Homeతెలంగాణఎంపీ అర్వింద్..బండికి షాకిచ్చారా..?

ఎంపీ అర్వింద్..బండికి షాకిచ్చారా..?

  • తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ ఆగేలా లేదా..?
  • లిక్కర్ స్కాం వేళ కవితపై బండి చేసిన వ్యాఖ్యలు పార్టీలో మరో రచ్చకు దారితీసాయా..?
  • ఏకంగా సొంత ఎంపీ అర్వింద్..బండికి షాకిచ్చారా..?

ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయకుండా.. ముద్దు పెట్టుకుంటారా అంటూ కవితపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు చేసి నాలుగురోజులయిన తర్వాత, భారత రాష్ట్ర సమితి నాయకులు ఒక ప్లాన్‌ ప్రకారం అంటే.. కవిత ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట కూడా నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీనికి బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది.

తెలంగాణ వాడుక భాష వాడినందుకే నానా యాగీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, తెలంగాణ మహిళా కమిషన్‌.. గతంలో కేసీఆర్‌, కేటీఆర్‌ మాట్లాడిన
మాటలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది. గతంలో వారు మాట్లాడిన మాటల తాలూకూ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ఇదంతా జరుగుతుండగానే కవితకు బద్ధ శత్రువైన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆమెకు బాసటగా నిలిచారు. కవితపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవి ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలకు, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కాగా అర్వింద్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. గతంలోనూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలతో విభేదించారు. తాజాగా అర్వింద్‌ కూడా అదే స్వరం అందుకోవడంతో పార్టీలో ఏదో జరుగుతోంది అనే సంకేతాలు విన్పిస్తున్నాయి. అర్వింద్‌ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు.

తెలంగాణలో సామెతలు చాలా ఉంటాయని, వాటిని జాగ్రత్తగా వాడాలని బండి సంజయ్ కు బీజేపీ ఎంపీ అర్వింద్ సూచించారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ వెనక్కి తీసుకుంటే బాగుంటుందని
సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమర్థించారు కానీ సొంత ఎంపీ ధర్మపురి అర్వింద్ మాత్రం ఖండించారు. కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలను సమర్థించనని.. ఆయన ప్రకటించారు.

అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడం కంటే దర్యాప్తు సంస్థలు, విచారణ సంస్థలు అడిగిన విషయాలకు సమాధానాలు చెబితే బెటర్ అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తాను చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చుకోవాలన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం అంటే పవర్ సెంటర్, పవర్ హౌస్ కాదని, కో ఆర్డినేషన్ చేసుకోవడం వారి బాధ్యత అన్నారు. కనుక ఇష్టరీతిన మాట్లాడకూడదని సూచించారు.

కవితపై చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. అయితే కవితపై బీజేపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా.. ఆమె అన్న కేటీఆర్ ఉరుకులు పరుగుల మీద ఢిల్లీకి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. కవితను అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పకుండా నేతల్ని ఢిల్లీకి పంపడంలో ఆయన ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. అరబిందో శరత్ చంద్రారెడ్డి గానీ, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వాళ్ల అబ్బాయి, ఇటు రామచంద్ర పిళ్లైగానీ, బోయినపల్లి అభిషేక్, ఇందులో ఇన్వాల్స్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఢిల్లీ లిక్కర్ కేసులో ఏం సంబంధం ఉందో చెప్పాలన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో క్లీన్ చిట్ గా బయటకు రావాలన్నారు. బీజేపీపై ఎదురుదాడి చేయడానికి ఇది సమయం కాదని, ఇంకా ఆరు, ఎనిమిది నెలల టైం ఉందన్నారు అర్వింద్. మంత్రి కేటీఆర్ ప్రజల పాలన కోసం అందుబాటులో ఉండాలని, కానీ చెల్లెలు కవితను కాపాడుకోవడం కోసం ఢిల్లీకి రావడం ఏంటని ప్రశ్నించారు. భవిష్యత్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ పై తెలంగాణలో ప్రచారం జరుగుతుందని, అలాంటి వ్యక్తి ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కవితను కాపాడుకోవడం కోసం ఢిల్లీలో చక్కర్లు కొట్టడం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు.

మరో వైపు బీఆర్‌ఎస్‌ శ్రేణులు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. పలుచోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బండి సంజయ్‌ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నీ భార్య, తల్లిని ముద్దు పెట్టుకుంటే ఊరుకుంటావా అంటూ ఆగ్రహంగా మాట్లాడాడు. మరోవైపు ఈడీ విచారణ విషయాన్ని బీఆర్‌ఎస్‌ డైవర్ట్‌ చేసేందుకు విఫలయత్నం చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు చేసిన ఆందోళనల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. సారా దందా చేసిందే కాక, ఇప్పుడు తెలంగాణలో నిరసనలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

  • దీనిపై బండి సంజయ్ రియాక్షన్..?

ఇప్పటికే బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పు పడుతూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఆయనపై కేసులు నమోదు చేశారు. మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీ నుంచి కూడా బండి సంజయ్ కు సెగ ప్రారంభం కావడం ఆ పార్టీలో పరిస్థితులకు అద్దం పడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బండి సంజయ్ ఏకపక్ష ధోరణి వల్ల పార్టీకి ఎంత లాభం కలుగుతుందో అంత కంటే ఎక్కువ నష్టం జరుగుతోందని ఆ పార్టీలో కొంత మంది ఫైర్ అవుతున్నారు అయితే బండి సంజయ్ పైనే హైకమాండ్ నమ్మకం ఉంచుతోంది.

ఆయననే టీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగించాలని హైకమాండ్ నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగానే అర్వింద్ కూడా అసంతృప్తికి గురయ్యారని తెలుస్తోంది. అధ్యక్ష పదవి పవర్‌ సెంటర్‌ కాదు.. కో ఆర్డినేషన్‌ సెంటర్‌ అని అర్వింద్ చెబుతున్నారు. అర్వింద్ కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. బండి సంజయ్ కు స్వపక్షంలో విపక్షం పెరిగిపోవడం ఆయన వర్గానికి మింగుడు పడటం లేదు. అరవింద్ మాటలపై ఇప్పుడు బీజేపీలో తీవ్ర చర్చ సాగుతోంది. అరవింద్ బహిరంగంగా సంజయ్ మాటల‌ను ఖండించడంపై సంజయ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

వీరిద్దరి మధ్య ఇంత కాలంగా సాగుతున్న కోల్డ్ వార్ ఎట్టకేలకు బహిరంగమైందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర బీజేపీలో నేతల మధ్య విభేదాలు ఉన్నాయని చాలారోజుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వంపై కొంత మంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరు పట్ల కొందరు కీలక నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే… ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిచిన పార్టీ పెద్దలు, విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

అయితే.. అధిష్టానం ఆర్డర్స్ తర్వాత కూడా రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాల పూర్తిగా సద్దుమణగలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా… నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. బండి సంజయ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు…ఈ వాదనలకు బలం చేకూర్చుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యల ద్వారా పార్టీలో అందరినీ కలుపుకొని పోవాలని, నిర్ణయాలు సమష్టిగా తీసుకోవాలనే విషయాన్ని ధర్మపురి అరవింద్ పరోక్షంగా చెప్పారని టాక్ వినిపిస్తోంది.

దీనిపై బండి సంజయ్ రియాక్షన్ ఏమిటన్నదే హాట్ టాపిక్ గా మారింది..

Must Read

spot_img