తెలంగాణలో టిడిపి బలపడుతోంది. ఖమ్మం సభతో మా సత్తా చూపించామని, త్వరలో నిజామాబాద్ లో సైతం టిడిపి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ నడి బొడ్డున ఎవరూ ఊహించని స్థాయిలో లక్షలాది మందితో సభ నిర్వహించి మరోసారి తెలంగాణలో టిడిపి బలహీనపడిందన్న వాళ్ల నోళ్లను మూయిస్తామంటున్నారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో టిడిపి స్దబ్దుగా ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాలపై ప్రత్యక దృష్టి పెట్టామని, రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టిడిపి అభ్యర్దులు ఎన్నికల బరిలో దిగడంతోపాటు విజయం సాధించడం ఖాయమని అన్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా టిడిపి ఎదుగుతోందన్నారు. సీట్లు గెలవడం మాత్రమే కాదు తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేసారు. ఖమ్మం అంటే ఆంధ్రా బోర్డర్ అని.. అక్కడ బహిరంగసభ నిర్వహించి తెలంగాణలో బలపడ్డామని చెప్పడం కాదని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కాసాని జ్ఞానేశ్వర్ రెడీ అయ్యామని వ్యాఖ్యానించారు. ఈ సారి ఆయన నిజామాబాద్‌లో బహిరంగసభ పెట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి మొదటి వారంలో నిజామాబాద్ లోనూ భారీ పబ్లిక్ మీటింగ్ కు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఖమ్మం సభ కన్నా నిజామాబాద్ మీటింగ్ విజయవంతమవుతుందని కాసాని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. సంక్రాంతిలోపు కొత్త కమిటీ వేస్తామన్న ఆయన.. ఇతర పార్టీల నాయకులు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అన్ని జిల్లాల్లోనూ క్యాడర్ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. బీసీల ఓట్లను ప్రధానంగా ఆకట్టుకోవాలని టీ టీడీపీ ప్రయత్నిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తొలి టిక్కెట్ నాయి బ్రాహ్మణులకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.ఆ తర్వాత మిగతా 11 కులాల వారికి టిక్కెట్ ఇస్తామని చెప్పారు. బీసీలకే అత్యధిక టిక్కెట్లు కేటాయంచాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించారు. నిజామాబాద్‌లో కూడా టీడీపీకి సానుభూతిపరులు ఎక్కువగా ఉన్నారు. గతంలో అయితే తెలంగాణ ఉద్యమం తర్వాత అక్కడ చాలా మంది పార్టీ మారిపోయారు. కీలక నేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు కూడా బీఆర్ఎస్ లో చేరారు. కానీ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఆ పార్టీలో దక్కలేదు.
ఇతర పార్టీల్లో ప్రాధాన్యం దక్కని కొంత మంది .. జూనియర్, యువ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పూర్వ వైభవాన్ని పునర్ ప్రతిష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పక్కా రాజకీయ ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. అభివృద్ధి, పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఉత్తర తెలంగాణలో పాగా వేసేందుకు రాజకీయ వ్యూహ రచన చేసింది. ఖమ్మం బహిరంగ సభతో దక్షిణ తెలంగాణలో తెలుగుదేశం సత్తా చాటినట్లే నిజామాబాద్ సభతో ఉత్తర తెలంగాణ లో టిడిపి స్థానాన్ని పదిల పర్చుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది. వచ్చే నెల 12, లేదా 13న నిజామాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.
గతంలో ఉత్తర తెలంగాణలో ఉన్న టిడిపి కమిటీలు, నాయకుల జాబితాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలించి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సూచనలు చేశారు. ఈ సూచనల మేరకు గతంలో టిడిపి కి కంచుకోటగా ఉన్న ప్రాంతాలు, నాయకులు, త్యాగాలకు సిద్ధంగా ఉన్న శ్రేణుల జాబితాలను సిద్ధం చేశారు. వీరిలో పార్టీ మారినా, అసంతృప్తిలో ఉన్న నేతల్ని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. అసలు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గట్టి పట్టు ఉంది. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా అనివార్యంగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైనట్లుగా కనిపించినా.. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి తెలంగాణ సెంటిమెంటుకు చెల్లు చీటీ పాడేయడంతో.. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవాన్ని సముపార్జించుకునే అవకాశాలు మెరుగయ్యాయి.
ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో నిజమైన అభివృద్ధి జరిగింది తెలుగుదేశం హయాంలోనే. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారించారు. ఖమ్మంలో గత నెల 21న నిర్వహించిన తెలుగుదేశం బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. చంద్రబాబు భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్లారు. దారి పొడవునా జనం బ్రహ్మరథం పలికారు.
తెలంగాణలో తెలుగుదేశంకు ఉన్న క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఖమ్మం సభ సక్సెస్ తో జోరుమీద ఉన్న తెలుగుదేశం వెంటనే మరో బహిరంగ సభకు ప్రణాళిక రచించింది. నిజామాబాద్ లో అంటే, ఉత్తర తెలంగాణలో సత్తా చాటేందుకు సిద్ధం అయ్యింది. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షడు కాసాని జ్ణానేందర్ అందుకు సన్నాహాలు షరూ చేశారు. ఖమ్మం సభతో తెలంగాణలో తెలుగుదేశంపై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకే కేసీఆర్ సైతం బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు ఖమ్మంనే వేదిక చేసుకున్నారు.
ఖమ్మంలో శంఖరావం పేరిట తెలుగుదేశం నిర్వహించిన భారీ భారీ బహిరంగ సూపర్ సక్సెస్‌తో.. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీలో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిస్తోంది.అంతే కాదు తెలుగుదేశం పార్టీ ఆంధ్రలోనే బతికి ఉంది.. తెలంగాణలో మాత్రం కనుమరుగైపోయిందంటూ వస్తున్న విమర్శలకు ఈ సభ సక్సెస్ ఫుల్‌స్టాప్ పెట్టింది. దీంతో కొత్త ఊపు ఉత్సాహంతో తెలంగాణలో తెలుగుదేశం అడుగుల వేగం పెంచింది. కేసీఆర్.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తోందంటూ ప్రకటించారు. అలాంటి వేళ.. ఆయన దేశంలో ఎక్కడైనా ఈ సభను నిర్వహించవచ్చు. కానీ అలా కాకుండా.. తెలంగాణలోని అదీ.. ఖమ్మం వేదికగా ఈ సభను ఏర్పాటు చేయడంతో ఖమ్మం తెలుగుదేశం సభ బీఆర్ఎస్ లోనూ ప్రకంపనలు సృష్టించిందని అవగతమౌతోంది.
మరోవైపు పార్టీలు మారిన నాయకుల్లో పదవులు పొందిన వారు మినహా రెండవ శ్రేణీ నాయకులు తిరిగి టిడిపిలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. నిజామాబాద్ బహిరంగ సభలో పలువురు ఉత్తర తెలంగాణ లోని వివిధ పార్టీల నాయకులు టిడిపిలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం లభించింది. సంక్రాంతి అనంతరం టిడిపి తెలంగాణ నాయకులు నిజమాబాద్ లో క్షేత్ర స్థాయి పర్యటనలు, సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేయనున్నారు.
బహిరంగ సభలోగా నిజామాబాద్ లో ర్యాలీలు, పర్యటనలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయాలని టిడిపి రాష్ట్ర నాయకత్వం నిర్వహించి. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు అవసరమైన అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని టిడిపి యోచిస్తోంది. నిజామాబాద్ బహిరంగ సభ అనంతరం తెలంగాణలో రోడ్ షోలు నిర్వహించాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి నాయకత్వం కోరింది. అయితే చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే నిజమాబాద్, కరీంనగర్, వంరంగల్ బహిరంగ సభల అనంతరం రోడ్ షాలు నిర్వహించి ఎన్నికల తేదీల ప్రకటన వచ్చే సమయానికి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సింహగర్జన నిర్వహించాలని ఇప్పటికే టిడిపి అధిష్టానం నిర్ణయించింది.
బహిరంగ సభలు నిర్వహించే ముందు ఇంటింటికి టిడిపి, ఇంటింటికి బొట్టు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. అలాగే బహిరంగ సభల నిహణ కమిటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే నిజమాబాద్ టిడిపి నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెటిలర్లు ఇప్పటికే టిడిపితో మంతనాలు జరుపుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో పూర్వవైభవాన్ని పునర్ ప్రతిష్టించే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి పార్టీశ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కాసాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.