Homeఆంధ్ర ప్రదేశ్వారాహి వాహనంపై వివాదం.. జనసేన పార్టీ క్లారిటీ ఇదే

వారాహి వాహనంపై వివాదం.. జనసేన పార్టీ క్లారిటీ ఇదే

జనసేనాని వాహనం వారాహి .. ఇప్పుడు .. హాట్ టాపిక్ గా మారిందా..? దీనికి వైసీపీ నేతలు చేస్తోన్న విమర్శలే కారణమా..? అసలు వైసీపీ చేస్తోన్న ఆరోపణలేమిటి..? దీనికి కౌంటర్ గా పవన్ ఇచ్చిన సమాధానమేంటి..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలక్షన్ బ్యాటిల్ కోసం సిద్ధం చేసుకున్న వాహనం వారాహి. ఇప్పుడు ఏపీలో వారాహి వాహనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారాహి వాహ‌నానికి ఆలీవ్ గ్రీన్ క‌ల‌ర్ వేశార‌ని, కేవ‌లం ర‌క్ష‌ణ వాహ‌నాల‌కు మాత్ర‌మే ఆ రంగును వినియోగిస్తార‌ని కొంత మంది విమ‌ర్శిస్తున్నారు. వారాహి వాహనానికి వేసిన రంగు పై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా వైసీపీ ఈ అంశాన్ని ప్రస్తావించి, సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో వారాహి వాహనానికి వేసిన రంగు పై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది.

పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు

ఇదే సమయంలో వైసిపి ప్రభుత్వం పై ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసిన జనసేన పార్టీ నిబంధనల ప్రకారమే వారాహి వాహనానికి రంగులు వేసినట్లుగా పేర్కొంది. విశాఖపట్నం లో జనసేన ఐటీ విభాగం ప్రతినిధులతో సమావేశమైన క్రమంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ వివాదం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారాహి వాహనం కలర్ పై జరుగుతున్న వివాదంపై జనసేన పార్టీ విడుదల చేసిన లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. హైకోర్టులో లెక్కకు మించి మొట్టికాయలు వేయించుకున్న వారు కూడా నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ వైసీపీ ని టార్గెట్ చేసింది.

ఇక పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు వాళ్ల మూర్ఖత్వానికి నిదర్శనమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగానే రూపుదిద్దుకుందని పేర్కొన్న ఆయన, పవన్ కళ్యాణ్ నిబంధనలకు లోబడే ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు.

ఏ రంగు వేశారో చూడకుండానే రవాణాశాఖ ఎలా అనుమతి ఇస్తుందని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఇది కావాలని వైసిపి చేస్తున్న వివాదంగా ఆయన అభివర్ణించారు. ఏపీఎస్ఆర్టీసీ ని వైసిపిఆర్టీసీ గా మార్చిన నాయకులకు, పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులలో జనాన్ని తరలిస్తూ ప్రయాణికులకు అవస్థలు కలిగించిన నాయకులకు పవన్ కళ్యాణ్ వారాహి వాహనం గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల డబ్బులతో వైసిపి రంగులు వేసే వారికి నిబంధనలు ఏం తెలుస్తాయి అంటూ చురకలంటించారు. ఇక ఆ పార్టీ నాయకుల నుండి ఇంతకంటే ఏం ఆశించగలం అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఇంకా పవన్ యాత్ర మొదలు పెట్టలేదు. కానీ ఆయన ప్రచారానికి వినయోగించనున్న వారాహి వాహనం రాజకీయం మొదలు పెట్టింది. ప్రత్యర్థులను వణుకు పుట్టిస్తోంది. యుద్ధం ప్రారంభించే ముందు సైరన్ మోగిస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతలకు రీ సౌండ్ వినిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను గట్టి హెచ్చరిక చేస్తోంది. జనసేన ప్రచార వాహనం వారాహిపై ఓ పద్ధతి ప్రకారం అధికార వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టింది.

కానీ అదే ప్రచారం వారి మెడకు చుట్టుకుంటోంది. వ్యవస్థలకే వైసీపీ రంగుపూసిన విధానంపై ఇప్పుడు జనసేన టార్గెట్ చేయడం ప్రారంభించింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రభుత్వమే ఒక ఆయుధాన్ని జనసేన చేతిలో పెట్టినట్టయ్యింది. జనసేన అన్ని పార్టీల మాదిరిగా ఓ సంప్రదాయ పార్టీ, తన రాజజకీయ కార్యకలాపాల కోసం ఒక ప్రచార వాహనాన్ని తయారుచేసుకుంది. ఎలక్షన్ బ్యాటిల్ కోసం తనకు అనువైన రూపంలో, నిబంధనలకు లోబడి రూపొందించుకున్న వాహనం అది. కానీ దానిని కూడా లేనిపోని వివాదం చేసి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో పడిన వైసీపీకి అదే ప్రతికూలతను తెచ్చిపెట్టింది.

వారాహి వెహికల్ కు వేసిన కలరే అభ్యంతరం అయినప్పుడు ప్రభుత్వ భవనాలకు, చివరకు ప్రజా రవాణాకు సంబంధించి ఆర్టీసీని సైతం విడిచిపెట్టకుండా రంగులు మార్చిన విధానం ప్రజల్లో చర్చకు వస్తుంది. ఆ వాహనం పవన్ కష్టార్జితం. తాను సినిమాల ద్వారా సంపాదించుకున్న సొమ్ముతో తన అభిష్టానానికి అనుగుణంగా తయారుచేసుకున్న వాహనం అది. దానిని కూడా రాజకీయం చేయడం ఏమిటన్న ప్రశ్న ఏపీ సమాజంలో వినిపిస్తోంది. వారాహి వెహికల్ విషయంలో అధికార పార్టీ చేస్తున్న కామెంట్స్ ను బలంగా తిప్పికొట్టాలని జనసేన నిర్ణయించింది.

పవన్ ఇంకా యాత్రే మొదలుపెట్టలేదు. ఆయన వాహనమే ఇన్ని ప్రకంపనలు సృష్టిస్తే.. మున్ముందు వైసీపీ శ్రేణులు ఇంకెన్ని చిత్రాలు చూడాలో అని సగటు జనసేన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో వాహనం రంగు మార్చకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వాహనాన్ని తిరగనిస్తారా? ప్రభుత్వం అభ్యంతరం కచ్చితంగా వ్యక్తం చేస్తుంది అన్న చర్చ మరింత రచ్చగా మారుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. పవన్ ఎన్నికల ప్రచార రథం వారాహి విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణలు చేశారు. పసుపు రంగు మార్చుకోవాలని సూచించారు. దీనికి కౌంటర్ గా పవన్ … కొన్ని రోజులకు ఊపిరి తీసుకోవడం ఆపేయమంటారా? అంటూ ట్వీట్ చేశారు. పవన్ విమర్శలపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ లో స్పందించారు.

శ్వాస తీసుకో… ప్యాకేజీ వద్దంటూ అంబటి రాంబాబు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. అంబటి ట్వీట్ పై జనసైనికులు ఫైర్అ వుతున్నారు. అంబటిని ట్రోల్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పవన్ తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పారు. వైసీపీపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. వారాహి వాహనంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఇంకా ఏమన్నారంటే…”మొదట మీరు నా సినిమాలను ఆపేశారు; విశాఖపట్నంలో నన్ను వాహనం, హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదు. సిటీ వదిలి పెట్టి వెళ్లిపోవాలని బలవంతం చేశారు. మంగళగిరిలో మీరు నా కారుని బయటకు వెళ్లనివ్వలేదు. తర్వాత నన్ను నడవనివ్వలేదు.

ఇప్పుడు వాహనం రంగు మీకు సమస్యగా మారింది. సరే, తర్వాత నేను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయాలా?” అంటూ ట్వీట్ చేశారు. వారాహి వెహికల్ కలర్‌ లాంటి ఆలివ్‌గ్రీన్‌ కలర్‌ షర్ట్‌ను పోస్ట్ చేసి వైసీపీ ఇదైనా నేను వేసుకోవచ్చా అంటూ పవన్ క్వశ్చన్ చేశారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా ఏపీ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. వైసీపీ నేతల వేధింపులతో కారు నుంచి కట్ డ్రయర్ వరకు కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. టికెట్‌ రేట్‌లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే ఏపీలో వీరి లంచాలు, వాటాలు వేధింపుల వల్ల కారు నుంచి కట్‌ డ్రాయర్‌ కంపెనీల దాకా పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయన్నారు.

ఆ తర్వాత పచ్చని చెట్లు ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన పవన్ మీకు ఏ రకమైన పచ్చని రంగు కావాలో తేల్చుకోవలంటూ దుయ్యబట్టారు. అదే విధంగా వారాహి రంగులోనే ఉన్న ఒక బైక్, ఒక కారు ఫోటోను పోస్ట్ చేస్తూ రూల్స్ అనేవి కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమేనా.. అ షరతులు వీరికి వర్తించవా అంటూ ప్రశ్నించారు. పవన్ వరుస ట్వీట్లు చేస్తుండడంతో ఆయన అభిమానులు, జనశెన కార్యకర్తలు పవన్ కి మద్దతుగా పోస్ట్ లు పెడుతూ జగన్ సర్కారుని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ల పర్వం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ సాలిడ్ ఆన్సర్ ఇచ్చారంటూ జనసైనికులు, అభిమానులు ఆయన చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తున్నారు.మొత్తానికైతే వారాహి వాహనం ఏపీ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలైతే పుట్టిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ వివాదంలో ముందు ముందు ఏం జరుగుతుందోనన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Must Read

spot_img