతే.. ముందు ముందు మరింత సమస్య అవుతందని వైసీపీ హైకమాండ్‌కు దిగువశ్రేణి నేతలు సలహాలిస్తున్నారు. ఇప్పుడు ఒకటి రెండు స్వరాలు అనుకున్నా అవి పెరిగే ఛాన్స్‌ లేకుండా ఆదిలోనే చెక్‌పెట్టాలని భావిస్తోంది వైసీపీ. ప్రభుత్వ చర్యలను సమర్థించాల్సిన సభ్యులు ఇలా పార్టీ లైన్‌ క్రాస్ చేసి మాట్లాతుండటంతో ప్రతిపక్షాలకు మంచి ఆయుధాలు దొరుకుతున్నాయి.

వ్యవహరం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీకి చెందిన నేతలు, శాసన సభ్యులే స్వయంగా చేస్తున్న వ్యాఖ్యలు మెయిన్‌ మీడియా, సోషల్ మీడియవిస్తృతంగా ట్రోల్ అవుతున్నాయి. దీంతో వైసీపీ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. అయినా అసలు విషయం చెప్పేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇన్నాళ్లూ భరిస్తవచ్చిన నేతలు.. ఇప్పడు ఎన్నికలు సమీపిస్తుండడంతో నోరు విప్పుతున్నారని భావించవచ్చు.

ఇప్పుడు కూడా నోరు తెరిచి మాట్లాడకపోతే తమను నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేయలేమనే బాధ వాళ్లలో కనిపిస్తోంది. అందుకో ఇప్పుడిప్పుడే ఇలాంటి నేతలు ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. బహుశా ఎన్నికల నాటికి ఇలాంటి నేతల సంఖ్య మరింత పెరగొచ్చు.

తాడికొండ నియోజకవర్గంలో మొదలైన వివాదం..

స్వరం పెంచి మాట్లాడితే చేటు తప్పదనే సంకేతాలు పార్టీ అధిష్ఠానం మొదటి నుంచీ పంపుతూనే ఉంది. మొదటగా తాడికొండ నియోజకవర్గంలో మొదలైన వివాదం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతున్నాయి పార్టీ వర్గాలు. తాడికొండ నియోజకవర్గంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి, పూర్తిగా జగన్ పైనే డిపెండ్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చారు. తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

శ్రీదేవి ఎంత స్పీడ్‌గా ఎదిగి… హాట్‌టాపిక్ అయ్యారో అంతే వేగంగా ఆమెను వివాదాలు చుట్టుముట్టాయి. నమ్మిన వ్యక్తులు కూడా శ్రీదేవికి హ్యాండ్ ఇవ్వటంతోపాటు ఎంపీ నందిగం సురేష్‌తో విభేదాలు ఆమెను మరింత సమస్యల్లో పడేశాయి. దీంతో శ్రీదేవి వివాదాల నేతగా పార్టీలో ముద్రపడిపోయారు. వరుసగా వివాదాలు ముసరటంతో పార్టీ నాయకులు ఆమెతో చర్చలు జరిపి నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు.

దీంతో పార్టీ అధినాయకత్వం తాడికొండ నియోజకవర్గానిక పరిశీలకుడిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించింది. దీంతో శ్రీదేవి వర్గం భగ్గుమంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీదేవి వర్గం మాజీ హోమంత్రి సుచరిత ఇంటి ముందు ధర్నాకు దిగటం కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలకు పార్టీ అధిష్ఠానం పరిశీలకులను నియమించింది. దీంతో వ్యవహరం సద్దుమణిగింది.

ఆ తరువాత డొక్కాను జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా నియమించిన అధిష్ఠానం మరో వ్యక్తిని పరిశీలకుడిగా నియమించింది. ఇదంతా శ్రీదేవిని పొమ్మనలేక పొగబెట్టటమే అన్న అభిప్రాయం పార్టీలో ప్రచారం జరుగుతుంది. పొన్నూరు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. స్థానిక శాసన సభ్యులు కిలారి రోశయ్యకు, అదే ప్రాంతానికి చెందిన మరో కీలకనేత రావి వెంకటరమణకు మధ్య విభేదాలు ఉన్నాయి.

మొదటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించిన రావి వెంకట రమణను కాదని ఆఖరి నిమిషంలో పార్టీ సీటును కిలారికి కేటాయించారు. దీంతో రావి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ స్వయంగా రావికి న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఎన్నికల్లో కిలారి రోశయ్య విజయానికి రావి వర్గం సహకరించింది. అయితే ఆ వర్గం తన విజయానికి సహకరించలేదని, వ్యతిరేకంగా పని చేసిందని… ఇప్పుడు కూడా అదే పనిలో ఉందని జగన్ ఫిర్యాదు చేశారు కిలారి.

దీంతో రావిని పార్టి నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇలా పార్టీలో వ్యతిరేక స్వరం వినిపిస్తున్న వారిని తప్పించి వారి స్థానంలో ఇన్‌ఛార్జ్‌లను నియమించడంపై వారిని పొన్నలేక పొగబెడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భవిష్యత్‌లో సర్వేలు ఆధారంగా ఇద్దరిలో ఎవరికి మొగ్గు ఉంటే వాళ్లనే అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు.

మరి జగన్ ఎలా కట్టడి చేస్తారనేది చూడాలి.


Must Read

spot_img