ఉత్తరాఖండ్ లో హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న జోషిమఠ్ ప్రాంతం కుంగిపోతోంది. భూమిలో చోటు చేసుకుంటున్న ఆకస్మిక పరిణామాలతో జోషిమఠ్ కొన్నిరోజులుగా కుంగుతోంది. దీంతో అక్కడి ఇళ్లు బీటలు వారుతున్నాయి. జోషిమఠ్ లో ఓ పురాతన దేవాలయం కూలిపోయింది. అలాగే పలు ఇళ్లు కూడా బీటలు వారాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇవి మరింత కుంగిపోయి ఇళ్లు కూరుకుపోయే జనం మృత్యువాత పడే ప్రమాదం పొంచి ఉంది.
ప్రభుత్వం తమను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 600 కుటుంబాలను వెంటనే తరలించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జోషిమఠ్ లో ఇళ్లు కుంగిపోతున్న వ్యవహారం జాతీయస్ధాయిలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అక్కడికి భూగర్భ పరిశోధన చేసేందుకు శాస్త్రవేత్తల్ని పంపింది. శాస్త్రవేత్తల బృందం అక్కడ భూగర్బ పరిస్ధితులపై అధ్యయనం ప్రారంభించింది.

ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర సీఎస్ ఎస్ఎస్ సంధు, డీజీపీ అశోక్ కుమార్ ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. జోషిమఠ్ గ్రామాన్ని పరిశీలించిన నిపుణులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. భూమి కుంగిపోవడానికి గల కారణాలను సత్వరమే తెలుసుకోవాల్సి ఉందని అన్నారు.
కేంద్రం నిపుణులతో మాట్లాడిందని, రేపు కూడా నిపుణుల బృందం జోషిమఠ్ గ్రామాన్ని సందర్శిస్తుందని తెలిపారు. అటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. సీఎం పుష్కర్ థామీ జోషిమఠ్ లో తీసుకోవాల్సిన చర్యల్ని సమీక్షించారు.
అలాగే జోషిమఠ్ లో ఎలాంటి పరిస్ధితిని అయినా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వం చాపర్లను రెడీ చేసింది. 600 కుటుంబాల్ని అక్కడి నుంచి తరలించాలని సీఎం పుష్కర్ థామీ ఆదేశించారు.
మిగిలిన కుటుంబాలను కూడా అక్కడి నుంచి తరలించేందుకు చాపర్లు ఎదురుచూస్తున్నాయి. జోషిమఠ్ టౌన్లో మొత్తం 4వేల 500 భవనాలు ఉండగా.. 1.5 కిలోమీటర్ల పరిధిలోని 610 ఇండ్లు, బిల్డింగులకు బీటలు ఏర్పడ్డాయి. బాధిత కుటుంబాలకు టౌన్లోనే సురక్షితమనుకున్న ప్రాంతాలలో ఉన్న కొన్ని బిల్డింగ్ లు, హోటల్స్, ఒక గురుద్వారా, రెండు ఇంటర్ కాలేజీల్లో 1,500 మందికి సరిపడేలా తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు.
బాధిత కుటుంబాలకు 6 నెలల పాటు ఇంటి అద్దె కోసం నెలకు 4 వేల ఆర్థిక సహాయం చేస్తామని కలెక్టర్ ఖురానా ప్రకటించారు. కాగా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి జోషిమఠ్‌లోని ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు, జోషిమఠ్ పరిస్థితిపై శాటిలైట్ ఇమేజెస్ ద్వారా సర్వే నిర్వహించి, ఫొటోలతో సహా రిపోర్టును అందజేయాలని హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ , డెహ్రాడూన్ లోని ఐఐఆర్ఎస్కు ఉత్తరాఖండ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
అయితే జోషిమఠ్ పట్టణం ఎందుకు భూమిలోకి కుంగిపోతోంది? అన్న విషయాలను చూస్తే.. ఉత్తరాఖండ్ లోని ప్రధాన పట్టణాల్లో జోషి మఠ్ ఒకటి . ఉత్తరాఖండ్ లో ఆధ్యాత్మిక, అడ్వెంచర్ ప్రయాణాలకు తొలి మెట్టుగా జోషిమఠ్ గురించి చెబుతారు. హిమాలయాలపై ట్రెక్కింగ్, లేదా బద్రీనాథ్ తీర్థ యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మకమైన పట్టణం నెమ్మది నెమ్మదిగా కుంగిపోతోంది..జోషి మఠ్ పట్టణం కుంగిపోతున్న విషయాన్ని గుర్తించి చాన్నాళ్లే అయింది. కానీ, ఆ ప్రక్రియ తీవ్రమవడం మాత్రం ఇటీవలనే ప్రారంభమైంది.
మొదట ఇళ్ల గోడలపై, రోడ్లపై పగుళ్లు కనిపించడంతో కుంగుబాటు ప్రారంభమైంది. నేల కొద్దికొద్దిగా కుంగడం స్పష్టంగా కనిపించసాగింది. శుక్రవారం ఒక ఆలయం కూడా కూలిపోయింది. దాంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు.
- సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
దాంతో, రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు ప్రారంభించింది. సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జోషి మఠ్ హిమాలయ పర్వత పాదంలో నెలకొని ఉంది. గర్వాల్ హిమాలయాల్లో 1890 మీటర్ల ఎత్తున ఈ జోషి మఠ్ ఉంది. నిపుణులు చెబుతున్న మేరకు జోషిమఠ్ దశాబ్దం క్రితం భూకంపం వల్ల ఏర్పడిన శిలలపై నిర్మించబడింది. ఈ రాళ్లకు తక్కువ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. అందుకే నిర్మాణాలు ప్రమాదంలో పడ్డాయి.
దీనికి తోడు జోషిమఠ్ పట్టణం బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ వంటి పుణ్యక్షేత్రాలకు హిమాలయాలకు ట్రెక్కింగ్ కు ఎంట్రీ లెవెల్లో ఉంటుంది. దీంతో అక్కడ అపారమైన నిర్మాణాలు పెరిగాయి. రోడ్డు విస్తరణ, జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆ ప్రాంతాన్ని అస్థిరంగా మారుస్తున్నాయి. దీనికి తోడు హిమాలయాల నుంచి వచ్చే నదీ ప్రవాహాలతో అక్కడి నేల కోతకు గురవుతోంది.
తూర్పున ధాక్నల, పశ్చిమాన కర్మనస, దక్షిణాన ధౌలిగంగ, ఉత్తరాన అలకనంద నదులు ప్రవహిస్తున్నాయి. జోషిమఠ్ కు కొండచరియలు విరిగిపడే ముప్పు కూడా ఉంది. ఈ పట్టణ జనాభా మొత్తంగా 20 వేల వరకు ఉంటుంది. భౌగోళికపరమైన సమస్యలతో పాటు, ఎలాంటి ప్రణాళిక, క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఉపద్రవానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.
అనేక ఇతర కారణాల వల్ల కూడా పట్టణం నేలలోకి కుంగిపోయే ముప్పు నెలకొందని వారు భావిస్తున్నారు. మొదటి నుంచీ నిపుణులు హెచ్చరిస్తున్నా, జోషిమఠ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ధ ఎత్తున భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. బద్రీనాథ్ కు సుమారు 30 కిమీల ప్రయాణ దూరం తగ్గించే హెలంగ్ బైపాస్ ను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జోషిమఠ్ కు సమీపం నుంచే నిర్మిస్తోంది. అందుకోసం అక్కడ భారీ మెషీనరీని వాడుతోంది. ముప్పును గుర్తించకుండా, ప్రభుత్వం పలు హైడ్రో పవర్ ప్రాజెక్టులను కూడా ఈ ప్రాంతంలోనే నిర్మిస్తోంది.
- ప్రమాదానికి దూరంగా సురక్షితమైన ప్రాంతంలో మరో జోషీమఠ్ నిర్మించడమొక్కటే ప్రభుత్వం చేయదగిన పరిష్కారం.
జోషిమఠ్ కు దాదాపు కిందుగా ఒక టన్నెల్ ను కూడా నిర్మిస్తున్నారు. జోషిమఠ్ పట్టణమే కాకుండా ఉత్తరకాశీ, నైనిటాల్‌కూ ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాల చెంతనున్న పలు పట్ణణాలు, నగరాల్లో భూమి కుంగుబాటుకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. స్ధానిక భౌగోళిక పరిస్ధితులను విస్మరిస్తూ కార్యకలాపాలను చేపట్టిన ఫలితంగానే పర్యావరణ అననుకూల పరిస్ధితులకు దారితీస్తోందని వారు స్పష్టం చేశారు.
బలహీన పునాదులతో పాటు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల భూమి కోతకు గురవడం కూడా జోషిమఠ్‌లో ఈ పరిస్ధితి నెలకొందని వారు వివరించారు. మానవ ప్రేరిత కార్యకలాపాలు దీనికి మరింత ఆజ్యం పోశాయని చెబుతున్నారు. ఎంసీటీ-2 జోన్ రీయాక్టివేట్ కావడంతో ఒక్కసారిగా జోషిమఠ్‌లో భూమి కుంగిపోయిందని, ఈ రీయాక్టివేషన్ ఎప్పుడు జరుగుతుందని ఏ భూగర్భ శాస్త్రవేత్త సైతం అంచనా వేయలేరు.
ప్రస్తుతం జోషిమఠ్ ఒక్కటే ఇలాంటి పరిస్ధితికి గురికాబోదని, ఉత్తర కాశీ, నైనిటాల్‌కూ ఈ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరించారు. తాము రెండు దశాబ్ధాల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఇప్పటివరకూ నిర్లక్ష్యం చేశారని అన్నారు. ప్రకృతితో ఎవరూ పోరాడి గెలవలేరని చెబుతున్నారు. అసలు విషయానికొస్తే..హిమాలయాలు ఆసియా ఖండపు టెక్టోనిక్ ప్లేటును నెట్టుకుంటూ సంవత్సరానికి సెంటిమీటర్ చొప్పున ముందుకు కదలుతోంది. అది మనం ముందు చెప్పుకున్నాం..ఆ కారణంగా ఇక్కడ భూకంపాలు అనివార్యంగా వస్తాయి. వాటినెవరైనా అపగలరా అంటే నో అనే చెప్పాలి.
చంద్రుడు భూమి నుంచి ప్రతీ సంవత్సరం 3.8 సెం.మీలు దూరం జరుగుతున్నాడని నాసా పరిశోధనల్లో తేలింది. అలా అని చంద్రుడిని ఆపగలరా..అలాగే జోషీమఠ్ కూడా..అక్కడ భవనాలను కూలిపోకుండా ఎవరూ కాపాడలేరు. ఇదంతా ప్రక్రుతిలో జరిగే పరిణామల ప్రభావం వల్లే జరుగుతోంది. అవి అనివార్యమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదానికి దూరంగా సురక్షితమైన ప్రాంతంలో మరో జోషీమఠ్ నిర్మించడమొక్కటే ప్రభుత్వం చేయదగిన పరిష్కారం.