మానవాళితో సహా స్రుష్టిలోని ప్రతీ వ్యవస్థలో ఒకదానినొకటి రక్షించుకునే ఏర్పాటు ఉంది. అది వాటి వాటి అవసరాలను బట్టి ఏర్పడి ఉంటుంది. అంతర్లీనంగా ప్రతీ జంతువు ఆవిర్భావానికి ఏదో కారణం ఉంటుంది. అలాంటిదే రాబందులు హైనాలు. వీటిని సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. ఇవి ఎదురుపడితే అరిష్టంగా భావిస్తారు. పైగా ఇవి అత్యంత క్రూరమైన జీవులుగా భావిస్తారు. కానీ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో రాబందులు, హైనాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. మీకు తెలుసా..ప్రమాదకరమైన రేబిస్ లాంటి వ్యాధుల వ్యాప్తిని కూడా ఇవి అడ్డుకోగలవు. మరి వాటికి తగిన ప్రాధాన్యాన్ని మనం ఇస్తున్నామా? అన్నది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్నగా అంటున్నారు జంతుప్రేమికులు. కళేబరాలను ఆహారంగా తీసుకునే జంతువులు, పక్షులను కొందరు చెడ్డవిగా చూస్తుంటారు.
రాబందులు, హైనాల పేరు చెప్పగానే అందుకే చాలా మంది అసహ్యించుకుంటారు. అవి సాధారణంగా బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉంటాయి. కళేబరాలు ఎక్కడుంటే అవి అక్కడికి అటోమెటిక్ గా చేరుకుంటాయి. చూస్తుండగానే ఆ ప్రదేశాన్ని నిరపాయంగా మార్చేస్తాయి. ఇవి దుర్మార్గపు జీవులని కొందరు అంటారు. మరికొందరు వాటిని చూస్తే భయపడుతుంటారు.
”గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా” నవలలో హైనాలను కళేబరాలను భక్షించే, కడుపుతో ఉండే జంతువులనూ వేటాడే, రాత్రిపూట పడుకొనేటప్పుడు మన మొహాలను పీక్కుతినే జంతువులు”గా ఎర్నెస్ట్ హేమింగ్‌వే రాయడం జరిగింది. ప్రాచీన కాలం నుంచి రాబందులను కూడా దురదృష్టానికి ప్రతీకగా, కళేబరాలకు గుర్తుగా చెప్పేవారు. అయితే, కళేబరాలను భక్షించే ఈ జంతువుల గురించి శాస్త్రవేత్తలు కొత్త విషయాలు తెలుసుకున్నారు. నిజానికి ఈ జంతువులకు మనం తగిన విలువ ఇవ్వడంలేదని వారు అంటున్నారు.
పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో, ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంలో ఈ జీవులు ముందుటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కళేబరాలను భక్షించడం ద్వారా వాటి నుంచి ప్రమాదకర సూక్ష్మజీవులు.. మనుషులు, జంతువులకు వ్యాపించకుండా, పర్యావరణంలో కలవకుండా ఇవి అడ్డుకుంటున్నాయి. తాజాగా చేపట్టిన అధ్యయనాల్లో ఈ జంతువుల వల్ల ఆరోగ్య, పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతున్నట్లు వెల్లడైంది. వీటి సంఖ్య తగ్గిపోవడంతో వచ్చే ముప్పులను కూడా ఈ అధ్యయనాలు ప్రధానంగా ప్రస్తావించాయి. ”జంతు కళేబరాలను తొలగించడంలో రాబందులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కళేబరాలను మెరుగ్గా పర్యావరణం నుంచి తొలగించే జంతుల్లో వీటిదే మొదటి స్థానం. రాబందుల సంఖ్య పెంచేందుకు ఇప్పుడు పలు సొసైటీలు కృషి చేస్తున్నాయి. ”ఈ జీవులు తమ శరీరంలో బరువులో 40 శాతం వరకు ఆహారాన్ని తీసుకోగలవు. మిగతా జంతువులు తమ శరీరంలో కేవలం 5 శాతం వరకే ఆహారాన్ని తీసుకుంటాయి. ఇది ప్రక్రుతి వీటికి కలిగించిన అదనపు సౌకర్యం అనుకోవ్చు.
అయితే, నేడు దక్షిణాసియా, ఆఫ్రికాలలో రాబందుల సంఖ్య చాలా వేగంగా తగ్గిపోతోంది. వీటి సంఖ్య తగ్గిపోవడం 1990లలో మొదలైంది. ఆ తర్వాత చాలా వేగంగా పడిపోతూ వచ్చింది. 1990 10 కోట్ల నుంచి 16 కోట్ల వరకు రాబందులు భారత్‌లో ఉండేవి. ”అసలు ఎటుచూసినా ఇవే కనిపించేవి. ”భారీ స్థాయిలో ఇవి కళేబరాలను ఆహారంగా తీసుకొనేవి. దీంతో పర్యావరణం శుభ్రంగా ఉండేది. ఇప్పుడా పరిస్తితి కనిపించడం లేదు. చనిపోయిన జంతువులు కుళ్లిపోయి దుర్వాసన వేయడం అంటే సదరు కళేబరం నుంచి బ్యాక్టీరియా వ్యాపిస్తున్నదని అర్థం చేసుకోవాలి. అది ప్రమాదకరం. అయితే, ఆ శతాబ్దం చివరికి వచ్చేసరికి ఒక్కసారిగా వీటి సంఖ్య పడిపోయింది. 1992 నుంచి 2007 మధ్య భారత్‌లోని మూడు ప్రధాన రాబందుల జనాభా 97 శాతం కంటే ఎక్కువే తగ్గిపోయింది.
అసలు ఇవి ఎందుకు చనిపోతున్నాయనే అంశంపై పరిశోధకులు దృష్టిసారించారు. వీటి శరీరాల్లో భార లోహాలు, పురుగు మందులు అవశేషాలు పేరుకున్నాయా? కాలుష్య కారకాలు ఎక్కువయ్యాయా? లాంటి అంశాలను పరిశీలించారు.
చాలా రాబందులు కిడ్నీలు విఫలం చెందడం వల్ల చనిపోతున్నట్లు పరీక్షల్లో వెల్లడైంది.
ముఖ్యంగా మనుషులు, జంతువుల్లో నొప్పుల నివారణకు తీసుకునే డైక్లోఫెనాక్ వీటికి ప్రాణాంతకంగా మారుతోందని గుర్తించారు. రాబందుల జీవక్రియా రేటులో అసాధారణగా చర్యలు శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి తమ శరీరాలలోకి చేరే డైక్లోఫెనాక్‌ను జీర్ణించుకోలేకపోతున్నాయి. ఫలితంగా వాటి కిడ్నీలు దెబ్బతింటున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
ఓ వాదన మేరకు రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో వీధి కుక్కలకు మేలు జరుగుతోందని అంటున్నారు. రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో వీధుల్లో జంతు కళేబరాల సంఖ్య పెరిగుతోంది. ఇవి వీధి కుక్కలకు ఆహారంగా మారుతున్నాయి. అయితే అది ఒకరకంగా ప్రమాదకరం. వాటి వల్ల మొత్తంగా మనుషుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది.
ఆ కుక్కల వల్ల మనుషుల్లో రేబిస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 20ఏళ్లలో భారీగా భారత్‌లో రేబిస్ కేసులు పెరగడానికి కారణం ఈ వీధికుక్కలేనని సర్వేలో తేలింది.
ఇంగ్లండ్‌లోని బాత్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం.. భారత్‌లో రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో దాదాపు 55 లక్షల వీధి కుక్కల సంఖ్య పెరిగింది. దీని వల్ల 1992 నుంచి 2006 మధ్య 3.85 కోట్ల కుక్కకాటులు నమోదయ్యాయి. భారత్‌లోని జాతీయ సర్వేను పరిశీలిస్తే భారత్‌లో పత్రి లక్ష మందిలో 123 మంది కుక్క కాటు అనంతరం ర్యాబిస్‌తో మరణించారు. ఒకప్పుడు రాబందులు మనదేశంలోని ప్రజలకు చాలా మేలు చేసేవి. జంతు కళేబరాలను విచ్ఛన్నం చేయడం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల వరకు.. చాలా పనుల్లో ఇవి ఉపయోగపడేవి.
కళేబరాలను లేకుండా చేయడం అన్నది ప్రక్రుతిలో చాలా ముఖ్యమైన విషయం. ఇవి వీధి కుక్కలకు ఆహారం కాకుండా చూసేవి. ఫలితంగా వీధి కుక్కల జనాభా కూడా అదుపులోనే ఉండేది. రేబిస్ వ్యాధికి చికిత్స, వీటి వల్ల సంభవిస్తున్న మరణాల విషయంలో పరిశోధకుల బృందం అంచనావేసింది. అటు ఆఫ్రికాలోనూ రాబందుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. అయితే, ఇక్కడి పరిస్థితులు, కారణాలు వేరు. ఆఫ్రికా ఖండంలో మొత్తంగా రాబందుల సంఖ్య 97 శాతం వరకు పడిపోయింది.
ఆఫ్రికా-యురేషియన్ రాబందుల్లోని 11 జాతుల్లో ఏడు నేడు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.
ఇక్కడ సింహాలు లాంటి భారీ జంతువులను చంపేందుకు ఉపయోగిస్తున్న విషపూరిత పదార్థాలు, రసాయనాలు రాబందులపైనా ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది. సింహాల దాడుల వల్ల తమ పశువులను కాపాడుకోడానికి రైతులు ప్రమాదకర విష పదార్థాలు, రసాయనాలను ఉపయోగిస్తున్నారు. జంతువుల కళేబరాలపై వీటిని చల్లుతున్నారు. కానీ,వీటిని తినడం వల్ల రాబందులు చనిపోతున్నాయి. మరోవైపు కొంతమంది మూఢ నమ్మకాలతో కూడా రాబందులను చంపేస్తున్నారు. చేతబడిలో రాబందుల తలకాయలను దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. రాబందులు లేనప్పుడు జంతువుల కళేబరాలను పీక్కుతినే హైనాలు, నక్కల సంఖ్య కెన్యాలో ఎక్కువ పెరిగినట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది.
రాబందులు లేనప్పుడు ఈ జంతువుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే, ఇక్కడ కళేబరాల్లోని ఎముకలను పూర్తిగా తినడం రాబందులకు మాత్రమే తెలుసు. అవి తిన్న తర్వాత అక్కడ ఈగలు కూడా వాలవు. మిగతా జంతువులు అంత శుభ్రంగా ఆహారాన్ని తినలేవు. రాబందుల వల్ల చేకూరే ఆరోగ్య ప్రయోజనాలపై ఎక్కువగా చర్చించుకోరు. పైగా వీటి వల్ల వాతావరణంపై పడే సానుకూల ప్రభావం గురించి చాలా మందికి తెలియదు. రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై ప్రభావం పడుతోంది.