Homeఅంతర్జాతీయంసిరియా రెస్క్యూలో సంక్షోభం..?

సిరియా రెస్క్యూలో సంక్షోభం..?

తుర్కియే సిరియా దేశాలలో భూకంపం మనం మొదటి నుంచి వింటున్న మాట..ప్రతీ చోట ఈ రెండు దేశాల పేర్లను వింటున్నాం..తుర్కియేలో ఎక్కువగా సిరియాలో తక్కువగా మరణాలు నమోదవుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న సాయం, సహాయక బ్రుందాలు నేరుగా తుర్కియేలో ల్యాండ్ అవుతున్నారు. గంటల వ్యవధిలో బాధిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. చేతనైన సాయం అందిస్తున్నారు. అయితే తుర్కియేలో జరుగుతున్నంత వేగంగా సిరియాలో సహాయక చర్యలు జరగడం లేదు. అసలు కొన్ని ప్రాంతాలలో దశాబ్దకాలంగా జరుగుతున్న అంతర్యుద్దం కారణంగా ఎవరూ వెళ్లే సాహసం చేయడం లేదు.

ఒక రకంగా చెప్పాలంటే అక్కడే మ్రుతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సిరియా ఎంతో కాలంగా సంక్షోభం మీద సంక్షోభాన్ని చవి చూస్తోంది. అయితే సిరియాకు భూకంప సహాయం అందించడం ఎందుకు కష్టమవుతోందన్నది చూస్తే మనం చెప్పుకున్న కారణాలు ముందుకు వస్తాయి. సిరియాలోని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న జాండారిస్ పట్టణంలో భూకంప బాధితుల కోసం అక్కడి వలంటీర్లు పునరావాస కేంద్రాలకు బదులు సమాధులను సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడి శిధిలాలలో వెతికితే కచ్చితంగా మ్రుతదేహాలే దొరుకుతాయని వారి నమ్మకం.

ఒక సంక్షోభంలో మరో సంక్షోభం, దానివెంటే మరో సంక్షోభం..సిరియాకు శాపంగా మారింది. ఇదీ ప్రస్తుతం సిరియా పరిస్థితి. దశాబ్దకాలంగా అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న దేశాన్ని గతవారం భూకంపం అతలాకుతలం చేసింది. మానవతా సహాయానికి అంతర్గత ఘర్షణలు అడ్డంకిగా మారాయి. అయితే, భూకంపం వచ్చిన నాలుగు రోజుల తరువాత సిరియా వైఖరిలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. మానవతా సహాయనికి ఇది అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు మానవతా సహాయాన్ని అందించేందుకు సిరియా క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది.

కాకపోతే కాస్త ఆలస్యంగా ఈ విషయం వెల్లడించింది. దీని తరువాత, ఐరాస హ్యుమానిటేరియన్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్ మాట్లాడుతూ, “ఇది మంచి పరిణామం. కానీ, మరిన్ని మార్పులు రావాలి” అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాలే కాక, ఇతర గ్రూపుల నియంత్రణలో ఉన్న ప్రాంతాలలోనూ సహాయక చర్యలకు సిరియా ప్రభుత్వం అంగీకరించిందని సనా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఐక్యరాజ్య సమితి, సిరియన్ అరబ్ రెడ్ క్రెసెంట్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్‌క్రాస్‌ సంయుక్తంగా సహాయక చర్యలు చేపడతాయని తెలిపింది. అయితే, ఈ వార్తలను మరింత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.

“సిరియా ప్రభుత్వ ప్రకటనకు అర్థం.. సిరియాలో ప్రధాన నగరాలకు సహాయక చర్యలు పంపించాలని. అంతే తప్ప, పక్క దేశాల నుంచి సరిహద్దుల మీదుగా సహాయక చర్యలు అందించవచ్చని కాదు. అయితే, ప్రజల ప్రాణాలను రక్షించే అత్యవసర సహాయాన్ని అందించడానికి అదనపు క్రాసింగ్ పాయింట్స్‌కు అత్యవసరంగా అనుమతించాలని కోరుతున్నాం” అని ఐరాస హ్యుమానిటేరియన్ చీఫ్ గ్రిఫిత్ అన్నారు. ప్రస్తుతం, వాయువ్య సిరియాలో ఉన్న ఇడ్లిబ్‌లోకి ప్రవేశించడానికి మాత్రమే అనుమతి ఉంది. ఇది తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతం.

బాబ్ అల్-హవా ద్వారా టర్కీ సరిహద్దు మీదుగా ఈ ప్రాంతంలోకి ప్రవేశించవచ్చు. ఉత్తర సిరియా ప్రాంతాలలోకి మానవతా సహాయాన్ని పంపించడానికి టర్కీ సరిహద్దులోని బాబ్ అల్-సలామెహ్ నుంచి మరొక మార్గానికి అనుమతి ఇవ్వమని సిరియా, దాని మిత్రదేశాలను ఐరాస కోరింది. అలాగే, ఈశాన్యం వైపు కుర్దిష్ జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలను చేరడానికి ఇరాక్ వైపు నుంచి రావడానికి అనుమతి ఇవ్వాలని కూడా కోరింది. బాబ్ అల్-సలామెహ్ వద్ద, అల్-రాయ్ వద్ద మానవతా సహాయ కేంద్రాలు నిర్వహించడానికి అంకారా అనుమతి పొందామని ఈ వారం సిరియా ప్రత్యర్థి సమూహాలు ప్రకటించాయి.

చాలా కాలంగా సిరియాలో ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య సామాన్యులు నలిగిపోతున్నారు. అనేక నగరాలు పట్టణాలు శిధిలాల కుప్పగా మారాయి. జనం లేక అనేక ప్రాంతాలు గోస్ట్ టౌన్స్ గా మిగిలిపోయాయి. అమెరికా రష్యా తమ ఆయుధాలను యధేచ్చగా పరీక్షించుకున్నారు. ఇక్కడి భవనాలను మరమ్మత్తులు చేయించు కోవడానికి కూడా వీరి వద్ద డబ్బులు లేవు. ఆ శిధిలాలలోనే అరకొర సంపాదనతో జీవిస్తున్నారు.

వారిపైనే మొన్నటి భూకంపం విరుచుకుపడింది. అయితే ఐరాస నుంచి మొదటి సహాయక కాన్వాయ్ దుప్పట్లు, ఇతర సామాగ్రి బాబ్ అల్-హవా గుండా సిరియాలో ప్రవేశించినప్పుడు, అంత మంచి స్పందన రాలేదు. నిజానికి భూకంపం రాక ముందు ఈ సహాయం సిరియాకు అందవలసి ఉందని సిరియన్ జర్నలిస్ట్ ఇబ్రహీం జైడాన్ అన్నారు. అంటే అంతకు ముందే వారు అంతటి దీనస్థితిలో బతుకుతున్నారని అర్థం.

అయితే సోమవారం వచ్చిన ప్రకంపనలకు ఈ మార్గం బాగా దెబ్బతింది. ఈ మార్గం 40 లక్షల కంటే ఎక్కువ మంది సిరియన్లకు జీవనాధారంగా ఉంటుంది. సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభంలో చాలామంది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు వెళుతూ ఉండేవారు. చేతిలో ఏమి మిగలని జనానికి ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. “సిరియాలో వాయువ్య ప్రాంతం భూకంపానికి అత్యధికంగా ప్రభావితం అయింది. అక్కడ సహాయక చర్యలు అందించేందుకు మాకు పూర్తి అనుమతి కావాలి” అని నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ జాన్ ఈజెలాండ్ అన్నారు.

గతంలో, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాల ద్వారా ప్రత్యర్థి సమూహాలు ఉన్న ప్రాంతాలకు మానవతా సహాయన్ని చేరవేయడానికి అనుమతించలేదని కొన్ని సంస్థలు తెలిపాయి. మార్గమధ్యంలో మానవతా సహాయ వనరులను వైరి వర్గాలు దారి మళ్లిస్తారనే ఆందోళన కూడా ఉంది. సిరియా గతంలో కూడా సహాయక చర్యలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించినా, ఆచరణలో అది కనిపించలేదు. అదే సిరియా మళ్లీ అలా చేస్తుందేమోనన్న ఆందోళన ఉంది.

సిరియాలో గడ్డకట్టుకుపోయే చలిలో లక్షలాది బాధితులు రోడ్లపై ఉన్నారు. వారికి ఎలాగైనా సహాయాన్ని అందించేందుకు ఐరాస మార్గాలను అన్వేషిస్తోంది. ఈ వారం గ్రిఫిత్ తుర్కియే, సిరియాలలో పర్యటించనున్నారు. రెండు దేశాల ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు ఆయన వెళుతున్నారు. సిరియన్లు సంవత్సరాల తరబడి పేదరికంలో, వివిధ సంక్షోభాల్లో మగ్గిపోతున్నారు. “పాశ్చాత్యదేశాలు అన్ని దేశాలనూ ఒకేలా చూడటం లేదు.

ఇది మానవత్వం కాదని అంటున్నారు మానవతావాదులు. సిరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని, ఈ ఆంక్షల వల్ల విదేశాల్లో ఉన్న సిరియన్లు తమ వారికి సహాయం అందించలేకపోతున్నారని ఆమె అన్నారు.అయితే సిరియాలో భూకంప బాధిత ప్రాంతాల్లో ఆక్షలకు ఉపశమనం ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. సిరియాకు పంపే సహాయం ఎప్పుడూ ఆయుధంగా మారుతుంది. సిరియాలో అంతర్యుద్ధం భీకరంగా ఉన్న రోజుల్లో అక్కడ కేవలం “లొంగిపోవాలి లేదా ఆకలితో అలమటించాలి” అన్న వ్యూహాన్ని పాటించడం జరిగింది.

ఏ మాత్రం కనికరం లేకుండా ఈ వ్యూహాన్ని పాటించేవారు. ముఖ్యంగా ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చే వారిని ప్రభుత్వ దళాలు ఇలాగే శిక్షించాయి. అయితే, ఈ భూకంపం అరబ్ దేశాల వైఖరిలో కూడా కొంత మార్పు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో, సిరియా, తుర్కియే వైఖరుల్లో కాస్త మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఉత్తర సిరియాలో తుర్కియే ట్రూపులు ఉండడం పెద్ద అడ్డంకి. కానీ, ఈశాన్య ప్రాంతంలో సిరియన్ సైన్యం, వాయువ్యంలో సిరియన్ కుర్దిష్ సేనలు ముందుకు రాకుండా ఉండేందుకు తుర్కియే ట్రూపులను అక్కడ ఉండడం ఎర్దోవాన్‌కు అవసరం. “సిరియాలో సహాయక చర్యల్లో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం ఉండకూడదు. “ముందు ప్రజలు” తరువాతే రాజకీయలు అంటున్నారు. సిరియాలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది.

Must Read

spot_img