Homeఅంతర్జాతీయం తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయిన డ్రాగన్ కంట్రీ..

 తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయిన డ్రాగన్ కంట్రీ..

మనకు బాగా తెలిసిన సామెత ‘ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు’.. సరిగ్గా అలాగే డ్రాగన్ కంట్రీ చైనా తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయింది. యావత్ ప్రపంచాన్ని దాదాపు రెండున్నరేళ్ల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసిన చైనా ఇప్పుడు తాను తవ్వుకున్న గోతిలో తానే పడి గిలగిలా తన్నుకుంటోంది.

2020 జనవరిలో వుహాన్ లాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయ్యిందని, ఆ వైరస్ చైనా ప్రయోగశాలలోనే ఉద్భవించిందని తొలి రోజుల నుంచి అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కానీ చైనా అందుకు అంగీకరించలేదు. దర్యాప్తుకు కూడా సహకరించలేదు. అయితే ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్త ఒకరు దీన్ని ధ్రువీకరించారు. జీవాయుధాలను రూపొందించే క్రమంలో కరోనా వైరస్ వూహన్ లాబొరేటరీ నుంచి లీకై, అది క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించింది. యావత్ మానవాళిని గడగడలాడించింది లక్షలాది మందిని పొట్టనబెట్టుకుందని ఆ అమెరికన్ శాస్త్రవేత్త వెల్లడించారు.

ఆయన ప్రకటన వెలువడిన కొన్ని రోజుల వ్యవధిలోనే చైనా తాను తయారు చేసిన కరోనా వైరస్ భారిన మరోసారి పడి విలవిల్లాడడం మొదలైంది. అయితే బయటి ప్రపంచానికి తెలియని మరో సీక్రెట్ కూడా ఇప్పుడే బయటపడింది. అసలు రెండున్నరేళ్లుగా చైనాలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. చైనా శాస్త్రవేత్తలు తయారుచేసిన టీకాలు ఉత్తుత్తి వ్యాక్సిన్లేనని చైనాకు మొదటే తెలిసిపోయింది.

కరోనా వ్యాప్తి మొదలవగానే దేశాలన్నీ వ్యాక్సిన్‌ తయారీలో తలమునకలయ్యాయి. చైనాయే తొలి వ్యాక్సిన్‌ను రూపొందించింది. ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీ రూపొందించిన సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌కు, ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన కరోనావాక్‌కు తొలుత ఆమోదం లభించింది. ఈ రెంటింటిని తమ పౌరులకు వేయడమే గాక పలు దేశాలకు చైనా సరఫరా చేసింది. వీటి కొనుగోలు నిమిత్తం ఆఫ్రికా దేశాలకు 200 కోట్ల డాలర్లు, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలకు 100 కోట్ల డాలర్ల రుణం కూడా ఇచ్చింది. ఆసియాలోనూ 30 దేశాలకు చైనా టీకాలందాయి.

ఇలా ముందు రుణాలివ్వడం ఆ దేశాలను డెబిట్ ట్రాప్..అంటే అప్పుల ఊబిలో పడేయడం చైనాకు పాత అలవాటు. దాదాపు 100 కోట్ల మందికి పైగా చైనీయులు ఇప్పటికే ఆ ఉత్తుత్తి కరోనా టీకాలు వేయించుకున్నారు. అందుకే కరోనా ఉధృతి తగ్గలేదు. సరికదా, రోజుకు కనీసం 10 లక్షల మందికి పైగా దాని బారిన పడుతూనే ఉన్నారు.

అసలు చైనా కరోనాను నియంత్రించ లేకనే జీరో కోవిడ్ పాలసీని మొదలుపెట్టిందని అనుమానంగా ఉంది. జీరో కోవిడ్ విధానాన్ని అవలంబించడం ద్వారా దేశంలో నిర్బంధాన్ని పెంచి, ఎవరినీ ఎటువైపూ కదలకుండా చేసి కరోనా వ్యాప్తిని నిరోధించాలని చైనా ప్రయత్నించింది. ఈ విధానం సక్సెస్ అయినట్లుగా దాదాపు రెండేళ్ల కాలం పాటు ప్రపంచాన్ని బాగా మభ్యపెట్టిందింది. కానీ తాజాగా గత నెల రోజులుగా చైనాలో చోటుచేసుకున్న పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిర్బంధాన్ని ఛేదించుకొని చైనీయులు ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం పరిస్థితిని తారుమారు చేసింది. చైనీయుల ఒత్తిడిని భరించలేక ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని ఉపసంహరించుకుంది. దాంతో ఉన్నట్లుండి చైనాలో కరోనా విలయతాండవం మొదలైంది. కరోనా వైరస్ చైనాలో శరవేగంగా విస్తరించింది. దేశ రాజధాని బీజింగ్ నగరంలో దాదాపు 70 శాతం మందికి కరోనా సోకినట్లుగా సమాచారం అందుతోంది. వాణిజ్య నగరమైన షాంఘైలో కూడా కరోనా విజృంభిస్తోంది. దురదృష్టవశాత్తు చైనాలో మీడియా సొంతంగా పనిచేయదు.

ప్రభుత్వం ఏది చెబితే దానిని మాత్రమే ప్రచురించాల్సి ఉంటుంది, ప్రసారం చేయాల్సి ఉంటుంది. అందుకే చైనాలో అసలు పరిస్థితి ఏమిటి అంటే ఎవరు కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో చైనాలో పరిస్థితిని తెలుసుకునేందుకు భారతీయ మీడియా సంస్థలు తమకున్న సొంత సోర్సుల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ ప్రయత్నాలు మనకు షాక్ ఇచ్చే సమాచారాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రపంచానికి కరోనా గురించి 2020 జనవరిలోనే తెలిసినప్పటికీ అంతకు రెండు, మూడు నెలల ముందుగానే చైనాలో ఈ వైరస్ ప్రబలినట్లుగా కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. డ్రాగన్ కంట్రీలో గత మూడు సంవత్సరాలుగా జీరో కోవిడ్ విధానంతో కఠిన నిబంధనలను అక్కడి ప్రభుత్వం కొనసాగించింది.

అపార్ట్మెంట్లకు బయట నుంచి తాళాలు వేసి మరి ప్రజలు రోడ్డు మీదికి రాకుండా నిర్బంధాన్ని అమలు చేశారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిర్బంధాన్ని ఆ దేశస్తులు భరించలేకపోయారు. అదే సందర్భంలో జరిగిన ఒక అగ్ని ప్రమాద ఘటన ఆ దేశ ప్రజలను రోడ్డెక్కేలా చేసింది. ఫలితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పీక్ లెవెల్‌కు చేరింది. ఏకంగా దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ దిగిపోవాలంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. దాంతో జీరో కోవిడ్ విధానాన్ని అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దాంతో కోవిడ్ ఒక్కసారిగా జడలు విప్పింది. కరోనా కేసులు సంఖ్య కోట్లకు పడగలెత్తింది.

అదే సమయంలో మృతుల సంఖ్య కూడా వేలల్లోకి చేరిపోయింది. దేశ రాజధాని బీజింగ్‌తో పాటు దేశంలో కీలక నగరాల్లో స్మశాన వాటికలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఇదంతా అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నప్పటికీ ఆ దేశ ప్రభుత్వం మాత్రం అధికారికంగా దీన్ని ధ్రువీకరించడం లేదు. దేశంలో పరిస్థితి అదుపు తప్పుతున్నా ప్రపంచానికి వాస్తవాలను వెల్లడించేందుకు చైనా ప్రభుత్వం సాహసించడం లేదు. నిజానికి గత నెల రోజులుగా చైనాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

గత వారం ఒక్కరోజులో మూడు కోట్ల 70 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. భారతదేశం కూడా అప్రమత్తమయింది. ఇప్పుడు చైనా దేశ జనాభాలో దాదాపు 60 శాతం అంటే సుమారు 80 కోట్ల మందికి కరోనా సోకినట్లుగా అంచనాలు వినిపిస్తున్నాయి. అక్కడి ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క రోగులు వరండాల్లో చికిత్స పొందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా కరోనా వైరస్ చైనాలో విజృంభిస్తుంది.

ఇటీవల వరకు ఆర్టిపిసిఆర్ పరీక్షలను నిర్వహించిన చైనా ప్రభుత్వం, ఇప్పుడు వాటిని నిలిపివేసింది. తమకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందిగా లెక్కలేనంత సంఖ్యలో తరలివస్తున్న ప్రజలను అక్కడి ప్రభుత్వం అదుపు చేయలేకపోతోంది. లెక్కకు మించి వస్తున్న ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఆర్టిపిసిఆర్ కిట్లు లేక పరీక్షలను నిలిపివేయాల్సి వచ్చింది.

ప్రజలు ఎవరికి వారే రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించు కోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంతో దేశ ప్రజలంతా ప్రైవేటు ల్యాబ్ ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిలిపివేయడం, రాపిడ్ యాంటిజన్ కిట్లతోనే పరీక్షలు కొనసాగించడం వల్ల ప్రస్తుతం చైనాలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయోమయంలో పడింది. ప్రైవేటు లాబ్స్ నిర్వహిస్తున్న రాపిడ్ యాంటిజన్ పరీక్షల లెక్కలు ప్రభుత్వానికి చేరడం లేదు.

కరోనా వైరస్‌పై చైనా చేస్తున్న యుద్ధంలో తనను తాను కమాండర్-ఇన్-చీఫ్‌గా అభివర్ణించుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్. కానీ ఇప్పుడు నెలకొన్న పరిస్థితిని ఎదుర్కొనే మార్గం తెలియక బిక్కచచ్చిపోతున్నట్టు కనిపిస్తోంది. అసలెక్కడున్నాడో తెలియకుండా పోయాడు. ఒక రకంగా చెప్పాలంటే చాలా దేశాలు ఎప్పుడో అమల్లోకి తెచ్చిన ‘కరోనాతో సహజీవనం’ అనే కాన్సెప్ట్‌ను చైనా ఇపుడు గుర్తించింది. కరోనా వైరస్ అనేది ఇకపై పాండెమిక్ కాదని, ఎండమిక్ దశకు చేరుకుందని తాజాగా చైనా అంగీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

దాంతో కరోనా సోకిన లక్షణాలు కనిపించిన ప్రజలు ఎవరికి వారి స్వయంగా క్వారంటైన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఎలాంటి లాక్ డౌన్లు విధించనప్పటికీ సూపర్ మార్కెట్లు, దుకాణాలు, మార్కెట్లు జనం లేక వెలవెల బోతున్నాయి. ప్రపంచానికి కరోనా వైరస్‌ను పరిచయం చేసిన చైనా ఇప్పుడు తాను చేసిన తప్పును గుర్తించింది. చైనా దేశ జనాభా సుమారు 150 కోట్లు. ఆ జనాభాకు వ్యాక్సిన్ పంపిణీ చేయడం అనేది చైనాలో వున్న మెకానిజానికి పెద్ద టాస్క్ ఏమీ కాదు. పెద్దగా యంత్రాంగం లేనప్పటికీ భారతదేశం ఆ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించింది.

మూడు రకాల వ్యాక్సిన్లను దేశీయంగా ఉత్పత్తి చేయడంతో పాటు రష్యా. అమెరికా దేశాల్లో తయారైన వ్యాక్సిన్ లను కూడా పరీక్షించి, మన దేశంలోకి అనుమతించింది. ఫలితంగా దేశంలో 220 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది. మరి అగ్రరాజ్యంగా చెప్పుకునే చైనా మాత్రం చతికిలపడింది. జీవాయుధంగా కరోనా వైరస్ ను ఉపయోగించి ఏదో చేయాలనుకుంది. మరేదో జరిగిపోయింది.

చైనా చివరకు తాను తవ్వుకున్న గోతిలో తానే అడ్డంగా పడిపోయింది.

Must Read

spot_img