Homeజాతీయంకరోనా తర్వాత దేశంలో డిజిటలైజేషన్ ...

కరోనా తర్వాత దేశంలో డిజిటలైజేషన్ …

డిజిటలైజేషన్ .. భారత్ లో శరవేగంగా సాగుతోంది. ఆటోమేషన్ పెరిగినా .. ఉపాధికి ఢోకా లేదని, టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు సైతం పెరుగుతున్నాయని నాబార్డు అంచనా వేసింది. దీంతో దేశంలో డిజిటల్ .. కరోనా తర్వాత మరింత ఊపందుకుందని నిపుణులు సైతం అంటున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ డిజి మెరుపులు కనిపిస్తున్నాయని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు .. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఇదే ఏజెండాగా భారత్ లో ఉద్యోగ అవకాశాలు సైతం పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతుండడమే దీనికి నిదర్శనమని, నాలుగో తరం టెక్నాలజీకి విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని వీరంతా చెబుతున్నారు.

భారతదేశంలో డిజిటలైజేషన్ వేగంగా జరుగుతోందని, ఇది కొత్త తరహా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాబార్డు వెల్లడించింది. డిజిటలైజేషన్ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమేనని స్పష్టం చేసింది. భవిష్యత్ లో ఇండియాలో ఉద్యోగ అవకాశాలు పేరిట నాబార్డు విడుదల చేసిన అధ్యయన నివేదకలో ఈ విషయాలు వెల్లడించింది. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా పది కోట్ల మందికిపైగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేశారని, భవిష్యత్ లో ఈ సంఖ్య మంత్రి పెరుగుతుందని అంచనా వేసింది. వివిధ రంగాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపింది.

2021లో పలు స్టార్టప్ లలో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు రూ.3.53 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టటడమే దీనికి నిదర్శనమని పేర్కొంది. 2025 నాటికి దేశీయ డిజిటల్ ఎకానమీ విలువ రూ. 80 లక్షల కోట్లకు చేరడమే కాకుండా 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మూడోతరం టెక్నాలజీతో బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలతో పాటు ఈ కామర్స్, సోషల్ మీడియా, డిజిటల్ అడ్వర్టైజింగ్, సాఫ్ట్ వేర్ రంగాల్లో భారీ మార్పులు తెచ్చిందని తెలిపింది. నాలుగో తరం టెక్నాలజీ అయిన బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా వస్తే, తయారీ రంగంతో పాటు వ్యవసాయంలో పెద్ద ఎత్తున ఆటోమేషన్ జరుగుతుందని పేర్కొంది. కోవిడ్ .. లాక్ డౌన్ తో భారీగా పెరిగిన నిరుద్యోగ సమస్యను డిజిటలైజేషన్ పరిష్కరించినట్లు నాబార్డు పేర్కొంది.

2020 జనవరి నాటికి దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్య 41 కోట్లు ఉండగా, కోవిడ్ దెబ్బతో 2021 జూన్ నాటికి 38.6 కోట్లకు పడిపోయిందని తెలిపింది. కోవిడ్ తర్వాత దేశీయ యువత ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చిందని, ఒకరి కింద పని చేయడం కాకుండా నచ్చిన సమయంలో స్వతంత్రంగా పని చేసుకునే గిగ్ విధానానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలతో పాటు ఓలా, ఉబర్ వంటి ట్రావెల్ సంస్థల్లో గిగ్ వర్కర్లుగా పనిచేయడానికి యువత మొగ్గు చూపినట్లు పేర్కొంది.

ఉదాహరణకు లక్ష కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన జొమాటోలో ప్రత్యక్షంగా 5 వేల మంది పనిచేస్తుంటే, పరోక్షంగా 3.5 లక్సల మందికి స్వయం ఉపాధి కల్పిస్తోంది. వీరంతా తాము పనిచేసిన సమయాన్ని బట్టి నెలకు రూ. పది వేల నుంచి 30 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. అయితే ఈ గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని నాబార్డు తెలిపింది. వీరికి పీఎఫ్, గ్రాట్యుటీ, అనారోగ్యపు సెలవులు, ఎర్నడ్ లీవులు వంటి సామాజిక భద్రత లేదని, ఈ సమస్యు పరిష్కారం చూపేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పెరుగుతున్న ఆటోమేషన్, రోబోటిక్ విధానానికి అనుగుణంగా యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచించింది.

ఏటా దాదాపు 1.2 కోట్లమంది యువత డిగ్రీలు చేతపట్టుకుని వస్తున్నారని, వీరందరికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం కల్పించడం అతిపెద్ద సవాల్ అని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే, భారత్ గతేడాది డిజిటల్ రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించింది. డిజిటల్ ప్రయాణంలో 2022 అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఫాక్స్‌ కాన్, వేదాంత లాంటి సంస్థల నుంచి పెద్ద పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మేక్ ఇన్ ఇండియా దిశగా కీలక అడుగులు పడ్డాయి. యాపిల్ అధికారిక గ్లోబల్ లాంచ్అయిన కొద్దిసేపటికే భారత్ లో ఐఫోన్ 14 సిరీస్ తయారీ ప్రక్రియను ప్రారంభించింది.

టెలికాం ఆపరేటింగ్ కంపెనీలు 5G నెట్ వర్క్ ను దేశ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల ఇంటర్‌ ఫేస్, అంటే UPI ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. RBI ఆమోదించిన లావాదేవీల కోసం డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకొచ్చింది.5G నెట్‌ వర్క్‌ ను ప్రారంభించడం టెక్నాలజీ పరంగా దేశం సాధించిన ముఖ్యమైన మైలు రాళ్లలో ఒకటి. ఈ ఏడాది అక్టోబర్‌ లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 సదస్సులో ప్రధాని మోడీ 5Gని అధికారికంగా ప్రారంభించారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశంలోని వివిధ ప్రాంతాలలో తమ 5G నెట్‌ వర్క్‌ ను విస్తరిస్తున్నాయి.

దేశంలోని దాదాపు 60 నగరాల్లో 5G కనెక్టివిటీ అందుబాటులో ఉంది. వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో 5G కవరేజీని అందించనున్నట్లు టెలికాం కంపెనీలు వెల్లడించాయి. ఇక భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది అక్టోబర్‌లో డిజిటల్ రూపాయిని అధికారికంగా ప్రారంభించింది. ఇ-రూపాయి అనేది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. దీన్ని RBI నిర్వహిస్తుంది. ఫియట్ కరెన్సీకి సమానమైన ట్రేడింగ్ విలువను కలిగి ఉంటుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ప్రారంభించినప్పటి నుంచి డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి.

తాజా డేటా ప్రకారం, అక్టోబర్ 2022లో UPI తో దేశంలో రూ. 12.11 ట్రిలియన్ల విలువైన 7.3 బిలియన్ లావాదేవీలు జరిగాయి. UPI తన సేవలను నేపాల్, భూటాన్, UAE,బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, UK సహా అనేక దేశాలలోఅందుబాటులోకి తెచ్చింది. భారత ప్రభుత్వం 2020లో PLI, SPECS, EMC 2.0తో సహా పలు సబ్సిడీ పథకాలతో దేశంలో సెమీకండక్టర్ తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారించింది.

టెక్నాలజీ రంగంలో వస్తున్న భారీ మార్పుల నేపథ్యంలో భారత ప్రభుత్వం సాంకేతిక చట్టాలను అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ ఏడాది
ప్రారంభంలోపార్లమెంటులో డేటా ప్రొటెక్షన్ బిల్లును ప్రవేశపెట్టింది. అన్ని సూచనలను దృష్టిలో ఉంచుకుని గత నెలలో బిల్లును మళ్లీ ప్రవేశపెట్టింది. ఈ
బిల్లు, విదేశాల్లోని కొన్ని దేశాలకు వినియోగదారుల వ్యక్తిగత డేటాను బదిలీ చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది. డేటా ఉల్లంఘనలకు సంబంధించిన సంఘటనలకు కంపెనీలపై ఆర్థిక జరిమానాలను కూడా ప్రతిపాదిస్తుంది.

దీంతో భారత దేశం డిజిటల్ పవర్ గా ఎదగడానికి రంగం సిద్దమైంది. దీనిలో భాగంగా 59 చైనా అప్స్ బాన్ చెయ్యడం ద్వారా మనం డిజిటల్ ఇండియా లో ఇంకొక అడుగు ముందుకు వేసినట్లు అయ్యింది. చైనా యాప్స్ బ్యాన్ ద్వారా డిజిటల్ ఇండియా ప్రోగ్రాం లో కనీసం వచ్చే సంవత్సరం లోగా లక్ష మందికి ఉద్యోగాలు, కోటి మందికి పైగా జనాలు లాభ పడటమే కాక 4 కోట్ల జనాభా దారిద్ర రేఖ ని దాటి ముందుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. తాజా పరిణామాలతో చైనా యాప్స్ తోనే కాకుండా పూర్తిగా దేశీయ యాప్స్ మీద పూర్తి డిజిటల్ ఇండియాకి శ్రీకారం చుట్టినట్లు నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవే కానక నిజం అయితే ఇంకొక 5 ఏళ్లలో పూర్తి గ డిజిటల్ ఇండియా ని చూసే అవకాశం దక్కనుంది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కారణంగా అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో అనేక ఉపాధి మార్గాలు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. టెక్నాలజీ ట్యాలెంట్‌కు ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతుండడంతో జీతాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుత టెక్ టాలెంట్‌లలో నైపుణ్యం, రీస్కిల్లింగ్‌ను షార్ట్‌టర్మ్‌లో
పెంపొందించేలా టెక్ కంపెనీలు సహకరించాలని నాబార్డు సూచించింది.

Must Read

spot_img