Homeతెలంగాణఆ నియోజకవర్గంలో రాజకీయ చదరంగం మొదలైందా..

ఆ నియోజకవర్గంలో రాజకీయ చదరంగం మొదలైందా..

అది ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానం… అక్కడ పోటీ చెయ్యాలన్న తలంపుతో ఐదుగురు అదికార పార్టీ నేతలు ఎవరికి వారే విశ్వ ప్రయత్నాలు మొదలెట్టారు. టిక్కెట్టు దక్కించుకోవాలన్న ఆకాంక్షతో వారంతా వర్గాలుగా విడిపోయి సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించుకుంటున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలోని అదికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు ఆరని జ్వాలగా మారింది. నిత్యం ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ రాజకీయాల్లోనే హీట్ పుట్టిస్తున్నారు. ఈ పరిణామం కారు గుర్తు పార్టీ అదిష్టానానికి ఇబ్బందిగా మారగా…

బీఆర్ఎస్ నేతల మద్య నెలకొన్న విబేధాలతో లాభపడాలని హస్తం గుర్తు నేతలు పావులు కదుపుతున్నారట. జోగులాంబ గద్వాల జిల్లా ప్రస్తుతం అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి డా.అబ్రహాం కొనసాగుతున్నారు. త్వరలోనే ఎన్నికలు రానుండటంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఐదుగురు బీఆర్ఎస్ నేతలు సర్వం సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంతో పాటు ఆయన కుమారుడు అజయ్ ముందువరుసలో ఉన్నారు. తమ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా సరే అన్నట్టు అబ్రహం వర్గం బావిస్తున్నారట.

ఇక ఇదే క్రమంలో మాజీ ఎంపి, డిల్లీలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మంధా జగన్నాథం, తన తనయుడు మంధా శ్రీనాథ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక మూడో వ్యక్తి గిడ్డంగుల చైర్మన్, గాయకుడు సాయిచంద్ కూడా అలంపూర్ నుంచే పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు ఆయన ఇప్పటి నుంచే తన కార్యాచరణను కొనసాగిస్తున్నారు. మిగిలిన మరో ఇద్దరు ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ప్రస్తుత గద్వాల జడ్పీ చైర్ పర్సన్ అనుచరుడు కిషోర్ కుమార్ లు ఉన్నారు. దీంతో ఈ ఐదుగురు అభ్యర్థులు నాకంటే నాకే టిక్కెట్టు లభిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు.

ఈ ఐదు మంది నియోజకవర్గంలో ఏ శుభ, ఏ అశుభ కార్యక్రమాలు జరిగినా అక్కడ వాలిపోతున్నారట… తమకే టిక్కెట్టు దక్కుతుందని చెప్పుకుంటున్నారట. ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానమైన అలంపూర్ లో ఒక్క బీఆర్ఎస్ పార్టీలోనే తీవ్రమైన పోటీ నెలకొంది. ఒక్క సీటుకు 1: 5 అన్నట్టు… అభ్యర్థులు పోటీ పడుతూ…. వర్గాలుగా విడిపోయి ఇప్పుడే ఎన్నికలు వచ్చాయన్నట్టు ప్రచారాలు మొదలుపెట్టారు.

అంతే కాక తాము అధికార పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి… నియోజకవర్గ అభివృద్దిపై ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. దీంతో కారుగుర్తు కార్యకర్తలు తాము… ఏ నేతతో తిరగాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో కాలంగా ఎమ్మెల్యే అబ్రహం, గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరితలు నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ వర్గపోరు ఇలా కొనసాగుతుండగానే గాయకుడు సాయిచంద్ తన వర్గంతో ఎంటరై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఎమ్మెల్యే అబ్రహం, సాయిచంద్ వర్గాల మద్య ఘర్షణ జరిగి సాయిచంద్ పై దాడికి సైతం దారితీసింది. ఈ దాడి విషయం ఆ పార్టీ అధిష్టానం దృష్టికి సైతం వెళ్ళింది. ఐనా సాయిచంద్ ఏమాత్రం తగ్గకుండా తన కార్యాచరణను కానిచ్చేస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉండగానే మొన్నీమధ్య… మంధా జగన్నాథం చేసిన కామెంట్స్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలో మరింత అగ్గి రాజేసింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాం, మంద జగన్నాధం లు తన తనయులకు టిక్కెట్టు దక్కాలని తీవ్రంగా కృషి చేస్తుండగా, జడ్పీ చైర్ పర్స న్ సరిత తిరుపతయ్య దంపతులు కూడా మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలతో కిషోర్ కుమార్ కు టికెట్టు ఇప్పించుకునేందుకు కృషిచేస్తున్నారని సమాచారం. ఐతే ఈ కిషోర్
కుమార్ కూడా మొన్నటి వరకు ఎమ్మెల్యే అబ్రహంకు అనుచరుడిగా ఉన్న వ్యక్తే… గ్రూపు రాజకీయాల్లో భాగంగా ఎమ్మెల్యే వర్గం వీడి జడ్పీ చైర్ పర్సన్ చెంత చేరారు. ఒకవేళ తన కుమారుడు మంద శ్రీనాథ్ కు టికెట్ దక్కకపోతే, మందా జగన్నాథం సైతం ఈ కిషోర్ కుమార్ కే సపోర్టు చేస్తారన్న ఊహాగానాలు సెగ్మెంట్లో ఊపందుకున్నాయి.

ఇక మాగిలిన సాయిచంద్, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ లు టిక్కెట్ వేట జోరుగా కొనసాగిస్తున్నారట. ఏది ఏమైనా అలంపూర్ టిక్కెట్టు ఇప్పించడంలో కీలంగా మారనుంది మాత్రం మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రమే నని నియోజకవర్గ కారుగుర్తు కార్యకర్తలు భావిస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో ప్రతిభగల యువకులు చాలా మందే ఉన్నారు. బయటి వారు వచ్చి ఇక్కడ పోటీ చేస్తామంటే ఊరుకునేది లేదని సాయిచంద్ ను ఉద్దేశించి మందా వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని మంధా జగన్నాథం .. జూపల్లి మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్దే తప్పా, కొత్తగా జరిగింది ఏమీ లేదని సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ నేతలు వర్గాలుగా విడిపోవడం భాధాకరమని సొంత పార్టీ నేతలపై ఆవేదన వ్యక్తం చేశారు.

constituency-Political

గద్వాల జిల్లాలో టీఆర్ఎస్ జండా పట్టనప్పుడు తాము పట్టామని, నాటి నుంచి ఇటుక ఇటుక పేర్చినట్టు పార్టీకి బలం చేకూర్చానని మందా జగన్నాథం అన్నారు. ఇప్పుడు మందా జగన్నాథం వ్యాఖ్యలు అలంపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర దుమారాన్నే రేపాయి. ఏది ఏమైనా రిజర్వుడు అసెంబ్లీ స్థానంలో టిఆర్ఎస్ పోటీలో రోజురోజుకు పెరుగుతున్న ఆశావుల సంఖ్యతో ప్రతిపక్షాలకు వరం గా మారుతున్నాయని కేడర్ వ్యాఖ్యానిస్తోంది. వర్గపోరుతో బీఆర్ఎస్ నాయకులు కుమ్ములాటలతో బిజీగా మారితే, ప్రతిపక్ష నాయకులు చెక్ పెట్టే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారట..

ఈ క్రమంలోనే.. అనూహ్యంగా బీఆర్ఎస్‌ అధిష్టానం.. చల్లా వెంకట్రామిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం.. ఆయన గులాబీ శ్రేణులతో కలిసిపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో.. అబ్రహం వ్యతిరేక వర్గాల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎమ్మెల్యే అబ్రహంకు చెక్‌పెట్టేందుకే చల్లాను పార్టీలో చేర్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి.. చల్లా చేరికలో మంత్రి నిరంజన్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. పార్టీ బలహీనంగా ఉందనే సర్వే రిపోర్టుల అధారంగా కేసీఆర్ కొన్ని నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. గ్రూపు తగాదాలతో సతమతమవుతున్న అలంపూర్‌పై
ఫోకస్‌ పెట్టారు. మొదటి నుంచి అక్కడ పార్టీలో గ్రూపు రాజకీయలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేది ఓ గ్రూపు కాగా.. మాజీ ఎంపీ ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథ్‌ది మరో గ్రూపు .. జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్యది ఇంకొక గ్రూపు. ఐజ తిరుమల్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌.. గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌.. ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ది మరో గ్రూపు..

వడ్డేపల్లి శ్రీనుది ఒక గ్రూపు.. ఇలా ఎవరికివారు ఆధిపత్యం కోసం తహతహలాడి పోతున్నారు. ఇక.. ఎమ్మెల్యే అబ్రహం ఏకపక్ష నిర్ణయాలు.. తనయుడు అజయ్‌కుమార్ మితిమీరిన జోక్యం.. ఇటు పార్టీకి.. అటు కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారుతున్నాయనేది ప్రధాన ఆరోపణ. అయితే ఏకాకిగా మారుతున్న అబ్రహం మాత్రం.. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్‌లందరికీ టికెట్‌ గ్యారెంటీ అని కేసీఆర్ ఎప్పుడో ప్రకటించేశారని..
దాంతో తానే అభ్యర్థినని అంటున్నారు. మరోవైపు చల్లా ప్రతిపాదించిన అభ్యర్థినే.. వచ్చే ఎన్నికల్లో అలంపూర్‌లో బీఆర్ఎస్ నుంచి బరిలో దించేందుకు అధినేత అంగీకరించినట్టు టాక్‌ నడుస్తోంది. అదే జరిగితే.. ప్రస్తుత ఎమ్మెల్యేకు చెక్‌ పడడం ఖాయంగా కనిపిస్తోంది.

Must Read

spot_img