ఒకప్పుడు డిజైనర్ బేబీస్ గురించి బాగా ప్రచారం జరిగింది. కోరుకున్న ఆకారం ఆరోగ్యంతో పండంటి పిల్లల కోసం ఎవరు మాత్రం ఆశపడరు..అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.. అసలు జబ్బులే రాని, మరణమే లేని బిడ్డను స్రుష్టించే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రయోగాలు స్రుష్టికి ప్రతి స్రుష్టి చేయడం లాంటిదేననీ, అలా చేయడం ప్రక్రుతి విరుద్దమనీ..ఇది ప్రపంచానికి మంచిది కాదని అంటున్నారు మేధావులు..
మీకు జబ్బులే రాని, మరణమే లేని బిడ్డ కావాలా? అయితే మరికొంత కాలం ఎదురు చూడండి అది సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు.
నిజమే ఎవరైనా ఇలాంటి పిల్లలను కంటే ఇక సమస్యలే ఉండవని ఆలోచించడం సహజమే..కానీ ఇది మనిషి తన స్వార్థం కోసం చేసే ప్రయోగాలే అంటున్నారు విశ్లేషకులు. మనిషి తన సుఖ, సంతోషాల కోసం చేస్తున్న ప్రయోగాలు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నాయో ప్రపంచం పట్టించుకోవడం లేదు. ఒక శతాబ్ద కాలంలోనే భూగోళంలో వేల సంవత్సరాలకు సరిపడా విధ్వంసం సృష్టించడం జరిగిపోయింది.
ప్రస్తుతం.. సహజసిద్ధమైన ప్రక్రియకు భిన్నంగా డిజైనర్ బేబీస్‌ను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది స్రుష్టికి ప్రతి స్రుష్టి చేయడం లాంటిదే అంటున్నారు.
ఈ తరహా ప్రయోగాలు ప్రపంచానికి మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏ సమస్యలూ రాని డిజైనర్ బేబీస్‌ను స్రుష్టిండాన్ని మాత్రం కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇదెలా ఉంటుందంటే..ఇంట్లో వాడుకునే వాషింగ్ మెషిన్ లేదా ఫ్రిజ్ కొనాలంటే షోరూమ్‌కి వెళ్ళి రకరకాల కంపెనీలకు చెందిన వాటిని పరిశీలించి దేనిలో ఉత్తమమైన ఫీచర్స్ ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకుని ఇంటికి తెచ్చుకుంటాం.
సరిగ్గా అలాగే రాబోయే రెండు మూడు దశాబ్దాల తర్వాత చంటిబిడ్డల్ని తయారు చేసే కంపెనీలు పుట్టుకొస్తాయని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బిడ్డలు కావాలనుకున్న దంపతులు ఆ కంపెనీకి వెళ్ళి వారు తయారు చేస్తున్న బిడ్డలకు సంబంధించిన వివరాలను పరిశీలించుకునే చూసే అవకాశం రానుంది.

పిల్లలకు సంబంధించిన వివరాలుండే బ్రోచర్స్ చూసి తమకు కావాల్సిన లక్షణాలున్న బిడ్డల్ని.. లేదంటే రకరకాల కాంబినేషన్లతో కూడిన బిడ్డల్ని తయారు చేయాలని కంపెనీలకు ఆర్డర్ చేసే పరిస్థితులు వస్తాయంటున్నారు. నవ మాసాలు మోసి బిడ్డల్ని కనాల్సిన అవసరం ఇకపై ఉండబోవడం లేదు.
ఇప్పటిలాగా సరోగసి..అంటే..అద్దె గర్భం వివాదాలు కూడా ఏ మాత్రం ఉండవు. మనకు కావాల్సిన బేబీని నచ్చినట్లు డిజైన్ చేసుకుని తయారు చేయించుకోవచ్చు. అయితే ఇటువంటి అభివృద్ధి సమాజానికి మంచిదేనా? అన్న ప్రశ్న తన పరిధిని పెంచుకుంటోంది.
అసలు ఇటువంటి ప్రయోగాలు నిజంగా సాధ్యమవుతాయా? మానవ శరీర నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనది. అది తల్లి గర్భంలో సహజసిద్దంగా తయారవుతుంది.
లేబొరేటరీలో వైరస్‌లను సృష్టించినంత తేలికగా…మనిషి జన్యువులను మనకు కావాల్సిన విధంగా ఎడిటింగ్ చేసుకోవడం కుదిరే పనేనా?
అంటూ అనేక ప్రశ్నలు మేధావులు, సామాజిక వేత్తలు, సైంటిస్టుల నుంచి వినిపిస్తున్నాయి. అసలిటువంటి ప్రయోగాలు నైతికమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొక్కలకు సంబంధించి జన్యుపరమైన మార్పులతో మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతున్నాం. అయితే మనుషుల విషయానికి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్లుగా జన్యువుల్లో మార్పులు చేయడం అంత తేలికైన విషయం కాదంటున్నారు అనేక మంది సైంటిస్టులు.
ఒక వ్యక్తికి తల్లి దండ్రులనుంచి..తరతరాలుగా వస్తున్న మానసిక, ఆరోగ్య లక్షణాలు, అందమూ, తెలివితేటలు, రంగు, పొడుగు విషయాల్లో మార్పులు చేయడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనిషికి సంబంధించిన ప్రతి లక్షణానికీ కొన్ని వందలు లేదా వేల జన్యువులు కారణమవుతాయి. మనిషి ఎత్తుని ప్రభావితం చేసే జన్యు వైవిధ్యాలు 93 వేల వరకు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనల్లో 93 వేలలో 697 జన్యువులను మాత్రమే గుర్తించగలిగారు. జన్యు పరివర్తన ఎంత సంక్లిష్టమైన వ్యవహారమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

కాబట్టి డిజైనర్ బేబీస్ అన్న మాట ప్రస్తుతానికి సైన్స్ ఫిక్షన్‌కే పరిమితం అని తేల్చేస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు. కానీ ఓ వంద సంవత్సరాల క్రితం ఇప్పుడున్న టెక్నాలజీలు ఓ కలగానే ఉండేవి. అవి ఇప్పుడు మన ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ సాధ్యం కాని డిజైనర్ బేబీస్ ని తయారుచేయడం సాధ్యపడే అవకాశం లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు.