Homeఅంతర్జాతీయంభవిష్యత్ యుద్ధంలో సైబర్గ్ లే కీలక పాత్ర పోషించనున్నాయా..?

భవిష్యత్ యుద్ధంలో సైబర్గ్ లే కీలక పాత్ర పోషించనున్నాయా..?

రాట్ సైబర్గ్ .. వినడానికి వింతగా అనిపించినా.. భవిష్యత్ లో అస్త్రం ఇదేనని విశ్లేషకులు అంటున్నారు.. మరి ఏమిటీ రాట్ సైబర్గ్..? దీని తయారీకి డీఆర్డీఓ ఎందుకు చేపట్టింది..?

యుద్ధ క్షేత్రంలో శత్రు శిబిరం ఎత్తుగడలు, రహస్యాలను తెలుసుకోవడానికి సైన్యం రకరకాల మార్గాల్లో ప్రయాణించడం తెలిసిందే. శత్రువులు ఎక్కెడక్కడ ఏఏ ఆయుధాలతో మోహరించారో తెలుసుకోవడం యుద్ధంలో కీలకం. ఇలాంటివి పసిగట్టే ఎలుకలపై భారత డిఫెన్స్ రీసెర్చ్ అండ్డె వలప్‌మెంట్ ఆర్గనైజేషన్ DRDO నిర్విరామంగా ప్రయోగాలు చేస్తోంది. డీఆర్డీఓలో అంతర్భాగమైన యంగ్ సైంటిస్ట్ లాబొరేటరీ బృందం ఈ ర్యాట్ సైబోర్గ్‌లపై పనిచేస్తోంది. భద్రతా దళాల పునరుద్ధరణ కార్యకలాపాలు, గూఢచార నిఘాలో సహాయపడే “ఎలుక సైబోర్గ్‌ల తయారీకి నడుంబిగించింది.

మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసి, రెండో దశను మొదలుపెట్టింది. అయితే సైనికులు జంతువులు, పక్షులను వినియోగించడం తప్పేమీ కాదు. తాజాగా రిమోట్ కంట్రోల్ తో పనిచేసే ఎలుకలను రంగంలోకి దింపాలన్నది భారత సైనిక వ్యూహం. ఇవి ఏమాత్రం అనుమానం రాకుండా శత్రు సైనికుల శిబిరాల్లోకి ప్రవేశించి, అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా సైన్యం వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. ఈ ఎలుకలను యానిమల్ సైబోర్గ్స్ అని పిలుస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని గురించి ఇటీవల జరిగిన 108 జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో డీఆర్డీఓ ప్రస్తావించింది. ఈ ప్రయోగంలో తొలుత జీవించి ఉన్న ఎలుకల సామర్థ్యాన్ని ఇందుకోసం ఎలక్ట్రికల్, మెకానికల్ పరికరాలు ఉపయోగిస్తారు. సాధారణ ఎలుకలు చేయలేని ఎన్నో పనులను ఇవి సునాయాసంగా చేసేస్తాయి. కేవలం సైన్యంలోనే కాక పరిశోధనలు, విపత్తుల సమయంలో భూమి మీద పాతిపెట్టిన బాంబులను కనిపెట్టడంలోనూ ఈ రాట్ సైబోర్గులు ఉపయోగపడతాయి.

శస్త్ర చికిత్సల్లోనూ వీటిని వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జంతువుల్లో మార్పులు చేయడాన్ని జంతు ప్రేమికులు, జంతు హక్కుల సంఘాల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. జంతువుల్లోని సహజ సామర్థ్యాలను దూరం చేయడం వాటిని బాధకు గురి చేయడమే అవుతుందని వీరంతా అంటున్నారు. ఇదిలా ఉంటే, ఎలుకలపై మొదటి దశ ప్రయోగాలు ముగిశాయి. ఎలుకల కదలికలను నియంత్రించడానికి సర్జరీల ద్వారా వాటి శరీరంలో ఎలక్ట్రోడ్ లను ఏర్పాటు చేశారు. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వీటిని పరీక్షించనున్నారు.కొండలను ఏంతమేర అధిరోహించగలవో పరీక్షిస్తారు.


మొదటి దశ ప్రయోగంలో ఎలుకలు కాస్తంత ఇబ్బంది పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే కార్యాచరణకు సిద్ధమైన ఎలుకలను రిమోట్ కంట్రోల్ తో నియంత్రించవచ్చు. ఏ దిశగా వెళ్లాలి..? ఎంత దూరం వెళ్లాలి..? ఎక్కడ ఆగాలి..?


ఎంతసేపు ఆగాలి..? అనే దానిపై వాటి మెదడుకు ఎప్పటికప్పుడు సందేశాలు అందిస్తారు. ప్రయోగానికి ఎలుకలనే ఎంచుకోవడానికి కారణమేమిటంటే, అవి వేగంగా కదులుతాయి. లోతైన బొరియల్లోకి సైతం సులువుగా వెళ్లగలవు. గోడలు, చెట్లు ఎక్కగలవు. ఇదిలా ఉంటే, 26/11 ముంబై దాడులు యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. చాలా మంది ప్రజలు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దాడులు జరిగిన ప్రాంతాలను పూర్తిగా ఉగ్రవాదులు స్వాధీనంలోకి తీసుకోవడంతో, ప్రజలను బంధీలుగా చేసుకోవడంతో భద్రతా దళాలకు సవాళ్లు తప్పలేదు. భవనాల లోపల పరిస్థితులపై సరైనా అంచనా లేక వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు. సరిగ్గా ఇలాంటి సందర్భాల్లో భద్రతా దళాలకు ఉపయోగపడేందుకే ఇండియన్‌ డిఫెన్స్‌ సైంటిస్టులు ‘ర్యాట్‌ సైబోర్గ్స్‌’అనిఅభివృద్ది చేశారు.

ఇవి సులువుగా భవనాల లోపలకు ప్రవేశించి లైవ్‌ వీడియో ఫీడ్‌ను అందించగలవు. శాస్త్రవేత్తలు వాటి మెదడుల్లో బయటి నుంచి సంకేతాలను స్వీకరించగల ఎలక్ట్రోడ్‌ను ఏర్పాటు చేశారు. లైవ్‌ ఇమేజ్‌లను తీయడానికి వెనుక భాగంలో ఒక చిన్న కెమెరా ఉంటుంది. ఇలాంటి సదుపాయాలతో ర్యాట్‌ సైబోర్గ్స్‌ ఒకసారి భవనంలోకి ప్రవేశించిన తర్వాత.. శత్రువుల కంటపడకుండా, అనుమానం రాకుండా.. అక్కడి పరిస్థితుల లైవ్‌ కవరేజీని అందించగలవు. గోడలపైకి ఎక్కి, ప్రతి గది మూలకు వెళ్లి వీడియో ఫీడ్‌ను ఇవ్వగలవు.

ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఎక్స్‌టర్నల్‌ సిగ్నల్స్‌ను కూడా రిసీవ్‌ చేసుకుని, వాటి ఆధారంగా ప్లాన్స్ అమలు చేసేలా ర్యాట్‌ సైబోర్డ్స్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడంలో రోబోలకు పరిమితులు ఉన్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా DYSL అభివృద్ధి చేస్తున్న స్ట్రాటెజిక్‌ టెక్నాలజీస్‌లో ర్యాట్‌ సైబోర్డ్స్‌ భాగమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సైబోర్గ్ టెక్నాలజీని 2019లో చైనా శాస్త్రవేత్తల బృందం బ్రెయిన్-మెషిన్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీని ఉపయోగించి, ఎలుకల మెదడును ఎక్స్‌టర్నల్‌ స్టిములస్‌తో నియంత్రించడానికి ప్రయత్నించింది.

చైనీస్ బృందం అటువంటి ఆరు ఎలుకలను ఒక ప్రయోగం కోసం ఉపయోగించింది. మొదటి దశలో మలుపులు తిరగడంలో ఎలుకలకు సులువైన ఆదేశాలు ఇచ్చారు. క్రమేణా కఠినమైన ఆదేశాలు ఇచ్చి పరిశీలించారు. మొత్తంమీద ఆశాజనక ఫలితాలు ఉన్నాయని, రెండు ఎలుకలు సక్రమంగా సిగ్నల్స్‌ను పాటించలేదని ప్రముఖ పీర్-రివ్యూడ్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ చైనీస్ అధ్యయనం తెలిపింది. ఇక స్టార్ వార్స్ లోని చ్యుబాకా .. ఇటువంటిదే. దట్టంగా శిరోజాలున్న ఈ జీవి శరీరంలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. ఇది ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్, రికవరీ కార్యకలాపాలలో సాయుధ దళాలకు సహాయం చేస్తుంది.

ఇదిలా ఉంటే, జ‌పాన్ ప‌రిశోధ‌కులు మొదటిసారి సైబోర్గ్ బొద్దింక‌ను సృష్టించారు. దీన్ని భూకంపాల లాంటి విపత్తుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆప‌రేష‌న్ నిర్వహించేందుకు ఉప‌యోగించనున్నారు. బొద్దింక‌ వీపుపై అమ‌ర్చిన సోలార్‌తో ప‌నిచేసే రిమోట్‌తో బొద్దింకను న‌డిపించారు. దీంతో తమ ప్రమోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. సైబోర్గ్‌పై శాస్త్రవేత్తలు ఎన్నో రోజుల‌ నుంచి నిర్విరామంగా ప్రయోగాలు చేస్తున్నారు. సైబోర్గ్‌ అంటే స‌గం జీవికి స‌గం రోబోను క‌లిపి త‌యారు చేసేటెక్నాల‌జీ. బ‌తికున్న జీవికి సోలార్‌తో న‌డిచే రిమోట్‌ను అమ‌ర్చి త‌మ కంట్రోల్‌లో ఉంచుకుంటారు. శరీరానికి అమర్చిన పరికరాలతో సైబోర్గ్ కీట‌కాలు రెస్క్యూ ఆప‌రేష‌న్లు నిర్వహిస్తాయి.

పర్యావరణ ప‌ర్యవేక్షణ‌, ప్రకృతి వైపరీత్యాల వేళ రెస్క్యూ, సెర్చ్ మిషన్లను సమన్వయానికి ఈ టెక్నాల‌జీ ఉప‌యోగ‌ప‌డుతుంది. జపాన్‌ శాస్త్రవేత్తల బృందం సైబోర్గ్ బొద్దింకను అభివృద్ధి చేసింది. మునుపటి పరికరాల కంటే 50 రెట్లు అధిక శక్తితో జీవి నాడీ వ్యవస్థలోకి వైర్ చేశారు. సైబోర్గ్ బొద్దింకను అల్ట్రాథిన్ సోలార్ సెల్‌తో నిర్మించారు. ప్రాథమిక కీటకాల కదలికపై ఎలాంటి ప్రభావం చూప‌కుండా అల్ట్రాథిన్ ఫిల్మ్ ఎలక్ట్రానిక్స్, అడెసివెనోనాడెసివ్ ఇంటర్‌లీవింగ్ స్ట్రక్చర్‌ల కలయికను ఉపయోగించారు. సోలార్ పవర్‌తో పనిచేసేలా..బొద్దింక థొరాక్స్‌కు బ్యాటరీ, స్టిమ్యులేషన్ మాడ్యూల్‌ను జోడించి రీఛార్జ్ చేయగలిగేలా సెల్‌లను
రూపొందించారు.

సౌర ఘటం మాడ్యూల్ కీటకాల పొత్తికడుపుకు కట్టారు. దాని నాడీ వ్యవస్థకు అనుసంధానించిన‌ వైర్‌లెస్ సిగ్నల్‌తో రిమోట్ సాయంతో బొద్దింకను కుడి, ఎడ‌మ‌కు న‌డిపించారు. ప్రస్తుతం కేవ‌లం సైబోర్గ్ బొద్దింక‌ను న‌డిపించామ‌ని, దీన్ని రెస్క్యూ ఆప‌రేష‌న్ల‌కు వాడేంతగా అభివృద్ధి చేసేందుకు మ‌రింత ప‌రిశోధ‌న చేయాల్సి ఉంద‌ని సైంటిస్టులు వెల్లడించారు.మూషికాస్త్ర్రం.. తరహాలోనే ఫ్యూచర్ లో మరిన్ని సైబర్గ్ లు తయారు కానున్నాయని పరిశోధకులు సైతం వెల్లడిస్తున్నారు.

Must Read

spot_img