Homeఅంతర్జాతీయంఅమెరికాలో ఘోర రైలు ప్రమాదం..

అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..

అమెరికాలోని ఒహాయోలో జరిగిన కెమికల్ గూడ్స్ రైలు ప్రమాదం మరో చెర్నోబిల్ ఘటనకు దారి తీయనుందని స్థానికులు అంటున్నారు. నగరానికి సమీపంలో ఈస్ట్ పాలస్తీన్ లో నివసించే ప్రజలకు ఆ రోజు రాత్రి జరిగిన ట్రెయిన్ యాక్సిడెంట్ విషయం తెలియగానే గుండె ఆగిపోయినంత పనైంది. పట్టాలు తప్పిన రైలులోంచి ప్రమాదకరమైన రసాయనాలున్నాయని అధికారులు చెబుతున్నారు..

అమెరికాలోని ఒహాయో నగరానికి సమీపంలోని ఈస్ట్ పాలస్తీన్‌లో నివసించే జాన్, లిసా హామ్నర్‌లకు ఫిబ్రవరి 3 రాత్రి 8.55 నిమిషాలకు తమ జీవితం ఆగిపోయినట్లేనని అనుకున్నారు. విషపూరిత రసాయనాలు మోసుకెళ్తున్న గూడ్స్ ట్రైన్ ఈస్ట్ పాలస్తీన్‌లో వారి గార్బేజ్ ట్రక్ బిజినెస్‌ ప్రాంతానికి అత్యంత సమీపంలో పట్టాలు తప్పింది.

ఒహాయోకు అత్యంత సమీపంలో ఉండే ఈస్ట్ పాలస్తీన్‌లో ఉండే వారంతా ‘ఈ రైలు ప్రమాదం మా జీవితాలను సర్వనాశనం చేసింది’ అంటూ విలపించారు. పట్టాలు తప్పిన రైలు నుంచి బయటకు లీకైన రసాయనాలు, సల్ఫర్ అక్కడ ఇప్పటికీ గుప్పుమంటూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ‘ఇక్కడ నుంచి మేం వెళ్లిపోవాలనుకుంటున్నాం. ఇకపై ఇక్కడ వ్యాపారం చేయలేం. మా మకాం మార్చేస్తాం’ అంటున్నారు అక్కడి వ్యాపారులు.

  • రాత్రి అక్కడ పేరుకుపోయిన విషపూరిత గ్యాస్ కారణంగా జనం కళ్లు ఎర్రగా మారాయి..

కొందరికైతే వాపుతో ఉబ్బిపోయాయి. పట్టాలు తప్పిన రైలు నుంచి లీకైన రసాయనాల ప్రభావం వల్లే తమ కళ్లు ఇలా మారాయని, మంటగా ఉన్నాయని వారు చెబుతున్నారు. జనానికి ఈ ప్రమాదం వల్ల బయటకు కనిపించే గాయాలకంటే మానసికంగా మరింత పెద్ద గాయాలయ్యాయి. దాంతో ఆందోళన తగ్గించుకునేందుకు మాత్రలు వేసుకుంటున్నారు. ఇక్కడ ప్రక్రుతి పరంగా జరిగిన నష్టం మామూలుది కాదని చెబుతున్నారు. అక్కడ జీవిస్తున్న ప్రజలలో ఆందోళన ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పుడేం జరుగుతోందోనని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. పట్టాలు తప్పి, కాలిపోయిన గూడ్స్ రైలు బోగీల మధ్య మురికి గుట్టను చూసినవాళ్లకు చెర్నోబిల్ ఘటన గుర్తుకు వస్తోంది.

1986 నాటి సోవియట్ యుక్రెయిన్‌లోని చెర్నోబిల్‌లో అణు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో’అడుగు బయటకు పెట్టాలంటే భయం..ఎందుకంటే గాలి పీలిస్తే చనిపోతామన్న భయం..పీల్చకుంటే అసలుకే మోసం వచ్చే అవకాశంతో జనం హడలిపోయారు. వేలాదిగా చనిపోయారు. దీర్ఘకాలిక రోగాలతో చాలా ఏళ్లపాటు ఆ గ్యాస్ ప్రభావానికి లోనయ్యారు. ఇప్పుడు అదే పరిస్తితి ఓహాయోలోనూ కనిపిస్తోందని అంటున్నారు.

పిల్లలను బయటకు పంపించాలన్నా, పెంపుడు కుక్కలతో వాకింగ్‌కు వెళ్లాలన్నా భయమేనని..పెంపుడు జంతువులు ప్రమాదవశాత్తు రసాయనాలతో కలుషితమైన నీటిని తాగినా ఇబ్బందేనని చెబుతున్నారు. అందుకే అక్కడి వారు స్థానికంగా లభించే నీరు తాగడం లేదు. ప్రభుత్వం కూడా బాటిల్ వాటరే తాగాలని ప్రత్యేకంగా ఆదేశించింది.

కోవిడ్-19 కొట్టిన దెబ్బ నుంచి ఇక్కడి పిల్లలు ఇప్పుడిప్పుడే వారి జీవితాలను మెరుగుపర్చుకుంటున్న సమయంలో మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాము అనుకున్నదే నిజమైతే ఈ ప్రమాదం కారణంగా కొన్ని తరాలపాటు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇంకా అక్కడ విషవాయువులు వీస్తూనే ఉన్నాయి. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ‘ఈపీఏ’ నిర్వాహకుడు మైఖేల్ రీగన్ గురువారం ఈస్ట్ పాలస్తీన్‌లో పర్యటించారు.

అక్కడి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అభయం ఇచ్చారు. మరోవైపు ఒహాయో గవర్నర్ మైక్ డివైన్ ఫెడరల్ ప్రభుత్వం నుంచి సహాయం కోరారు. ఒహాయో సెనేటర్లు జేడీ వాన్స్, షెరాడ్ బ్రౌన్‌లు అండగా ఉంటామంటూ ప్రజలకు సందేశాలు పంపించారు. పట్టాలు తప్పిన ఈ రైలును నిర్వహించిన నార్‌ఫోక్ సంస్థ ఈ ఘటనపై ఓ లేఖ విడుదల చేసింది.

ప్రజలు ఆందోళన చెందుతున్నారు..తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కాగా రైలు పట్టాలు తప్పిన 15 రోజులు తరువాత కూడా అధికారులు కానీ, తనికీ బృందాలు కానీ తమ వద్దకు రాలేదని కొందరు స్థానికులు చెప్పారు. ఇక్కడి జనానికి ఏం జరిగిందో ఎవరూ పట్టించుకోవడం లేదు. వీరంతారైలు పట్టాలు తప్పిన ప్రదేశం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. అందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పడానికి లేదు. రైలు ప్రమాదం తరువాత అక్కడి ఇళ్లపై నుంచి పెద్ద పొగ మేఘం వెళ్లింది. అది ప్రమాదకరమైన విషపూరిత వాయువు. దానిని పీల్చితే బతకడం చాలా కష్టం అని అంటున్నారు అధికారులు. అయితే జరిగిన ప్రమాదం గురించి ఇంకా దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు వచ్చాక అన్ని విషయాలు వారికి చెబుతామని అంటున్నారు అధికారులు.

Must Read

spot_img