ఇంతకాలం కలసికట్టుగా ఉండి, ప్రత్యర్థులపై విజయబావుటా ఎగరేసిన ఆ మిత్రబంధం ఇప్పుడేమైంది..? ఏకంగా ఎమ్మెల్యే ను క్యాంపు కార్యాలయం ఖాళీ చేయించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు..? టీడీపీ లో నెక్స్ట్ టిక్కెట్ కోసం ఎవరికి వారే, యమునాతీరే అన్నచందంగా ఉన్న ఆ నియోజకవర్గం ఏది..?
పశ్చిమగోదావరిజిల్లా ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కి కంచుకోట. 2004లో వైఎస్సార్ పాదయాత్ర ప్రభావం మినహా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకూ అన్ని ఎన్నికల్లోనూ టీడీపీనే ఉండి నియోజకవర్గంలో విజయబావుటా ఎగురవేసింది. 1983 నుండి 1999 వరకూ వరుసగా ఐదుసార్లు కలిదిండి రామచంద్రరాజు ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఆ తర్వాత 2004లో మాత్రం కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా పాతపాటి సర్రాజు గెలుపొందగా, టీడీపీ అభ్యర్ధిగా కలిదిండి రామచంద్రరాజు ఓటమిచెందారు.
అప్పటికే 66 ఏళ్ల వయసు రావడంతో ఆయన రాజకీయ వారసుడిగా వేటుకూరి శివరామరాజు అలియాస్ కలువపూడి శివ తెలుగుదేశం బాధ్యతలు భుజాన వేసుకున్నారు. 2009 లో, 2014లో వరుసగా రెండుసార్లు కలువపూడి శివ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గం నుండి గెలుపొందగా, రైతుల పక్షాన, ప్రజల పక్షాన పోరాటాలు చేసి, ఆక్వా రైతులకు ఎంతో మేలు చేకూరే ఉద్యమ ఫలితాలను సాధించారు. ఆఖరికి 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ పాదయాత్ర ప్రభావంతో
రాష్ట్రమంతా ఫ్యాను గాలి వీచినా ఉండి లో మాత్రం తెలుగుదేశం జెండానే ఎగిరింది. అంతటి బలమైన క్యాడర్, నాయకత్వం ఉండి నియోజకవర్గంలో ఉంది. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరిజిల్లాలో పాలకొల్లు తర్వాత ఉండి మాత్రమే టీడీపీ కి మిగిలింది. అయితే, ఆ ఎన్నికల్లో ఈసారి కలువపూడి శివను నర్సాపురం పార్లమెంట్ అభ్యర్ధిగా తెలుగుదేశం అధిష్టానం బరిలోకి దింపగా, ఉండి ఎమ్మెల్యే టిక్కెట్ ను శివ తన సన్నిహితుడు మంతెన రామరాజు కి ఇప్పించి, ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యే గా పోటీచేసారు.
శివ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ, ఆయన ఎన్నికల సమయంలోనూ శివ గెలుపుకోసం ఎంతో కష్టపడి, బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసిన రామరాజు కి టిక్కెట్ తీసుకురావడంతో పాటు, ఎమ్మెల్యే గా గెలిపించడంలో కూడా రామరాజు కోసం కృషిచేసిన శివ .. మాత్రం నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఎంపీ అభ్యర్ధిగా ఓటమి తర్వాత కొంతకాలం పాటు ఉండి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ దూరంగా వెళ్లిపోగా, ఎమ్మెల్యే రామరాజు మాత్రం టీడీపీ లో కొనసాగినా అధికార పార్టీ కి మద్దతుగా నిలిచారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. తొలి రెండేళ్లపాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలోనూ, ప్రజలకోసం పోరాడడంలోనూ, పార్టీ క్యాడర్ కు వెన్నుదన్నుగా ఉండడంలోనూ రామరాజు ఆశించిన మేర పనిచేయలేదనే ఆరోపణలు పార్టీలోని ఓ వర్గం క్యాడర్ నుండి బలంగా వినిపించింది.
ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ మళ్లీ హైదరాబాద్ నుండి నియోజకవర్గానికి వచ్చి, ఇక్కడే ఉంటూ తన క్యాడర్ ను మమేకం చేసుకుంటూ, పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో శివ పోటీచేస్తారని కొందరు ప్రచారం కూడా మొదలెట్టారు. అయితే, అదే సమయానికి ఎమ్మెల్యే రామరాజు సైతం ప్రజా పోరాటాలతో నియోజకవర్గంలో ఊపందుకుని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు తన వర్గాన్ని కాపాడాకునే ప్రయత్నం మొదలుపెట్టారు. రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు పోరు బాట కూడా నియోజకవర్గంలో నిర్వహించి, ప్రభుత్వంపై పోరాటం చేయడంతో పార్టీలోనూ గట్టిమార్కులు కొట్టేశారు.
ఇక్కడే అసలు గుబులు మొదలైంది.అప్పటివరకూ స్తబ్దుగా ఉన్న ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివ రంగంలోకి దిగేసరికి స్పీడు పెంచడం, ఇప్పుడు పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తుండడం పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తున్నాయి. దీనికితోడు ఇటీవల భీమవరంలో ఉన్న ఎమ్మెల్యే రామరాజు క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయించి, తిరిగి మళ్లీ కలువపూడి శివ అదే కార్యాలయం నుండి తన కార్యకలాపాలు ప్రారంభించడంతో ఇద్దరిమధ్యా ఉన్న అంతర్గత పోరు బహిరంగమైందని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పేరుతో ఉన్న ఆ కార్యాలయంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే శివ జన్మదిన వేడుకలు జరపడం, అక్కడినుండే శివ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలు పునప్రారంభించడంతో రాబోయే ఎన్నికల్లో శివ ఉండి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారనేది కేడర్ లోకి బలంగా వెళ్లింది. మాజీ ఎమ్మెల్యే శివ టిక్కెట్ ఆశిస్తున్నారనే ప్రచారం ఉన్నా, ఎమ్మెల్యే రామరాజు మాత్రం తన పని తాను చేసుకుపోతూ, మరింత వేగం పెంచారు.
హుటాహుటిన ఆక్వా రైతులకోసం, వ్యవసాయ రైతులకోసం నియోజకవర్గంలో ఐదురోజుల పాదయాత్ర కూడా చేసి, రైతులతో మమేకమై గట్టిగానే కష్టపడ్డారు. అయితే, 2019 ఎన్నికల తర్వాత ఇద్దరు నేతలూ స్తబ్దుగా ఉండి, ఇప్పుడు మళ్లీ ఇద్దరూ ఒకేసారి వేగం పెంచడంతో తెలుగు తమ్ముళ్లు ఎవరిదారి ఎటో తెలియక, ఎవరి వెనుక ఉండాలో తెలియక సతమతమవుతున్నారు. కొందరైతే, అటు మాజీ ఎమ్మెల్యే కార్యాలయానికి, ప్రస్తుత ఎమ్మెల్యే నివాసానికి కూడా వెళ్తూ, ఇద్దరూ తమకు అవసరమేనంటూ సర్దిచెప్పుకొస్తున్నారు. ఇద్దరూ కలిసి ముందుకు వెళ్లకపోతే టీడీపీ కంచుకోటకు బీటలువారి, రాబోయే ఎన్నికల్లో పార్టీకే నష్టం చేకూరే ప్రమాదముందంటూ మదనపడుతున్న తెలుగుతమ్ముళ్లూ లేకపోలేరు.
ఇదిలా ఉంటే, తెలుగు దేశం పార్టీకి వచ్చే ఎన్నికలు డూ ఆర్ డై లాంటివి.. అధికారంలోకి రాకుంటే పార్టీ ఉనికికే ప్రమాదం ఉంటుంది. అందులోనూ అధికార పార్టీ చాలా పటిష్టంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు మరింత అలర్ట్ గా ఉండాలి. కానీ చాలా చోట్ల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నేతల మధ్య రాజకీయం కయ్యాల కాపురం చేస్తోందనే ప్రచారం ఉంది. అదేబాటలో పార్టీకి కంచుకోట ఉన్న ఉండి నియోజకవర్గం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ పార్టీ రధసారథుల మధ్య నడుస్తున్న అంతర్యుద్దంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దృష్టి సారించాలని స్థానిక నేతలు, కేడర్ కోరుతోంది. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని, నెక్స్ట్ టీడీపీ టిక్కెట్ ఎవరికి అన్నది తేలుస్తారా, లేదా..? అన్నదే ఆసక్తికరంగా మారింది. రాజకీయాలు మిత్రుడుని శత్రువుగా మార్తేస్తాయనేలా మారిన ఉండి లో పరిస్థితిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉండిలో కలవపూడికి గట్టి పట్టు ఉందని, ఆయనకు టిక్కెట్ ఇస్తే, గెలుపు పక్కా అని కొందరు అంటున్నారు.
అదేసమయంలో తొలుత సైలెంట్ గా ఉన్నా మంతెన కూడా పుంజుకున్నారని .. ఒకవేళ రామరాజుకు టిక్కెట్ కేటాయిస్తే, టగ్ ఆఫ్ వార్ తప్పదని అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ కంచుకోటల్ని టార్గెట్ చేయాలని వైసీపీ భావిస్తున్నందున .. ఈ స్థానంలో సైకిల్ సవారీ ఎవరిదన్నదే ఆసక్తికరంగా మారాయి. శివ రీ ఎంట్రీతో .. పార్టీలో జోష్ రాగా, టిక్కెట్ విషయంలో క్లారిటీ రాకపోవడం కొంత మేర డీలా పడినట్లు తెలుస్తోంది. ఇక సిట్టింగులకే టిక్కెట్లు అన్న బాబు .. ఇక్కడ అదే సూత్రాన్ని పాటిస్తారా లేదా అన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే స్థానికంగా పట్టున్నశివకే టిక్కెట్ ఇవ్వాలని కేడర్ డిమాండ్ చేస్తున్న వేళ .. టిక్కెట్ రేస్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీకి శివ అంగీకరించకపోయినా, బాబు పట్టుపట్టడమే కారణమని, అందుకే ఇప్పుడు నియోజకవర్గంలో టిక్కెట్ రేసు తలెత్తిందని స్థానికంగా చర్చ వినిపిస్తోంది. దీంతో టిక్కెట్ కేటాయింపుపై బాబు నిర్ణయం ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది.