Homeఅంతర్జాతీయంచైనాలో కరోనా మరణాలు ..!

చైనాలో కరోనా మరణాలు ..!

చైనాలో కరోనా మరణాలు .. ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పెడుతున్నాయి. అదే సమయంలో భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు భారత్ సన్నద్ధమైనట్లేనా..? కరోనా మరణ మృందంగం మళ్లీ వినిపిస్తోంది. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్, బెడ్ల కొరతతో .. ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మళ్లీ కళ్లముందు మెదులుతున్నాయి. ఈ తరుణంలో దీన్ని అడ్డుకునేందుకు భారత్ ఏం చేస్తోందన్నదే ఆసక్తికరంగా మారింది.

చైనాలో 2022 ఏప్రిల్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్యను డిసెంబర్ నెలలో దాటేసింది. దాంతో, ప్రపంచమంతా అప్రమత్తమయింది. అనేక దేశాలు కోవిడ్ నిర్వహణకు సంబంధించిన చర్చలు మొదలుపెట్టాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారులు, ఆరోగ్య నిపుణులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనాపై నిఘాను పటిష్టం చేయాలని సూచించారు.

ప్రజలు మాస్క్ ధరించాలని, నిబంధనలను పాటించాలని కోవిడ్‌ జాతీయ టాస్క్‌ఫోర్స్ అధిపతి వీకే పాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే, దేశంలో పరిస్థితి అదుపులోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా భారత్‌లో కరోనా పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

కరోనా విషయంలో రాష్ట్రాలన్నీ పూర్తి అప్రమత్తతలో వ్యవహరించాలని, కోవిడ్‌ పరీక్షలను ముమ్మరం చేయాలని, ముఖ్యంగా విమానాశ్రయాల్లో నిఘా పెంచాలని సూచించారు.

ఇక జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ డాష్‌బోర్డ్ ప్రకారం, కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 66.72 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఎంత పెద్దది అంటే, ప్రపంచ పటంలో దాదాపు 70 దేశాల జనాభా 66 లక్షల కంటే తక్కువ.

గత కొద్ది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ, ఈ నెలలో మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఇప్పుడు భారత్ ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌ల లాగ మరో కొత్త వేరియంట్ కూడా ఇక్కడ విజృంభిస్తుందా? కోవిడ్ కొత్త వేవ్ వస్తే, దాన్ని ఎదుర్కోవడానికి భారత్ ఎంత సంసిద్ధంగా ఉంది? వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరా, ఆస్పత్రులలో కోవిడ్ బెడ్‌లు, కోవిడ్ పరీక్షలు, హెల్ప్‌లైన్ వంటివి ఏ స్థితిలో ఉన్నాయి? అన్నదే చర్చనీయాంశంగా మారింది.

ఇంతకుముందు వచ్చిన కరోనా వేవ్స్ నుంచి భారతదేశం పాఠాలు నేర్చుకుందా లేదా..?

ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు నాలుగు వేల కంటే తక్కువగా ఉన్నాయి. విమానాశ్రయాలలో ర్యాండమ్ టెస్టులు మొదలుపెట్టారు. కోవిడ్ టీకాల విషయానికొస్తే, ప్రజలకు రెండు డోసుల టీకాలు అందించడంలో భారత ప్రభుత్వం విజయవంతమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాక్సీన్‌తో సంక్రమణను ఆపలేకపోవచ్చుగానీ, వైరస్ తీవ్రతను, మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగామని అంటున్నారు.

కాగా, భారతదేశంలో సుమారు 220 కోట్ల వ్యాక్సీన్లను అందించారు. మొదటి డోసు తీసుకున్నవారు సుమారు 102 కోట్లు ఉన్నారు. రెండవ డోసు తీసుకున్నవారు సుమారు 95 కోట్లు ఉన్నారు. అంటే సుమారు 7 కోట్ల మంది రెండో డోసు తీసుకోలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశంలో 92 శాతం ప్రజలు రెండు డోసులూ తీసుకున్నారు. అయితే, వ్యాక్సీన్ విషయంలో కొన్ని రాష్ట్రాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వీటిలో ఝార్ఖండ్ ముందుంది.

ఆ రాష్ట్రంలో కేవలం 74 శాతం మాత్రమే రెండు డోసులూ తీసుకున్నారు. ఈ జాబితాలో మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, చండీగఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఈ కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఇండియన్ sars-cov-2 జెనోమిక్స్ కన్సార్టియం ప్రకారం, భారతదేశంలో ఈ వేరియంట్‌తో నాలుగు కేసులు నమోదయ్యాయి.

ఈ సంవత్సరం జూలైలో ఒకటి, సెప్టెంబర్‌లో రెండు, నవంబర్‌లో ఒకటి బయటపడ్దాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో, అందరూ బూస్టర్ డోసు వేయించుకోవాలని వీరంతా కోరుతున్నారు.

అయితే బూస్టర్ డోసు కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా ఎంత ప్రభావవంతంగా పని చేస్తుందన్న దానిపై సందేహాలు వెలువడుతున్నాయి. అలాగే, ఎక్కువమంది బూస్టర్ డోసు ఎందుకు తీసుకోవడం లేదు అన్న ప్రశ్నా తలెత్తుతోంది. కోవిడ్ వ్యాక్సీన్ మొదటి డోసు పొందినవారిలో కేవలం 23 శాతం మాత్రమే బూస్టర్ డోసు తీసుకున్నారని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అన్ని రాష్ట్రాలలోకల్లా మేఘాలయలో వ్యాక్సీన్ పరిస్థితి దారుణంగా ఉంది.

మొదటి డోసు తీసుకున్నవారిలో కేవలం 8 శాతం మాత్రమే బూస్టర్ డోసు తీసుకున్నారు. పంజాబ్, నాగాలాండ్, హరియాణా వంటి రాష్ట్రాలలో బూస్టర్ డోసు తీసుకున్నవారు 10 శాతం లోపే ఉన్నారు. మరోవైపు, అండమాన్, నికోబార్ దీవులలో మొదటి డోసు తీసుకున్నవారిలో 82 శాతం బూస్టర్ డోసు తీసుకున్నారు. లద్దాఖ్‌లో 62 శాతం, తెలంగాణలో 42 శాతం బూస్టర్ డోసు తీసుకున్నారు. బూస్టర్ డోస్‌తో ఇన్‌ఫెక్షన్‌ రేటు తగ్గినట్టు కనిపించలేదు.

పరిశోధనలో కూడా ఇదే తేలింది. అందుకే ఎక్కువమంది ఆ డోసు వేయించుకోడానికి మొగ్గు చూపట్లేదని నిపుణులు సైతం చెబుతున్నారు. దేశ రాజధానిలో సుమారు 20,000 కోవిడ్ పడకలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 30 పడకలపై మాత్రమే రోగులు ఉన్నారని దిల్లీ ప్రభుత్వం చెబుతోంది. క్లిష్ట పరిస్థితులు ఎదురైతే పడకల సంఖ్యను రెట్టింపు చేయవచ్చని అంటున్నారు.

కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం
జీటీబీలో కోవిడ్ కోసం దాదాపు 100 పడకలు ఉన్నాయి. అవి అన్నీ ఖాళీగా ఉన్నాయి. అవసరమైతే వెంటనే వీటిని 500కి పెంచగలమని
చెబుతున్నారు. కరోనా సెకడ్ వేవ్‌లో జీటీబీ హాస్పిటల్‌లో 750 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి.

ఇప్పుడు వీటిని 1200కి పెంచామని స్పష్టం చేస్తున్నారు. దిల్లీ మాత్రమే కాదు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా కోవిడ్‌ను ఎదుర్కోవటానికి ఆస్పత్రులలో కోవిడ్ పడకల సంఖ్యను పెంచాయి. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో సుమారు రెండు వేల ఆక్సిజన్ బెడ్‌లు, 800 ఐసీయూ పడకల సౌకర్యం ఉంది. కరోనా రెండో వేవ్‌లో, దేశంలో ఆక్సిజన్ కొరత సృష్టించిన భయానక పరిస్థితి అందరికీ తెలిసిందే.

ఆస్పత్రులలో చేరిన రోగులు కూడా ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డారు. ఆక్సిజన్ కోసం రోడ్లపై క్యూలు కట్టారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో. అందుకే, అన్ని మెడికల్ కాలేజీలలో తప్పనిసరిగా ప్రెజర్ అబ్జార్ప్షన్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటులను ఏర్పాటు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశించింది.

2022 జూలై 27న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో 4 వేల 115 ప్రెజర్ అబ్జార్ప్షన్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటులను ప్రారంభించారు. వీటిలో వెయ్యి ప్లాంటులను గత ఏడాది అక్టోబర్‌లోనే ప్రారంభించారు. దీనితోపాటు, కేంద్ర ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు, లక్షన్నర ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను కొనుగోలు చేసింది.

ప్రారంభంలో దేశంలో కోవిడ్ పరీక్షలకు కావలసిన మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన ఆర్‌టీ‌పీసీఆర్ టెస్ట్ ఫలితాలు రావడానికి చాలా రోజులు పట్టేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తింపు పొందిన 3,393 ల్యాబ్‌లు కోవిడ్ పరీక్షలనునిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశం ఒక నెలలో సుమారు 5 కోట్ల కోవిడ్ పరీక్షలను చేయగలదు. దేశంలో ఇప్పటివరకు 90 కోట్ల కోవిడ్ పరీక్షలు జరిగాయి.

కరోనా ఉత్పాతానికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే కేంద్రం సన్నద్ధమైంది. గత ఘటనలు పునరావృతం కాకుండా.. చూసేందుకు సర్వత్రా కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేస్తోంది.

Must Read

spot_img