Homeజాతీయంఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్ …

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్ …

రాఘవరెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుందా?

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహరంతో మాగుంట రాఘవరెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుందా? దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన మాగుంట కుటుంబంలో…ఎన్నడూ ఊహించని విధంగా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఆ కుటుంబ ప్రతిష్టకు మచ్చకానున్నాయా? సొంత పార్టీలో తగ్గిన ప్రాధాన్యతతో పాటు లిక్కర్ స్కాం కేసులో కుమారుడి అరెస్ట్ తో మాగుంట కుటుంబ

రాజకీయ భవితవ్యంపై నీలినీడలు అలమకోనున్నాయా?

మాగుంట కుంటుంబం అంటే ప్రకాశం జిల్లాలో తెలియని వారుండరు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ నేపధ్యం ఉన్న ఫ్యామిలీ మాగుంట. మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్థన్‌ రెడ్డి ప్రోత్సాహంతో నెల్లూరుకు చెందిన మాగుంట సుబ్బరామిరెడ్డి 1991లో రాజకీయ రంగప్రవేశం చేశారు. తనకు ఎలాంటి పరిచయాలు లేని ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ టిక్కెట్‌ కేటాయించగా, పార్టీ ఆదేశాలతో పోటీ చేశారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట కిలోమీటర్ల మేర వచ్చిన వాహన ర్యాలీ..

అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. స్థానికేతరుడైనా తక్కువ కాలంలోనే లోక్‌సభ పరిధిలోని గ్రామాలు, పట్టణాలలో పర్యటించి, ప్రజల కష్టాలు, బాధలు తెలుకుని అండగా ఉంటాననే హామీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ ప్రభంజనం వీస్తున్నా.. ప్రజల మన్ననలను మాగుంట పొందారు. లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. లోక్‌సభ సభ్యుడంటే ప్రజలకు కనిపించరనే సంప్రదాయానికి సుబ్బరామిరెడ్డి ఫుల్‌స్టాప్ పెట్టారు. ఒంగోలులో ఇల్లు నిర్మించుకుని, ప్రజలకు అందుబాటులో ఉన్నారు.

ఎన్నికల వేళ ప్రజల కష్టాలను చూసిన మాగుంట.. ఓ పక్క ప్రభుత్వ నిధులతో వారి కష్టాలను తీరుస్తూనే.. మరో పక్క మాగుంట చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి.. విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. పశ్చిమ ప్రకాశం జిల్లాలోని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. విద్యకు పెద్దపీట వేశారు. ఎంఎస్‌ఆర్‌ పేరుతో జూనియర్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసి విద్యాదాతగాపేరొందారు.

1995 డిసెంబర్‌ 1న ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నేతలతో ముచ్చటిస్తున్న సమయంలో నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో సుబ్బరామిరెడ్డి మృతి
చెందారు. ఆతర్వాత 1996లో ఆయన సతీమణి పార్వతమ్మ ఒంగోలు లోక్‌సభ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో ఒంగోలు లోక్‌సభ నుంచి సుబ్బరామిరెడ్డి చిన్న తమ్ముడు శ్రీనివాసుల రెడ్డి పోటీ చేసి గెలిచారు.

1998,2004,2009లలో కాంగ్రెస్‌పార్టీ తరఫున, 2019లో వైసీపీ తరఫున శ్రీనివాసుల రెడ్డి ఎంపీగా గెలిచారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించారు.ప్రస్తుతం సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మాగుంట రాజకీయ వారసత్వాన్ని తమ్ముడు శ్రీనివాసులరెడ్డి కొనసాగిస్తున్నారు.మృదుస్వాభావిగా,పార్టీలకతీతంగా అందరివాడిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరుతెచ్చుకున్నారు.
ఇంత వరకు బాగానే వున్నా ఇటీవల కాలంలో రాజకీయ పరిణామాలు మాగుంట శ్రీనివాసులరెడ్డిని కుంగుబాటుకు గురిచేస్తున్నాయి.

ప్రధానంగా అధికార పార్టీలో వున్నప్పటకీ సొంత పార్టీ ప్రజాప్రతినిధులు మొదలు అధికారుల వరకు ఎక్కడా ఆయనకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడం ఆయనతో అనుచరగణానికి ను ఆవేదన కలిగిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి డామినేషన్ న్ను మాగుంట తట్టుకోలేకపోతున్నారు. వైసిపి తరుపున ఎంపిగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా ఆయన మాటకు పార్టీలోను, అధికారుల్లో గౌరవం లేకపోవడం ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మాగుంట ఏకార్యక్రమం చేపట్టినా అధికార పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న పోటీ, డామినేషన్ ఆయనకు ఆవేదన కలిగిస్తోంది. ఆయన చేపట్టిన ప్రతి పనిలో సొంత పార్టీ వారే అడ్డు తగలడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 2019 ఎన్నికలలో గెలిచిన నాటి నుంచి ఒంగోలులో జరిగే అధికారిక కార్యక్రమాల్లో శ్రీనివాసరెడ్డికి సరైన గౌరవం లేదని ఆయన వర్గం ఆవేదన చెందుతోంది. ఈక్రమంలోనే ఇప్పడు ఢిల్లీ లిక్కర్స్ స్కాం ఇప్పుడు మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

తన 30 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో ఎక్కడ తన వ్యాపారంలో అవినీతి లేకుండా మచ్చలేని వ్యాపారం చేశానని చెప్పినప్పటికీ లిక్కర్ కేసు మాత్రం మాగుంట కుటుంబ వారసత్య రాజకీయభవిష్యత్ పై తీవ్రప్రభావాన్ని చూపుతోందనే చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు లిక్కర్ స్కాం కుంభకోణంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేరుపై ప్రధానంగా చర్చ నడిచింది.

కేసు విచారణలో భాగంగా గతంలో దిల్లీ, చెన్నై, నెల్లూరు ప్రాంతాల్లోని ఎంపీ మాగుంట కార్యాలయాలు, నివాసాలు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. 70 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో తమ కుటుంబం ఉన్నప్పటికీ దిల్లీ స్కాంతో తమకు సంబంధంలేదని ఎంపీ మాగుంట చెప్పుకొచ్చారు . ఈ వివాదంలోకి లాగడం ఉత్తరాది వ్యాపార వర్గాల కుట్రలో భాగమని ఆరోపించారు.మాగుంట అనే ఇంటిపేరుతో ఎవరైనా అనుమతులు దక్కించుకుంటే దానికి తామెలా బాధ్యులమవుతామని ప్రశ్నించారు.

ఇది జరిగిన కొన్నిరోజులకే ఆయన కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. కీలక వ్యక్తుల అరెస్టు సమయంలో దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్టు, ఛార్జిషీట్లు, అనుబంధ ఛార్జిషీట్లలో ఎంపీ మాగుంట పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే వాటిని మాగుంట కొట్టిపారేస్తూ వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అరెస్టుతో మాగుంట రాఘవరెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుందనే టాక్ నడుస్తోంది.

దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన మాగుంట కుటుంబంలో…ఎన్నడూ ఊహించని విధంగా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఆకుటుంబ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని చర్చ జోరుగా జరుగుతోంది. అయితే లిక్కర్ స్కాంలో మొదటి నుంచి మాగుంటపై ఆరోపణలు వస్తున్నా పార్టీ పరంగా ఎలాంటి మద్దతు లేకపోవడం మాగుంట రాజకీయ కొంగుబాటుకు గురిచేసింది. మొదటి నుంచే పార్టీలో మాగుంటపై వచ్చిన ఆరోపణలను ఖండించే నాధుడే కరువడం పార్టీలో మాగుంటకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోందనే చెప్పుకోవచ్చు.

ఓవైపు వ్యాపారం, మరోవైపు రాజకీయం రెండూ మాగుంట కుటుంబ రాజకీయ భవిష్యత్తు ను ప్రశ్నార్థకంలో నెట్టేస్తోందనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఢిల్లీ
లిక్కర్‌ స్కాంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి అరెస్టు కావడం ప్రస్తుతం జిల్లారాజకీయాల్లో సంచలనంగా మారింది. రాజకీయ వర్గాలతోపాటు,సాధారణ ప్రజల్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది. అరెస్టుతో వైసీపీ వర్గీయుల్లో కలకలం ఆరంభమైంది. రాజకీయ అరంగేట్రంలోనే రాఘవరెడ్డి మెడకు లిక్కర్ స్కాం కేసు చుట్టుకోవడం చర్చనీయాంశమైంది.

ఇదే అంశం వైసీపీలోనూ, ప్రత్యేకించి మాగుంట కుటుంబ అభిమానుల్లోనూ అందోళనలను రేకెత్తిస్తోంది. గత సాధారణ ఎన్నికల సమయంలో కేవలం ఎన్నికల్లో ప్రచారానికి మాత్రమే పరిమితమై ఆ తర్వాత వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్న రాఘవరెడ్డి రెండు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయరంగ ప్రవేశం చేశారు. మాగుంట రాజకీయ వారసుడిగా కొడుకు ఉంటాడని మాగుంట చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ అంగీకరిస్తే ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి రాఘవరెడ్డి
పోటీ చేస్తారని కూడా ఎంపీ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. ఈక్రమంలోనే మాగుంట రాఘవరెడ్డి జిల్లాలో పర్యటిస్తూ వచ్చారు. ప్రధానంగా కోవిడ్ సమయంలో అనందయ్య మందు పంపిణీతో పాటు కొవిడ్ బారిన పడి చికిత్సపోందుతున్న వారికి వైద్యసదుపాయాలను ఆందించారు.

ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలపై రాఘవరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలుచేశారు. ఆయన వ్యాపారాలపై దృష్టిసారించి పర్యటనలు తగ్గించినా, ఎన్నికల్లో పోటీ చేస్తారనే సంకేతాలు ఇస్తూనే వస్తున్నారు. ఇప్పుడు కేసులో అరెస్టు కావటం ఆయన రాజకీయ భవితవ్యం ఎలా ఉండనుందనే రాజకీయ చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది.

Must Read

spot_img