HomePoliticsముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ విస్తరణ పై నిర్ణయం..!

ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ విస్తరణ పై నిర్ణయం..!

తెలంగాణ కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయా? ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ విస్తరణ పై నిర్ణయం తీసుకుంటారా? ఉన్నవారిలో కొందరికి ఉద్వాసన .. మరికొందరికి అవకాశం కల్పిస్తారా అంటే అవుననే సమాధానం వినిస్తోంది. టీఎస్ కేబినెట్ పై విస్తరణ, మార్పు వల్ల లాభం ఎవరికి, నష్టం ..

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని మరోసారి రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా బిఅర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. సంక్రాంతి తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేస్తారని ఉన్నవారిలో కొందరికి డిమోషన్ కల్పిస్తూనే కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. కొత్తవారికి అవకాశం కల్పించడం మంచిదే కానీ ఉన్న వారికి ఉద్వాసన పలుకుతారనే వార్తలపై కొందరు మంత్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.

ఈటెల రాజేందర్ పై కేసీఆర్ యాక్షన్, మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికిన తరువాత కేసీఆర్ మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరుపుతారని చాలా సార్లు పార్టీలో చర్చ జరిగినా కేసీఆర్ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఈటెల రాజేందర్ పోస్ట్ ను ఆర్ధికమంత్రి హరీష్ రావుకు అప్పగించారు సీఎం కేసీఆర్. దీంతో ఇప్పట్లో మంత్రివర్గం ఉండదనే క్లారిటీ అందరికి వచ్చింది. కానీ అది జరిగి కూడా దాదాపు ఏడాది అవుతుంది.

ఇక జనరల్ ఎన్నికలకు కూడా ఏడాది కాలం మాత్రమే ఉంది. ఏడాది ఎన్నికల ముందు మంత్రివర్గ విస్తరణ చేసి గతంలో ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన యువ నాయకులకు అవకాశం కల్పించడంతో పాటు సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు మంత్రులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం రెండేసి శాఖలకు భాద్యత వహిస్తున్నారు. అలా కాకుండా కీలకమైన వారికి ఒక్కో శాఖను కేటాయిస్తూ ఎన్నికల నిర్వహణ భాద్యత ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఉన్న వారిలో కొంతమంది మంత్రులపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

పనితీరు భాగాలేకపోవడం, జిల్లా రాజకీయాల్లో తలదూర్చడం, క్యాడర్ ను కలుపుకొని వెళ్లకపోవడంతో పాటు అవినీతి, భూ కబ్జా ఆరోపణలు వచ్చిన వారికి డిమోషన్ ఉంటుందనే చర్చ వినిపిస్తోంది. బహిరంగంగా కేసులు నమోదైన వారితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సర్వేలో మంత్రి ఆగడాలపై ఇప్పటికే వాళ్లకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ, మార్పు చేస్తే ఎవరికి ఉద్వాసన పలుకుతారు, కొత్తవారికి ఎవరికి అవకాశం కల్పిస్తారనేది మాత్రం ముఖ్యమంత్రికి తప్ప ఎవరికీ తెలియదనేది బిఅరెస్ నాయకుల వాదన.

బయటకు మేమే కాబోయే మంత్రులం అని చెప్పే వారికి సీఎం మంత్రులుగా ఈసారి అవకాశం ఇవ్వరని సీనియర్ నాయకులు చెప్పుకొస్తున్నారు..

మరోవైపు మొదటిసారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారికి జిల్లా రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు లేదా ముగ్గురికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇక కొత్త వారిలో ఇద్దరు ముగ్గురు ఉద్యమంలో పనిచేసిన వారని, వారినీ వారి సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకోని అవకాశం కల్పిస్తారనే తెలుస్తోంది. ఏది ఏమైనా మంత్రివర్గ విస్తరణ, మార్పుతో సీఎం కేసీఆర్ బిఅర్ఎస్ ఎన్నికల దూకుడు పెంచుతారనే చర్చ బలంగా వినిపిస్తోంది.

ఏడాదిన్నర క్రితం నుంచి తెలంగాణ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయని ఊహగానాలు వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూర్చాయి. అయితే అవి అప్పట్లో ఊహాగానాలకే పరిమితమయ్యాయి. కొందరు మంత్రులు పరిధి దాటి ప్రవర్తించినప్పటికీ, తమ హద్దులు మీరి వ్యవహరించినప్పటికీ ప్రగతి భవన్ వారిని ఏమీ అనలేదు.

దీనిపై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా మౌనంగానే ఉంది.. కానీ ఇటీవల కొందరి మంత్రుల వ్యవహార శైలి శృతి మించిన నేపథ్యంలో వారికి చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎలాగూ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సదరు మంత్రులకు ఉద్వాసన పలికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గించుకోవాలని కెసిఆర్ భావిస్తున్నట్టు వినికిడి. ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచి తమకు మంత్రి పదవి దక్కుతుందని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కొత్త కేబినెట్ సమీకరణాలే లక్ష్యంగా కేసీఆర్ ఎమ్మెల్సీలను భర్తీ చేశారని చర్చ కూడా జరిగింది.

అప్పట్లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ను ఎమ్మెల్సీ చేశారు. రాత్రికి రాత్రే కలెక్టర్ గా ఉన్న వెంకటరామిరెడ్డితో పదవీ విరమణ చేయించి ఎమ్మెల్సీ చేశారు. అసలు అవకాశమే లేదు అనుకున్న కడియం శ్రీహరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వీరందరికీ కూడా మంత్రి పదవులు దక్కుతాయని చాలామంది అనుకున్నారు. కెసిఆర్ కూడా ఏ క్షణమైనా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. దీంతో మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్న వారు నీరుగారి పోయారు.

మంత్రివర్గంలో ఎవరికి డిమోషన్, ఎవరికి అవకాశం..

ఇదిలా ఉంటే, తాజాగా బడ్జెట్ తర్వాత అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్తారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. అదే నిజమైతే సంక్రాంతి లోపే కేసీఆర్ మంత్రి వర్గాన్ని సంస్కరించే అవకాశం కల్పిస్తోంది. పరిస్థితి బాగోలేదు అనుకుంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లరని, ఒకవేళ అదే జరిగితే మంత్రి వర్గాన్ని విస్తరించే అంశంపై మరోసారి ఆలోచించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

సంక్రాంతి తర్వాత జనవరి 3 లేదా నాలుగో వారంలో మంచి రోజు చూసుకుని కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారని భారత రాష్ట్ర సమితిలోని కీలక నాయకులు చెప్తున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన వెంటనే కెసిఆర్ ఆ పని చేస్తారని ఆయన గురించి తెలిసిన వారు చెప్తున్నారు. తెలంగాణ మంత్రివర్గ మార్పుచేర్పులపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. 2021 ఏడాది నవంబర్‌లో ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేటప్పుడు పూర్తిగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమీకరణాలనే చూసుకున్నారన్న ప్రచారం జరిగింది. కేసీఆర్ కూడా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు.

మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేసినప్పటి నుండి విస్తరణపై చర్చ జరుగుతోంది. త్రివర్గంలో స్వల్పమార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరి విపక్షా లకు అనుకూలంగా మారకూడదనే ఉద్దేశంతో దిద్దు బాటు చర్యలు కూడా చేపట్టాలని భావిస్తున్నారు. మంత్రివర్గాన్ని మార్చడానికి కేసీఆర్ ఎప్పుడో ప్రణాళికలు వేసుకున్నారు.

కేసీఆర్ ఏ క్షణమైన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే చేస్తారని ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివాదాస్పదమైన మంత్రుల్ని ఆయన తొలగిస్తారని, కొందరు మంత్రులు పనితీరు విషయంలో ప్రజాగ్రహానికి గురయ్యారని, వీరిని మార్చాలని కేసీఆర్ అనుకుంటున్నారు. రాజకీయ వ్యూహ ధురంధురిడిగా పేరొందిన కేసీఆర్ ఇటీవల ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నారు. రాజకీయ పరిణామాలతో ఆయన ఏ నిర్ణయమూ వెంటనే తీసుకోలేకపోతున్నారు.

పార్టీని బీఆర్ఎస్‌గా మార్చేశారు కానీ దాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టి.. దేశ ప్రజలకు తమ పార్టీ విధివిధానాలేంటో
చెప్పలేకపోయారు. భారీ బహిరంగసభ ఆలోచనలు ఎప్పటికప్పుడు వెనక్కి పోతూనే ఉన్నాయి. ఏదైనా సరే ఫిబ్రవరి లోపే మంత్రివర్గంలో మార్పులు ఖాయమని
నమ్ముతున్నారు. ప్రాంతాలు, సామాజికవర్గాల వారీగా లెక్కలు చూసుకునే కేసీఆర్ తన మంత్రివర్గంలో మార్పులు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల టీమ్ ను ఏర్పాటు చేసుకుని సిద్ధం కావాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

మరి మంత్రివర్గంలో ఎవరికి డిమోషన్, ఎవరికి అవకాశం అన్నది తెలియాలంటే మాత్రం సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Must Read

spot_img