బెజవాడ రాజకీయాల్లో ఒకే పార్టీలో తిరుగులేని ఇద్దరు నేతల మధ్య టగ్ ఆఫ్ వార్ మొదలైందా..? దేవినేనిపై కేశినేని ఫైర్ వెనుక .. పెద్ద వ్యూహమే ఉందని టాక్వి నిపిస్తోంది. మరి ఇంతకీ దేవినేనిపై కేశినేని చేసిన వ్యాఖ్యలు ఏమిటో చూద్దామా..
దేవినేని ఉమా భవిష్యత్ కార్యచరణ ఏంటి?
విజయవాడ రాజకీయాల్లో టీడీపీకి తిరుగులేని పట్టు ఉంది. అయితే అదేసమయంలో నేతల మధ్య విబేధాలు సైతం ఓ రేంజ్ లో ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే. ఎప్పుడూ నేతల మధ్య విసుర్లు, రచ్చ కామన్ గా మారిపోయింది. తాజాగా దేవినేనిపై కేశినేని పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. దీంతో టీడీపీ పెద్దలకు టెన్షన్ మాత్రం తప్పడం లేదు. దేవినేని ఉమామహేశ్వరరావు…టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేత. అయితే ఈ సారి ఎన్నికల్లో ఆయన ప్రస్థానం ఎలా ఉంటుంది. పార్టీ నేతల్లో ఉమాపై అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది. అందరూ అంటున్నట్లే ఈ సారి ఉమాకు సీట్ లేదా?
పార్టీకి పని చేయటం వరకే ఆయన పరిమితమా అనే సందేహాలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. దేవినేని ఉమా భవిష్యత్ కార్యచరణ ఏంటి? పార్టీలో ఆయన పాత్ర ఎలా ఉండనుంది.. అనే అంశాలు టీడీపీలో చర్చకు దారితీస్తున్నాయి. గత ఎన్నికల వరకు దేవినేని ఉమా టీడీపీలో అత్యంత కీలకమైన నేతగా వ్యవహరించారు. మంత్రిగా కూడా పని చేయటంతో ఆయనకు ఎదురులేదన్నట్లుగా వాతావరణం కనిపించింది. కానీ రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదంటారు. ఇప్పుడు ఆయనకు పార్టీలో సీటు లేదన్నట్లుగా వాతావరణం మారిపోయింది.
సిట్టింగ్ నియోజకవర్గం అయిన మైలవరం నుంచి దేవినేని ఉమాను పోటీ చేయించేందుకు స్దానిక టీడీపీ నేతలే సుముఖత వ్యక్తం చేయటం లేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో తాను అధికారంలో ఉన్నప్పుడు అసలు పట్టించుకోలేదని, క్యాడర్ ను అమ్మా…ఎంటమ్మా…అంటూ దూరం పెట్టేశారని, దీంతో ఇప్పుడు ఆయన తిరిగి అదే నియోజకవర్గంలో పోటీకి దిగుతుంటే, మా పరిస్దితి ఏంటి అన్నదానిపై క్యాడర్ లో కూడా గందరగోళం నెలకొందని అంటున్నారు. మరోవైపు మైలవరం నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో ఇమడలేక పక్క చూపులు చూస్తున్న వసంత కృష్ణ ప్రసాద్ పై టీడీపీ నేతల ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు.
టీడీపీ నుంచి దేవినేని ఉమాను ఓడించేందుకు వైసీపీ గత ఎన్నికల్లో వసంతను రంగంలోకి తీసుకువచ్చింది. అయితే మారిన రాజకీయ పరిస్దితుల్లో వసంతకు టీడీపీలో లైన్ క్లియర్ అయ్యిందనే ప్రచారం ఇప్పుడే ఊపందుకుంది. ఇదే సందర్బంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వసంత ఏ పార్టిలో ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉన్నారా లేక, స్వతంత్రంగా ఉన్నారా, అది కాకపోతే టీడీపీలో ఉన్నారా ?అని కేశినేని ప్రశ్నించారు. దీంతో టీడీపీలోకి వసంతను తీసుకురావటం కోసమే నాని ఈ కామెంట్స్ చేశారని చెబుతున్నారు. తద్వారా దేవినేనికి చెక్ చెప్పాలన్నదే ఆయన ఉద్ధేశ్యమని టాక్ వినిపిస్తోంది.
తాజాగా టీడీపీలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఎక్కువ శాతం సీట్లు కొత్త వారికి, యువతకు ఇవ్వాలని నిర్ణయించారని చెబుతున్నారు. అందులో భాగంగానే అత్యధిక నియోజకవర్గాలకు సీనియర్లను పక్కన పెట్టి, వీలైతే వారి వారసులు లేదంటే యువతకు సీట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు నాయకులు ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగానే విజయవాడ ఎంపీ కేశినేని నాని దేవినేని ఉమాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వారయినా సరే పార్టీ నిర్ణయం మేరకు వ్యవహరించాలని, పార్టీని గెలిపించటమే ప్రధాన లక్ష్యం కావాలని అన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో దేవినేని ఉమా ఈ సారి ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు త్యాగం చేయక తప్పదా అనే అనుమానాలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీచేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు నాని. ఎన్నికలకు చివరి మూడు నెలల్లో అభ్యర్థులు ఖరారు అవుతారని.. సోషల్ మీడియా వచ్చాక ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
చివరి మూడు నెలల్లో రాజకీయంగా పరిస్థితులు మారిపోతాయన్నారు నాని. ప్రభుత్వం మారాలంటే సీనియర్లంతా త్యాగాలకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. కలుపుకెళ్లడం అనేది రెండు వైపులా ఉండాలని.. ఐలవ్ యు.. యు డోంట్ లవ్ మి అంటే కుదరదు అన్నారు. తానే సామంతరాజునని బిల్డప్ ఇస్తే కృష్ణానదిలో ఈడ్చికొడతారని.. ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు వైసీపీ ఎమ్మెల్యేలు పిలిచినా తాను వెళ్తాను అన్నారు. కేశినేని నాని వ్యాఖ్యల్ని బట్టి దేవినేని ఉమాపై పరోక్షంగా సెటైర్లు వేశారనే చర్చ జరుగుతోంది. కొద్దిరోజులుగా మైలవరం టీడీపీలో రాజకీయాలు హీట్ పెంచాయి.
మాజీ మంత్రి దేవినేని ఉమాకు వ్యతిరేక వర్గం కొద్దిరోజులుగా దూకుడు పెంచింది. గొల్లపూడికి చెందిన టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు యాక్టివ్ అయ్యారు. ఈ మధ్యే బొమ్మసాని ఓ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో మైలవరం టిక్కెట్ స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్‌ను తీసుకొచ్చారు. పరోక్షంగా దేవినేని ఉమాను టార్గెట్ చేశారు. సొంత పార్టీలోనే వ్యతిరేకత వెల్లువెత్తడంతో, కేశినేని సైతం అందుకు మద్ధతు పలుకుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, బొమ్మసాని సుబ్బారావు కాంగ్రెస్ సీనియర్ నేతగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆయన .. మైలవరం సీటు వస్తుందని భావించారు. కానీ సీటు రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి ఓడిపోయారు..
ఆ తర్వాత వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. 2019లో కూడా టికెట్ ఆశించినా నిరాశ తప్పలేదు. ఈసారి మైలవరం నుంచి తాను కూడా రేసులో ఉన్నానని బొమ్మసాని సంకేతాలు పంపుతున్నారు. ఇక కృష్ణా జిల్లా రాజకీయాల్లో కేశినేని నాని, దేవినేని ఉమా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఈ వైరం ఈనాటిది కాదు. వాళ్లిద్దరి మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా వుంటాయి. ఏ మాత్రం అవకాశం వచ్చినా పరస్పరం రాజకీయంగా దెబ్బతీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. గత ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి కేశినేని నాని గెలుపొందగా, ఆయన శత్రువు దేవినేని ఉమా మైలవరం నుంచి
ఓడిపోయారు. కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా వైఖరిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు రానున్న ఎన్నికల్లో సీటు ఇవ్వొద్దనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒకవేళ కాదు కూడదని ఉమాకు టికెట్ ఇస్తే ఓడించేందుకు సొంత పార్టీ నేతలు కాచుక్కూచున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దేవినేనిపై కేశినేని నాని పరోక్షంగా దేవినేనిపై హాట్ కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో కేశినేని కుమార్తెకు విజయవాడలో అసెంబ్లీ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కేశినేని నాని ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఆసక్తిగా లేరని సమాచారం. ఆయనతో టీడీపీ నేతలకు విభేదాలున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యే స్థానాన్ని ఆయన కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలిసింది.
ఎటూ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో ఉమాకు మైలవరం సీటు దక్కకుండా చేయాలనే ఎత్తుగడ వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేశినేని నాని వ్యాఖ్యలు కొత్తేమి కాకపోయినప్పటికి, ఆయన దేవినేని ఉమాను టార్గెట్ చేసి మాట్లాడటం పార్టీలో చర్చనీయాశంగా మారింది. బెజవాడలో టీడీపీలో
ఎప్పటికప్పుడు కొత్త రచ్చ నడుస్తూనే ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన నేతలు..సొంత పార్టీలోని నేతలతో ఫైట్ చేస్తారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఈ గ్రూపు గొడవలకు అడ్డు అదుపు ఉండదు.
తాజాగా దేవినేనిపై పరోక్ష వ్యాఖ్యలతో కేశినేని మరో రచ్చకు తెర తీసినట్లేనని టాక్ వినిపిస్తోంది. తాజా పరిణామాలతో దేవినేనికి వసంతతో చెక్ పెట్టాలనే వ్యూహంలో కేశినేని ఉన్నారన్న చర్చ సొంత కేడర్ లో వినిపిస్తోంది. అందుకే వసంత ఫ్యామిలీతో భేటీలు, పరోక్ష వ్యాఖ్యలన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. ఈ రచ్చపై అధిష్టానం ఏం చేయనుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.