Homeఅంతర్జాతీయంకూలిపోయిన శకలాలను చైనా లాంటి దేశాలు జాగ్రత్తగా తీసుకుపోతాయి.

కూలిపోయిన శకలాలను చైనా లాంటి దేశాలు జాగ్రత్తగా తీసుకుపోతాయి.

అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ లాంటి అగ్రదేశాల యుధ్ద విమానాలు ఎక్కడైనా కూలిపోయాయంటే చాలు వెంటనే వాటిని పూచిక పుల్ల కూడా వదలకుండా మూట కట్టుకుని తమ దేశానికి ఎత్తుకుపోతుంటాయి. ఆఖరుకు సముద్రంలో కూలిపోయినా సరే అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి ఆపని చేస్తుంటాయి. అందుకు కారణం ఉంది. వాటిని అలా ఎత్తుకుపోనట్టయితే చైనా రంగంలోకి దిగుతుంది. కూలిపోయిన శకలాలను చైనా లాంటి దేశాలు జాగ్రత్తగా తీసుకుపోతాయి. వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసి అలాంటి మోడల్ సీక్రెట్స్ తెలుసుకుంటాయి. ఆపై వాటి రెప్లికాలను తయారుచేస్తాయి. ఒరిజినల్ వాటంత సామర్థ్యం లేకపోయినా ఆమాత్రం మెరిసిపోతుంటాయి. అందుకే వాటిని తయారుచేసిన వారు ఇలా జాగ్రత్త పడతారన్నమాట.

అయితే తాజాగా వస్తున్న టెక్నాలజీలు ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేకుండానే కాపీ కొట్టడం చేస్తున్నాయని అంటున్నారు నిపుణులు. మీకు తెలుసా అమెరికా ఎంత జాగ్రత్త పడినా దాని టెక్నికల్ సీక్రెట్స్‌ను చైనా దొంగిలిస్తోంది. అందుకు కారణం ఇప్పుడు బయటకు వచ్చింది. దానిపేరే స్టెగనోగ్రఫీ.. ఇందుకు ఉదాహరణగా ఓ ఫోటో ఇక్కడ చూడవచ్చు. అది చూడటానికి సాధారణ ఫోటోలానే కనిపిస్తుంది.

కానీ, తీక్షణంగా చూస్తేనే దాని వెనుక మర్మం బయటపడుతుంది. ఇది ”జనరల్ ఎలక్ట్రిక్ పవర్” సంస్థ మాజీ ఉద్యోగి జెంగ్ షియావోకింగ్ మెయిల్‌లో బయటపడిన ఓ ఫోటో కథ. ఒక సూర్యోదయాన్ని కెమెరాలో బంధించినట్లుగా కనిపిస్తున్న ఆ ఫోటోలో కొన్ని రహస్య ఫైల్స్‌ను ఆయన ఆఫీస్ నుంచి తీసుకెళ్లిపోయారు. ఆ ఫోటోలో బైనరీ కోడ్‌లో సమాచారాన్ని దాచిపెట్టి ఆయన తన వ్యక్తిగత మెయిల్‌కు పంపించుకున్నారని అమెరికాలోని న్యాయ సేవల విభాగం ‘డీఓజే’ అధికారులు నిరూపించారు. సామాన్యులకు వెంటనే ఈ విషయం అంతగా మింగుడు పడకపోవచ్చు.

కానీ నిపుణులు మాత్రం తేలికగానే అర్థం చేసుకుంటారు. ఈ టెక్నిక్‌ను ”స్టెగనోగ్రఫీ”గా పిలుస్తారు.

అంటే ఒక డేటా ఫైల్‌లో మరో డేటాను కోడ్ రూపంలో దాచిపెట్టడం. జనరల్ ఎలక్ట్రిక్ నుంచి తస్కరించిన రహస్య సమాచారాన్ని బయటకు తీసుకెళ్లేందుకు జెంగ్ ఈ టెక్నిక్‌ను ఉపయోగించారు. ఎనర్జీ, ఏరోస్పేస్‌తో మొదలుపెట్టి ఆరోగ్య సేవల వరకు భిన్న రంగాల్లో జీఈ విస్తరించింది. ఫ్రిడ్జ్‌లతో మొదలుపెట్టి విమాన ఇంజిన్ల వరకు సంస్థ తయారుచేస్తుంది. వాటికి సంబంధించిన ప్రొటోటైపు టెక్నాలజీలన్నీ చాలా విలువైనవిగా ఉంటాయి.

అవి బయటకు పొక్కితే కంపెనీ నష్టపోతుంది. ఇప్పటికి ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీలు ఇలాంటి కార్యకలాపాల వల్ల నష్టాలపాలైన అంతరించుకుపోయిన సందర్భాలున్నాయి. విషయానికొస్తే..జెంగ్ తస్కరించిన సమాచారం ”గ్యాస్, స్టీమ్ టర్బైన్ల డిజైన్, తయారీ”కి సంబంధించినది. టర్బైన్ బ్లేడ్లు, టర్బైన్ సీల్స్ తయారీ సమాచారాన్ని కూడా ఇలా తీసుకెళ్లారు. కోట్ల రూపాయల విలువైన ఈ సమాచారాన్ని చైనాలోని తన ఏజెంట్లుకు ఆయన పంపించారు. చైనా ఇలాంటివాటిని చాలా పద్దతిగా చేస్తుంటుంది. ఎందుకంటే అది మొదటి నుంచీ అలా చేస్తూనే ఉంది.

దీని వల్ల చైనా ప్రభుత్వానికి, అక్కడి కంపెనీలు, యూనివర్సిటీలకు లబ్ధి చేకూరే అవకాశముంటుంది. అసలు ఓ ఆవిశ్కర్త మదిలో ఓ వస్తువును తయారు చేయాలన్న ఆలోచన వస్తే చాలు చైనా బుద్దిజీవులు ఆ ఆలోచనకు రూపం తెప్పిస్తారు. టెక్నాలజీల విషయంలో చైనా అంతగా అభివ్రుద్ది చెందింది. వస్తువులో పస లేకపోయినా ఫరవాలేదు..ఆ మోడల్ మాత్రం మార్కెట్లోకి వచ్చేస్తుంది. విపరీతంగా అమ్ముడుపోతుంది. దాంతో ఒరిజినల్ కంపెనీకి ఆ స్థాయిలో నష్టం అనివార్యంగా జరుగుతుంది. అందుకే అన్ని దేశాలు చైనా విషయంలో తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగానే ఉంటారు.

అయితే ఈ విషయం బయటపడిన తరువాత జెంగ్‌కు ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది కోర్టు. అమెరికాలో వెలుగుచూస్తున్న రహస్య సమాచార చోరీల్లో ఇది తాజా కేసు. నవంబరులో చైనా పౌరుడు షు యంజున్‌కు కూడా 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అమెరికా విమానయాన రంగంతోపాటు జీఈకి చెందిన సహస్య వాణిజ్య సమాచారాన్ని ఆయన తస్కరించినట్లు అధికారులు నిరూపించారు. తమ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతోపాటు టెక్నాలజీలో అంతర్జాతీయంగా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల్లో ఈ రహస్య సమాచార తస్కరణ కూడా ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు.

ఈ వాణిజ్య సమాచార చౌర్యం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. సమయం, డబ్బు వెచ్చించకుండానే గ్లోబల్ వేల్యూ చైన్‌లో ప్రధాన పాత్ర పోషించేందుకు ఇది దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పశ్చిమ దేశాల మేధా సంపత్తిని తస్కరించడమే లక్ష్యంగా చైనా పని చేస్తోంది. ఈ రహస్య సమాచారాన్ని ఉపయోగించుకుని తన పారిశ్రామిక అభివృద్ధిని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. దాదాపు అన్ని కంపెనీలపైనా, నగరాల నుంచి పట్టణాల వరకు, విమానయాన రంగం నుంచి కృత్రిమ మేధస్సు వరకు, దిగ్గజ కంపెనీల నుంచి అంకుర సంస్థల వరకు ఇలా అన్నిచోట్లా చైనా తన వేగుల ద్వారా, తాము స్రుష్టించిన మొబైల్ యాప్ ల ద్వారా నిఘా పెడుతున్నారు.

అయితే, చైనాపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని, పచ్ఛన్న యుద్ధంనాటి ఆలోచనా విధానానికి ఈ రకమైన ఆలోచనలు అద్దం పడుతున్నాయని అప్పటి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ వ్యాఖ్యానించారు. సాధారణంగా చైనా తమ దేశంపై వచ్చే ఏ ఆరోపణలనైనా వెంటనే ఖండిస్తూ ఉంటుంది. అలాంటిదేదీ లేదని బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది చైనా నైజం అంటారు విశ్లేషకులు.

జెంగ్‌పై న్యాయ సేవల విభాగం విడుదల చేసిన ప్రకటనలో ఎఫ్‌బీఐకి చెందిన అలాన్ కోహ్లెర్ స్పందిస్తూ.. ”అమెరికా సంపత్తిని చైనా లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రపంచంలో అగ్రగామిగా కొనసాగుతున్న అమెరికా నాయకత్వాన్ని చైనా సవాల్ చేయాలని చూస్తోందని అన్నారు. టర్బైన్ సీలింగ్ టెక్నాలజీలో జెంగ్ నిపుణుడు. స్టీమ్ టర్బైన్ ఇంజినీరింగ్‌లో లీకేజ్ కంటైన్‌మెంట్ టెక్నాలజీలపై ఆయన పనిచేశారు. టర్బైన్ పనితీరు మెరుగుపరచడంలో ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. ”టర్బైన్‌లను మరింత శక్తిమంతంగా చేసేందుకు, వాటి జీవిత కాలం పొడిగించేందుకు అవసరమైన టెక్నాలజీని ఆయన తస్కరించారు. చైనా విమానయాన రంగంలో విమానాలను నడిపించే ఈ గ్యాస్ టర్బైన్ల టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. విదేశీ టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, దేశీయ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు చైనా అధికారులు గుర్తించిన పది రంగాల్లో విమానయాన రంగం కూడా ఒకటి. అయితే, ఇతర అనేక భిన్న రంగాల్లో కూడా చైనా ఈ విధమైన చౌర్యానికి పాల్పడుతోంది.

ఫార్మా, నానో టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్, టెక్స్‌టైల్స్, ఫ్యాబ్రిక్స్, ఆటోమొబైల్ లాంటి రంగాల్లోనూ సమాచారాన్ని చైనా తస్కరిస్తోంది.

ఇదివరకు దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్ లాంటి ప్రాంతాల నుంచి ఇలాంటి పారిశ్రామ గూఢచర్యం ముప్పు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం చైనా నుంచి ఈ ముప్పు విపరీతంగా ఎక్కువైంది. అలాగే హ్యాకింగ్ లో కూడా చైనా తీసిపోలేదు. హ్యాకింగ్ ద్వారా కూడా రహస్య సమాచార చౌర్యం ఎక్కువైంది. అమెరికాపై చైనా గూఢచర్యం ఇటీవల తగ్గిందని కొందరు చెబుతున్నారు. అయితే, ఇది మళ్లీ ఎక్కువైందని మరికొందరు అంటున్నారు.

అమెరికా-చైనా సంబంధాలు దెబ్బతినడంతో ఇది మరింత ఎక్కువైందని అంటున్నారు. మరోవైపు చైనా కూడా అమెరికా తరహాలోనే జాతీయ భద్రత గురించి ఆందోళన వ్యక్తంచేస్తోంది. గమ్మత్తేమిటంటే అమెరికా హ్యాకర్లు ఓ విషయం చెబుతుంటారు. తాము చైనా సైట్లను హ్యాక్ చేసినప్పుడు, అక్కడ కనిపించేది అమెరికా మేధా సంపత్తి సమాచారమే కనిపిస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా..ఈ రెండు దేశాల మధ్య ఈ టెక్నాలజీ పోరు భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశముంది.

Must Read

spot_img