ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధం ఉందనే విషయాన్ని ఈడీ రిమాండ్రిపోర్ట్ లో పేర్కొనడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్‌లో అనేక మంది పేర్లు బయటికి వచ్చాయి. ఈడి ఇప్పటికే ఒక్కొక్కరిని విచారిస్తోంది. విచారణలో సేకరించిన ఆధారాలను పరిశీలిస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఫోన్‌సవ్యవహారం, ట్రావెలింగ్ సంబంధించినటువంటి ఆధారాలు, సంభాషణలకు సంబంధించి ఆడియో, వీడియో క్లిప్పులు, బస చేసిన హోటల్ జాబితా ఇలా అన్నింటిని కోర్టుకు అధికారులు అందజేశారని తెలుస్తోంది. నిజానిజాలు ఎలా ఉన్నా కవితకు ఇందులో ఎంత మేరకు సంబంధం ఉన్నదనేది దర్యాప్తు సంస్థ విచారణలో వెల్లడి కానుంది. కానీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు బయటికి రావడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధానంగా ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని పొలిటికల్ గైన్ పొందాలని అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ రెండు ప్రయత్నం చేస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌లో కవితను ఎంత వీలైతే అంత లోతుకు లాగాలని ప్రయత్నం చేస్తుంది బిజెపి.
దీనిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు రావడమే కారణమా…?
కేంద్రంలో అధికారంలో ఉండి దర్యాప్తు సంస్థలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుందని ఇప్పటికే టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ బిజెపి మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. దర్యాప్తు సంస్థలు తమ పని తాను చేసుకుంటున్నాయని పైకి చెబుతున్నాయి. కానీ గత కొంతకాలంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన వ్యవహారాలను ఒక్కసారి చూస్తే ముఖ్యంగా పశ్చిమబెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇలా బిజెపేతర పాలిత రాష్ట్రాల్లో, అదేవిధంగా బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో విపక్షాల ముఖ్యనాయకులను దర్యాప్తు సంస్థలు దాడులు చేయడాన్ని టీఆర్ఎస్ గుర్తుచేస్తుంది.
తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీని, టిఆర్ఎస్ నాయకుల్ని బద్నాం చేయడం కోసమే దర్యాప్తు సంస్థలను తమ జేబు సంస్థలుగా బిజెపి వాడుకుంటోందని నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలకు పక్కన పెడితే, ఇప్పుడు తాజాగా కల్వకుంట్ల కవిత పేరు బయటికి రావడం దీన్ని ఎన్నికల వరకు ఒక ప్రచార అస్త్రంగా వాడుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లను చేసుకుంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్న బిజెపి… అంది వచ్చిన అవకాశాన్ని వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది. బిజెపి అగ్ర నేతలు కూడా పదేపదే కేసిఆర్ కుటుంబాన్ని టార్గెట్గ్ చేస్తూ ఇటీవల కాలంలో ఘాటుగానే మాట్లాడుతున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో 60కుపైగా సీట్లు సాధించి, అధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకు లిక్కర్ స్కామ్ ని ఒక ప్రచార అస్త్రంగా మలుచుకోనున్నారు. ఇతర విషయాల కంటే కేసీఆర్కు టుంబం, ఆయన పాలన, కుటుంబంలో ఉన్నవారు చేస్తున్న అవినీతి వ్యవహారాలను బట్టబయలు చేస్తే తెలంగాణ ప్రజల మన్ననలు పొందవచ్చని భావిస్తోంది బిజెపి.
తాజాగా ఈడీ రిపోర్టు మరింత రచ్చ చేయనుందా..?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎలాగైతే ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో టేపులు బయటపెట్టారో, లిక్కర్ స్కాంకు సంబంధించి కూడా బిజెపి నాయకులు రోజుకు ఒక వార్తను ప్రజల్లోకి వదలాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అంశం రాజకీయంగా మరింత దుమారాన్ని లేపే అవకాశం లేకపోలేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అటు బిజెపి ఇటు టిఆర్ఎస్ నాయకత్వం శ్రేణులకు సూచిస్తోంది. అయితే లిక్కర్ స్కాం వ్యవహారం ఎంత వీలైతే అంతగా ప్రచారం చేసి టిఆర్ఎస్ పార్టీని వీలైనంత ఎక్కువ బద్నాం చేయాలని బిజెపి భావిస్తోంది. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, లిక్కర్ స్కాం ఈ రెండు అంశాలు తెలంగాణలో ప్రధాన అంశాలుగా మారనున్నాయి. అయితే ఎన్నికల వరకు ఇదే హీటు కొనసాగే అవకాశం లేకపోలేదు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆధారాలు బయటపడటం, బయటకు వస్తున్న వీడియోలు, ఆధారాలు, వార్తలను తెలంగాణ సమాజం ఏ రకంగా చూస్తుంది అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా నిలిచింది.
అదేవిధంగా ఈ లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మూడు రాజకీయ పార్టీలు కూడా వీలైనంత ఎక్కువ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి. అయితే ప్రజలు వీటిని ఏ రకంగా నమ్ముతారు. ప్రజలు ఏరకంగా వీటిని రిసీవ్చేసుకుంటారు. తెలంగాణ సమాజం, తెలంగాణ ఓటర్లు ఈ అంశాలపై ఏ రకంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు అనేది ఓట్ల రూపంలోనే
తేలనుంది. ఎన్నికల అయ్యేవరకు ఈ చర్చ, ఈ పొలిటికల్ హీట్ తప్పేలా లేదు. ఇక ముందు ఇంకా ఎన్నిజరగనున్నాయో దర్యాప్తు సంస్థలకే తెలియాలి. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ అన్న చందంగా ఉంది వ్యవహారం. ఇదిలా ఉంటే, కల్వకుంట్ల కవితకు భవిష్యత్ కళ్ల ముందు కనిపిస్తోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మూడు నెలలుగా ఈ స్కాంలో కవిత ఉన్నట్లు ఆరోపణలు మాత్రమే వచ్చాయి. కానీ, తాజాగా ఈడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావించడంతోపాటు సౌత్ లాబీలో కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొంది. టెక్నికల్ ఎడిడెన్స్ దొరకకుండా 10 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. దీంతో ఇన్నాళ్లూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సీఎం కూతురును కాబట్టే తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కానీ, ఈడీ నివేదికలో పేర్కొన్న వివరాలతో కవిత దిమ్మతిరిగిపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సౌత్ లాబీకి కీలకంగా వ్యవహరించిన కవితను త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉందని ఈడీ వర్గాల సమాచారం. ఈ విచారణ ద్వారా స్కాంకు సంబంధించిన మరిన్ని వివరాలను బయటపెట్టాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడం దక్షిణాదిన ప్రకంపనలు సృష్టిస్తోంది.
దీంతో అరెస్టు తప్పదన్న టాక్ వెల్లువెత్తుతోందా..?
లిక్కర్ స్కాంలో చాలామంది టెక్నికల్ ఎవిడెన్స్ డ్యామేజ్ చేసినట్లు ఈడీ తన నివేదికలో పేర్కొంది. స్కామ్‌లో కీలక ఆధారాలైన సెల్‌ఫోన్లను నిందితులు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఇందులో అత్యధికంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అత్యధికంగా 14 సెల్‌ఫోన్లు ధ్వంసం చేసి టాప్ వన్‌లో నిలవగా, తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత 10 సెల్‌ఫోన్లు ధ్వంసం చేసి రెండో స్థానంలో నిలిచింది. మిగతా నిందితులు కూడా 2 నుంచి 6 ఫోన్ల వరకు ధ్వంసం చేశారని ఈడీ వెల్లడించింది. వీటిపై కూడా నిందితులపై టెక్నికల్ ఎవిడెన్స్ డ్యామేజ్ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఇన్నాళ్లూ లీకులకే పరిమితం అయ్యాయి. కానీ మొదటిసారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చింది ఈడీ. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన కవిత యథావిధిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై, కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మోదీ కంటే ముందు ఈడీ వచ్చిందని పేర్కొన్నారు. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జరుగుతుందని తెలిపారు. అంతటితో ఆగకుండా ఏం జరుగబోతుందో తనకు ముందే తెలిసినట్లు కేసులు పెట్టుకోండి.. అరెస్టులు చేసుకోండి.. జైల్లో పెట్టుకోండి అని వ్యాఖ్యానించారు.
ఈ మాటలు ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. కవిత అరెస్ట్ తప్పదా అని నేతలు గుసగుసలాడుతున్నారు. అందుకే అరెస్ట్ చేసుకోండి అంటూ కవిత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారా అని చర్చించుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును బీజేపీ నాయకులు గత సెప్టెంబర్‌లో ప్రస్తావించారు. వాటిని కవిత ఖండించారు. ముఖ్యమంత్రి కూతురును కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు ప్రెస్‌మీట్ అంటూ నాడు మీడియాకు సమాచారం ఇచ్చి.. తాను చెప్పాపల్సింది చెప్పి వెళ్లిపోయారు. ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో ప్రెస్‌మీట్ అంటూ కవిత మళ్లీ మీడియాకు సమాచారం ఇచ్చారు. అందరూ వచ్చాక.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రెండు పోన్ నంబర్ల వినియోగంపైగానీ, పది ఫోన్లను డ్యామేజ్ చేసిన విషయంపైగానీ ఆమె నోరు మెదుపలేదు. నగదు రవాణాకు సబంధించి ఈడీ పేర్కొన్న
అంశంపై కూడా మాట్లాడలేదు. కేవలం తప్పుడు కేసు అని మాత్రమే చెప్పుకున్నారు. ఈడీ నివేదిక తప్పయితే.. అందలో పేర్కొన్న అంశాలపై కచ్చితంగా కవిత మాట్లాడేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ కుటుంబ అవినీతిని టార్గెట్ గా చేసుకుని, కవితే అస్త్రంగా బీజేపీ పావులు కదుపుతోందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మరి కవిత .. నెక్ట్స్ స్టెప్ ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది.