Homeతెలంగాణబీఆర్ఎస్‌తో పొత్తుపై రేవంత్ క్లారిటీ ఇచ్చారా..?

బీఆర్ఎస్‌తో పొత్తుపై రేవంత్ క్లారిటీ ఇచ్చారా..?

మరీ ముఖ్యంగా సీనియర్ల వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లేనా..? పొత్తు టాక్‌పై రేవంత్ వ్యాఖ్యలు కాక రేపుతున్నాయా..? ఇంతకీ రేవంత్ ఏమంటున్నారు..?

తెలంగాణలో ఎన్నికల ఏడాదిలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటి నుంచి ఎన్నికల ఫలితాలపై అంచనా వేస్తూ ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్యపై పొత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధానంగా త్రిముఖ పోరు నెలకొంది. అయితే బీఆర్ఎస్‌తో వామపక్షాలు కాస్త అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తుపై, రాష్ట్రంలో అధికారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత వరకు కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు.

MIMకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీటు ఇచ్చిందని రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం మూడు పార్టీల మధ్య జరుగుతుంది. ప్రచారంలో ముగ్గురుంటారు. కానీ ఎన్నికల్లో ఇద్దరవుతారని రేవంత్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు 25 సీట్లు కూడా రావు. బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని రేవంత్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు 20 సీట్లు ఇస్తే పోతారని..అందుకే పార్టీకి 80 సీట్లు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇక కాంగ్రెస్ మాఫియాతో చేతులు కలపదని..పార్లమెంట్ బీఆర్ఎస్ వ్యవహారాలు వేరు..రాష్ట్ర రాజకీయాలు వేరని అన్నారు. తెలంగాణ వస్తే ఏదో జరుగుతుందని అనుకున్నామని.. కానీ స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఒక పక్క ఆ పార్టీ సీనియర్లు బీఆర్ఎస్ తో పొత్తుకు తహతహలాడుతుంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ఆ ప్రసక్తే లేదని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. మాఫియాతో కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ పొత్తు పెట్టుకోదని కుండబద్దలు కొడుతున్నారు. అసలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కాంగ్రెస్ సీనియర్లలో అసంతృప్తి జ్వలిస్తూనే ఉంది.

అయితే హైకమాండ్ సీనియర్ల అసంతృప్తిని పెద్దగా పట్టించుకోకుండా రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే బాధ్యతను రేవంత్ పై పెట్టింది. అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పార్టీలో నూతనోత్సాహాన్ని తీసుకువచ్చారు. రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన అనంతరం జరిగిన ఉప ఎన్నికలలో పార్టీ విజయాలు సాధించకపోయినా.. శ్రేణుల్లో మాత్రం కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నది మాత్రం నిర్వివాదాంశం.

అయితే సీనియర్లు మాత్రం రేవంత్ గమనానికి అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నారు.

అయితే మాణిక్యం ఠాకూర్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన మాణిక్‌రావు ఠాక్రే సీనియర్ల అసంతృప్తికి చెక్ పెట్టడంలో చాలా వరకూ కృతకృత్యులయ్యారు. అసంతృప్తి జ్వాలలు పూర్తిగా చల్లారిపోయాయని చెప్ప లేకపోయినా.. పార్టీలో మాత్రం గణనీయమైన మార్పు కనిపించింది. విభేదాలు ఉన్నా సీనియర్లు, జూనియర్లు.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రేవంత్ వర్గం, రేవంత్ వ్యతిరేక వర్గం కూడా ఎవరి దారిన వారు పార్టీ కార్యక్రమాలలో నిమగ్నమైపోయారు. దీంతో పార్టీలో ఆల్ ఈజ్ వెల్ అన్న వాతావరణం కనిపిస్తోంది. కానీ అడపా దడపా సీనియర్లు మాత్రం ఏదో ఒక పుల్ల విరుపు మాట అయితే అంటూనే ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అనంతరం అయినా సరే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు అనివార్యమని వ్యాఖ్యలు చేసిన రేపిన సంచలనం ఇలా సర్దుమణిగిందో లేదో.. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు అవసరం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని అన్నారు.

అంతేకాదు రాహుల్ గాంధీ అనర్హత విషయంలో బీఆర్ఎస్ బహిరంగంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందని సో … శత్రువు, శత్రువు మిత్రుడు, థియరీ ప్రకారం కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలపవచ్చని వివరణ కూడా ఇచ్చారు. అటు బీఆర్ఎస్ కూడా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ దూకుడును అడ్డుకోవాలంటే.. కాంగ్రెస్ అండ కావాలి అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. ఇటీవల పలు సందర్భాలలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఇటీవల ఢిల్లీ వేదికగా బీజేపీని ఓడించాలంటే బీజేపీయేతర పార్టీలతో కాంగ్రెస్ కలిసి రావాలని వ్యాఖ్యానించారు.

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రాహుల్ అనర్హత వేటుకు వ్యతిరేకంగా సమష్టి పోరుకు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలోనే జానా రెడ్డి పోత్తు ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. తాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండగా బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని, మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పరాజయం తథ్యమని, బీజేపీ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కే పరిమితమౌతుందని రేవంత్ అన్నారు.

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో పొత్తులపై విస్తృత చర్చ జరుగుతోంది. మొదట కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తర్వాత జానారెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్‌తో పొత్తుల గురించి మాట్లాడటం వల్ల సీరియస్ నెస్ తగ్గుతోందని.. ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా భావించరని రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీపై వేసిన అనర్హతా వేటు విషయంలో ఆ పార్టీకి మద్దతు పలికారు.

దీంతో కాంగ్రెస్ నేతలు కొంత మంది బీఆర్ఎస్‌తో పొత్తు ఆలోచనలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పొత్తుల గురించి మాట్లాడితే సమస్య ఉండేది కాదు కానీ.. రాష్ట్ర స్థాయిలో పొత్తులపై మాట్లాడుతూండటంతో రేవంత్ రెడ్డి వర్గానికి కోపం తెప్పిస్తోంది. బీఆర్ఎస్‌తో పొత్తు ప్రతిపాదనలు ఏమైనా ఉంటే.. అది తాను రాజీనామా చేసిన తర్వాతనేనని.. రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు. అలాంటి పరిస్థితి వస్తే తాను పీసీసీ చీఫ్‌గా ఉండనని చెప్పినట్లయింది. నిజానికి బీఆర్ఎస్‌ ను ఓడించడానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయ పునరేకీకరణ కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చాలాసార్లు చెప్పారు. అది కూడా బీఆర్ఎస్‌ను ఓడించడానికేనన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి కూడా బీఆర్ఎస్‌తో అంత గొప్ప సంబంధాలు లేవు.

తెలంగాణ ఇస్తే .. టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ తర్వాత హ్యాండిచ్చారు. ఇది కూడా హైకమాండ్ ఆగ్రహానికి ఓ కారణంగా ఉందని చెబుతున్నారు. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని చెబుతూంటారు. అందుకే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలవడంపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని.. కేసీఆర్ ను క్షమించేది లేదని స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తో సంబంధాలు కలిగివున్న వారిని ఎంతవారైనా ఉపేక్షించవద్దని రాహుల్ చెప్పారని కూడా అన్నారు. బీఆర్ఎస్ ఒక మాఫియా వంటిదని, మాఫియాతో కాంగ్రెస్ ఎన్నటికీ కలవదని అన్నారు. కేసీఆర్ రాజకీయాలు కూడా దావూద్ ఇబ్రహీం తరహాలోనే ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో 80 శాతం మంది ప్రజలు కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారని, బీజేపీతో చేయి కలిపి కాంగ్రెస్ ను లేకుండా చేయాలని కేసీఆర్ కుట్ర పన్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రణాళికను కేసీఆర్ అమలు చేస్తున్నాడని, రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని అన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని.. తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

మరి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నిజంగానే అంత సీన్ ఉందా..? అన్నది తేలాల్సి ఉంది.

Must Read

spot_img